SBI పేరుతో నకిలీ బ్యాంకు బ్రాంచ్ ప్రారంభించారు, వీళ్ల మోసం ఎలా బయటపడిందంటే..

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరుతో నకిలీ బ్రాంచ్
ఫొటో క్యాప్షన్, చాపోరా గ్రామంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరుతో నకిలీ బ్రాంచ్ తెరిచారు
    • రచయిత, అలోక్ ప్రకాశ్ పుతుల్
    • హోదా, రాయ్‌పూర్ నుంచి బీబీసీ కోసం

గత వారం వరకు తాను పనిచేసిన స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా చాపోరా బ్రాంచ్ అసలు బ్యాంకే కాదనే విషయాన్ని జ్యోతియాదవ్ నమ్మలేకపోతున్నారు. ఆమె ఛత్తీస్‌గఢ్‌లోని బన్బారస్ గ్రామానికి చెందినవారు.

పోలీసులతో కలిసి స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియాకు చెందిన కొందరు అధికారులు ఈ నకిలీ బ్యాంకు బ్రాంచ్‌పై రైడింగ్‌కు వచ్చినప్పుడు, బ్యాంకు బోర్డు, తన నియామక పత్రం, అక్కడ పనిచేసే ఉద్యోగులందరూ నకిలీ అని తొలిసారి జ్యోతికి తెలిసింది.

ఛత్తీస్‌గఢ్‌ రాజధాని రాయ్‌పూర్‌కు సుమారు 200 కిలోమీటర్ల దూరంలోని శక్తి జిల్లాలో చాపోరా గ్రామం ఉంది. అక్కడ తెరిచిన ఎస్‌బీఐ బ్రాంచ్ నకిలీదని తెలుసుకుని ప్రజలు దిగ్భ్రాంతి చెందారు.

ఈ కేసులో అనిల్ భాస్కర్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
అజయ్ అగర్వాల్
ఫొటో క్యాప్షన్, అజయ్ అగర్వాల్

‘సంబరపడ్డాం’

చాపోరా గ్రామంలో ‘స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా’ కొత్త బ్రాంచ్ తెరిచినప్పుడు గ్రామంలోని ప్రజలంతా చాలా సంతోషించారు. బ్యాంకు సంబంధిత పనుల కోసం ఎక్కడికి వెళ్లాల్సిన పనిలేదని వారంతా భావించారు.

కానీ, వారి సంతోషం ఎంతో కాలం లేదు.

గత వారం స్టేట్ బ్యాంకు ఇండియా అధికారులు, పోలీసులతో వచ్చి ఈ బ్యాంకుపై దాడులు చేసినప్పుడు ఈ బ్రాంచ్ నకిలీదని తెలిసింది.

స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా కియోస్క్‌ కోసం తాను దరఖాస్తు చేసుకున్నట్టు గ్రామంలోని అజయ్ అగర్వాల్ అనే వ్యక్తి తెలిపారు.

తక్కువ ఆదాయ వర్గాల వారికి పరిమిత బ్యాంకింగ్ సేవలను అందించేందుకు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా ప్రైవేట్ సంస్థలకు లేదా వ్యక్తులకు కియోస్కులను తెరిచే అనుమతి ఇస్తుంటుంది. చిన్న గ్రామాలు, పట్టణాలలో వీటిని తెరుస్తుంటారు.

నకిలీ బ్రాంచ్
ఫొటో క్యాప్షన్, స్థానిక పోలీసులతో పాటు ఎస్‌బీఐ అధికారులు నకిలీ ఎస్‌బీఐ బ్రాంచ్‌పై దాడులు చేశారు

అనుమానం ఎలా వచ్చింది?

‘‘గ్రామంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ తెరవడాన్ని చూసి నేను చాలా షాకయ్యాను. మా గ్రామంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్‌ను తెరవాల్సిన అవసరం ఏంటా అని ఆలోచించాను’’ అని అజయ్ చెప్పారు.

గ్రామస్థులు బ్యాంకుకు వెళ్లినప్పుడు, అక్కడ చాలా మంది పనిచేస్తూ కనిపించారు.

అధునాతన సౌకర్యాలతో బ్యాంకులో వివిధ డెస్క్‌లు ఉన్నాయి.

బ్యాంకుఖాతా తెరవాలని వెళ్లిన గ్రామస్థులకు సర్వర్ పని కొనసాగుతోందని, త్వరలోనే ఖాతాలు తెరుస్తామని అక్కడి ఉద్యోగులు చెప్పారు.

ఎస్‌బీఐ ఫీల్డ్ ఆఫీసర్లు చంద్రశేఖర్ బోద్రా, అజయ్ అగర్వాల్‌ బ్రాంచ్ఉద్యోగులను విచారించినప్పుడు వారికి ఈ బ్రాంచ్ తీరుపై అనుమానం వచ్చింది. వెంటనే ఈ విషయాన్ని జిల్లాలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉన్నతాధికారులకు తెలిపారు.

దీంతో తర్వాత రోజు స్థానిక పోలీసులతో కలిసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారులు ఆ నకిలీ బ్యాంకు బ్రాంచ్ వద్దకు చేరుకుని విచారణ జరపడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అయితే నకిలీ బ్యాంకు మేనేజర్ పంకజ్ సాహు పరారయ్యారు.

