విదేశీ కంపెనీలు భారత్‌లో కార్మిక హక్కులను గౌరవించవా? శాంసంగ్ ఇండస్ట్రీలో వర్కర్ల నిరసన ఎందుకు?

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, చెరిలాన్ మోలాన్
- హోదా, బీబీసీ న్యూస్
తమిళనాడులోని శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ కంపెనీలో దాదాపు 1500 మంది సిబ్బంది గత 11 రోజులుగా సమ్మె చేస్తున్నారు. ఫలితంగా ఉత్పత్తిలో తీవ్ర అవాంతరాలు ఏర్పడ్డాయి.
భారత్‌లో శాంసంగ్ కంపెనీకి రెండు ఫ్యాక్టరీలు ఉన్నాయి. అందులో ఒకటి చెన్నైలో ఉంది. చెన్నై ప్లాంటులో దాదాపు 2 వేల మంది పనిచేస్తున్నారు. ఇక్కడ గృహోపకరణాలు (హోం అప్లయన్సెస్) తయారవుతాయి.
భారత్‌లో కంపెనీ వార్షికాదాయం సుమారు రూ. లక్ష కోట్లు కాగా (12 బిలియన్ డాలర్లు) ఈ ప్లాంటు నుంచి అందులో మూడో వంతు ఆదాయం లభిస్తుంది.
కొత్తగా ఏర్పాటు చేసుకున్న కార్మిక సంఘం ‘శాంసంగ్ ఇండియా లేబర్ వెల్ఫేర్ యూనియన్ (ఎస్‌ఐఎల్‌డబ్ల్యూయూ)’కు గుర్తింపు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఫ్యాక్టరీ సిబ్బంది రోజూ కంపెనీకి సమీపంలోని ఒక స్థలానికి చేరుకుని సమ్మె చేస్తున్నారు.
వేతనాలు, పని వేళలకు సంబంధించి మేనేజ్‌మెంట్‌తో సంప్రదింపులు జరపడానికి యూనియన్ తమకు సహాయకారిగా ఉంటుందని వారు అంటున్నారు.
అయితే, వర్కర్ల సంక్షేమమే తమకు మొదటి ప్రాధాన్యమని పేర్కొంటూ శాంసంగ్ ఇండియా ఒక ప్రకటన విడుదల చేసింది.

‘‘చెన్నై ప్లాంటులో వీలైనంత త్వరగా సమస్యల్ని పరిష్కరించేందుకు మా వర్కర్లతో చర్చలు ప్రారంభించాం’’ అని ఆ ప్రకటనలో పేర్కొంది.
అనుమతి లేకుండా నిరసన ర్యాలీ చేపట్టినందుకు 104 మంది సిబ్బందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తర్వాత వారిని విడుదల చేశారు.
‘‘తమ డిమాండ్లు నెరవేరే వరకు నిరవధిక సమ్మె చేయాలని కార్మికులు నిర్ణయించుకున్నారు’’ అని సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ (సీఐటీయూ) సభ్యుడు ఎ. సౌందరరాజన్ చెప్పారు.
ఫ్యాక్టరీలో వర్కర్లు ఏర్పాటు చేసుకున్న కొత్త యూనియన్‌కు సీఐటీయూ మద్దతు ఇస్తోంది. సీఐటీయూకు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) అండ ఉంది.
శాంసంగ్ ఫ్యాక్టరీ కార్మికులు ప్రధానంగా మూడు డిమాండ్లు నెరవేర్చాలని కోరుతున్నారు. కొత్త యూనియన్‌కు గుర్తింపు ఇవ్వడం, సంస్థతో జీతాల బేరసారాలను అనుమతించడం, సంస్థలోని 90 శాతం కార్మికులు ఎస్‌ఐఎల్‌డబ్ల్యూయూలోనే ఉన్నందున మిగతా పోటీ యూనియన్లను తిరస్కరించడం అనేవి కార్మికులు చేస్తోన్న డిమాండ్లని సౌందరరాజన్ చెప్పారు.

