రతన్ టాటా: ఆడంబరాలకు దూరంగా, సాధారణ జీవితాన్ని కోరుకున్న వ్యక్తి కథ ఇది..

రతన్ టాటా

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, రెహాన్ ఫజల్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

1992లో ఇండియన్ ఎయిర్ లైన్స్ ఉద్యోగులతో ఒక ప్రత్యేక సర్వే చేశారు.

దిల్లీ నుంచి ముంబయికి విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో మిమ్మల్ని అత్యంత ఎక్కువగా ప్రభావితం చేసిన ఒక ప్రయాణికుడి గురించి చెప్పండి అన్నారు. అప్పుడు అత్యధిక ఓట్లు రతన్ టాటాకు లభించాయి.

కారణమేంటో తెలుసుకోడానికి ప్రయత్నించినప్పుడు, వీఐపీల్లో ఆయన ఒక్కరు మాత్రమే ఒంటరిగా ప్రయాణించేవారని తెలిసింది. అంటే తన బ్యాగ్ తీసుకెళ్లడానికి, ఫైళ్లు పట్టుకోవడానికి రతన్ టాటాకు అసిస్టెంట్లు ఎవరూ ఉండేవారు కాదు.

విమానంలో ఆయన నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుంటుండేవారు. ఆ సమయంలో తక్కువ చక్కెర వేసిన ఒక బ్లాక్ కాఫీ తాగడం ఆయనకు అలవాటు.

తాను అడిగినట్టుగా కాఫీ ఇవ్వలేదని ఆయన ఎప్పుడూ ఫ్లయిట్ అటెండెంట్లపై కోప్పడలేదు.

రతన్ టాటా సాదాసీదా జీవితంలో ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
రతన్ టాటా

ఫొటో సోర్స్, Ratan Tata Instagram

ఫొటో క్యాప్షన్, ఒంటరిగా ప్రయాణించే వీఐపీ రతన్ టాటా మాత్రమే.

“టాటా సన్స్ చీఫ్‌గా ఉన్నప్పుడు, ఆయన జేఆర్డీ టాటా గదిలో కూర్చోలేదు. ఆయన కూర్చోవడానికి సాధారణంగా ఉండే ఒక చిన్న గదిని నిర్మించారు. ఆయన ఎవరైనా జూనియర్లతో మాట్లాడుతున్నప్పుడు, ఆ సమయంలో సీనియర్ అధికారి వస్తే, ఆయన కాసేపు ఆగిరండి అని ఆ సీనియర్‌ అధికారికి చెప్పేవారు. ఆయన దగ్గర రెండు జర్మన్ షెపర్డ్ కుక్కలు ఉండేవి. వాటి పేర్లు టీటో, ట్యాంగో. అవంటే ఆయనకు చాలా ఇష్టం” అని టాటా గ్రూప్ మీద గిరీష్ కుబేర్ రాసిన పుస్తకం “ది టాటాస్: హౌ ఏ ఫ్యామిలీ బిల్ట్ ఏ బిజినెస్ అండ్ ఏ నేషన్”లో వివరించారు.

ఆ కుక్కలతోపాటూ రతన్ టాటా తరచూ బాంబే హౌస్ (టాటా గ్రూప్ ప్రధాన కార్యాలయం) లాబీలో తిరుగుతూ కనిపించేవారు. ఆ సమయంలో ముందే అపాయింట్‌మెంట్ తీసుకుంటే తప్ప ఎవరినైనా ఆయన్ను కలవడానికి అక్కడికి అనుమతించేవారు కాదు.

రతన్ టాటా

ఫొటో సోర్స్, Getty Images

కుక్క ఆరోగ్యం బాలేనప్పుడు..

ప్రముఖ వ్యాపారవేత్త, రచయిత సుహైల్ సేథ్ ఒక ఘటన గురించి వివరించారు.

2018 ఫిబ్రవరి 6న బ్రిటన్ ప్రిన్స్ చార్లెస్ బకింగ్హమ్ ప్యాలెస్‌లో రతన్ టాటాకు ‘రాక్‌ఫెల్లర్ ఫౌండేషన్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్’ అవార్డును ఇవ్వాల్సి ఉంది.

