అమూల్: ఈ బ్రాండ్ గుజరాత్ నుంచి అమెరికా ఎలా చేరింది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, రాక్సీ గగ్డేకర్ ఛారా
- హోదా, బీబీసీ ప్రతినిధి
1946లో గుజరాత్‌లోని ఆనంద్‌లో ప్రారంభమైన అమూల్ డెయిరీ సంస్థ, ఇప్పుడు అమెరికా మార్కెట్లో కూడా అడుగుపెట్టింది. ఫ్లూయిడ్ మిల్క్‌ను అమెరికాలో విడుదల చేసింది.
మిషిగన్ మిల్క్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (ఎంఎంపీఏ)తో అమూల్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. మిచిగాన్, ఇండియానా, ఒహయో, విస్కాన్సిన్‌లలో పాడి రైతుల యాజమాన్యంలో 108 ఏళ్ల అనుభవం ఉన్న సహకార సంస్థ ఎంఎంపీఏ.
అమెరికాలోని భారతీయుల కోసం అమూల్ అభివృద్ధి చేసిన రుచి ప్రాధాన్యతల ప్రకారం పాల సేకరణ, ప్యాకేజింగ్, పంపిణీ బాధ్యతలను ఎంఎంపీఏ చూసుకుంటుంది.
‘‘అమూల్ ఫ్లూయిడ్ మిల్క్ నాణ్యత, బ్రాండ్ కారణంగా అమెరికాలో కూడా ప్రజాదరణ పొందే అవకాశం ఉంది’’ అని అమూల్ మేనేజింగ్ డైరెక్టర్, జయేన్ మెహతా బీబీసీతో చెప్పారు.
భారతీయ జనాభా ఎక్కువగా వినియోగించే పనీర్, పెరుగు, చీజ్ వంటి పాల ఉత్పత్తులు ఇప్పటికే అమెరికా మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి.
2024లో అమెరికా పాల మార్కెట్‌లో ఆదాయం సుమారు రూ.2.54 లక్షల కోట్లు ఉండనుందని అంచనాలు చెబుతున్నాయి.
అయితే, ప్రపంచవ్యాప్తంగా పరిశీలిస్తే 2024లో పాల మార్కెట్‌లో సుమారు రూ. 5.95 లక్షల కోట్ల ఆదాయంతో భారత్ అగ్రస్థానంలో ఉంది.


ఫొటో సోర్స్, Getty Images
రోజు 1.3 కోట్ల లీటర్ల పాలు
అమూల్ ప్రస్తుతం ప్రతిరోజూ దాదాపు 1.3 కోట్ల లీటర్ల పాలను ప్యాకింగ్ చేస్తోంది. వీటిని 36 లక్షల మంది పాడి రైతులు, 18 సంఘాల నుంచి సేకరిస్తుంది.
రైతులు ప్రైవేటు కంపెనీలకు పాలను అమ్మడం మానేసి, సొంతంగా వ్యాపారం చేసుకునేలా ఖేడా జిల్లా రైతులను సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రోత్సహించారని రూత్ హెరెడియా రచించిన "ది అమూల్ ఇండియా స్టోరీ" పుస్తకం వివరిస్తుంది.
అలా ఏర్పాటైన రైతుల సహకార సంస్థ ప్రధాన కార్యాలయం ఆనంద్‌కు మార్చారు. దాని హెడ్‌గా త్రిబువాందాస్ పటేల్ నియమితులయ్యారు.
భారత్‌లో శ్వేత విప్లవ పితామహుడిగా పేరొందిన డాక్టర్ వర్గీస్ కురియన్ అమూల్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు.
అమూల్ కేవలం 200 లీటర్ల పాలతో 1946లో ప్రారంభమైందని, అది 1952 నాటికి 20,000 లీటర్లకు పెరిగిందని తన ఆత్మకథ "ఐ టూ హాడ్ ఎ డ్రీమ్" పుస్తకంలో పేర్కొన్నారు.
అయితే, అమూల్‌కు మున్ముందు సవాళ్లు ఎదురుకావచ్చని కొందరు భావిస్తున్నారు.
యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్ మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ (యూఎస్డీఏ) ఎకనామిక్ రీసెర్చ్ సర్వీస్ ఫుడ్ అవైలబిలిటీ డేటా సిస్టమ్ ప్రకారం, అమెరికాలో గత ఏడు దశాబ్దాలుగా ఫ్లూయిడ్ మిల్క్ వినియోగం క్రమంగా తగ్గుతోంది.
మీడియా రిపోర్టుల ప్రకారం.. అమెరికాలోని ప్రభుత్వ పాఠశాలలు పాలను ఎక్కువగా ఉపయోగించేవి. అల్పాహారం, మధ్యాహ్న భోజనంగా పాల డబ్బాలను అందించేవి. అయితే, రుచి సరిగా లేకపోవడంతో చాలామంది పిల్లలు పాలను తాగడం మానేశారు. ఇది పాఠశాలల్లో పాల వినియోగం తగ్గడానికి దారితీసింది.
అనంతరం లాక్టోజ్ లేని పాలు, బాదం పాలు, వోట్ పాలు, కొబ్బరి పాలు, సోయా పాలు వంటి మొక్కల ఆధారిత ప్రత్యామ్నాయాలను ఇష్టపడటం ప్రారంభించారు.

