‘డాక్టర్లు, పేషెంట్లు, వారి బంధువులు.. అందరూ లైంగికంగా వేధించేవారే’.. పాకిస్తాన్‌ ఆసుపత్రుల్లో మహిళావైద్యులు, సిబ్బంది కష్టాలు

మహిళా డాక్టర్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ఫర్హాత్ జావెద్
    • హోదా, బీబీసీ ఉర్దూ

(గమనిక: ఈ కథనంలోకి కొన్ని అంశాలు పాఠకుల మనసులను కలచివేయొచ్చు)

పాకిస్తాన్ ఆస్పత్రులలో పనిచేస్తున్న మహిళలు తమ పురుష సహచరుల నుంచి, రోగుల నుంచి, రోగుల కుటుంబీకుల నుంచి నిత్యం లైంగిక వేధింపులు, లైంగిక హింస, తిట్లు ఎదుర్కొంటున్నట్లు చెప్తున్నారు.

కోల్‌కతాలో 31 ఏళ్ళ ట్రైనీ వైద్యురాలు అత్యాచారం, హత్యకు గురయ్యాక పాకిస్తాన్‌లోనూ ఆసుపత్రుల్లో పనిచేసే చాలామంది మహిళలు తమ భద్రత విషయంలో ఆందోళన చెందుతున్నట్లు చెప్పారు.

వీరిలో చాలామంది తమ పేరు వెల్లడించడానికి ఇష్టపడలేదు. తమ పేరు బయటపడితే ఉగ్యోగం పోవడమే కాకుండా తమ ‘పరువు’ పోతుందనీ ఆందోళన చెందారు.

కొద్ది నెలల కిందట ఓ యువ వైద్యురాలు డాక్టర్ నుస్రత్ (పేరు మార్చాం) వద్దకు ఏడ్చుకుంటూ వచ్చారు.

తాను టాయిలెట్‌కు వెళ్లినప్పుడు అక్కడ గోడకు ఉన్న రంథ్రంలోంచి ఓ మగ డాక్టర్ వీడియో తీసి, బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని ఆమె ఆరోపించారు.

‘ఫెడరల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ(ఎఫ్ఐఏ)కి ఫిర్యాదు చేయమని నేను ఆమెకు సలహా ఇచ్చాను. కానీ ఆమె తిరస్కరించారు. ఈ విషయం బయటకు తెలియడం.. ముఖ్యంగా తన కుటుంబానికి, ఆడపడుచులకు తెలియడం ఇష్టం లేదని తెలిపారు’ అని డాక్టర్ నుస్రత్ చెప్పారు.

మరో ముగ్గురు మహిళా వైద్యులు కూడా ఇలాంటి సమస్యను ఎదుర్కొన్న విషయం తనకు తెలుసని నుస్రత్ చెప్పారు.

డాక్టర్ నుస్రత్‌కు ఓ సీనియర్ పోలీసు ఆఫీసర్ పరిచయం ఉండటంతో ఆయన్ను ఆశ్రయించారు. దాంతో, ఆ పోలీసు అధికారి బ్లాక్‌మెయిలర్ వద్దకు వెళ్లి జైలులో వేస్తానని హెచ్చరించి, ఆ వీడియోను డిలీట్ చేయించగలిగారు.

‘మేం దీనిపై తదుపరి చర్యలు తీసుకోలేకపోయాం. కానీ ఎవరూ ఇలా చేయకుండా మేం ఆ టాయిలెట్‌కు ఉన్న రంథ్రాన్ని మూసివేయించాం’ అని డాక్టర్ నుస్రత్ తెలిపారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
వీడియో క్యాప్షన్, సహోద్యోగులతో పాటు రోగులు కూడా తమపై దౌర్జన్యానికి దిగుతున్నారన్న బాధితులు

‘తరచూ తాకే ప్రయత్నం’

అయిదేళ్ల కిందట ప్రభుత్వ ఆసుపత్రిలో రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్‌గా ఉన్న డాక్టర్ ఆమ్నా (అసలు పేరు కాదు) సహా ఇతర మహిళలు తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి తెలిపారు.

అక్కడ బాగా పలుకుబడి ఉన్న సీనియర్ డాక్టర్ తనను లక్ష్యంగా చేసుకున్నారని ఆమె చెప్పారు.

