బ్రాందీ టాక్స్: ఫ్రాన్స్‌పై చైనా ప్రతీకారం తీర్చుకుంటోందా

ఫ్రాన్స్ నుంచి చైనాకు బ్రాందీ ఎగుమతులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బ్రాందీ
    • రచయిత, టామ్ ఎస్పినర్
    • హోదా, బిజినెస్ రిపోర్టర్, బీబీసీ న్యూస్

యూరప్ దేశాల నుంచి తమ దేశానికి దిగుమతి అయ్యే బ్రాందీపై చైనా పన్నులు విధించింది. చైనా ఎలక్ట్రిక్ వాహనాలపై యూరోపియన్ యూనియన్ ఇటీవల భారీగా పన్నులు విధించింది.

దీనికి ప్రతీకారంగానే ఈయూ నుంచి బ్రాందీ దిగుమతులపై చైనా పన్నులు ప్రకటించిందని ఫ్రాన్స్ ఆరోపిస్తోంది.

చైనా నిర్ణయాన్ని వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్(డబ్ల్యూటీఓ)లో సవాల్ చేస్తామని యూరోపియన్ కమిషన్ తెలిపింది.

ఇది వాణిజ్య రక్షణ నిబంధనల దుర్వినియోగం అని యూరోపియన్ కమిషన్ ఆరోపించింది.

కానీ, ఇది తమ దేశీయ ఉత్పత్తిదారులకు రక్షణ కల్పించే చర్య అని చైనా వాదిస్తోంది.

హెన్నెసీ, రెమీ మార్టిన్ సహా పేరున్న బ్రాండ్‌లను ఈ సుంకాలు దెబ్బతీస్తాయని ఫ్రెంచ్ బ్రాందీ ఉత్పత్తిదారులంటున్నారు. బ్రాందీ పరిశ్రమకు ఇది నష్టదాయకంగా మారుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. ఈ ప్రకటన తర్వాత బ్రాందీ కంపెనీల షేర్లు పడిపోయాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

చైనా ఎలక్ట్రిక్ వాహనాలపై ఈయూ కొత్త పన్నులు

చైనా తయారుచేసే ఎలక్ట్రిక్ వాహనాలపై సుంకాలు పెంచడానికి ఈయూ దేశాలు ఆమోదం తెలిపిన కొన్నిరోజులకే చైనా ఈ కొత్త నిబంధనలు ప్రకటించింది.

తమ దేశంలోని ఉత్పత్తిదారులకు యూరప్ దేశాల నుంచి బ్రాందీ దిగుమతుల కారణంగా తీవ్ర నష్టం వాటిల్లుతోందని చైనా వాణిజ్యమంత్రిత్వ శాఖ తెలిపింది.

యూరోపియన్ యూనియన్ దేశాల నుంచి దిగుమతి చేసుకునే కార్లు, పందిమాంసం, డెయిరీ ఉత్పత్తులపైనా కొత్త పన్నులు విధించే అంశాన్ని చైనా పరిశీలిస్తోంది.

తమ ఎలక్ట్రిక్ వాహనాలపై ఈయూ విధించిన పన్నులు అంతర్జాతీయ వాణిజ్య నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తాయని చైనా వాదిస్తోంది.

చైనా ఎలక్ట్రిక్ కార్లపై సుంకాలు పెంచాలని యూరోపియన్ యూనియన్ నిర్ణయించిన తర్వాత చైనా బ్రాందీ పన్నులు విధించడం ప్రతీకార చర్యలా కనిపిస్తోందని ఫ్రెంచ్ వాణిజ్య శాఖ మంత్రి సోఫీ ప్రిమాస్ అన్నారు.

ఇలాంటి ప్రతీకార చర్యలు ఆమోదయోగ్యం కావని, అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలకు పూర్తిగా విరుద్ధమని ఆమె అన్నారు. యూరోపియన్ యూనియన్‌తో కలిసి ఈ విషయాన్ని డబ్ల్యూటీఓ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు.

brandy

ఫొటో సోర్స్, Getty Images

99 శాతం ఫ్రాన్స్ నుంచే దిగుమతి

చైనాకు బ్రాందీ ఎగుమతుల్లో 99 శాతం వాటా ఫ్రాన్స్‌దే. బ్రాందీ పరిశ్రమకు ఇది విపత్తులా మారుతుందని ఫ్రెంచ్ కాగ్నక్ లాబీ గ్రూప్ బీఎన్ఐసీ ఆందోళన వ్యక్తంచేసింది.

‘‘చైనా ప్రతీకారంపై మేం చేయగలిగింది ఏమీ లేదు. ఈ విషయంలో ఫ్రెంచ్ అధికారులు మమ్మల్ని ఒంటరిగా వదిలేయరని అనుకుంటున్నాం. ఆలస్యం కాకముందే పన్నులు నిలిపివేయాలి’’ అని బీఎన్ఐసీ వ్యాఖ్యానించింది.

చైనా ప్రకటన తర్వాత మద్యం అమ్మే కంపెనీల షేర్లు ఒడుదొడుకులకు లోనయ్యాయి.

హెన్నెసీ బ్రాందీని ఉత్పత్తి చేసే లగ్జరీ సంస్థ ఎల్‌వీఎంహెచ్ షేర్ల విలువ 3 శాతానికి పైగా పడిపోయింది.

రెమీ మార్టిన్‌ను తయారుచేసే రెమీ కోయిన్‌ట్రూ షేర్ల విలువ 8 శాతానికి పైగా పడిపోయింది.

పన్నుల వల్ల వినియోగదారులపై 20 శాతం అదనంగా భారం పడుతుందని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. దీనివల్ల అమ్మకాలు పడిపోయే అవకాశముంది.

చైనా పన్నుల ప్రభావం జర్మన్ కార్ల తయారీ కంపెనీల షేర్లపైనా కనిపించింది. కార్ల కంపెనీల షేర్లు పడిపోయాయి.

ఫోక్స్‌వ్యాగన్, పోర్షీ, మెర్సెడెస్-బెంజ్, బీఎండబ్ల్యూ వంటి కార్ల షేర్ల ధరలన్నీ చైనా ప్రకటన తర్వాత పడిపోయాయి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)