టాటాల ‘టైటాన్’ కథేంటో తెలుసా? ఈ కంపెనీ ఎలా అవతరించింది, పేరెలా పెట్టారు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, మురళీధరన్ కాశీ విశ్వనాథన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
టాటా గ్రూప్, తమిళనాడు ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టిడ్కో) సంయుక్తంగా ప్రారంభించిన చేతి గడియారాల తయారీ సంస్థ (జాయింట్ వెంచర్) టైటాన్.. ఇప్పుడు భారత్‌లో ప్రముఖ వాచ్‌ల కంపెనీగా వెలుగొందుతూ.. ఆభరణాలు, చీరలు, కళ్లద్దాల వ్యాపారాల్లోనూ తనదైన ముద్ర వేసుకుంది. ‘గ్లోబల్ బ్రాండ్’గా అవతరించింది.
అయితే, ఈ కంపెనీ సక్సెస్ స్టోరీ ఎలా ప్రారంభమైందో ఒకసారి తెలుసుకుందాం..
టైటాన్, తనిష్క్ పేర్లు విననివారు ఉండరు. ఈ బ్రాండ్ల వెనుక ఆసక్తికరమైన చరిత్ర ఉంది.
జర్నలిస్ట్ వినయ్ కామత్ రాసిన ‘టైటాన్: ఇన్‌సైడ్ ఇండియాస్ మోస్ట్ సక్సెస్‌ఫుల్ కన్జూమర్ బ్రాండ్’ అనే పుస్తకంలో, టైటాన్ మేనేజింగ్ డైరెక్టర్ సీ.కే వెంకటరామణ్ రాసిన ‘ది తనిష్క్ స్టోరీ: ఇన్‌సైడ్ ఇండియాస్ నంబర్.1 జువెలరీ బ్రాండ్’ అనే పుస్తకంలో ఈ రెండు బ్రాండ్ల ప్రయాణం గురించి వివరణాత్మకంగా రాశారు.

‘లైసెన్స్ రాజ్’ వ్యవస్థ అమలులో ఉన్న 1970లలో చేతి గడియారాలు తయారీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వ కంపెనీ హిందుస్థాన్ మెషీన్ టూల్స్‌కు మాత్రమే లైసెన్స్ ఉండేది. చిన్న కంపెనీలు స్థానికంగా వీటిని తయారు చేసేవి. చేతి గడియారాలను తయారు చేసేందుకు మరే పెద్ద కంపెనీకీ అనుమతి ఉండేది కాదు.
సింధూ లోయ నాగరికతపై తమిళ ఐఏఎస్ అధికారి ఐరావతం మహాదేవన్‌కు చాలా ఆసక్తి ఉండేది. ఆయన 1977లో దిల్లీలో పనిచేసేటప్పుడు, సింధూ లోయకు సంబంధించిన సమాచారాన్ని సేకరించేందుకు టాటా ప్రెస్‌కు వెళ్లారు.
ఆ సమయంలో టాటా ప్రెస్‌లో ఉన్నతాధికారిగా అనిల్ మంచండా పనిచేస్తున్నారు. ఆ సమయంలో మహాదేవన్, అనిల్ మంచండాకు మధ్యలో మంచి సాన్నిహిత్యం ఏర్పడింది.

ఫొటో సోర్స్, Getty Images
ఒక రోజు దిల్లీలోని ఉద్యోగ్ భవన్‌లో మహాదేవన్ కార్యాలయానికి అనిల్ మంచండా వెళ్లారు. ఆ సమయంలో, ప్రైవేట్ రంగ భాగస్వామ్యంలో కొత్త ఉత్పత్తుల తయారీకి అనుమతులపై చర్చలు జరుగుతున్నాయి. పలు ఉత్పత్తుల తయారీ అవకాశాలపై ఈ ఇద్దరూ చర్చించారు. ఆ తర్వాత, అనిల్ మంచండా ఈ విషయాన్ని టాటా ప్రెస్ ఎగ్జిక్యూటివ్ జార్జెస్ దేశాయ్‌తో చర్చించారు.
చివరికి, చేతి గడియారాలు తయారు చేస్తే బాగుంటుందని వారు భావించారు. ఆ సమయంలో చేతి గడియారాలను తయారు చేయాలని టాటా కంపెనీ కూడా అనుకొంది. కానీ, అందుకు కేంద్ర ప్రభుత్వ లైసెన్సులు లేవు.
టాటాలు చేతి గడియారాల వ్యాపారాల్లోకి రావడానికి రెండు సవాళ్లు ఎదురయ్యాయి.
ఒకటి ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకోవడం. రెండోది వాటిని తయారు చేసేందుకు కావాల్సిన టెక్నాలజీ వారివద్ద లేకపోవడం. దీనికి అప్పట్లో టెక్నాలజీ అందించేందుకు ప్రపంచంలో కేవలం ఐదు కంపెనీలే ఉన్నాయి.
ఆ ఐదు కంపెనీల్లో ఒకటైన సిటిజన్ అప్పటికే కేంద్ర ప్రభుత్వానికి చెందిన హెచ్ఎంటీ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. సీకో కంపెనీ అల్విన్‌తో చర్చలు జరుపుతోంది. టైమెక్స్ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. ఇక క్యాసియో సంస్థ, చేతి గడియారాలు తయారు చేయడమే కాకుండా, డిజిటల్ వాచ్‌లపైనా దృష్టిసారించడం పెట్టింది. స్వచ్ఛ్ గ్రూప్ తన కంపెనీ టెక్నాలజీని మరెవర్వకీ షేర్ చేసేందుకు సిద్దంగా లేదు.