‘నా చేతిలో ఏదైనా ఫైలు కనిపిస్తే చాలు, ఆ ఫైలుపైకి వంగి నన్ను తాకడానికి ప్రయత్నించేవారు’ అని చెప్పారు.

దీనిపై ఆసుపత్రి యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

‘వేధింపులకు సంబంధించి ఆధారాలు చూపించాలని వారు అడిగారు. ఏడేళ్లుగా మేం ఆయన్ను దోషిగా తేల్చలేకపోయాం’ అని చెప్పారు.

తనకు ఎదురైన వేధింపులను వీడియో రికార్డ్ చేసిన మరో మహిళల గురించి తనకు తెలుసని డాక్టర్ అమ్మాన్ చెప్పారు.

‘వేధించిన వ్యక్తిని కేవలం బదిలీ చేశారు. అతను కొన్నినెలల తరువాత తిరిగి వచ్చాడు’ అని చెప్పారు.

ఆమె డాక్టర్‌గా అర్హత సాధించాలంటే తన హౌస్‌సర్జన్సీ పూర్తి చేయాల్సి ఉంది. దీంతో ఆమె తన హౌస్‌సర్జన్సీ పూర్తి చేసుకుని వెళ్లిపోయారు అని తెలిపారు.

ఆమె కథ చాలా సాధారణంగా అనిపించింది. ఓ మాజీ నర్సు తాను ఆపరేషన్ థియేటర్‌లో పడిన ఇబ్బందులను వివరించారు.

‘ఆపరేషన్ థియేటర్‌లో డాక్టర్ నన్ను అనుచితంగా తాకేవారు. ఆయనకు శస్త్రచికిత్స పరికరాలు అందించేటప్పుడు నా చేతిని పట్టుకునేవారు’ అని బాధితురాలు చెప్పారు. ‘ఆయన పదేపదే నా దగ్గరకు రావడానికి ప్రయత్నించేవారు. సైగలు చేస్తూతన భుజాలను నా భుజాలతో రాయడానికి ప్రయత్నించేవారు’ అన్నారు.

ఇస్లామాబాద్‌లో నర్సింగ్ చదివేందుకు ఆమెకు స్కాలర్‌షిప్ వచ్చింది. దీని గురించి ఎవరికైనా చెబితే తనకు వచ్చిన అవకాశాన్ని ఎక్కడ చెడగొడతారో అని ఆమె భయపడ్డారు. ‘‘ఎవరూ ఇవి వినరు..ఎవరైనా నర్సు ఇలాంటి విషయాలపై ఫిర్యాదు చేయడానికి ప్రయత్నిస్తే ఓ గౌరవనీయమైన వైద్యుడిపై ఇలాంటి ఆరోపణలు చేయడానికి నీకెంత ధైర్యం?’’ అంటారు అని ఆమె ఆవేదన చెందారు.

ఈ కోర్సు మూడేళ్లపాటు చదవాల్సి ఉండగా, అక్కడ పరిస్థితుల కారణంగా ఆమె ఏడాదికే బయటకు వచ్చేశారు.

Karachi's chief police surgeon, Dr Summaya Tariq Syed
ఫొటో క్యాప్షన్, సుమయా తారిఖ్

‘నన్ను గదిలో బంధించి సంతకం పెట్టమని బెదిరించారు’

నమ్మకం, జవాబుదారీతనం లేకపోవడమే ఈ సమస్యకు మూలమని కరాచీలోని చీఫ్ పోలీస్ సర్జన్, దేశంలోని తొలి రేప్ క్రైసిస్ సెంటర్ హెడ్ డాక్టర్ సుమయా తారిఖ్ సయ్యద్ అన్నారు.

తన 25 ఏళ్ల సర్వీసును హింస, నమ్మకద్రోహానికి వ్యతిరేకంగా సాగించిన పోరాటంగా అభివర్ణించిన ఆమె, పరిస్థితులను చక్కదిద్దే తీరుపై తాను నిరాశకు గురయ్యానని చెప్పారు.

హత్యకు గురైన వ్యక్తికి సంబంధించిన పోస్టుమార్టమ్ రిపోర్టును మార్చాలని బెదిరిస్తూ తన సహోద్యోగులు తనను ఒక గదిలో బంధించిన విషయాన్ని ఆమె గుర్తు చేసుకున్నారు.

