మొసాద్: ఈ ఇజ్రాయెలీ నిఘా సంస్థ శత్రువును ఎలా దెబ్బతీస్తుందంటే...

హమాస్ నేతలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, హమాస్ నేతలు ఖలేద్ మిషాల్ (ఎడమ వైపు), యాహ్యా అయ్యాష్ (మధ్యలో)
    • రచయిత, స్టాఫ్ రిపోర్టర్లు
    • హోదా, బీబీసీ న్యూస్ అరబిక్

హిజ్బుల్లా సభ్యులు వాడుతున్న పేజర్లు, ఇతర కమ్యూనికేషన్ సాధనాలను మొబైల్ పేలుడు పదార్థాలుగా మార్చేయడమన్నది విస్తుగొలిపే అంశమే.

ఇజ్రాయెల్ అధునాతన నిఘా సంస్థ నుంచి తప్పించుకునేందుకు సురక్షితమైనవిగా భావించిన ఈ డివైజ్‌లు యూజర్ల చేతుల్లోనే పేలడంతో, పదుల సంఖ్యలో మరణాలు.. వేలాది మంది గాయాలు పాలయ్యారు.

ఈ దాడులకు కారణం ఇజ్రాయెలే అని లెబనాన్ ప్రభుత్వం ఆరోపించింది. దీనిని ‘‘ఇజ్రాయెల్ నేరపూరిత దురాక్రమణ’’ అని పేర్కొంది. ఈ దాడులకు సరైన సమయంలో ప్రతీకారం తీర్చుకుంటామని హిజ్బుల్లా ప్రతిజ్ఞ చేసింది.

ఈ ఆరోపణలపై ఇజ్రాయెల్ ఇంకా స్పందించలేదు. కానీ, దీని గురించి పబ్లిక్‌గా ఎలాంటి ప్రకటనలు చేయొద్దని మంత్రులందర్ని కేబినెట్ ఆదేశించిందని కొన్ని ఇజ్రాయెల్ మీడియా సంస్థలు రిపోర్టు చేశాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
హిజ్బుల్లా ఫైటర్ మరణం

ఫొటో సోర్స్, Getty Images

మొసాద్‌ విజయాలు

హిజ్బుల్లా కార్యకలాపాలను నిశితంగా ఇజ్రాయెల్ పరిశీలిస్తోంది. ప్రస్తుతం ఇరు వర్గాల మధ్య జరుగుతున్న ఘర్షణల్లో భాగంగానే ఈ ఆపరేషన్‌ను చేపట్టి ఉండొచ్చని రిపోర్టులు చెబుతున్నాయి.

ఒకవేళ ఇజ్రాయెల్ ఈ దాడులకు బాధ్యత వహిస్తే, అత్యంత ఆశ్చర్యకరమైన, ప్రభావవంతమైన ఆపరేషన్స్‌లో ఒకటిగా ఇది నిలుస్తుంది. ముఖ్యంగా, ఇజ్రాయెల్, దాని జాతీయ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మొసాద్ అంతకుముందు చేపట్టిన మిషన్లను ఇది గుర్తుకు చేస్తుంది.

మొసాద్ పలు విజయవంతమైన ఆపరేషన్లు చేసింది. వాటిల్లో ముఖ్యమైనవి మనం ఇక్కడ తెలుసుకుందాం.

ఇజ్రాయెల్‌లో అడాల్ఫ్ ఐచ్‌మన్‌పై విచారణ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఇజ్రాయెల్‌లో అడాల్ఫ్ ఐచ్‌మన్‌పై విచారణ

నాజీ అధికారి అడాల్ఫ్ ఐచ్‌మన్‌ను పట్టుకోవడం

నాజీ అధికారి అడాల్ఫ్ ఐచ్‌మన్‌ను 1960లో అర్జెంటీనా నుంచి కిడ్నాప్ చేసి తీసుకురావడం మొసాద్ చేపట్టిన అత్యంత ప్రముఖ ఇంటెలిజెన్స్ విజయాల్లో ఒకటి.

హోలోకాస్ట్‌గా పిలిచే మారణహోమంలో ఐచ్‌మన్‌ కీలక వ్యక్తి. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో నాజీ జర్మనీ 60 లక్షల మంది యూదుల్ని హత్య చేసింది.

పలు దేశాల మధ్య తప్పించుకు తిరిగిన ఐచ్‌మన్‌, చివరికి అర్జెంటీనాలో స్థిరపడ్డారు.