ఫొటో సోర్స్, X/titanwatches
అదే సమయంలో, తమిళనాడు ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టిడ్కో) ద్వారా రాష్ట్రంలోకి కొత్త పరిశ్రమలను ఆహ్వానించాలని తమిళనాడు ప్రయత్నిస్తోంది.
ఆ సమయంలో కేంద్ర ప్రభుత్వ సర్వీసులో ఉన్న మహాదేవన్ తమిళనాడుకు బదిలీ అయ్యారు. టిడ్కో చైర్మన్‌గా, మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు.
అప్పట్లో, చేతి గడియారాల కంపెనీని ఏర్పాటు చేసేందుకు టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్ కోసం టిడ్కో కూడా ఓ కంపెనీతో చర్చలు జరుపుతోంది.
టాటాలు కూడా చేతి గడియారాలు తయారు చేసేందుకు ఆసక్తిగా ఉన్నారని మహాదేవన్‌కు అప్పటికే అవగాహన ఉంది. జార్జెస్ దేశాయ్‌తో ఈ విషయం గురించి మాట్లాడారు.
తాము ఫ్రాన్స్‌కు చెందిన ఓ గడియారాల కంపెనీతో మాట్లాడామని, తమిళనాడులో తమకు భాగస్వామి కావాలని, టాటాలకు ఆసక్తి ఉందా? అని జార్జెస్ దేశాయ్‌ను ఐఏఎస్ అధికారి మహాదేవన్ అడిగారు.
టాటాలు కూడా ఆ క్షణం కోసమే ఎదురు చూస్తున్నారు. దీంతో, ఆ అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు.
ఆ తర్వాత, గడియారాల తయారీకి లైసెన్స్ కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి టిడ్కో దరఖాస్తు చేసింది. అందులో టాటాలను భాగస్వామిగా పేర్కొంది. అయితే, టిడ్కోకు మాత్రమే లైసెన్స్ ఇస్తామని, టాటాల ప్రమేయం ఉండకూడదని కేంద్ర ప్రభుత్వం చెప్పింది.