‘‘సంతకం చెయ్యకపోతే మేం నిన్ను ఏం చేస్తామో తెలియదు’’ అని బెదిరించారు.

కానీ ఆ పనిచేయడానికి ఆమె తిరస్కరించారు. తనను బెదిరించిన వారిలో ఒకరికి సీనియర్ పొజిషన్ ఇచ్చారని, వారిపైన ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆమె చెప్పారు.

పంజాబ్‌లోని(పాకిస్తాన్‌లోని ప్రాంతం) ఓ ప్రభుత్వ వైద్యశాలలో పనిచస్తున్న మహిళా డాక్టర్ వేధింపులపై ఫిర్యాదు చేయడం కష్టమైన పని అని చెప్పారు. ఆస్పత్రులలో మహిళా వైద్యులు ధైర్యంగా ఫిర్యాదు చేసేందుకు అధికారిక కమిటీలు లేవని చెప్పారు.

‘‘ఒకవేళ కమిటీలు ఉన్నా, వాటిల్లో వేధింపులకు పాల్పడిన డాక్టర్లే సభ్యులుగా ఉంటారు లేదంటే వారి స్నేహితులు ఉంటారు. అలాంటప్పుడు ఎవరైనా ఎందుకు ఫిర్యాదు చేస్తారు, చేసి మరిన్ని కష్టాలు కోరి ఎందుకు తెచ్చుకుంటారు?’’

ఇంజెక్షన్ వేస్తున్న మహిళ
ఫొటో క్యాప్షన్, మహిళా వైద్యులకు, సిబ్బందికి సరైన టాయిలెట్లు, విశ్రాంతి గదులు లేవు.

‘95 శాతం నర్సులకు వేధింపులు’

పాకిస్తాన్‌లో మహిళా హెల్త్ వర్కర్స్‌పై సాగే దాడులకు సంబంధించి ఎలాంటి అధికారిక గణాంకాలు అందుబాటులో లేవు.

అయితే 2022లో యూఎస్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్‌లో వచ్చిన ఓ నివేదిక పాకిస్తాన్‌లోని పరిస్థితులను బయటపెట్టింది.

పాకిస్తాన్‌లో 95శాతం మంది నర్సులు తమ కెరీర్‌లో ఒక్కసారైనా పని ప్రదేశంలో హింసను ఎదుర్కొన్నారని ఆ నివేదిక వెల్లడించింది.

సహోద్యోగులు, రోగులు, ఆసుపత్రికి వచ్చే ఇతరుల నుంచి దాడులు, బెదిరింపులతో పాటు వేధింపులు ఎదుర్కొంటున్నట్లు నివేదిక వెల్లడించింది.

పాకిస్తాన్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ అండ్ డెంటిస్ట్రీ 2016లో లాహోర్‌లోని ప్రభుత్వ రంగ ఆసుపత్రులపై చేసిన ఒక అధ్యయనాన్ని ఉటంకిస్తూ 27 శాతం మంది నర్సులు లైంగిక హింసను అనుభవించారని తెలిపింది.

పాకిస్తాన్ వాయువ్య ఖైబర్ పఖ్తుంఖా ప్రావిన్స్ ప్రాంతంలోని పరిస్థితులను కూడా అది వివరించింది. అక్కడ 69 శాతం మంది నర్సులు 52 శాతం మంది మహిళా వైద్యులు.. ఇతర సిబ్బంది నుంచి పనిప్రాంతంలో లైంగిక వేధింపులను ఎదుర్కొన్నారని తెలిపింది.

2010లో కరాచీలో జరిగిన ఒక బాధాకరమైన దాడిని డాక్టర్ సయ్యద్ వివరించారు.

‘ఒక ప్రభుత్వ ఆసుపత్రిలోని వైద్యుడు ఒకరు నర్సును తన హాస్టల్‌కు తీసుకువెళ్లాడు. అక్కడ అతనితోపాటు మరో ఇద్దరు వైద్యులు కూడా ఉన్నారు. నర్సు అత్యాచారానికి గురై తీవ్ర మనస్తపంతో భవనం పైనుంచి దూకేశారు. దాంతో వారం రోజుల పాటు కోమాలో ఉన్నారు. కానీ ఆమె ఈ కేసును కొనసాగించకూడదని నిర్ణయించుకున్నారు’ అని సయ్యద్ చెప్పారు.