కానీ, వేడుకకు కొన్ని గంటల ముందు తాను అక్కడికి రాలేనని, ఎందుకంటే తన కుక్క టీటోకు హఠాత్తుగా జబ్బు చేసిందని ఆ కార్యక్రమ నిర్వాహకులకు సమాచారం ఇచ్చారు రతన్ టాటా. ప్రిన్స్ చార్లెస్‌కు ఆ విషయం చెప్పగానే ఆయన ‘‘దట్స్ ఎ మ్యాన్. దట్ ఈజ్ ద మ్యాన్ రతన్ ఈజ్’’ అన్నారు.

అబ్దుల్ కలాంతో రతన్ టాటా

ఫొటో సోర్స్, Getty Images

ఆడంబరాలకు దూరం, ఏకాంతం అంటే ఇష్టం..

జేఆర్డీ టాటా లాగే రతన్ టాటా సమయపాలనకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చేవారు. ఆయన సరిగ్గా సాయంత్రం ఆరున్నర గంటలకు తన ఆఫీసు నుంచి వెళ్లిపోయేవారు.

ఆఫీసుకు సంబంధించిన పని కోసం ఎవరైనా తనను ఇంట్లో కలవాలనుకుంటే ఆయన చిరాకు పడేవారు. ఇంట్లో ఏకాంతంగా ఫైళ్లు, ఇతర పత్రాలు చదువుతుండేవారు.

ఆయన ముంబయిలో ఉన్నప్పుడు వారాంతాల్లో అలీబాగ్‌లోని తన ఫాంహౌస్‌లో గడిపేవారు. ఆ సమయంలో ఆయనతో కుక్కలు తప్ప ఇంకెవరూ ఉండేవారు కాదు. ఆయనకు ప్రయాణాలు చేయడం, ప్రసంగాలు చేయడం లాంటివి పెద్దగా నచ్చేవి కాదు. ఆడంబరాలంటే ఆయనకు చిరాకు.

చిన్నప్పుడు కుటుంబం రోల్స్ రాయిస్ కారులో ఆయన్ను స్కూలు దగ్గర దింపే సమయంలో ఆయనకు అసౌకర్యంగా అనిపించేది.

ఆయనకున్న ‘మొండి’ స్వభావం తన కుటుంబంలోనే ఉందని, జేఆర్డీ, ఆయన తండ్రి నావల్ టాటాల నుంచి అది రతన్‌కు వారసత్వంగా వచ్చిందని రతన్ టాటాను దగ్గరగా చూసినవారు చెబుతుంటారు.

“మీరు ఆయన తలకు తుపాకీ గురిపెట్టినా, నన్ను కాల్చండి కానీ, నేను దారిలోంచి పక్కకు వెళ్లను అంటారాయన. రతన్ టాటా అలాంటివారు” అని సుహైల్ సేథ్ చెప్పారు.

తన పాత స్నేహితుడి గురించి బాంబే డైయింగ్ చీఫ్ నుస్లీ వాడియా మాట్లాడుతూ.. “రతన్ చాలా సంక్లిష్టమైన వ్యక్తి. ఎవరైనా ఎప్పుడైనా ఆయన గురించి పూర్తిగా తెలుసుకుని ఉంటారని నాకు అనిపించడం లేదు. మాకు సాన్నిహిత్యం ఉన్నప్పటికీ నాకు, రతన్‌కు మధ్య వ్యక్తిగత సంబంధాలు లేవు. ఆయన పూర్తిగా ఒంటరి వ్యక్తి” అన్నారు.

‘‘రతన్ తన గోప్యతకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తానని ఆయన స్వయంగా నా దగ్గర అంగీకరించారు. ‘నేను బహుశా కలుపుగోలుగా ఉండే వ్యక్తిని కాకపోవచ్చు. అలా అని సమాజంలో కలవనివాడిని కూడా కాదు’ అని ఆయన చెప్పేవారు” అని కుమీ కపూర్ తన పుస్తకం “యాన్ ఇంటిమేట్ హిస్టరీ ఆఫ్ పార్శీస్‌”లో రాశారు.

రతన్ టాటాను పెంచిన నానమ్మ

రతన్ టాటా యువకుడుగా ఉన్న రోజులను గుర్తు చేసుకున్న ఆయన స్నేహితులు టాటా గ్రూప్‌లో తన ప్రారంభ రోజుల్లో రతన్‌ తన సర్‌నేమ్ ఒక భారంలా అనుకునేవారని చెబుతారు.