ఫొటో సోర్స్, X/TanishqJewelry
ఆ తర్వాత, టాటాల పేరు ప్రస్తావించకుండా, క్వెస్టర్ ఇన్వెస్ట్‌మెంట్స్ పేరుతో మరోసారి దరఖాస్తు పెట్టుకుంది టిడ్కో. క్వెస్టర్ ఇన్వెస్ట్‌మెంట్స్ లిమిటెడ్ కూడా టాటా గ్రూప్‌కు చెందినదే. ఆ తర్వాత లైసెన్స్ వచ్చింది.
ఇక వారు విడుదల చేయబోయే వాచ్ కోసం బ్రాండ్ నేమ్ కోసం ఆలోచించారు. వాళ్ల వాచ్‌ల బ్రాండ్‌కు టైటాన్ అనే పేరును ఖరారు చేశారు. ఈ పేరు కూడా ఆసక్తికరమే. ఎలాగంటే.. టాటా ఇండస్ట్రీస్(TATA Industries) నుంచి టీ, ఐ(T, I) అనే అక్షరాలు, తమిళనాడు అనే పేరు నుంచి టీ, ఏ, ఎన్(T, A, N) అక్షరాలను కలిపి.. టైటాన్ అనే బ్రాండ్ పేరు అవతరించింది.
హోసూర్‌లో 1986లో ఈ వాచీల కంపెనీ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేశారు. 1987 ఫిబ్రవరిలో ఉత్పత్తి ప్రారంభించారు. ఉత్పత్తి ప్రారంభమైన నెల నుంచే టైటాన్ చేతి గడియారాలు అమ్మకానికి వచ్చాయి. 1989 ఏప్రిల్ నాటికి 10 లక్షల చేతి గడియారాలు అమ్ముడుపోయాయి.
జేఆర్డీ టాటా తర్వాత 1991లో టాటా గ్రూప్ చైర్మన్‌గా రతన్ టాటా బాధ్యతలు చేపట్టారు. తొలిసారి హోసూర్‌లో టైటాన్ ఇన్‌స్టిట్యూట్‌ను ఆయన 1992లో సందర్శించారు. ప్రారంభం నుంచే భారత వాచ్ మార్కెట్లో టైటాన్ తనదైన ముద్ర వేసుకుంది.
టైటాన్ విజయవంతమైన బ్రాండ్‌గా ఎదగడంతో, దానికి కొనసాగింపుగా, తనిష్క్ బ్రాండ్ వెలిసింది.
1990ల్లో ముంబయిలో జరిగిన ఒక జువెలరీ ప్రదర్శనకు జార్జెస్ దేశాయ్ వెళ్లారు. హైఎండ్ వాచ్‌లను, చక్కగా రూపొందించిన ఆభరణాలను కలిపి యూరోపియన్ మార్కెట్లో అమ్మితే ఎలా ఉంటుందని ఆయన ఆలోచించారు. అలా, తనిష్క్ పురుడుపోసుకుంది.

ఫొటో సోర్స్, Getty Images
టైటాన్ ప్రారంభం నుంచి జార్జెస్ దేశాయ్‌తో ఉన్న అనిల్ మంచండాను ఆ విభాగానికి ఇన్‌ఛార్జ్‌గా నియమించారు.
ఆభరణాల అమ్మకాలు బాగుంటాయని తొలుత భావించారు. అయితే, అంతా బాగోలేకపోవడంతో, ఆయన ఆ బాధ్యత నుంచి వైదొలిగారు.
కానీ, జార్జెస్ దేశాయ్ మాత్రం ఆ ప్రాజెక్టు పట్ల పట్టుదలతో ఉన్నారు. రూ.65 కోట్ల పెట్టుబడితో, హోసూర్‌లో ఆభరణాల తయారీ ప్లాంట్ ప్రారంభించారు.
తొలుత యూరప్, అమెరికాలకు ఆభరణాలు ఎగుమతి చేయాలని ప్లాన్ చేశారు. భారత్‌లో కూడా చిన్న మొత్తంలో విక్రయించాలని నిర్ణయించారు.
1994లో ప్రొడక్షన్ మొదలైంది. పెద్ద మొత్తంలో యూరప్, అమెరికా మార్కెట్లకు ఎగుమతి చేయడం సాధ్యం కాదని జార్జెస్ దేశాయ్ గుర్తించారు. దీంతో, ఆయన లోకల్ మార్కెట్‌పై దృష్టిపెట్టారు.
కానీ, అప్పటికే లోకల్ మార్కెట్లో తీవ్ర పోటీ ఉంది. తొలుత ‘సెలెస్టే’ పేరుతో ఈ బ్రాండ్ ప్రారంభించారు. ఆ తర్వాత 1996లో, దీని పేరును తనిష్క్‌గా మార్చారు.
చెన్నైలోని కేథడ్రల్ రోడ్డులో 1996లో తొలి షోరూంను తెరిచారు. తొలుత తనిష్క్ బ్రాండ్ కేవలం 18 క్యారెట్ల బంగారు ఆభరణాలను మాత్రమే అమ్మేది.
భారతీయులు ఎక్కువగా 22 క్యారెట్ల ఆభరణాలను ఇష్టపడతారని గుర్తించి, 22 క్యారెట్ల ఆభరణాలను కూడా తయారు చేయడం ప్రారంభించింది.
తనిష్క్ తన వ్యాపారాల్లో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్న తర్వాత, ఎదగడం ప్రారంభించింది.
ప్రస్తుతం వాచీలు, బంగారు ఆభరణాలు, డైమండ్ ఆభరణాలు, కళ్లద్దాలు, వస్త్రాలు, హ్యాండ్‌బ్యాగులు, పెర్‌ఫ్యూమ్‌ల అమ్మకాల్లో టైటాన్ దేశంలో అతిపెద్ద బ్రాండ్‌గా అవతరించింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