ఫొటో సోర్స్, Jay Bhrambhatt
అమెరికాలో ..
అమెరికా మార్కెట్‌లో ఫ్యాట్ శాతం తక్కువగా ఉండే పాలకు మంచి ఆదరణ ఉందని నిపుణులు చెబుతున్నారు. అయితే, భారత్‌లో అమూల్ గోల్డ్ వంటి ఫ్యాట్ ఎక్కువగా ఉండే పాలను కంపెనీ విక్రయిస్తుంది. ఇందులో 6 శాతం కొవ్వు పదార్థాలు ఉంటాయి.
అయితే, కొవ్వు తక్కువగా ఉండే అమెరికా పాల నుంచి, భారత్‌లో వచ్చే రుచిని మళ్లీ సృష్టించడం అమూల్‌కు సవాలుగా మారింది.
అమెరికాలో అధిక కొవ్వు పాలను ఉత్పత్తి చేయడంపై మొదట్లో ఆందోళనలు ఉన్నాయని జయేన్ మెహతా అంగీకరించారు.
‘‘కానీ, గుజరాత్ కో-ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (జీసీఎంఎంఎఫ్), అమూల్ ఉత్పత్తి, నాణ్యత నియంత్రణ బృందం సహాయంతో అనేక ప్రయోగాల తర్వాత, అమెరికాలో అమూల్ గోల్డ్, శక్తి కోసం రెసిపీని రూపొందించగలిగారు’’ అని మెహతా అన్నారు.
తమ దగ్గరున్న సాంకేతికత, కావలసిన రుచిని సాధించడానికి సాయపడిందని ఎంఎంపీఏ ప్రెసిడెంట్, సీఈవో అయిన జో డిగ్లియో తెలిపారు. పాల నుంచి క్రీమ్‌ను వేరు చేసి, తర్వాత కావాల్సిన మోతాదులో కలిపామని అన్నారు.

ఫొటో సోర్స్, Ketul Shah
ఇదంతా ఎక్కడ జరుగుతుంది?
అమూల్ పాలను ఒహయోలోని సుపీరియర్ డైరీ ప్లాంట్‌లో ప్రాసెస్ చేస్తారు.
ఎంఎంపీఏ రైతుల సహకార సంస్థ అని, దానికి చాలామంది రైతులతో కూడిన నెట్‌వర్క్ ఉందని, వాళ్లే అమూల్‌కు పాలు సరఫరా చేస్తారని మెహతా వివరించారు.
‘‘పాలు వివిధ తనిఖీల ద్వారా భారతీయ రుచికి సరిపోయేలా ప్రాసెస్ అవుతాయి’’ అని ఆయన అన్నారు.
భారతీయ కమ్యూనిటీని దాటి..
అమెరికాలో అధిక కొవ్వు పాలను ఎవరూ ఇష్టపడరనడం సరికాదని మెహతా అన్నారు.
చాలామంది అమెరికన్లు తమ కాఫీకి అదనపు క్రీమ్‌ను కలుపుతున్నారని, దానిని అమూల్ ఫ్లూయిడ్ మిల్క్‌తో భర్తీ చేయవచ్చని ఆయన సూచించారు.
అమూల్ పాలు ఇప్పటికే భారతీయ కమ్యూనిటీని దాటి ఆదరణ పొందుతున్నాయని డిగ్లియో చెప్పారు. అమెరికాలో చాలామంది ఈ పాలను ఇష్టపడటం ప్రారంభించారని ఆయన తెలిపారు.
అమెరికాలో గుర్తింపు తెచ్చుకునేందుకు, అమెరికన్ క్రికెట్ జట్టుకు అమూల్ సంస్థ స్పాన్సర్ చేసింది. జట్టు టీ20 క్రికెట్ జెర్సీలపై అమూల్ బ్రాండ్ లోగో కనిపించింది.
"మేము అమెరికాలోని సోషల్ మీడియాలో, భారతీయ కమ్యూనిటీలోని ప్రైవేట్ వాట్సాప్ గ్రూపులలో చాలా యాక్టివ్‌గా ఉన్నాం" అని మెహతా చెప్పారు.
బ్రాండ్ లాయల్టీ కారణంగా అమూల్ ప్రయోజనం పొందుతుందని పరిశ్రమ నిపుణులు భావిస్తున్నారు.
అయితే, అమెరికా ఆహార ప్రమాణాలకు అనుగుణంగా ఉండే ఉత్పత్తులను ఉత్పత్తి చేయడం సవాలుగా ఉంటుంది. తమ కార్యకలాపాలు అత్యుత్తమ నాణ్యతతో ఉన్నాయని డిగ్లియో అంటున్నారు.
అమూల్ కోసం పాలను ఉత్పత్తి చేసేవారు కో ఆపరేటివ్ సభ్యులని, నాణ్యతపైనే దృష్టి సారించామని ఆయన అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