వేధింపులు, బెదిరింపులు రోగులు, వారి స్నేహితులు, బంధువుల నుంచి కూడా వస్తాయని ఆమె వివరించారు. కిందటేడాది మార్చురీలో శవపరీక్షలు చేస్తున్నప్పుడు తన బృందంపై ప్రజాప్రతినిధులు ఎలా దాడి చేశారో ఆమె వివరించారు.

‘‘కేవలం వీడియోలు తీయొద్దని చెప్పినందుకే తనను కొట్టడానికి ప్రయత్నించారని’’ చెప్పారు. ఈ విషయంపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పుడు ఈ కేసు కోర్టు వరకు వెళుతుందా లేదా అని ఎదురుచూస్తున్నారు.

భద్రతా ప్రమాణాలు తక్కువ
ఫొటో క్యాప్షన్, ఆసుపత్రి భవనాలలో వెలుతురు ఉండాలని, భద్రత మెరుగ్గా ఉండాలని మహిళా వైద్యులు కోరుతున్నారు.

‘మద్యం మత్తులో వస్తారు’

భద్రత లేకపోవడాన్ని ఇతర మహిళా వైద్యులు కూడా ఒక సమస్యగా అభివర్ణించారు, ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రులలోకి ఎవరైనా ఎటువంటి తనిఖీలు లేకుండానే నేరుగా వచ్చేయొచ్చని చెప్పారు.

దాడులకు గురైన మహిళా సిబ్బందిలో కొందరు.. తమపై దాడి చేసినవారు మద్యం మత్తులో వచ్చిన సాధారణ పౌరులేనని చెప్పారు. పాకిస్తాన్‌లో మద్యపానాన్ని నిషేధించారు.

డాక్టర్ సాదియా (ఆమె అసలు పేరు కాదు) కరాచీలోని ఒక ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తారు. తన సహోద్యోగులు అనేక మంది పదేపదే లైంగిక వేధింపులకు గురయ్యారని ఆమె చెప్పారు.

‘మాదకద్రవ్యాల మత్తులో ఉన్న వ్యక్తులు తరచుగా ఆసుపత్రిలోకి వస్తున్నారు’ అని ఆమె చెప్పారు.

మద్యం మత్తులో ఉండే రోగులు తమను తాకడానికి ప్రయత్నించడంలాంటి ఘటనలు సాధారణమని ఎలిజిబెత్ (పేరు మార్చాం) అనే నర్సు చెప్పారు. ‘‘మేం అతనికి చికిత్స చేయాలా, లేక మమ్మల్ని మేం రక్షించుకోవాలో తెలియక భయపడుతుంటాం.మాకు సాయపడేందుకు భద్రతా సిబ్బంది కూడా ఉండరు. అప్పుడు మేం పూర్తి నిస్సహాయులమనిపిస్తుంది’’ అని చెప్పారు.

ఆస్పత్రి సిబ్బంది పేరుతో ఫ్లోర్ తుడిచేవారు, ఆ పరిసరాల్లో తిరిగే నిజంగా సిబ్బందో కాదో కూడా తెలియదని సాదియా చెప్పారు.

భారత్ లో నిరసన

ఫొటో సోర్స్, EPA

‘లైట్లు ఉండవు’

"మారుమూల ప్రాంతాల్లో భద్రత లేకపోవడమే కాదు హాళ్లలో కూడా సరైన వెలుతురు ఉండదు’’ అని డాక్టర్ అమ్నా ఐదేళ్ళ కిందట పంజాబ్‌లో పనిచేసినప్పటి సంగతులను గుర్తు చేసుకున్నారు.

పాకిస్తాన్ ఎకనమిక్ సర్వే- 2023 ప్రకారం, దేశంలో 1,284 ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయి.

వీటిల్లో భద్రతాచర్యలు చాలా పేలవంగా ఉన్నాయని డాక్టర్లు తెలిపారు.

చాలాచోట్ల సీసీ కెమెరాలు లేవని, ఉన్నా అవి సరిగా పనిచేయమని ఆరోగ్య కార్యకర్తలు చెబుతున్నారు.

