వరదలో ఇల్లు కూలిపోతే ఇన్సూరెన్స్ వస్తుందా?

హోం ఇన్సూరెన్స్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, జక్కుల బాలయ్య
    • హోదా, బీబీసీ ప్రతినిధి

దేశంలో ఎక్కడ చూసినా వరదలు, కొండచరియలు విరిగిపడడం వంటి ఘటనలు ఇటీవల ఎక్కువగా చోటుచేసుకున్నాయి. ఇలాంటి ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ప్రాణనష్టంతో పాటు భారీగా ఆస్తి నష్టం కూడా సంభవిస్తోంది. ఎంతోమంది జీవితాలు రాత్రికి రాత్రే తలకిందులైపోతున్నాయి.

నిన్నటి వరకూ సొంత ఇంట్లో ప్రశాంత జీవనం సాగించిన వారు విపత్తుల కారణంగా అయినవారిని కోల్పోవడంతో పాటు సర్వం కోల్పోయి రోడ్డున పడుతున్నారు.

వరదలు, భూకంపాలు, కొండచరియలు విరిగిపడడం వంటి ఘటనల్లో ఆస్తి నష్టం తీవ్రంగా జరుగుతోంది. జీవిత కాలం కష్టపడి కట్టుకున్న ఇల్లు నీళ్లలో మునిగిపోవడం, వరదలకు కొట్టుకుపోవడం, కొండచరియలు విరిగిపడినప్పుడు నేలమట్టం కావడం వంటి ఘటనలతో చాలా మంది చితికిపోతున్నారు.

దీనికి ఇటీవల విజయవాడ, ఖమ్మం నగరాలను ముంచెత్తిన వరదలే నిదర్శనం.

మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాలు ఎక్కువగా నివాసముండే కాలనీలను వరద నీరు ముంచెత్తడంతో ఎంతోమంది నిరాశ్రయులయ్యారు. ఇళ్లు, ఇళ్లలోని వస్తువులు పాడైపోయి ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయారు.

మరి ఇలాంటి విపత్తులు సంభవించినప్పుడు సర్వం కోల్పోయి రోడ్డున పడకుండా ఉండేందుకు ఏం చేయాలి? ప్రాపర్టీ/హోం ఇన్సూరెన్స్ వరదలకూ, ప్రమాదాలకూ వర్తిస్తుందా?

బీబీసీ న్యూస్ తెలుగు
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
విజయవాడ వరదలు
ఫొటో క్యాప్షన్, ఇటీవల విజయవాడలో వరద భారీ విధ్వంసం సృష్టించింది

ఇంటికి ఇన్సూరెన్స్ ఎలా చేయించాలి?

దేశంలోని బీమా కంపెనీల నియంత్రణ సంస్థ అయిన ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్‌డీఏఐ) వినియోగదారులకు అవగాహన కల్పించడం కోసం రూపొందించిన వెబ్‌‌‌సైట్‌లోని వివరాల ప్రకారం.. జీవిత బీమా తరహాలోనే ఇంటికి కూడా బీమా చేయించుకునే అవకాశం ఉంది.

చాలా కంపెనీలు గృహ బీమా (హోం ఇన్సూరెన్స్) సౌకర్యాన్ని అందిస్తున్నాయి. దానినే ప్రాపర్టీ ఇన్సూరెన్స్‌గానూ వ్యవహరిస్తారు.

ఇంటితో పాటు కార్యాలయాలు, వ్యాపార సముదాయాలు, ఫ్యాక్టరీలు, ఏవైనా గూడ్స్ రవాణా చేస్తున్నప్పుడు వాటికి ప్రమాదం జరిగి ఆస్తి నష్టం సంభవించినా ప్రాపర్టీ ఇన్సూరెన్స్‌తో బీమా పొందే అవకాశం ఉంది.

వీటిలో వివిధ రకాల బీమా పథకాలు అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు, హౌజ్‌హోల్డర్స్ పాలసీ, షాప్‌కీపర్స్ పాలసీ, ఆఫీస్ ప్యాకేజీ పాలసీ వంటివి ఉన్నాయి. భవనంతో పాటు అందులోని వస్తువులకు కూడా బీమా చేయించుకునే వెసులుబాటు ఉంది.

వయనాడ్ వరదలు

ఫొటో సోర్స్, Getty Images

వరదలు, కొండ చరియలు విరిగిపడటం వంటి విపత్తులు సంభవించినప్పుడు ఇంటికి జరిగిన నష్టం (డ్యామేజీ) ఆధారంగా బీమా క్లెయిమ్ చేసుకోవచ్చు.

