రతన్ టాటా: ఆధునిక భారతానికి అందివచ్చిన పారిశ్రామిక నాయకుడు - ఎడిటర్స్ కామెంట్

నానో కారుతో రతన్ టాటా

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, జీఎస్ రామ్మోహన్
    • హోదా, ఎడిటర్, బీబీసీ తెలుగు

రతన్ టాటా, టాటా గ్రూప్ సంస్థల నాయకత్వం చేపట్టిన సమయంలోనే భారత్ ఆర్ధిక సరళీకరణ బాట పట్టింది. అది 1991. అలా రతన్ టాటా నేతృత్వంలో టాటా సామ్రాజ్య విస్తరణ, భారత ఆర్థిక వ్యవస్థ విస్తరణ రైలు పట్టాలుగా ఒకదాని వెంట ఒకటి సాగిపోయాయి అనుకోవచ్చు. పరస్పర పూరకాలు అనుకోవచ్చు.

దేశీయ దృష్టి మాత్రమే హెచ్చుగా ఉన్న కంపెనీల్లో సంప్రదాయ నాయకత్వాన్ని, సంప్రదాయ ఆలోచనా విధానాన్ని తొలగించి.. విస్తారమైన కొత్త ఆలోచనా విధానాన్ని నెలకొల్పి.. సంస్థను అనూహ్యమైన స్థాయికి విస్తరించిన పారిశ్రామిక వేత్తగా ఇవాళ ఆయన్ను అందరూ గుర్తిస్తున్నారు. కీర్తిస్తున్నారు.

విస్తరణ అనేది వ్యాపారంలో ఎంత కీలకమైన అంశమో గుర్తించి, అందివచ్చిన అవకాశాలను ఉపయోగించుకుని సంస్థలను అందనంత ఎత్తుకు తీసుకువెళ్లిన ఇండస్ట్రియల్ లీడర్ రతన్ టాటా.

రతన్ టాటా 1991 నుంచి 2012 వరకూ టాటా సంస్థలకు నాయకత్వం వహిస్తే ఈ కాలంలో టాటా గ్రూప్ సంపద 40 రెట్లు పెరిగింది. లాభం 50 రెట్లు పెరిగిందని ఆర్థిక నిపుణుల అంచనా.

కొన్ని పరాజయాలు, ప్రతికూల అంశాలున్నప్పటికీ ఎక్కువగా సానుకూల అంశాలతోనే వార్తల్లో ఉండే ఇండస్ట్రియల్ లీడర్ రతన్ టాటా.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
జేఆర్డీ టాటాతో రతన్ టాటా

ఫొటో సోర్స్, Getty Images

బ్రిటన్ సంస్థలను కొనడం ద్వారా కొత్త ఒరవడికి పునాదులు

ఏ వలసవాదులైతే భారతదేశాన్ని ఆక్రమించి పాలించారో అదే దేశ వ్యాపారవేత్త, బ్రిటన్‌కు చెందిన సంస్థలను కొనుగోలు చేయడం ద్వారా ఆయన కొత్త ఒరవడికి పునాదులు బలంగా వేశారు.

భారత ఆర్థిక శక్తిని, ఇండస్ట్రియల్ పవర్‌ను ప్రపంచానికి చాటి చెప్పడమే కాకుండా.. దేశంలో ఎదుగుతున్న మిడిల్ క్లాస్‌కు ఒక సైకలాజికల్ అంశాన్ని, పవర్ ఫుల్ సింబాలిజాన్ని అందించారు.

ప్రపంచంలో రెండో పెద్ద టీ కంపెనీ అయిన టెట్లీని, లగ్జరీ కార్ల తయారీ సంస్థ జాగ్వార్‌ లాండ్ రోవర్‌, స్టీల్ కంపెనీ కోరస్‌ను టాటా టేకోవర్ చేశారు. ఇవ్వన్నీ బ్రిటన్ కంపెనీలు, బ్రిటన్ బ్రాండ్లు.

