లెబనాన్‌లో ఇజ్రాయెల్ వైమానిక దాడులు, రెండు రోజుల్లో 550 మందికి పైగా మృతి

దక్షిణ లెబనాన్

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, దక్షిణ లెబనాన్‌లోని ఈ భవనం ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో దెబ్బతిన్నది
    • రచయిత, డేవిడ్ గ్రిటెన్
    • హోదా, బీబీసీ న్యూస్

సోమవారం నుంచి లెబనాన్‌లో హిజ్బుల్లా లక్ష్యంగా ఇజ్రాయెల్ జరుపుతున్న వైమానిక దాడుల్లో 550 మందికి పైగా మరణించారని, 1,800 మందికిపైగా గాయపడ్డారని లెబనాన్ ఆరోగ్య శాఖ తెలిపింది. గడిచిన 30 ఏళ్లలో జరిగిన ఘర్షణలలో ఇదే అత్యంత ఘోరమైనదని పేర్కొంది.

ఇజ్రాయెల్ దాడులతో వేలాది కుటుంబాలు సురక్షిత ప్రాంతాలలో తలదాచుకోవడానికి తమ ఇళ్లను వదిలివెళ్ళాయి.

2006 యుద్ధం తరువాత హిజ్బుల్లా నిర్మించుకున్న మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులకు దిగి, 1,300 స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది.

మరోవైపు హిజ్బుల్లా ఉత్తర ఇజ్రాయెల్‌‌లోకి 200కు పైగా రాకెట్లను ప్రయోగించినట్లు సైన్యం తెలిపింది. ఇద్దరు గాయపడినట్టు పారామెడికల్ సిబ్బంది తెలిపారు.

రెండు పక్షాలు యుద్ధానికి దగ్గరవుతున్నట్లు కనిపిస్తుండటంతో సంయమనం పాటించాలని ప్రపంచ దేశాలు కోరుతున్నాయి.

మృతుల్లో 50 మంది చిన్నారులు ఉన్నారని లెబనాన్ ఆరోగ్య శాఖ తెలిపింది.

అయితే, మృతులలో ఎంతమంది సామాన్య పౌరులు, ఎంతమంది హిజ్బుల్లాకు చెందినవారు ఉన్నారనే విషయం వెల్లడించలేదు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
దెబ్బతిన్న కార్లు, భవనం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, లెబనాన్ రాజధాని బేరూత్‌కు దక్షిణాన ఉన్న దహియేహ్లోని మాది ప్రాంతంలో ఇజ్రాయెల్ దాడిలో దెబ్బతిన్న కార్లు, భవనం

ఈ దాడుల వల్ల వేలాదిమంది ప్రజలు నిరాశ్రయులయ్యారని లెబనాన్ ఆరోగ్య మంత్రి ఫిరాస్ అబియాద్ తెలిపారు.

లెబనాన్ మరో గాజాగా మారాలని కోరుకోవడం లేదని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ చెప్పారు. ఉద్రిక్తతలు పెరగడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

ఐక్యరాజ్య సమితిలో ప్రపంచ నేతల సమావేశానికి ముందు ఈయూ విదేశీ వ్యవహారాల చీఫ్ జోసెప్ బోరెల్ మాట్లాడుతూ.. ఉద్రిక్తతలు పెరగడం ప్రమాదకరమని.. ఆందోళన కలిగిస్తోందని అన్నారు.

‘‘మనం దాదాపు పూర్తిస్థాయి యుద్ధంలో ఉన్నాం’’ అని ఆయన అన్నారు.

రాకెట్ దాడిలో ధ్వంసమైన ఇల్లు

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, లెబనాన్‌ నుంచి జరిపిన రాకెట్ దాడిలో ధ్వంసమైన ఉత్తర ఇజ్రాయెల్‌లోని ఓ ఇల్లు

వెనక్కి తగ్గం: హిజ్బుల్లా

గాజాలో కాల్పుల విరమణ జరిగే వరకు తాము హమాస్‌కు మద్దతు ఇవ్వడం ఆపబోమని హిజ్బుల్లా తెలిపింది. ఈ రెండు గ్రూపులకు ఇరాన్ మద్దతుగా నిలుస్తోంది. వీటిని ఇజ్రాయెల్, యూకే, కొన్ని ఇతర దేశాలు ‘టెర్రరిస్ట్ సంస్థలు’గా గుర్తించాయి.

స్థానిక కాలమానం ప్రకారం, సోమవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో ఇజ్రాయెల్ వైమానిక దాడులు ప్రారంభమైనట్లు లెబనాన్ మీడియా తెలిపింది.

‘క్షిపణులు మా తలలపై ఎగిరాయి. బాంబుల శబ్దం విని మేల్కొన్నాం, ఇలా జరుగుతుందని ఊహించలేదు’ అని ఓ మహిళ తెలిపింది.