ఫొటో సోర్స్, Reuters
నెలకు సగటున రూ. 25 వేలు జీతంగా పొందుతున్న కార్మికులు వచ్చే మూడేళ్లలో జీతాన్ని 50 శాతం పెంచాలని డిమాండ్ చేస్తున్నారని సీఐటీయూ పేర్కొంది.
రిఫ్రిజిరేటర్, వాషింగ్ మెషీన్, టీవీ వంటి వాటికి సంబంధించిన పనులను 10-15 సెకన్లలో పూర్తి చేయాలని కార్మికులపై ఒత్తిడి చేస్తున్నారని, ఏకధాటిగా నాలుగైదు గంటల పాటు పని చేయాలని, కార్మికులు పనిచేసే అసురక్షిత పరిస్థితులు ఉన్నాయని సీఐటీయూ ఆరోపించింది.
కొత్త యూనియన్ నుంచి తప్పుకోవాలని కార్మికులను, వారి కుటుంబాలను మేనేజ్‌మెంట్ బెదిరించినట్లు సౌందరరాజన్ ఆరోపించారు.
శాంసంగ్ ఇండియాను కొన్ని సమాధానాలు కోరుతూ బీబీసీ కొన్ని ప్రశ్నల్ని వారికి పంపించింది.
సమస్యల పరిష్కారానికి చర్చలు జరుపుతున్నామని యూనియన్ అధికారులకు హామీ ఇచ్చినట్లు తమిళనాడు కార్మిక మంత్రి సీవీ గణేశన్ చెప్పారు.
కార్మికుల డిమాండ్లను నెరవేర్చుతామని ఆయన అన్నారు.
సిజో అనే ఒక నిరసనకారుడు మాట్లాడుతూ, రోజూ తాను శాంసంగ్ ఇండియా యూనిఫాం ధరించి ఉదయం 8 గంటలకు నిరసన స్థలానికి వచ్చి సాయంత్రం 5 వరకు సహచరులతో కలిసి నిరసనలో పాల్గొంటున్నానని చెప్పారు.
నిరసనకారుల కోసం భోజనం, నీళ్లను యూనియన్ ఏర్పాటు చేస్తోంది. అక్కడ వాష్‌రూమ్ సౌకర్యం లేకపోవడంతో కార్మికులంతా ఆరుబయటకు వెళ్లాల్సి ఉంటుంది.
‘‘ఫ్యాక్టరీ పెట్టినప్పటి నుంచి ఉద్యోగులంతా యూనియన్ లేకుండా, ఎలాంటి ఫిర్యాదులు చేయకుండా పనిచేస్తూ వస్తున్నారు. కానీ, గత రెండేళ్లుగా పరిస్థితులు అధ్వాన్నంగా మారాయి. ఇప్పుడు మాకు ఒక యూనియన్ మద్దతు అవసరం’’ అని సిజో అన్నారు.
పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా తమ జీతం పెరగట్లేదని, దీంతో కుటుంబాన్ని నడపడం కష్టమవుతోందని ఆయన చెప్పారు.
యూనియన్లను అనుమతించదని 2020 వరకు శాంసంగ్ గ్రూప్‌కు పేరుండేది. అయితే, లంచం, మార్కెట్ మానిపులేషన్ వంటి ఆరోపణలపై దాని చైర్మన్‌ను విచారించిన తర్వాత నుంచి పరిస్థితులు మారిపోయాయి.

ఫొటో సోర్స్, Reuters
లక్షల మంది భారత కార్మికులు, ట్రేడ్ యూనియన్లలో చేరతారు. వీటికి సాధారణంగా వామపక్ష పార్టీలు అండగా ఉంటాయి. కార్మిక చట్టాల అమలు, కార్మికులకు మెరుగైన పని పరిస్థితులు కల్పించడం కోసం ఇవి ఉద్యమిస్తుంటాయి.
భారత్‌లో పనిచేసే విదేశీ కంపెనీలు, కార్మికుల హక్కులకు సంబంధించిన స్థానిక చట్టాలను అనుసరించడానికి తిరస్కరిస్తాయని సౌందరరాజన్ ఆరోపించారు.
ఆపిల్, అమెజాన్ వంటి చాలా ప్రముఖ మల్టీ నేషనల్ కంపెనీలు భారత్‌లో తమ ఫ్యాక్టరీలను స్థాపించాయి. కానీ, వీటిలో చాలా కంపెనీలు భారతీయ ఉద్యోగులకు తక్కువ జీతాలు ఇవ్వడం, అధికంగా పనిచేయించుకోవడంతో పాటు కార్మికుల హక్కులను హరించడానికి రాష్ట్ర ప్రభుత్వాలతో కుమ్మక్కు అవుతాయని పలువురు కార్మిక హక్కుల కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.
రాజకీయ మద్దతు ఉన్న, బయటి యూనియన్లలో కార్మికులు చేరడాన్ని మల్టీనేషనల్ కంపెనీలు తీవ్రంగా వ్యతిరేకిస్తాయని లేబర్ ఎకనమిస్ట్ శ్యామ్ సుందర్ వివరించారు. దీనికి బదులుగా కార్మికుల నేతృత్వంలోని అంతర్గత యూనియన్లలో చేరాల్సిందిగా కార్మికులను ప్రోత్సహిస్తాయని చెప్పారు. ఇలా అయితే, యూనియన్ కార్యకలాపాలపై కాస్త పట్టు నిలుపుకోవచ్చనేది వారి ఉద్దేశంగా ఉంటుందని ఆయన తెలిపారు.
శాంసంగ్ ప్లాంట్ కూడా ఇలాంటి పరిష్కారంతోనే ముందుకొచ్చిందని, కార్మికులు దీన్ని తిరస్కరించారని సౌందరరాజన్ చెప్పారు. దీనిపై స్పందన కోసం బీబీసీ, శాంసంగ్ యాజమాన్యాన్ని సంప్రదించింది. స్పందన రావాల్సి ఉంది.
కార్మికుడి గుర్తింపును రక్షించడానికి ఆయన పేరు మార్చాం
అదనపు ఇన్‌పుట్స్ విజయానంద్ అర్ముగం (బీబీసీ తమిళ్), నిఖిల్ ఇనాందార్ (బీబీసీ న్యూస్)
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