అమెరికాలో చదువుకుంటున్న సమయంలో క్లాస్‌మేట్స్‌కు తన కుటుంబ నేపథ్యం గురించి ఏమీ తెలియదు కాబట్టి, ఆయన ఏ చింతా లేకుండా ఉండేవారు.

కుమీ కపూర్‌కు రతన్ టాటా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో.. “ఆ రోజుల్లో విదేశాల్లో చదవడానికి రిజర్వ్ బ్యాంక్ చాలా తక్కువ విదేశీ కరెన్సీ ఉపయోగించడానికి అనుమతించేది. మా నాన్నకు చట్టాలను ఉల్లంఘించడం నచ్చదు. అందుకే ఆయన నా కోసం బ్లాక్‌లో డాలర్లు కొనేవారు కాదు. దీంతో తరచూ నెల ముగిసేలోపే నా దగ్గర డబ్బులు అయిపోయేవి. దాంతో నా స్నేహితుల దగ్గర అప్పు తీసుకునేవాడిని. చాలాసార్లు కాస్త అదనపు డబ్బు సంపాదించడానికి పాత్రలు కూడా కడిగాను” అని చెప్పారు.

రతన్‌కు పదేళ్ల వయసు ఉన్నప్పుడు ఆయన తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు.

ఆయనకు 18 ఏళ్లు వచ్చిన సమయంలో ఆయన తండ్రి సిమోన్ దూనోయర్‌ అనే ఒక స్విస్ మహిళను పెళ్లాడారు.

మరోవైపు, ఆయన తల్లి విడాకులు తీసుకున్న తర్వాత సర్ జంషెడ్జీ జీజీభాయ్‌ను వివాహం చేసుకున్నారు. దీంతో రతన్‌ను ఆయన నానమ్మ లేడీ నవాజ్‌బాయి టాటా పెంచారు.

రతన్ అమెరికాలో ఏడేళ్లు ఉన్నారు. అక్కడ కార్నెల్ విశ్వవిద్యాలయంలో ఆయన ఆర్కిటెక్చర్ అండ్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ చేశారు. లాస్ ఏంజలస్‌లో ఆయనకు ఒక మంచి ఉద్యోగం, అద్భుతమైన ఇల్లు ఉండేవి. కానీ తన నానమ్మ కోరడంతో ఆయన భారత్‌కు తిరిగి రావాల్సి వచ్చింది.

ఆయన అమెరికాలో ఉన్నప్పుడు ఒక అమెరికన్ అమ్మాయిని ప్రేమించారు. ‘‘ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాను. ఆమె నాతో పాటే భారత్‌కు వస్తారని అనుకున్నాను. కానీ, అప్పుడు భారత్, చైనా మధ్య యుద్ధం (1962) జరుగుతోంది. దాంతో, ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు’’ అని హ్యూమన్స్ ఆఫ్ బాంబే‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రతన్ టాటా చెప్పారు.

రతన్ టాటా జీవితాంతం అవివాహితుడిగా ఉండిపోయారు.

రతన్ టాటా

ఫొటో సోర్స్, Getty Images

సాధారణ కార్మికుడిలా బ్లూ ఓవరాల్ ధరించి కెరియర్ ప్రారంభం

1962లో రతన్ టాటా జంషెడ్‌పూర్‌లోని టాటా స్టీల్ సంస్థలో పనిచేయడం ప్రారంభించారు.

‘‘రతన్ జెంషెడ్‌పూర్‌లో ఆరేళ్లు ఉన్నారు. మొదట్లో ఆయన ఒక షాప్‌ఫ్లోర్ కార్మికుడిలా బ్లూ ఓవరాల్ ధరించి అప్రెంటిస్‌షిప్ చేశారు. ఆ తర్వాత ఆయన్ను ప్రాజెక్ట్ మేనేజర్‌గా చేశారు’’ అని గిరీష్ కుమార్ తన పుస్తకంలో రాశారు.

ఆ తర్వాత ఆయన మేనేజింగ్ డైరెక్టర్ ఎస్కే నానావతికి స్పెషల్ అసిస్టెంట్ అయ్యారు. ఆయన చాలా కష్టపడి పనిచేసే వ్యక్తి అన్న విషయం ముంబయి వరకూ చేరింది. దీంతో జేఆర్డీ టాటా ఆయన్ను ముంబయికి పిలిపించారు.