భారత్‌లో ఎదుగుతున్న మధ్యతరగతికి ‘హమ్ కిసీసే కమ్ నహీ’ అనే కొత్త ఆత్మ విశ్వాసానికి అలా పోయెటిక్ జస్టిస్ లాంటి సింబాలిజాన్ని టాటా అందించారు.

బిజినెస్ వరల్డ్‌లో రతన్ టాటా దిగ్గజం. బ్రిటిష్ ఇండస్ట్రీకి రూపు ఇవ్వడంలో ఆయన కృషి అపారం అని బ్రిటన్ వాణిజ్య మంత్రి జోనాధన్ రేనాల్డ్స్ తన సంతాప సందేశంలో పేర్కొన్న తీరు చూస్తే టాటా లాంటి కంపెనీ ఇంటా బయటా చూపిన ప్రభావం మనకు అర్థమవుతుంది.

అదే కాదు. ఇంకో సింబాలిజం కూడా ఉంది. స్వాతంత్య్రం కనుచూపు మేరలో ఉందనగా 1944-45లో భారత అభివృద్ధి కోసం జేఆర్‌డీ టాటా నేతృత్వంలోని తొమ్మిది మంది సభ్యుల బాంబే పారిశ్రామికవేత్తల బృందం బాంబే ప్లాన్ రూపొందించింది.

ఇప్పుడే పోటీ వాతావరణం వద్దు, వ్యాపార పరంగా రక్షణ చర్యలు కావాలి, ప్రభుత్వ మద్దతు, పర్యవేక్షణ కావాలి అని అప్పటి పారిశ్రామిక బృందం తన నివేదికలో కోరింది.

అదే టాటా వారసుడు రతన్ టాటా ఇప్పుడు పోటీ ప్రపంచంలో ముందు నిలిచి, వలస పాలకుల దేశంలోని బ్రాండ్లను కొనుగోలు చేశారు.

ఇది భారత్ సాధించిన ప్రగతికి చిహ్నంగా చెప్పుకోవచ్చు. దేశ పారిశ్రామిక రంగం బలపడిన తీరును, అది ఉరకలెత్తుతున్న తీరును ఈ పరిణామం సూచిస్తుంది.

మెంటార్‌ జేఆర్‌డీ టాటాతో రతన్ టాటా

ఫొటో సోర్స్, Ratan Tata/Instagram

సంపదను, ఇండస్ట్రీని వ్యతిరేక దృష్టితోనూ, అనుమానంగానూ చూసే దశ గతంలో ప్రధానంగా ఉండేది. తొంభైల ఆరంభం వరకూ ఆ ధోరణి బలంగా కనిపించేది.

సరళీకరణ విధానాల తర్వాత ధోరణి పూర్తిగా మారింది. ఇండస్ట్రీ, పెట్టుబడి లాంటివి పాలకులకే కాదు, మిడిల్ క్లాస్‌కు కూడా డార్లింగ్ వర్డ్స్‌గా మారిపోయాయి. పెట్టుబడిని ఉపాధి సంకేతంగా చూడటం పెరిగింది.

ఎవరు ఎన్ని ఇండస్ట్రీలను తీసుకొచ్చారు అనేది ఇప్పుడు పాలకుల అభివృద్ధి నమూనాగా, సంకేతంగా మారిపోయింది.

ఒక పారిశ్రామికవేత్త ఇంతగా జనం నోళ్లలో నానడానికి ఇంతమంది ఇన్ని రకాలుగా గుర్తు చేసుకోవడానికి ఈ వాతావరణం ఒక బలమైన కారణం.

అలాగే చిన్నపుడు రోల్స్ రాయిస్ కారులో స్కూల్ కెళ్లిన రతన్ టాటా తన జీవితంలో సాధారణ జీవన విధానాన్ని, ఆడంబరాలకు దూరంగా ఉండే శైలిని ఎంచుకున్నారు.

