సుకన్య, దిశ: దేశవ్యాప్తంగా జైళ్ల నిబంధనలు మార్చేలా పోరాడింది వీరే..

సుకన్య, దిశా వాడేకర్
    • రచయిత, ఆశయ్ ఎడ్గే
    • హోదా, బీబీసీ ప్రతినిధి

"సుకన్య శాంత మేడమ్.. మీరు బాగా పరిశోధించి రాసిన కథనానికి ధన్యవాదాలు. మీ కథనం ఈ కేసును ప్రారంభించింది. మీ కథనం తర్వాత వాస్తవికత ఎంత మారిందో తెలియదు కానీ, ఈ తీర్పు క్షేత్రస్థాయిలో పరిస్థితిని మార్చగలదని మేం ఆశిస్తున్నాం."

భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై. చంద్రచూడ్ ఒక మహిళా జర్నలిస్టును ప్రశంసిస్తూ చేసిన వ్యాఖ్యలివి.

జర్నలిస్టులు తాము రిపోర్టు చేసిన సమస్యను పరిష్కరించేందుకు సుప్రీంకోర్టుకు వెళ్లడం, అక్కడి నుంచి సామాజిక మార్పు తీసుకురావడం చాలా అరుదు.

‘ది వైర్‌’ మీడియా సంస్థలో పనిచేస్తున్న జర్నలిస్టు సుకన్య శాంత ఇది చేసి చూపించారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉన్న జైళ్లలో కొనసాగుతున్న కుల వివక్షపై ఆమె వరుస కథనాలు రాశారు.

ఈ పరంపరలో ఖైదీలకు కుల ప్రాతిపదికన ఇచ్చే పనులు, కులాల ఆధారంగా ఖైదీల విభజన, ఖైదీల హక్కులు తదితర కీలక విషయాలను ఆమె వెలుగులోకి తెచ్చారు.

ఈ విషయాలను ఒక సిరీస్‌గా ప్రచురించిన తర్వాత, కేసును సుమోటోగా స్వీకరించిన రాజస్థాన్ హైకోర్టు రాష్ట్రంలో జైళ్ల నిబంధనలను మార్చాలని ఆదేశించింది.

హైకోర్టు నుంచి సానుకూల స్పందన రావడంతో సుకన్య శాంత, లాయర్ దిశా వాడేకర్‌తో కలిసి సుప్రీంకోర్టుకు కేసును తీసుకెళ్లారు. మహారాష్ట్రకు చెందిన ఈ ఇద్దరు మహిళలు సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పులో భాగమయ్యారు.

కుల వివక్షను ప్రోత్సహించే జైళ్ల నిబంధనలు రాజ్యాంగ విరుద్ధమని 2024 అక్టోబరు 3న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ నిబంధనలను సవరించాలని ఆదేశించింది. అంతేకాకుండా ఖైదీల పట్ల వివక్షను రూపుమాపేందుకు ప్రత్యేక ఆదేశాలు కూడా జారీ చేసింది.

ఈ చరిత్రాత్మక నిర్ణయం వెలువడటానికి మూల కారణమైన సుకన్య శాంత, దిశా వాడేకర్‌లు బీబీసీతో ప్రత్యేకంగా మాట్లాడారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
తీహార్ జైలు
ఫొటో క్యాప్షన్, తిహార్ జైలు (ఫైల్)

‘జైలు అనేది సమాజానికి అద్దం లాంటిది’

‘’జైలు సమాజానికి అద్దం వంటిది, అందుకే సమాజంలో కనిపించే కుల వివక్ష జైలులో చోటుచేసుకున్నా ఎవరూ ఆశ్చర్యపోనవసరం లేదు. నేను లా విద్యార్థిని, చదువుకునే రోజుల్లో చాలాసార్లు జైళ్లను సందర్శించాల్సి వచ్చింది" అని జర్నలిస్టు సుకన్య శాంత చెప్పారు.

"జర్నలిస్టులు జైలుకు వెళ్లడం కష్టం, కానీ నేను లా చదువుతున్నందున నన్ను అనుమతించారు. మరోవైపు, జర్నలిస్ట్‌గా కుల వివక్షకు వ్యతిరేకంగా కథనాలు రాస్తూనే ఉన్నాను. ది వైర్ కోసం మేం చేసిన సిరీస్‌లో 'కులం, జైళ్లు' అనే అంశంపై చర్చించాం. జైలు నిబంధనలను అధ్యయనం చేసి అక్కడ కుల వివక్ష ఎలా ఉందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను" అని సుకన్య వివరించారు.

‘‘రాజ్యాంగం ప్రకారం జైళ్ల బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలది. కాబట్టి జైలు నిబంధనలను ఆ రాష్ట్రాల ప్రభుత్వాలే నిర్ణయిస్తాయి. ఖైదీలు జైలులో ఎక్కడ ఉండాలి? ఎక్కడ నిద్రపోవాలి? ఇలాంటి నియమాలు, నిబంధనలు ఖైదీలకు చెప్పడం లేదు. అందుకే వారి హక్కుల గురించి వారికి తెలియడం లేదు" అని ఆమె చెప్పారు.