ఆ తర్వాత రతన్ ఆస్ట్రేలియాలో ఏడాది పాటు పనిచేశారు. రతన్ టాటాకు సెంట్రల్ మిల్, నెల్కో లాంటి నష్టాల్లో ఉన్న కంపెనీలను గాడినపెట్టే బాధ్యతలను అప్పగించారు జేఆర్డీ.

రతన్ టాటా నేతృత్వంలో మూడేళ్లలోనే నెల్కో దశ మారిపోయింది. అది లాభాలు ఆర్జించడం మొదలుపెట్టింది. 1981లో రతన్‌ను టాటా ఇండస్ట్రీస్‌కు చీఫ్‌గా చేశారు జేఆర్డీ.

మన్మోహన్ సింగ్‌తో రతన్ టాటా

ఫొటో సోర్స్, Getty Images

సాదాసీదా జీవనశైలి

ఆ సమయంలోని బిజినెస్ జర్నలిస్ట్‌లు, రతన్ టాటా స్నేహితులు ఆయన చాలా స్నేహపూర్వకమైన వ్యక్తిగా గుర్తు చేసుకుంటారు.

ఎవరితోనైనా గౌరవ మర్యాదలతో నడుచుకుంటారని, ఎలాంటి గాబరా ప్రదర్శించని ఆసక్తికరమైన వ్యక్తి అని చెబుతుంటారు. ఎవరైనా తనను కలవాలనుకుంటే, స్వయంగా ఆయనే ఫోన్ ఎత్తే వారని చెప్పారు.

‘‘చాలామంది భారత బిలియనీర్స్‌తో పోలిస్తే రతన్ టాటా జీవనశైలి అత్యంత సాధారణంగా ఉంటుంది’’ అని రచయిత కుమీ కపూర్ చెప్పారు.

ఆయనకు సెక్రటరీలు ఎక్కువగా లేకపోవడాన్ని చూసి తాను చాలా ఆశ్చర్యానికి గురైనట్లు తన వ్యాపార సలహాదారుల్లో ఒకరు అన్నట్లు తెలిపారు.

‘‘నేనొకసారి ఆయన ఇంటి బెల్ నొక్కినప్పుడు, ఒక చిన్న అబ్బాయి వచ్చి తలుపు తెరిచారు. యూనిఫామ్ వేసుకున్న సర్వెంట్లు ఎవరూ నాకు ఆ ఇంట్లో కనిపించలేదు. సముద్రానికి ఎదురుగా కొలాబాలో ఉండే ఆయన ఇల్లు టాటా కళాభిరుచిని ప్రతిబింబిస్తుంది. కుంబ్లా హిల్స్‌లోని యాంటిలియాలో ఉన్న ముకేశ్ అంబానీ 27 అంతస్తుల భవనానికి ఇది పూర్తి భిన్నంగా ఉంటుంది’’ అని రచయిత చెప్పారు.

జేఆర్డీ టాటాతో రతన్ టాటా

ఫొటో సోర్స్, Getty Images

జేఆర్డీ టాటా వారసుడిగా..

జేఆర్డీ టాటాకు 75 ఏళ్లు వచ్చినప్పుడు, ఆయన వారసుడు ఎవరు? అని విపరీతంగా చర్చ జరిగింది.

‘‘నాని పాల్ఖీవాలా, రుసీ మోదీ, షారుఖ్ సబ్వాలా, హెచ్‌ఎన్ సేథ్నాలలో ఒకరు ఆయన వారసులు అవుతారని అనుకున్నారు. రతన్ టాటా కూడా పాల్ఖీవాలా, రుసీ మోదీలు ఇద్దరూ ప్రధాన అభ్యర్థులుగా భావించారు’’ అని టాటా బయోగ్రాఫర్ కేఎం లాలా రాశారు.

86 ఏళ్ల వయసులో 1991లో జేఆర్డీ టాటా చైర్మన్ పదవి నుంచి దిగిపోయినప్పుడు, కంపెనీ వారసత్వ బాధ్యతలు రతన్ టాటాకు అప్పజెప్పారు.

టాటా స్నేహితుడు నుస్లీ వాడియా, ఆయన అసిస్టెంట్ షారుఖ్ సబ్వాలాలు రతన్ టాటా పేరును సమర్థించారు.

1991లో టాటా గ్రూప్ చైర్మన్‌గా రతన్ టాటా బాధ్యతలు చేపట్టినప్పుడు, దర్బారి సేత్, రుసీ మోదీ, అజిత్ కేర్కర్‌లను ఎలా బలహీనపర్చాలన్నది ఆయన ముందున్న సవాలు.

