ప్రజల చేతిలో ‘కిల్లర్ హిప్పో’ హతం

ఫొటో సోర్స్, Sani Yauri
వాయువ్య నైజీరియాలోని ఒక పట్టణంలో స్థానిక రైతులు, మత్స్యకారులు కలిసి ఒక హిప్పోను, దాని పిల్లను చంపేశారు.
కెబ్బి రాష్ట్రంలోని యౌరీలో ఒక మత్స్యకారుడు హిప్పో దాడిలో చనిపోవడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు.
దీంతో ప్రజల భద్రత కోసం ఈ జంతువును చంపాలని కెబ్బి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.
అనంతరం కొన్ని వారాల పాటు ప్రయత్నించి ఈ ‘కిల్లర్ హిప్పో’ను ప్రజలు హతమార్చారు.
నైజీరియాలో నీటిగుర్రాల(హిప్పో) సంఖ్య గత కొన్ని దశాబ్దాలుగా చాలా వేగంగా తగ్గుతోంది.
ప్రస్తుతం ఇక్కడ దాదాపు 100 హిప్పోలు ఉన్నాయని అంచనా. వీటిలో చాలావరకు రక్షిత ప్రాంతాల్లోనే నివసిస్తున్నాయి.

ఈ హిప్పోను చంపడానికి యౌరీ యువకులు ‘జాగోస్’ అనే స్థానికంగా తయారు చేసిన ఈటెలను ఉపయోగించారు.
హిప్పోపై ఈటెలతో దాడి చేసి చంపారు. ఆ తరువాత మాంసాన్ని స్థానికులు పంచుకున్నారు.
‘ఈ హిప్పో దాడికి భయపడి చాలా మంది రైతులు, మత్య్సకారులు బయటకు వెళ్లడం మానేశారు’ అని స్థానికులైన సానీ యౌరి బీబీసీతో అన్నారు.
‘ఇది యౌరి ఎమిర్ సిబ్బందిలో ఒక సభ్యుడిని చంపడమే కాకుండా, మరొకరినీ తీవ్రంగా గాయపరిచింది. ఇది మా పంటలను నాశనం చేసింది’ అన్నారు.
యౌరి పట్టణానికి సమీపంలో నైజర్ నది ఒడ్డున వరి పొలాలు ఉన్నాయి, ఇక్కడే హిప్పో తిరుగుతుండేది.
మరొక స్థానికుడు ఇసా జమీలు మాట్లాడుతూ.. కొన్ని వారాలుగా తాను హిప్పో భయంతో తన పొలానికి వెళ్లలేదని, ఇప్పుడు ధైర్యంగా వెళతానని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
చనిపోయిన జంతువు ఫొటోలను స్థానికులు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేయగా.. మిశ్రమ స్పందన వ్యక్తం అవుతోంది.
హిప్పోను చంపి తమను రక్షించారంటూ కొందరు ప్రశంసలు కురిపించగా మరికొందరు మాత్రం ఆ జంతువు ప్రాణాలను తీయడంపై ఆందోళన వ్యక్తం చేశారు.
ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (ఐయూసీఎన్) విడుదల చేసిన అంతరించి పోయే అవకాశం ఉన్న జంతువుల జాబితాలో హిప్పోపొటామస్‌లు ఉన్నాయి.
‘‘ఇది అంతరించిపోతున్న జాతి, దీన్ని చంపి ప్రజలు సంబరాలు చేసుకుంటున్న వీడియోను చూసి నేను చాలా బాధపడ్డాను’’ అని జంతు హక్కుల కార్యకర్త, ఆఫ్రికన్ వాయిస్ ఫర్ యానిమల్స్ ఇనిషియేటివ్ వ్యవస్థాపకుడు ఇస్యాకు అబ్దుల్లాహి బీబీసీతో అన్నారు.
"యౌరీ ప్రజలు సంబంధిత అధికారులకు చెప్తే.. వాళ్లు బంధించి దాని సహజ ఆవాసంలో వదిలేవాళ్లు’’ అన్నారు ఇస్యాకు.
గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజలు ప్రమాదకరమైన క్షీరదాలతో వ్యవహరించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇతర ఇతర ప్రత్యామ్నాయాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
హిప్పోలు పరిమాణం పరంగా ఈ భూమి మీద ఉన్న అతిపెద్ద క్షీరదాలలో మూడో స్థానంలో ఉన్నాయి. వాటి దంతాల పొడవు 50.8 సెంటీమీటర్ల పొడవు వరకు ఉంటుంది. ఇవి భారీ పరిమాణంలో ఉన్నా, గంటకు 32 కిలోమీటర్ల వేగంతో పరుగెత్తగలవు.
ఇవి శాకాహారులు అయినా, వాటిని బెదిరించినప్పుడు లేదా వాటి ఆవాసాలకు భంగం కలిగించినప్పుడు అవి చాలా దూకుడుగా మారతాయి.
ఆఫ్రికాలో హిప్పోల కారణంగా ఏటా సుమారు 500 మంది మరణిస్తున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