సుకన్య శాంత
ఫొటో క్యాప్షన్, ది వైర్‌ సీనియర్ జర్నలిస్ట్ సుకన్య శాంత

‘చాలా రాష్ట్రాల నిబంధనలు పరిశీలించా’

సుకన్య మాట్లాడుతూ.. ‘‘పలు రాష్ట్రాల జైళ్ల నిబంధనలకు సంబంధించిన సమాచారం సేకరించి, అధ్యయనం చేశాను. అప్పుడు జైళ్లలో ఖైదీల కులం ప్రస్తావన గురించి తెలిసింది. వారి కులాన్ని బట్టి ఖైదీలు ఏ పని చేయాలో జైళ్ల నిబంధనలలో ఉంది. అలాగే, జైళ్లలో కుల వివక్ష ఉందో, లేదో తెలుసుకోవడానికి కొందరు ఖైదీలతో కూడా మాట్లాడాను’’ అని తెలిపారు.

‘‘ఒకసారి 19-20 ఏళ్ల యువకుడితో మాట్లాడాను. ఆయన బిహార్‌కు చెందిన వ్యక్తి. పని కోసం రాజస్థాన్‌కు వలస వచ్చారు. అంతకు ముందు ఆయన ఉద్యోగం చేసేవారు. ఐటీఐ చదివారు. ఆ యువకుడు జైలులోకి వెళ్లగానే ఒక ఖైదీ ఆయన కులం అడిగారు. సామాజిక వర్గం ఏంటని అడిగారు, యువకుడు చెప్పారు. షెడ్యూల్డ్ కులానికి చెందిన వ్యక్తిగా పరిగణించి క్లీనింగ్ పని అప్పగించారు. ఆయన మాదిరే షెడ్యూల్డ్ కులానికి చెందినవారు అక్కడ క్లీనింగ్ పనిచేస్తున్నారని, మిగతా కులాలకు చెందినవారు వేరే పని చేస్తున్నారని తెలుసుకున్నారు. ఆయనను కలిసినపుడు, అప్పటి విషయాలు చెబుతూ చాలా భావోద్వేగానికి గురయ్యారు’’ అని సుకన్య వివరించారు.

దిశా వాడేకర్
ఫొటో క్యాప్షన్, లాయర్ దిశా వాడేకర్

కథనాలతో మారలేదు, కానీ..

"ఈ కేసు పిటిషన్‌ను వ్యూహాత్మకంగా సుప్రీంకోర్టులో వేశాం" అని లాయర్ దిశా వాడేకర్ చెప్పారు.

"సుకన్య సిరీస్ విడుదల చేసి చాలా రోజులైంది. ఈ విషయంపై వార్తలు వచ్చిన తర్వాత, సానుకూల మార్పు రావచ్చని భావించాం. ఇలాంటివి చదివి ప్రజలు షాక్ అవుతారనుకున్నాం. కానీ, జైళ్ల నిబంధనల్లో ఎటువంటి మార్పు కనిపించలేదు" అని దిశ అన్నారు.

"రాజస్థాన్ హైకోర్టు నోటీసు ఇచ్చినప్పటికీ ఇతర రాష్ట్రాల్లో పరిస్థితి మారలేదు. జైళ్ల నిర్వహణ రాష్ట్రాల పరిధిలోని అంశం కాబట్టి, ఇతర రాష్ట్రాల్లోనూ మార్పు రావాలంటే ఆయా రాష్ట్రాల హైకోర్టులకు లేదా సుప్రీంకోర్టుకు వెళ్లాల్సి ఉంటుంది. ఇది పద్దెనిమిది నుంచి ఇరవై రాష్ట్రాలకు సంబంధించిన విషయం, అందుకే బాగా ఆలోచించి వ్యూహాత్మకంగా సుప్రీంకోర్టుకు వెళ్లాం’’ అని ఆమె వివరించారు.

జైలు ఖైదీలు
ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

‘అప్పుడే ఆశ్చర్యకర విషయాలు తెలిశాయి’

దిశా వాడేకర్ మాట్లాడుతూ.. "సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాం. అదే సమయంలో డి-నోటిఫైడ్ తెగల ఖైదీలను ఎలా పరిగణిస్తారో కూడా పరిశోధించాం. ఆశ్చర్యకర విషయాలు తెలిశాయి. ఉదాహరణకు, 'Habitual offenders' అనే పదాన్ని తరచుగా ఉపయోగిస్తారు. కొన్ని రాష్ట్రాల జైలు నిబంధనలలో ఫలానా తెగకు చెందిన వ్యక్తులు 'Habitual offenders' కాబట్టి వారిని ఇతర ఖైదీల నుంచి వేరుగా ఉంచాలనే నిబంధనలు ఉన్నాయి" అని చెప్పారు.

"తమిళనాడులోని జైళ్లలో కులపరమైన విభజనను అక్కడి హైకోర్టు చట్టబద్ధం చేసింది. మేము దీనిని కూడా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లాం. అటువంటి వివక్ష రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రకటించింది. కుల ప్రాతిపదికన పని కేటాయింపు, ఖైదీలను వేరు చేయడం వంటి నిబంధనలన్నింటినీ కొట్టివేసింది" అని దిశా వాడేకర్ తెలిపారు.

ఆ ఉత్తర్వుల అమలుపై మూడు నెలల్లోగా నివేదిక సమర్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. అంతేకాకుండా ఆదేశాలను పాటిస్తున్నారో లేదో స్వయంగా వెళ్లి పరిశీలించాలని ఉత్తర్వులు జారీచేసింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)