తరచుగా నానో కారులోనో, ఇంకో సాధారణ కారులోనో కనిపించడం, అది వార్తగా మారడం ఇవ్వన్నీ ఆయనకు మిడిల్ క్లాస్‌లో పాజిటివ్ ఇమేజ్ తెచ్చిపెట్టాయి.

ఇక ఫిలాంత్రపీ, అంటే దానగుణం. తన ఆదాయంలో అధిక భాగం సంస్థలకు దానాలు చేయడం, ముఖ్యంగా ఆరోగ్య విద్య రంగాల్లోని సంస్థలకు కేటాయించడం ఆయన ప్రతిష్ఠ పెరిగేలా చేశాయి.

మూగజీవాల మీద ప్రేమ, ముఖ్యంగా కుక్కల మీద ప్రేమ వంటివి టాటాకు సాఫ్ట్ ఇమేజ్‌ను సాధించి పెట్టాయి.

టాటా ఎంతగా పాపులర్ అయ్యారు అంటే ఆయనవి కాని స్ఫూర్తిదాయకమైన వ్యాఖ్యలు కూడా ఆయన పేరుతో ప్రచారమయ్యేవి. తర్వాత ఆయనే అవి నా మాటలు కాదు అని ఇంటర్యూల్లో చెప్పాల్సి వచ్చేది.

సీనియర్ సిటిజన్స్‌కు కంపానియన్‌షిప్ అవసరమని గుర్తించి ఇంటర్ జనరేషనల్ ఫ్రెండ్‌షిప్స్ కోసం గుడ్ ఫెల్లోస్ అనే స్టార్టప్ లాంచ్ చేయడం లాంటివి ఆధునికమైన దూరదృష్టి ఉన్న నేతగా ఆయనకు గుర్తింపు తెచ్చాయి.

అదొక్కటే కాదు, అనేక స్టార్టప్స్‌ను ప్రోత్సహిస్తూ పెట్టుబడులు పెట్టడం లాంటివి యువతలో ఆయన క్రేజ్ పెంచాయి. దాదాపు 30 స్టార్టప్స్‌లో ఆయన పెట్టుబడులు పెట్టారు.

టీసీఎస్ సమావేశంలో రతన్ టాటా

ఫొటో సోర్స్, Getty Images

నిన్నటి ట్విట్టర్ లేదా నేటి ఎక్స్‌లో కోటి ముఫ్పై లక్షలమందికి పైగా ఫాలోయర్స్‌తో, పది లక్షల మంది ఇన్‌స్టాగ్రామ్ ఫాలోయర్స్‌తో ఆయన భారత్‌లో ఎక్కువ ఫాలోయింగ్ ఉన్న వ్యాపారవేత్తగా హరున్ రిచ్ లిస్ట్ 2023లో ప్రకటించింది.

ఇవి కాకుండా టాటా కంపెనీల్లో ఉద్యోగం వస్తే గవర్నమెంట్ ఉద్యోగం వచ్చినట్టే అనే ఉద్యోగ భద్రతకు సంబంధించిన ఇమేజ్ ఉంది.

ఇటీవల అక్కడక్కడా కంపెనీల్లో లేఆఫ్స్ ఉన్నప్పటికీ ప్రధానమైన ఇమేజ్ మాత్రం అదే ఉంది.

సాధారణంగా టాటా కంపెనీల్లో ఉద్యోగులను తొలగించరు అనే ముద్ర అయితే సంపాదించుకున్నారు. అదొక జనరల్ ఇమేజ్, అక్కడక్కడా అపవాదు ఉన్నప్పటికీ. ఐటీలో ఇప్పటికీ టీసీఎస్ జాబ్ అనేది డ్రీమ్ జాబ్‌గానే చాలామందికి ఉంది.

టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ లాంటి సంస్థలు మేధోపరంగా ఆలోచనా విధానాల్లో భిన్నత్వానికి, సామాజిక పరిశోధనకు ఎంత పెద్ద పీట వేశాయో, అక్కడ ఎంత ఫ్రీడమ్ ఉందో చాలా మంది చెబుతారు. అయితే, ఇటీవల ఆ సంస్థలో భావప్రకటనా స్వేచ్ఛకు సంబంధించిన కొన్ని వివాదాలు తలెత్తాయి.