ప్రధాన కార్యాలయం నుంచి ఎలాంటి జోక్యం లేకుండా ఇప్పటికీ ఈ ముగ్గురూ టాటా కంపెనీల్లో పనిచేస్తున్నారు.

రతన్ టాటా

ఫొటో సోర్స్, Getty Images

టెట్లీ, కోరస్, జాగ్వార్ కొనుగోళ్లు

రతన్ టాటా వ్యాపారాలను అర్థం చేసుకునే విధానంపై తొలుత చాలామంది పలు ప్రశ్నలు సంధించారు.

కానీ, 2000లో బ్రిటీష్ టెట్లీ గ్రూప్‌ను కొనుగోలు చేసి, ఆయన అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఇప్పుడు టాటా గ్లోబల్ బెవరేజెస్ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద టీ కంపెనీ. ఆ తర్వాత యూరప్‌కు చెందిన రెండో అతిపెద్ద స్టీల్ తయారీ కంపెనీ ‘కోరస్’ను కొనుగోలు చేశారు.

ఈ డీల్‌పై విమర్శకులు పలు ప్రశ్నలు సంధించినప్పటికీ, తన సామర్థ్యాన్ని టాటా గ్రూప్ రుజువు చేసి చూపించింది.

2009లో దిల్లీ ఆటో ఎక్స్‌పో సందర్భంగా టాటా ‘నానో’ కారును ప్రజల ముందుకు తీసుకొచ్చారు. ఆ కారు ధర అప్పుడు లక్ష రూపాయలేనని ఆ సంస్థ ప్రకటించింది.

నానోకు ముందు 1998లో టాటా మోటార్స్ ‘ఇండికా’ కారును మార్కెట్లోకి విడుదల చేసింది. భారత్‌లో డిజైన్ చేసిన తొలి కారు ఇదే.

ఈ కారు తొలుత విఫలమైంది. దీంతో, ఫోర్డ్ మోటార్ కంపెనీకి దీన్ని అమ్మాలని రతన్ టాటా నిర్ణయించారు. ఆయన డెట్రాయిట్‌కు వెళ్లినప్పుడు బిల్ ఫోర్డ్‌ను కలిశారు. అయితే, ఈ వ్యాపారం గురించి సరైన అవగాహన లేనప్పుడు ఎందుకు ఈ రంగంలోకి వచ్చారంటూ ఆయన్ను బిల్ ఫోర్డ్‌ ప్రశ్నించారు.

రతన్ టాటా బృందానికి ఆయన ప్రవర్తన, మాటలు కోపం తెప్పించాయి. సంభాషణను పూర్తి చేయకుండానే అక్కడి నుంచి బయటికి వచ్చేశారు.

ఆ తర్వాత, 2008లో పరిస్థితులన్నీ మారిపోయాయి. ఫోర్డ్ కంపెనీ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ఫోర్డ్ తన జాగ్వార్ అండ్ ల్యాండ్ రోవర్‌ బ్రాండ్ల వ్యాపారాన్ని అమ్మకానికి పెట్టింది. ఆ రెండు లగ్జరీ కార్ల బిజినెస్‌ను టాటా గ్రూప్ 2.3 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది.

జాగ్వార్ ల్యాండ్ రోవర్ సీఈవో డేవిడ్ స్మిత్‌తో రతన్ టాటా

ఫొటో సోర్స్, Getty Images

జాగ్వార్ కొన్నప్పుడు విమర్శలు

రతన్ టాటా నేతృత్వంలో జరిగిన ఈ కొనుగోళ్లపై కొందరు వ్యాపార విశ్లేషకులు పలు ప్రశ్నలు లేవనెత్తారు.

రతన్ టాటా ఖరీదైన విదేశీ కొనుగోళ్లు ఆయనకు ఖరీదైన డీల్స్‌గా మారాయని వాళ్లు అన్నారు.

టాటా స్టీల్ యూరప్ ‘వైట్ ఎలిఫెంట్‌’గా మారి, టాటా గ్రూప్‌ను తీవ్ర అప్పుల ఊబిలోకి నెట్టింది.

రతన్ టాటా విదేశీ కొనుగోళ్లు పూర్తిగా ‘అహంకారం, బ్యాడ్ టైమింగ్‌లో తీసుకున్నవి’ అని టీఎన్ నీనన్ అన్నారు.