''ఇల్లు మునిగిపోయి డ్యామేజీ అయినా, వరదలకు కూలిపోయినా, కొండచరియలు పడి ఇల్లు నేలమట్టమైనా బీమా సౌకర్యం ఉంటుందని, బీమా పాలసీ తీసుకునేప్పుడే అలాంటి కవరేజీ ఉండే పాలసీలను ఎంచుకోవాలి'' అని నివా బుపా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ రీజనల్ సేల్స్ మేనేజర్ వెంకటేశ్వరరావు బంటుపల్లి బీబీసీతో చెప్పారు.

గతంలో ప్రాపర్టీ ఇన్సూరెన్స్, మోటారు వాహనాల ఇన్సూరెన్స్ విభాగాల్లోనూ పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది.

అయితే, వేర్వేరు పాలసీలకు నిబంధనలు వేరుగా ఉంటాయని ఆయన చెప్పారు.

బంగారం

ఫొటో సోర్స్, Getty Images

బీరువాలోని బంగారానికీ బీమా వర్తిస్తుందా?

ఇల్లు మునిగిపోయినప్పుడు, లేదా అగ్నిప్రమాదాల వంటివి సంభవించినప్పుడు ఇల్లు మాత్రమే కాకుండా ఇంట్లోని విలువైన వస్తువులు కూడా డ్యామేజ్ అవుతాయి. వాటికి కూడా ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకునే వెసులుబాటు ఉంది.

''ఇంటికి, ఇంట్లోని వస్తువులతో కలిపి బీమా పాలసీ తీసుకోవచ్చు. అయితే, కస్టమర్ డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. టీవీ రూ.25 వేలు, ఫ్రిజ్ రూ.30 వేలు, ఇలా ఇంట్లోని వస్తువుల వివరాలు తెలిపి డిక్లరేషన్ ఇవ్వాలి. ఇల్లు, వస్తువుల విలువ ఆధారంగా బీమా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది'' అని వెంకటేశ్వరరావు తెలిపారు.

ఇంటి బీమా పాలసీల్లో అత్యంత ప్రజాదరణ పొందిన పాలసీ ఫైర్ ఇన్సూరెన్స్. దీనినే ఫైర్ పాలసీగానూ వ్యవహరిస్తారు. దొంగతనాలు, దోపిడీల నుంచి రక్షణకు బర్గ్లరీ ఇన్సూరెన్స్ పాలసీ కూడా అందుబాటులో ఉంది.

ఆస్తికి ఏదైనా ప్రమాదం సంభవించి నష్టం జరిగితే ఈ పాలసీ రక్షణ కల్పిస్తుంది. ఇళ్లు, కార్యాలయాలు, వ్యాపార సముదాయాలు, ఆస్పత్రులు, ఫ్యాక్టరీలు ఇలా వేటికైనా బీమా చేయించవచ్చు.

అగ్నిప్రమాదం, పిడుగులు పడడం వంటివి జరిగినా ఈ బీమా వర్తిస్తుందని, తుపానులు, వరదలతో పాటు అల్లర్లు, దాడుల వంటివి జరిగి ఆస్తి నష్టం సంభవించినా ఫైర్ పాలసీ కింద బీమా వర్తిస్తుందని ఐఆర్‌డీఏఐ పేర్కొంది.

అయితే, యుద్ధ కార్యకలాపాలు, అణు విస్ఫోటనాల వంటి వాటికి ఇది వర్తించదు.

''సాధారణంగా ఇల్లు, ఇంట్లోని వస్తువులకు కలిపి తీసుకునే పాలసీ ఫైర్ పాలసీ. ఇంట్లో ఉండే విలువైన బంగారు ఆభరణాలకూ కలిపి ఈ పాలసీ తీసుకోవచ్చు. దొంగతనాలు, దోపిడీ వంటి ఘటనలు జరిగినా ఈ పాలసీ వర్తిస్తుంది. అయితే, జీవిత బీమాలో అదనపు రైడర్లు లేదా యాడ్ ఆన్స్ ఉన్నట్లుగానే వీటిలో కూడా మనకి ఏవి అవసరమో, ఆ ఆప్షన్లను ఎంచుకోవచ్చు'' అని వెంకటేశ్వరరావు తెలిపారు.

హోం ఇన్సూరెన్స్

ఫొటో సోర్స్, Getty Images

ఈ పాలసీలు ఎవరు తీసుకోవచ్చు?