ఆ సంస్థ ఆయన కంటే ముందు నుంచే ఉన్నప్పటికీ, దాని భావజాల వైవిధ్యాన్ని, స్వేచ్ఛను కాపాడటంలో, దానిని విస్తరించడంలో ఆయన పేరు సంపాదించుకున్నారు.

ఒక పెట్టుబడిదారుడు పెట్టిన ఆ సంస్థ నుంచి వచ్చిన లెఫ్ట్ లిబరల్ థింకర్స్ చాలామంది కనిపిస్తారు. కొన్ని వివాదాలు ఉన్నప్పటికీ ఆ సంస్థ, సామాజిక పరిశోధకులకు చాలాకాలంగా వాహికగా ఉంటూ వస్తున్నది.

అటు వ్యాపార సంస్థలు కావచ్చు, ఇటు సామాజిక సంస్థలు కావచ్చు. ఇన్‌స్టిట్యూషన్స్ ఆయా రంగాల్లో ముందుకెళ్లేలా బలపరిచిన ఇన్‌స్టిట్యూషన్ బిల్డర్ అనే కీర్తి టాటాకు ఉంది.

సైరస్ మిస్త్రీతో రతన్ టాటా

ఫొటో సోర్స్, Getty Images

రతన్ టాటా ప్రయాణంలో కొన్ని అపజయాలు, వివాదాలు కూడా ఎదుర్కొన్నారు.

కలల ప్రాజెక్ట్ నానో కారు సక్సెస్ కాలేదు. సామాన్యులకు అందుబాటు ధరలో కారు అనే నినాదం కాస్తా అఫర్డబుల్ బదులు చీప్ కారు అనే ఇమేజ్‌లోకి వెళ్లిపోయి దెబ్బకొట్టింది.

కారు అనేది భారత సమాజంలో కేవలం ప్రయాణ సాధనం మాత్రమే కాక హోదాకు చిహ్నంగా కూడా ఉన్న దశలో ఈ చీప్ కారు అనే ఇమేజ్ వల్ల జనం దాన్ని ఆదరించలేదు.

దానికితోడు పశ్చిమ బెంగాల్‌లోని సింగూర్‌లో గొడవలు. అలాగే ఒడిశాలోనూ మరికొన్ని చోట్ల టాటా ప్లాంట్లు స్థానికుల నుంచి ముఖ్యంగా ఆదివాసీల నుంచి తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వచ్చింది.

అలాగే రతన్ టాటా చైర్మన్‌గా పీఠం దిగిపోయి సైరస్ మిస్త్రీని గద్దెనెక్కించాక వివాదాలు తీవ్రరూపం దాల్చాయి. కోర్టుల్లో పోరాడాల్సి వచ్చింది. తర్వాత సైరస్ మిస్త్రీ 2022లో కారు ప్రమాదంలో మరణించారు.

స్వతంత్రానికి ముందు నుంచే భారత ఆర్థిక రంగంలో ప్రధాన పాత్రధారుగా ఉన్న టాటా సామ్రాజ్యాన్ని భారత్‌కే పరిమితం చేయకుండా అంతర్జాతీయ దిగ్గజ సంస్థగా అంతర్జాతీయ యవనికపై భారత ఇండస్ట్రియల్ వాహికగా మార్చిన లీడర్‌గా రతన్ టాటా గుర్తింపు పొందారు.

అలాగే తన జీవనశైలి, ఇతరత్రా నైపుణ్యాలు, సంస్థలను తీర్చిదిద్దిన తీరు వల్ల, ముఖ్యంగా కేపిటల్ ఫ్రెండ్లీగా మారుతున్న భారత్‌లో మారిన వాతావారణం వల్ల ఆయన ఇమేజ్ పెరుగుతూ పోయిందని చెప్పొచ్చు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)