మొసాద్‌కు చెందిన 14 మంది ఏజెంట్ల బృందం, ఆయన్ను కిడ్నాప్ చేసి, ఇజ్రాయెల్‌కు తీసుకొచ్చింది. ఆ తర్వాత ఆయనను దోషిగా నిర్ధరించి, మరణశిక్ష విధించారు.

ఎంటెబీ ఆపరేషన్

ఫొటో సోర్స్, Getty Images

ఎంటెబీ ఆపరేషన్

ఇజ్రాయెల్ చేపట్టిన అత్యంత విజయవంతమైన సైనిక మిషన్లలో యుగాండాలోని ఎంటెబీ ఆపరేషన్ ఒకటి. 1976లో ఎంటెబీ ఆపరేషన్ చేపట్టారు.

మొసాద్ ఈ ఆపరేషన్‌కు ఇంటెలిజెన్స్ సేవలను అందించగా.. ఇజ్రాయెల్ సైనిక వ్యవస్థ దీన్ని విజయవంతంగా నిర్వహించింది.

పాపులర్ ఫ్రంట్ ఫర్ ది లిబరేషన్ ఆఫ్ పాలస్తీనా చెందిన ఇద్దరు సభ్యులు, ఇద్దరు జర్మన్ సహచరులు కలిసి పారిస్ వెళ్లే ఒక విమానాన్ని యుగాండాకు తరలించారు. అందులోని ప్రయాణికులు, సిబ్బందిని ఎంటెబీ ఎయిర్‌పోర్ట్‌లో బందీలను చేశారు.

ఇజ్రాయెల్ కమాండోలు ఎయిర్‌పోర్ట్‌లోకి వెళ్లి బందీలుగా మారిన 100 మంది ఇజ్రాయెలీ, యూదు పౌరులను రక్షించారు.

ఈ ఆపరేషన్‌లో ముగ్గురు బందీలు, హైజాకర్లు, పలువురు యుగాండా సైనికులు, ప్రస్తుత ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సోదరుడు యోనాథన్ నెతన్యాహులు చనిపోయారు.

మొసాద్ ఏజెంట్ వెహికిల్

ఫొటో సోర్స్, Raffi Berg

ఆపరేషన్ బ్రదర్స్

1980 ప్రారంభంలో అప్పటి ప్రధానమంత్రి మెనాచెమ్ బిగిన్ సూచనల మేరకు మొసాద్ 7 వేల మందికి పైగా ఇథియోపియా యూదులను సూడాన్ మీదుగా ఇజ్రాయెల్ తరలించింది.

సూడాన్ ఎర్ర సముద్రం తీరంలో ఒక రిసార్ట్‌ను ఏర్పాటు చేసిన మొసాద్ ఏజెంట్లు, దాన్ని తమ బేస్‌గా ఉపయోగించారు.

అరబ్ లీగ్‌లో సూడాన్ శత్రు దేశం. అందుకే, ఈ ఆపరేషన్‌ను రహస్యంగా చేపట్టారు.

రోజంతా ఈ ఏజెంట్లు హోటల్ స్టాఫ్ లాగా వస్త్రధారణ చేసుకోవడం, రాత్రి పూట యూదులను తరలించడం వీరి పని.

పక్కనున్న ఇథియోపియా నుంచి యూదులను రహస్యంగా సూడాన్ మీదుగా ఇజ్రాయెల్ పంపేవారు. ఇలా ఈ ఆపరేషన్ ఐదేళ్ల పాటు సాగింది. ఈ ఆపరేషన్ బయటపడే సమయానికి మొసాద్ ఏజెంట్లు అక్కడి నుంచి తప్పించుకున్నారు.

రోజంతా ఈ ఏజెంట్లు హోటల్ స్టాఫ్ లాగా వస్త్రధారణ చేసుకోవడం, రాత్రి పూట యూదులను తరలించడం వీరి పని.

పక్కనున్న ఇథియోపియా నుంచి యూదులను రహస్యంగా సూడాన్ మీదుగా ఇజ్రాయెల్ పంపేవారు. ఇలా ఈ ఆపరేషన్ ఐదేళ్ల పాటు సాగింది. ఈ ఆపరేషన్ బయటపడే సమయానికి మొసాద్ ఏజెంట్లు అక్కడి నుంచి తప్పించుకున్నారు.

ఇజ్రాయెల్ ఒలింపిక్ టీమ్

ఫొటో సోర్స్, Getty Images

మ్యూనిక్ ఒలింపిక్స్ కిడ్నాప్‌ల తర్వాత ప్రతీకారం

1972 సెప్టెంబర్‌లో మ్యూనిక్ ఒలింపిక్స్‌లో పాల్గొనడానికి వచ్చిన ఇజ్రాయెల్ ఒలింపిక్ టీమ్‌‌లోని ఇద్దరు సభ్యులను పాలస్తీనా మిలటెంట్ గ్రూప్ బ్లాక్ సెప్టెంబర్ చంపేసింది. మరో తొమ్మిది మందిని తమ బందీలుగా తీసుకుంది.