ఇంటి బీమా పాలసీని ఎవరు తీసుకోవచ్చు? అర్హతలేంటి? అనే విషయాలపై కొన్ని అపోహలు ఉన్నాయి.

సాధారణంగా బ్యాంకు రుణాలతో ఇల్లు కొనుగోలు చేసేవారు, లేదా వ్యాపార రుణాలు తీసుకునే వారు, ఆదాయ పన్ను చెల్లింపు వర్గాల వారికి ఇలాంటి బీమా పాలసీల గురించి తెలిసే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

ఎందుకంటే, రుణాలిచ్చే బ్యాంకులు, లేదా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు ఇలాంటి పాలసీల గురించి కస్టమర్లకు చెబుతుంటాయి. ఏవైనా ప్రమాదాలు జరిగినా, అనుకోని అవాంతరాలు ఎదురైనా ఆర్థిక భరోసా ఉంటుందని, ఈ పాలసీలను వారికి సూచిస్తుంటాయి.

అలాగే, ఉద్యోగస్థులు, ఆదాయ పన్ను చెల్లింపుదారులు మాత్రమే ఇలాంటి పాలసీలకు అర్హులనే అపోహలు కూడా కొందరికి ఉన్నాయి.

రోడ్డు పక్కన చిన్న దుకాణం నిర్వహిస్తూ, ఆదాయానికి సంబంధించి ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేనివారు ఈ బీమా పాలసీలు తీసుకోవచ్చా? వారు అర్హులేనా? అనే విషయంలోనూ అనుమానాలున్నాయి.

అయితే, ప్రాపర్టీ ఇన్సూరెన్స్‌ తీసుకోవడానికి ప్రత్యేకంగా ఎలాంటి అర్హతలూ అవసరం లేదని, ఎవరైనా తీసుకోవచ్చని వెంకటేశ్వరరావు చెప్పారు.

ఈ పాలసీల్లో వేర్వేరు రకాలు ఉన్నాయని, తీసుకునే ముందు కస్టమర్ తమ అవసరాలకు తగ్గట్టుగా పాలసీని ఎంచుకోవచ్చన్నారు.

హోం ఇన్సూరెన్స్

ఫొటో సోర్స్, Getty Images

ప్రధానంగా ఆస్తికి నష్టం జరిగితే ప్రాపర్టీ ఇన్సూరెన్స్‌ రక్షణ కల్పిస్తుంది. ఏవైనా అనుకోని ప్రమాదాల కారణంగా ఆస్తికి నష్టం జరిగితే ప్రాపర్టీ ఇన్సూరెన్స్ పాలసీ కింద క్లెయిమ్ చేసుకోవచ్చు.

ఒకవేళ ఇల్లు, లేదా ఆస్తిని రుణం తీసుకుని కొనుగోలు చేస్తే, ఆ రుణ మొత్తంపై కూడా బీమా పాలసీ తీసుకోవచ్చు. ఇలాంటి పాలసీ తీసుకున్నట్లయితే, సదరు కస్టమర్ రుణం పూర్తిగా చెల్లించకముందే మరణిస్తే ఆ రుణం మాఫీ అయిపోతుంది.

అంటే, ఆ రుణ మొత్తాన్ని బీమా కంపెనీ సదరు బ్యాంకుకు, లేదా రుణం ఇచ్చిన సంస్థలకు చెల్లిస్తుంది.

రుణం కోసం ఇన్సూరెన్స్ తీసుకున్నట్లయితే ఆ వ్యక్తికి ఏదైనా జరిగినప్పుడు రుణం మాఫీ అయిపోతుందని, మిగిలిన సొమ్ము ఆ కస్టమర్ నామినీకి అందజేస్తారని వెంకటేశ్వరరావు చెప్పారు.

''ఇది లోన్‌కి సెక్యూరిటీగా తీసుకునే పాలసీ. ఒకవేళ కస్టమర్ ఈ పాలసీ తీసుకుంటే, ఆ వ్యక్తి మరణిస్తే వారి కుటుంబ సభ్యులు మిగిలిన రుణ మొత్తాన్ని చెల్లించాల్సిన అవసరం లేదు. బీమా పాలసీలో మిగిలిన మొత్తం నామినీకి ఇస్తారు.'' అని ఆయన వివరించారు.

గమనిక: ఈ కథనం ప్రాథమిక అవగాహన కోసం మాత్రమే. ఆయా బీమా సంస్థల షరతులు, నిబంధనలు గమనించగలరు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)