బ్యాంకు అధికారి ఫిర్యాదు

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోర్బా రీజనల్ ఆఫీస్ చీఫ్ మేనేజర్ జీవ్రాఖాన్ కావడే దీనిపై సెప్టెంబర్ 27న ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదు ప్రకారం, సెప్టెంబర్ 18న బ్రాంచ్ తెరిచారు. ఆరుగురు వ్యక్తులు దీనిలో పనిచేస్తున్నారు. వారికి కూడా నకిలీ జాయినింగ్ లెటర్లు ఇచ్చారు.

ఈ కేసులో అనిల్ భాస్కర్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.

బ్యాంకులో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పిన అనిల్ భాస్కర్ వివిధ యూపీఐ ఐడీల నుంచి మొత్తం రూ.6,60,000లను లంచంగా తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

ఈ డబ్బులతో అనిల్ భాస్కర్ ఐ-20 సెకండ్ హ్యాండ్ కారును కొనుగోలు చేశాడు.

విచారణలో అనిల్ తన 8 మంది సహచరుల పేర్లు చెప్పాడు. వివిధ పోలీసు బృందాలువీరిని గుర్తించే పనిలో ఉన్నాయి. వీరిపై చీటింగ్ కేసు కూడా నమోదైంది.

బిలాస్‌పూర్ జిల్లాలో రైల్వేఉద్యోగాల పేరుతో రూ.7.5 లక్షలు తీసుకున్న ఆరోపణలపై కూడా అనిల్ భాస్కర్‌పై విచారణ జరుగుతోంది.

జ్యోతి యాదవ్
ఫొటో క్యాప్షన్, జ్యోతి యాదవ్

‘వెరిఫికేషన్ కోసం పోలీస్ స్టేషన్‌కు పంపారు’

ఈ నకిలీ బ్యాంకులో పనిచేస్తున్న ఉద్యోగులను కూడా పోలీసులు విచారిస్తున్నారు. ఇందులో పనిచేస్తున్న ఆరుగురి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమేనని విచారణలో తెలిసింది.

ఈ ఉద్యోగం కోసం లంచాలు ఇచ్చినట్లు వారిలో కొందరు చెప్పారు.

‘‘తెలిసిన వాళ్ల ద్వారా ఈ బ్యాంకు గురించి తెలిసింది. ఈ బ్యాంకుకు వచ్చినప్పుడు, ఆన్‌లైన్ ఫామ్ నింపమని అడిగారు. ఆ ఫామ్‌లో విద్యార్హతలు నింపి, సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేశాను. ఫింగర్‌ప్రింట్స్ కూడా తీసుకున్నారు’’ అని జ్యోతి యాదవ్ చెప్పారు.

‘‘ఈ ఉద్యోగం కోసం నా దగ్గర నుంచి రూ.2.5 లక్షలు తీసుకున్నారు. నాకు ఆఫర్ లెటర్ ఇచ్చారు. ఆ తర్వాత అపాయింట్‌మెంట్ లెటర్ ఇచ్చారు. చాపోరా బ్రాంచ్‌కు అపాయింట్‌ అయినట్లు చెప్పారు. శిక్షణ ఇస్తామన్నారు. నేనొక మోసంలో కూరుకుపోతున్నానని నాకసలు అనిపించలేదు. కానీ ఇప్పుడు అంతా అయిపోయింది’’ అని జ్యోతి ఆవేదన వ్యక్తం చేశారు.

తెలిసిన వాళ్లు శక్తి జిల్లాలో చాపోరా స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా బ్రాంచ్లో ఉద్యోగం గురించి చెప్పినట్లు కోర్బా జిల్లాకు చెందిన సంగీతా కాన్వార్ చెప్పారు. ఉద్యోగం కోసం అక్కడికి వెళ్తే, రూ.5 లక్షల కట్టమన్నారని తెలిపారు.

నగలు కుదువ పెట్టి లక్ష రూపాయలు సర్దాను. ప్రతి నెలా 5 శాతం వడ్డీతో మరో లక్ష అప్పుగా తెచ్చాను. బంధువుల నుంచి రూ.50 వేలు తీసుకున్నాను. ఇలా, రూ.2.5 లక్షలు చెల్లించడంతో ఈ బ్యాంకులో ఉద్యోగం వచ్చిందని సంగీతా కాన్వార్ చెప్పారు.

ఈ ఉద్యోగం కోసం పోలీసు వెరిఫికేషన్‌కు ఉర్గా పోలీస్ స్టేషన్‌కు పంపారు. అక్కడే వెరిఫికేషన్ కూడా జరిగింది. కానీ, ఎవరికీ అనుమానం రాలేదు.

ఉద్యోగాల పేరుతో ప్రజల నుంచి కేవలం డబ్బు వసూలు చేసేందుకే బ్యాంకు తెరిచినట్లు తమకు అనిపించడంలేదని ఓ పోలీసు అధికారి చెప్పారు. కానీ, బ్యాంకు తెరిచిన అసలు ఉద్దేశం ఏమిటో ఊహించడం కష్టమన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)