ఓ రోగికి ఒక నిర్దిష్టమైన ఇంజెక్షన్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు అది ఆయనకు ఇవ్వొచ్చో లేదో తెలుసుకోవడానికి తొలుత టెస్ట్ డోస్ ఇచ్చి.. ఫలితం కోసం ఎదురుచూస్తుండగానే వెంటనే ఇంజెక్షన్ చేయాలంటూ రోగి బంధువు తనపై దాడికి యత్నించిన ఘటనను డాక్టర్ సాదియా చెప్పారు.

‘ఆయన చాలా పొడవుగా ఉన్నారు. నాపై అరుస్తూ నన్ను తలుపుకేసి అదిమిపెట్టారు. ఇప్పుడే ఇంజెక్షన్ ఇవ్వండి, లేదంటే చంపేస్తాను అని బెదిరించారు' అని ఆమె చెప్పారు.

‘పాకిస్తాన్ నర్సింగ్ సిబ్బందిలో చాలా మంది ముస్లిమేతర మైనారిటీ సమాజాల నుంచి వచ్చినవారు ఉంటారు. వారిని దైవదూషణ పేరుతో బెదిరిస్తారు. ఎవరైనా నర్సు అందంగా ఉంటే ఆమెను మతం మార్చుకోవాలని వేధిస్తారు’ అని చెప్పారు.

వేధింపులకు తోడు కనీస సౌకర్యాలు లేకపోవడం, పనిగంటలు ఎక్కువగా ఉండటం వంటి సమస్యలు ఉన్నాయని మహిళా డాక్టర్లు వివరిస్తున్నారు.

'నేను ఎమర్జెన్సీ వార్డులో ఉన్నప్పుడు మరుగుదొడ్డి లేదు. 14 గంటల షిఫ్టులో టాయిలెట్‌కు వెళ్లే అవకాశమే లేకపోయింది. రుతుక్రమంలో ఉన్నప్పుడు కూడా మరుగుదొడ్డిని ఉపయోగించలేకపోయాం’’ అని డాక్టర్ సాదియా చెప్పారు.

‘ఇతర బ్లాకుల్లో ఉన్న మరుగుదొడ్లను ఉపయోగించే సమయం లేదని చెప్పారు. పురుష సిబ్బంది భవనం బయట చెక్ పాయింట్ వద్ద ఉన్న మరుగుదొడ్లను ఉపయోగించగలిగారు, కాని ఇవి పురుషులకు మాత్రమే కేటాయించారు’ అని చెప్పారామె.

ఈ మహిళలు పనిచేసిన నాలుగు ప్రావిన్సుల్లోని స్థానిక ఆరోగ్య మంత్రులను, అలాగే ఇస్లామాబాద్‌లోని నేషనల్ హెల్త్ కో-ఆర్డినేటర్‌ను బీబీసీ సంప్రదించినా వారి నుంచి ఎలాంటి సమాధానాలు రాలేదు.

భారత్‌లో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య జరిగినప్పటి నుంచి పాకిస్తాన్‌లోనూ తమ భద్రతపై మహిళా వైద్యులలో తీవ్రమైన చర్చ మొదలైంది.

ఈ సంఘటన తనను తీవ్రంగా ప్రభావితం చేసిందని డాక్టర్ సాదియా చెప్పారు. తాను కూడా దైనందిన జీవితంలో కొన్ని మార్పులు చేసుకున్నానని చెప్పారు. ‘‘నేను చీకటిగా ఉండే, నిర్మానుష్య ప్రాంతాలకు వెళ్ళకూడదని నిర్ణయించుకున్నాను. గతంలో మెట్లదారి ఉపయోగించేదానిని. ఇప్పుడు లిఫ్ట్ వాడటమే మంచిదని అనుకుంటున్నా’’ అని చెప్పారు.

‘‘నాకు ఏడేళ్ల కూతురు ఉంది. తను డాక్టర్ కావాలని ఎప్పుడూ చెబుతూ ఉంటుంది. కానీ ఈ దేశంలో డాక్టర్‌కు రక్షణ ఉందా అని నేను తరచూ ఆశ్చర్యపోతూ ఉంటా’’ అని ఎలిజిబెత్ చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)