‘గత రెండు దశాబ్దాలలో భారత వ్యాపారాల్లో అతిపెద్ద అవకాశం టెలికం. కానీ, రతన్ టాటా ఆ అవకాశాన్ని వదులుకున్నారు’’ అని ఈ వ్యాపార విశ్లేషకులు అంటారు.

‘‘రతన్ టాటా తప్పు మీద తప్పు చేస్తున్నారు. జాగ్వార్‌ను కొనడం ఆయన గ్రూప్‌కు ఆర్థిక భారమే. కానీ, టీసీఎస్ ఎప్పుడూ టాటా గ్రూప్‌ను అగ్రస్థానంలో నిలబెడుతుంది’’ అని ప్రముఖ జర్నలిస్ట్ సుచేతా దలాల్ చెప్పారు.

2015లో టాటా గ్రూప్ ఆర్జించిన నికర లాభంలో 60 శాతానికి పైగా ఈ కంపెనీ నుంచే వచ్చింది. 2016లో మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా టీసీఎస్ అతిపెద్ద భారత కంపెనీగా ఉంది.

సైరస్ మిస్త్రీతో రతన్ టాటా

ఫొటో సోర్స్, Getty Images

నీరా రాడియా, తనిష్క్, సైరస్ మిస్త్రీల వివాదం

లాబీయిస్ట్ నీరా రాడియాతో జరిగిన టెలిఫోన్ సంభాషణలు లీకవ్వడంతో 2010లో రతన్ టాటా పెద్ద వివాదంలో చిక్కుకున్నారు.

ఆ తర్వాత 2020 అక్టోబర్‌లో, టాటా గ్రూప్ జ్యూవెల్లరీ బ్రాండ్ తనిష్క్ వ్యాపార ప్రకటన కూడా రతన్ టాటాకు పెద్ద తలనొప్పి అయింది. ఆ వ్యాపార ప్రకటనను తనిష్క్ వెనక్కి తీసుకుంది. జేఆర్డీ టాటా బతికి ఉంటే, ఇలాంటి ఒత్తిడి వచ్చేది కాదని చాలామంది భావించారు.

కనీసం గంట కూడా సమయం ఇవ్వకుండా 2016 అక్టోబర్ 24న టాటా గ్రూప్ చైర్మన్‌గా సైరస్ మిస్త్రీని తొలగించినప్పుడు కూడా రతన్ టాటాపై విమర్శలు వచ్చాయి.

రతన్ టాటా

ఫొటో సోర్స్, Getty Images

టాటా అంటే విశ్వసనీయమైన బ్రాండ్‌

అయితే, ఇన్ని ఉన్నప్పటికీ, రతన్ టాటా ఎప్పుడూ భారత్‌లోని అత్యంత విశ్వసనీయ పారిశ్రామిక వేత్తల్లో ఒకరిగా ఉంటారు.

భారత్‌లో కోవిడ్ మహమ్మారి వ్యాపించినపుడు రతన్ టాటా అప్పటికప్పుడు టాటా ట్రస్టుల నుంచి రూ.500 కోట్లు, టాటా కంపెనీల నుంచి రూ.1,000 కోట్లు విరాళంగా ఇచ్చారు.

ఆ సమయంలో కరోనా రోగులకు వైద్యం చేయడానికి ప్రాణాలకు తెగించిన డాక్టర్లు, వైద్య సిబ్బంది ఉండడం కోసం తమ లగ్జరీ హోటళ్లను ఉపయోగించుకోవచ్చని మొట్టమొదట చెప్పిన వ్యక్తి రతన్ టాటానే.

ఇప్పటికీ భారత ట్రక్ డ్రైవర్లు తమ వాహనాల వెనుక భాగంలో ‘ఓకే టాటా’ అని రాసుకుంటూ ఉంటారు. అంటే నేను నడిపే ఈ ట్రక్కు టాటాది, ఇది విశ్వసనీయమైనది అని చెప్పడానికే.

టాటా వేసిన ఒక భారీ గ్లోబల్ ఫుట్‌ప్రింట్ కూడా ఉంది. జాగ్వార్ అండ్ ల్యాండ్ రోవర్ కార్లను తయారు చేసేది ఈ కంపెనీనే. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ప్రపంచంలోని ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో ఒకటి.

ఇవన్నీ రతన్ టాటా పాత్రను శాశ్వతంగా గుర్తుండిపోయేలా చేస్తాయి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)