దక్షిణ లెబనాన్‌లోని సిడాన్, మర్జాయున్, నబాటియే, బింట్ జ్బీల్, టైర్, జెజ్జిన్, జహ్రానీ జిల్లాలతో పాటు తూర్పు బెకా లోయలోని జహ్లే, బాల్బెక్, హెర్మెల్ జిల్లాల్లో రోజంతా డజన్ల కొద్దీ పట్టణాలు, గ్రామాలు, బహిరంగ ప్రాంతాలు ఇజ్రాయెల్ దాడులకు లక్ష్యంగా మారాయని ప్రభుత్వ ఆధ్వర్యంలోని నేషనల్ న్యూస్ ఏజెన్సీ (ఎన్ఎన్ఏ) తెలిపింది.

రాజధాని బేరూత్ దక్షిణ శివారులోని బీర్ అల్ అబేద్ ప్రాంతంలోని ఓ భవనంపై సాయంత్రం అనేక క్షిపణులు పడ్డాయి.

దక్షిణ లెబనాన్ లోని హిజ్బుల్లా టాప్ కమాండర్ అలీ కరాకిని లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగిందని లెబనాన్ భద్రతా వర్గాలు తెలిపాయి. కరాకీ క్షేమంగా ఉన్నారని, సురక్షిత ప్రాంతానికి వెళ్లారని హిజ్బుల్లా మీడియా కార్యాలయం తెలిపింది.

తరలిపోతున్న ప్రజలు

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోతుండటంతో రద్దీగా మారిన దక్షిణ లెబనాన్ రహదారులు

ఇళ్లు వదిలిన ప్రజలు

హిజ్బుల్లా ఆయుధాలను నిల్వ చేస్తున్న భవనాలను ప్రజలు వెంటనే ఖాళీ చేయాలంటూ ఇజ్రాయెల్ పంపిన ఆడియో, టెక్ట్స్ సందేశాలతో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు బయల్దేరడంతో రహదారులన్నీ రద్దీగా మారిపోయాయి.

ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోయేందుకు ఇళ్లను వదిలి బయటకు రావడంతో లెబనాన్ దక్షిణం నుంచి బేరూత్ వరకు రహదారులు రద్దీగా మారాయి.

ఉత్తరప్రాంతంలోని ట్రిపోలీకి తరలిపోతున్న ఓ నలుగురు సభ్యులున్న కుటుంబం తమ మార్గమధ్యంలో బేరూత్‌లో బీబీసీతో మాట్లాడారు.

‘‘మేం ఇల్లు వదిలిపోతున్నాం’’ అని కుటుంబ పెద్ద ఆందోళనగా చెప్పారు.

బేరూత్‌లోని భవనాన్ని ఖాళీ చేయాలని కోరుతూ తమ మంత్రిత్వ శాఖకు ఇజ్రాయెల్ నుంచి ఫోన్ కాల్ వచ్చిందని సమాచార మంత్రి జియాద్ మకారీ తెలిపారు. అయితే, ఇది తాము భావించే "మానసిక యుద్ధం’’లా ఉందని చెప్పారు.

ఇజ్రాయెల్ చర్యలు లెబనాన్‌ను పూర్తిగా తుడిచిపెట్టేందుకు సాగుతున్నవేనని ప్రధాని నజీబ్ మికాతి అన్నారు.

దక్షిణ లెబనాన్, బెకా లోయలోని సుమారు 1,300 హిజ్బుల్లా స్థావరాలపై తమ విమానాలు దాడులు చేశాయని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) సోమవారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపింది.

ఈ స్థావరాలలోనే హిజ్బుల్లా రాకెట్లు, క్షిపణులు, లాంచర్లు, డ్రోన్లను నిల్వ చేసిందని ఐడీఎఫ్ పేర్కొంది.

‘‘ముఖ్యంగా 20 ఏళ్లుగా హిజ్బుల్లా నిర్మించుకున్న వార్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను లక్ష్యంగా చేసుకున్నాం' అని ఐడీఎఫ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ హెర్జీ హలేవీ టెల్ అవీవ్‌లో కమాండర్లకు తెలిపారు.

ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు లెబనాన్ ప్రజలను ఉద్దేశించి ‘‘ప్రమాదకర మార్గం నుంచి తప్పుకోండి’’ అని కోరారు.

‘‘చాలా కాలం నుంచి హిజ్బుల్లా మిమ్మల్ని మానవ కవచంలా వాడుకుంటోంది. మీ లివింగ్ రూమ్‌లలో రాకెట్లను, మీ గరాజ్‌లలో మిస్సైల్స్‌ను నిల్వచేసింది’’ అని ఆయన చెప్పారు. ‘‘మా ప్రజలను రక్షించుకోవడానికి మేం కచ్చితంగా ఈ ఆయుధాలను ధ్వంసం చేయాల్సిందే’’ అని చెప్పారు.

అయితే ప్రజల ఇళ్లలో ఆయుధాలు దాచామనే ఇజ్రాయెల్ ఆరోపణలపై హిజ్బుల్లా ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. తమ గ్రూపు సభ్యుడు ఒక్కరు మాత్రమే మరణించారని హిజ్బుల్లా మీడియా కార్యాలయం తెలిపింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)