గూగుల్ డీప్‌మైండ్ సహ వ్యవస్థాపకుడికి కెమిస్ట్రీలో నోబెల్ బహుమతి

డెమిస్ హసాబిస్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, గూగుల్ డీప్‌మైండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డెమిస్ హసాబిస్

బ్రిటిష్ కంప్యూటర్ శాస్త్రవేత్త డెమిస్ హసాబిస్, ప్రొటీన్లపై చేసిన పరిశోధనలకు గాను రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతిని గెలుచుకున్నారు.

48 ఏళ్ల హసాబిస్ సహవ్యవస్థాపకుడిగా ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ తరువాత ‘గూగుల్ డీప్‌మైండ్‌’గా మారింది.

స్వీడన్‌లోని స్టాక్‌హోమ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఆయన, మరో ఇద్దరికి కెమిస్ట్రీలో బహుమతిని ప్రకటించింది.

హసాబిస్‌తో కలిసి పనిచేసిన ప్రొఫెసర్ జాన్ జంపర్, అమెరికాకు చెందిన ప్రొఫెసర్ డేవిడ్ బేకర్‌లకూ ఈ అవార్డును ప్రకటించారు.

జీవానికి బిల్డింగ్ బ్లాక్స్‌లాంటి ప్రొటీన్లు, మానవ శరీరంలోని ప్రతి కణంలోనూ కనిపిస్తాయి.

ప్రొటీన్‌లను బాగా అర్థం చేసుకోవడం వల్ల వైద్యం చాలా పురోగమించింది.

హసాబిస్, ప్రొఫెసర్ జంపర్ దాదాపు మనకు తెలిసిన అన్ని ప్రొటీన్ల నిర్మాణాలను అంచనా వేయడానికి కృత్రిమ మేధను ఉపయోగించారు, ఆల్ఫాఫోల్డ్ 2 అనే సాధనాన్ని సృష్టించారు.

నోబెల్ కమిటీ దీనిని రసాయన శాస్త్రంలో విప్లవంగా పేర్కొంది.

ఈ సాధనాన్ని ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 20 కోట్ల ప్రొటీన్‌ల విషయంలో ఉపయోగిస్తున్నారు.

ప్రొఫెసర్ బేకర్ కొత్త ప్రొటీన్‌ను రూపొందించడానికి అమైనో ఆమ్లాలను ఉపయోగించారు, ఫార్మాస్యూటికల్స్, వ్యాక్సిన్‌లలో కొత్త ప్రొటీన్‌ల సృష్టికి తలుపులు తెరిచారు.

ఈ ప్రకటన వెలువడిన కొద్దిసేపటికి, ఇది తనకు దక్కిన గౌరవం అని ప్రొఫెసర్ బేకర్ కమిటీకి కృతజ్ఞతలు తెలిపారు.

ఫోన్ మోగినప్పుడు తాను నిద్రపోతున్నానని, ప్రకటన వెలువడగానే తన భార్య చాలా బిగ్గరగా అరవడం ప్రారంభించిందని ఆయన చెప్పారు.

విజేతలు సుమారు 9 కోట్ల రూపాయల విలువైన బహుమతిని పంచుకుంటారు. ప్రొఫెసర్ బేకర్ ఈ అవార్డులో సగం అందుకుంటారు, మిగిలిన సగం హసాబిస్, జంపర్‌లు పంచుకుంటారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)