జర్మన్ పోలీసులు చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్ విజయవంతం కాలేదు. బందీలుగా మారిన మిగతా అథ్లెట్లు హత్యకు గురయ్యారు.

ఆ తర్వాత మహమూద్ హమ్సారీతో పాటు ఇతర పాలస్తీనియన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ సభ్యులను మొసాద్ టార్గెట్ చేసింది.

మహమూద్ హమ్సారీ తన పారిస్ అపార్ట్‌మెంట్‌లో ఫోన్‌లో ఉంచిన పేలుడు పదార్థం కారణంగా మరణించారు.

పేలుడు వల్ల ఆయన ఒక కాలు కోల్పోయారు. తర్వాత గాయాలతో చనిపోయారు.

యాహ్యా అయ్యాష్

ఫొటో సోర్స్, EPA

యాహ్యా అయ్యాష్ హత్య

1996లో జరిగిన ఇలాంటి ఆపరేషన్‌లోనే హమాస్‌ కీలక బాంబు తయారీదారి యాహ్యా అయ్యాష్‌‌ మరణించారు. మోటోరోలా అల్ఫా మొబైల్ ఫోన్‌లో 50 గ్రాముల పేలుడు పదార్థాలను అమర్చి ఆయనను హత్య చేశారు.

హమాస్ మిలిటరీ వింగ్‌లో అయ్యాష్ కీలక వ్యక్తి. బాంబుల తయారీలో నిపుణుడు. ఇజ్రాయెల్ టార్గెట్లకు వ్యతిరేకంగా క్లిష్టమైన దాడులకు ఆయన నేతృత్వం వహించారు.

దీని వల్ల ఇజ్రాయెల్ సెక్యూరిటీ ఏజెన్సీల ప్రధాన ఫోకస్‌గా మారి, మోస్ట్ వాంటెడ్ వ్యక్తుల్లో ఒకరుగా మారారు.

2019 చివరిలో ఈ హత్యకు సంబంధించిన కొన్ని వివరాలపై సెన్సార్‌షిప్‌ను ఇజ్రాయెల్ ఎత్తివేసింది.

దీంతో, తన తండ్రితో అయ్యాష్ మాట్లాడిన చివరి కాల్‌ రికార్డింగ్‌ను ఇజ్రాయెల్ చానల్ 13 టీవీ ప్రసారం చేసింది.

మహమూద్ అల్- మభౌహ్

ఫొటో సోర్స్, Getty Images

మహమూద్ అల్- మభౌహ్ మరణం

2010లో హమాస్ సీనియర్ మిలటరీ లీడర్ మహమూద్ అల్-మభౌహ్ దుబాయ్ హోటల్‌లో హత్యకు గురయ్యారు.

తొలుత ఇది సహజ మరణంలాగా కనిపించినప్పటికీ, సర్వైలెన్స్ ఫుటేజీని పరిశీలించిన తర్వాత దుబాయ్ పోలీసులు హత్య చేసిన టీమ్‌ను గుర్తించగలిగారు.

ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చి, ఆ తర్వాత గొంతు నులిమి చెప్పి అల్-మభౌహ్‌ను చంపేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఆపరేషన్‌ను మొసాద్ చేపట్టినట్లు అనుమానాలున్నాయి.

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి దౌత్య పరంగా పెద్ద ఎత్తున ఆందోళనలు వ్యక్తమయ్యాయి.

అయితే, మొసాద్‌కు ఈ దాడితో సంబంధమున్నట్లు ఎలాంటి ఆధారాలు లేవని ఇజ్రాయెల్ దౌత్యవేత్తలు చెప్పారు.

విఫలమైన మొసాద్ ఆపరేషన్లు

మొసాద్ పలు ఆపరేషన్లను విజయవంతంగా చేపట్టింది. మరికొన్నింట్లో వైఫల్యాలు ఎదుర్కొంది.

ఖలిద్ మిషాల్

ఫొటో సోర్స్, Getty Images

హమాస్ రాజకీయ నేత ఖాలేద్ మిషాల్

హమాస్ పొలిటికల్ బ్యూరో హెడ్ ఖాలేద్ మిషాల్‌ను హత్య చేసేందుకు 1997లో ఇజ్రాయెల్ ప్రయత్నం అతిపెద్ద దౌత్య సంక్షోభానికి కారణమైంది.

