‘మా ఆర్థిక పరిస్థితి భారత్‌కు తెలుసు’ అంటూ వచ్చిన మాల్దీవుల అధ్యక్షుడికి మోదీ భారీ సహాయం

ముయిజ్జు, మోదీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, భారత పర్యటన సందర్భంగా సోమవారం చర్చలు జరిపిన మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు (ఎడమ), భారత ప్రధాని నరేంద్ర మోదీ (కుడి)
    • రచయిత, నియాజ్ ఫరూఖీ
    • హోదా, బీబీసీ న్యూస్

కష్టాలలో ఉన్న మాల్దీవుల ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఆ దేశానికి ఆర్థిక సహాయాన్ని అందించడానికి భారత్ అంగీకరించింది.

మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు తన ఐదు రోజుల భారత పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీతో చర్చలు జరిపిన అనంతరం ఈ విషయాన్ని ప్రకటించారు.

400 మిలియన్ డాలర్ల (సుమారు రూ.3,360 కోట్లు) కరెన్సీ స్వాప్ డీల్, అమెరికా డాలర్లలో కాకుండా స్థానిక కరెన్సీలలో వ్యాపారం చేయగలిగే మరొక 3 వేల కోట్ల రూపాయల ఒప్పందం ఈ సహాయంలో భాగం.

ఇటీవలి కాలంలో రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నప్పటికీ మాల్దీవుల అధ్యక్షుడికి ఈ పర్యటనలో గొప్ప ఆతిథ్యం లభించింది.

మోదీ.. మాల్దీవుల అధ్యక్షుడి పర్యటనను రెండు దేశాల సంబంధాలలో నూతన అధ్యాయంగా పేర్కొన్నారు.

మాల్దీవుల ప్రజల పురోభివృద్ధికి, శ్రేయస్సుకు భారత్ ఎప్పుడూ తోడుగా ఉంటుందని మోదీ అన్నారు.

మోదీ ప్రకటనలు, అందిస్తున్న ఆర్థిక ప్యాకేజీ.. 2023 నవంబర్‌లో ముయిజ్జు అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలలో గణనీయమైన అభివృద్ధిని సూచిస్తున్నాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే ముయిజ్జు తుర్కియే, చైనా పర్యటలనకు వెళ్లాలనుకున్నారు.

ఆయన చైనా పర్యటనను భారతదేశానికి ఎదురుదెబ్బగా భావించారు.

ముయిజ్జు కంటే ముందు మాల్దీవుల నాయకులు ఎవరైనా ఎన్నికైన తర్వాత మొదట దిల్లీ వచ్చేవారు. ఆ తరువాతే ఇంకే దేశానికైనా వెళ్లేవారు. కానీ, ముయిజ్జు అందుకు భిన్నంగా తొలుత చైనా వెళ్లారు.

అదే సమయంలో, మోదీపై ముగ్గురు మాల్దీవుల అధికారులు చేసిన వ్యాఖ్యలపై భారతదేశం ఆగ్రహం వ్యక్తం చేసింది.

అయితే మాల్దీవుల ఆర్థిక వ్యవస్థే భారతదేశంతో సంబంధాలను సరిదిద్దుకునేలా చేసిందని విశ్లేషకులు భావిస్తున్నారు.

మాల్దీవుల విదేశీ మారకద్రవ్య నిల్వలు పడిపోయాయి. అవి కేవలం ఒకటిన్నర నెలల దిగుమతులకు మాత్రమే సరిపోతాయి.

సోమవారం, ముయిజ్జు మాట్లాడుతూ, ‘‘రెండు దేశాల మధ్య భవిష్యత్‌ సహకారం’’ కోసం మోదీతో విస్తృతమైన చర్చలు జరిపినట్లు ప్రకటించారు.

భారతదేశానికి కృతజ్ఞతలు తెలిపిన ముయిజ్జు, ఈ ఆర్థిక సహాయం ‘‘విదేశీ మారక ద్రవ్య సమస్యలను పరిష్కరించడంలో సాధనం’’గా ఉపయోగపడుతుందని అన్నారు.

రెండు దేశాలు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్చలు ప్రారంభించేందుకు కూడా నిర్ణయించాయి.

మోదీతో సమావేశానికి ముందు ముయిజ్జు బీబీసీతో మాట్లాడుతూ.. గతంలో చేసిన విధంగానే భారతదేశం ఈసారీ తమ దేశానికి సహాయం చేస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.

‘‘భారతదేశానికి మా ఆర్థిక పరిస్థితి గురించి పూర్తిగా తెలుసు. మా అతిపెద్ద అభివృద్ధి భాగస్వాములలో ఒకటిగా, మా భారాన్ని తగ్గించడానికి, మేం ఎదుర్కొంటున్న సవాళ్లకు ప్రత్యామ్నాయాలు, పరిష్కారాలను సూచించడానికి భారతదేశం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది’’ అని ఆయన అన్నారు.

తన భారత వ్యతిరేక ప్రచారాన్ని ప్రస్తావించకుండా.. ‘‘ఏవైనా విభేదాలను చర్చలు, పరస్పర అవగాహన ద్వారా పరిష్కరించుకోవచ్చని మేం విశ్వసిస్తున్నాం’’ అన్నారు.

ఈ ప్రకటన ఆయన మునుపటి నిర్ణయాలకు భిన్నంగా ఉంది.

ఆయన గత నిర్ణయాలు కొన్ని దిల్లీ ప్రభావాన్ని తగ్గించేవిగా, చైనాతో సన్నిహిత సంబంధాలను ఏర్పరచుకునేవిగా పరిశీలకులు భావించారు.

ఫిబ్రవరిలో, ఒక చైనీస్ పరిశోధన నౌకను మాల్దీవులలో లంగరు వేయడానికి అనుమతించారు. దీనిపై భారతదేశం అసంతృప్తి వ్యక్తం చేసింది.

కొందరు దీనిని జలాంతర్గామి కార్యకలాపాల కోసం చైనా మిలిటరీ ఉపయోగించే డేటాను సేకరించే మిషన్‌గా భావించారు.

అయితే ముయిజ్జు మాత్రం తాము చైనాకు అనుకూలం అన్న వాదనను కొట్టిపారేశారు. ఆయన తన విధానాలను ‘‘మాల్దీవులు ఫస్ట్’’ అంటారు.

అయితే మాల్దీవులు చైనాపైనా ఎక్కువగానే ఆధారపడుతోంది, ఇప్పటివరకు చైనా ఆ దేశానికి సుమారు 11 వేల కోట్ల రూపాయల రుణ సహాయం చేసింది.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)