విషప్రయోగం ద్వారా జోర్డాన్‌లో ఆయన్ను హత్య చేయాలనుకున్నారు. ఇజ్రాయెల్‌ ఏజెంట్లు దొరికిపోవడంతో, ఈ మిషన్ విఫలమైంది.

మిషాల్‌ను కాపాడేందుకు యాంటీడోట్‌ను ఇజ్రాయెల్ సరఫరా చేయాల్సి వచ్చింది.

మొసాద్ హెడ్ డానీ యాటమ్‌ జోర్డాన్‌కు వెళ్లి మిషాల్‌కు యాంటీడోట్ ఇచ్చారు. ఈ సంఘటన వల్ల ఇజ్రాయెల్, జోర్డాన్ మధ్య సంబంధాలు చాలాకాలం నిలిచిపోయాయి.

మహమూద్ అల్-జహర్

ఫొటో సోర్స్, Getty Images

హమాస్ నేత మహమూద్ అల్-జహర్

గాజా నగరంలోని హమాస్ నేత మహమూద్ అల్-జహర్ ఇంటిని లక్ష్యంగా చేసుకుని 2003లో ఇజ్రాయెల్ వైమానిక దాడి జరిపింది.

ఈ దాడి నుంచి అల్-జహర్ బయటపడ్డారు. కానీ, తన భార్య, బిడ్డ ఖలేద్, ఇతరులు చనిపోయారు. ఈ బాంబు దాడిలో ఆయన ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది.

ఇజ్రాయెల్

ఫొటో సోర్స్, Getty Images

యోమ్ కిప్పూర్ యుద్ధం

గోలన్ హైట్స్, సినాయ్ పెనిన్సులాను తిరిగి దక్కించుకునేందుకు 1973 అక్టోబర్ 6న ఇజ్రాయెల్‌పై ఈజిప్ట్, సిరియాలు అనూహ్యంగా దాడి చేశాయి.

యూదుల పండుగ యోమ్ కిప్పూర్ సమయంలో ఈ దాడి చేశాయి. ఈ దాడి గురించి ఇజ్రాయెల్‌కు ముందస్తు సమాచారం లేదు.

రెండు వైపుల నుంచి ఈజిప్ట్, సిరియాలు ఇజ్రాయెల్‌పై దాడి చేశాయి.

ఈజిప్ట్ బలగాలు సూయజ్ కాలువను క్రాస్ చేసి దాడి చేయగా.. సిరియా బలగాలు ఇజ్రాయెల్ స్థావరాలపై దాడి చేసి, గోలన్ హైట్స్‌లోకి చొచ్చుకుపోయాయి.

సిరియా, ఈజిప్ట్‌కు సోవియట్ యూనియన్ సపోర్టు చేయగా.. ఇజ్రాయెల్‌కు అమెరికా ఎమర్జెన్సీ సరఫరాలను అందించింది.

ఈ యుద్ధానికి ముగింపు పలకాలని ఐరాస తీర్మానాన్ని తీసుకొచ్చిన తర్వాత నాలుగు రోజులకు అక్టోబర్ 25న ఈ యుద్ధం ముగిసింది.

హమాస్ అటాక్

ఫొటో సోర్స్, AFP

2023 అక్టోబర్ 7న దాడి

సుమారు 50 ఏళ్ల తర్వాత, ఇజ్రాయెల్‌పై అకస్మాత్తుగా దాడులు జరిగాయి. ఈసారి 2023 అక్టోబర్ 7న గాజా సరిహద్దులో ఉన్న ఇజ్రాయెల్ పట్టణాల్లో హమాస్ దాడులు చేపట్టాయి.

ఈ దాడిని ముందుగా అంచనావేయడంలో మొసాద్ విఫలమైందని నిపుణులు అన్నారు.

అక్టోబర్ 7న జరిగిన దాడిలో 1200 మంది చనిపోయినట్లు, వారిలో చాలామంది పౌరులేనని ఇజ్రాయెల్ అధికారులు పేర్కొన్నారు. 251 మందిని గాజాకు బందీలుగా తీసుకెళ్లారు.

హమాస్ దాడికి ప్రతిగా గాజా స్ట్రిప్‌లో ఇజ్రాయెల్ యుద్ధాన్ని ప్రారంభించింది. ఈ యుద్ధం వల్ల ఇప్పటి వరకు 40 వేల మందికి పైగా మరణించారని, వారిలో చాలామంది పౌరులేనని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ చెప్పింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)