ఆంధ్రప్రదేశ్‌ సహా 11 రాష్ట్రాల జైళ్లలో కుల వివక్ష ఉందా? జైళ్ల మాన్యువల్స్‌ను సుప్రీంకోర్టు ఎందుకు కొట్టివేసింది

జైలు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ఉమంగ్ పొద్దార్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఆంధ్రప్రదేశ్ సహా 11 రాష్ట్రాల జైలు మాన్యువల్‌లోని కొన్ని నిబంధనలు కుల వివక్ష చూపుతున్నాయని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.

జైళ్లలోని పరిస్థితులపై సుకన్య శాంత అనే జర్నలిస్టు సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. పలు రాష్ట్రాల్లోని జైలు మాన్యువల్‌లు కుల ప్రాతిపదికన వివక్షను ప్రోత్సహిస్తున్నాయని ఆమె తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

జైలు లోపల పనులు చేయించడానికి కులం ప్రాతిపదికన ఖైదీలను వినియోగిస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు సుకన్య.

ఖైదీలకు బ్యారక్‌ల కేటాయింపులోనూ కులం చూస్తున్నారని తెలిపారు.

సుకన్య పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు జైలు నిబంధనలను తప్పుబట్టింది.

ప్రస్తుతం ఉన్న జైలు మాన్యువల్‌లు ప్రాథమిక హక్కులకు విరుద్ధమని, కుల ప్రాతిపదికన వివక్ష చూపుతున్నాయని ధర్మాసనం అభిప్రాయపడింది.

మూడు నెలల్లోగా జైలు మాన్యువల్‌ను అప్‌డేట్ చేయాలని, ఈ వివక్షపూరిత నిబంధనలను తొలగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
జైలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, జైలు - ప్రతీకాత్మక చిత్రం

ఏమిటీ జైలు మాన్యువల్?

జైలు మాన్యువల్ అనేది ఖైదీలు ఎలా ఉండాలి? జైలులో వారు ఏ పని చేయాలి? తదితర విషయాల కోసం ఉపయోగిస్తారు.

అనేక రాష్ట్రాల్లో జైళ్లలో శుభ్రపరిచే పనిని 'తక్కువ కులం'గా భావించే వ్యక్తులు చేస్తారనే విధానం ఉంది.

అదేవిధంగా ఆహారాన్ని వండే పని 'ఉన్నత కులం'గా పరిగణించే వ్యక్తులతో చేయిస్తున్నారు.

ఈ జైలు మాన్యువల్‌లో కొన్ని తెగలకు చెందిన వారిని నేరం చేయడం అలవాటున్న వ్యక్తులుగా పరిగణిస్తున్నారు.

సుప్రీంకోర్టు

ఫొటో సోర్స్, Getty Images

వాదనలు ఏం జరిగాయి?

డి-నోటిఫైడ్ తెగల (బ్రిటిష్ పాలనలో చేసిన ‘క్రిమినల్ ట్రైబ్స్ చట్టం’ ప్రకారం వారిని క్రిమినల్ ట్రైబ్స్‌గా ప్రకటించారు)కు చెందిన వారు అనేక జైళ్లలో వివక్షకు గురవుతున్నారని సుకన్య శాంత తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

ఈ తెగ వ్యక్తులు మొదటిసారి దోషిగా తేలినా కూడా చాలా జైళ్లలో వారిని 'హేబిట్యుయల్ అఫెండర్స్'గా ప్రకటిస్తారు.

ఎవరినైతే ఇలా ప్రకటిస్తారో ఆ ఖైదీలను జైలులోని గట్టి భద్రతలో ఉంచుతుంటారు.

పశ్చిమ బెంగాల్ జైలు మాన్యువల్ ప్రకారం.. అక్కడి క్లీనర్లు తప్పనిసరిగా 'మెహతర్, హదీ లేదా చందాల్' కులానికి చెందిన ఖైదీలు లేదా సాధారణంగా ఈ పని చేసే ఏదైనా కులానికి చెందిన ఖైదీలు అయి ఉండాలి.

'ఉన్నత కులానికి' చెందిన ఖైదీ, తనకు ఆహారం వండే వంటవాడిపై అభ్యంతరం వ్యక్తం చేస్తే, ఆయన కోసం కొత్త వంటవాడిని నియమిస్తారని కూడా మాన్యువల్‌లో తెలిపారు. మధ్యప్రదేశ్‌లోని జైలు మాన్యువల్‌లో జైలులో క్లీనింగ్ పనులు 'మెహతార్' కులానికి చెందినవారు చేస్తారని ఉంది.

ఇటువంటి నిబంధనలు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, ఒడిశా, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలోనూ ఉన్నాయి.

సుకన్య వీటిని సుప్రీంకోర్టులో సవాలు చేశారు.

బ్రిటిష్ కాలం నుంచి ఇలాంటి నిబంధనలు ఉన్నాయని సుకన్య శాంత పిటిషన్‌లో పేర్కొన్నారు.

బ్రిటిష్ కాలం నిబంధనలు స్వతంత్ర భారతదేశంలో ఇంకా ఎందుకు కొనసాగుతున్నాయి అనే ప్రశ్న కూడా ఆమె లేవనెత్తారు.

న్యాయస్థానం

సుప్రీం కోర్టు ఏం చెప్పింది?

జైళ్లలో పని విభజనకు కులాన్ని ప్రాతిపదిక ఉపయోగించుకున్నట్లు స్పష్టమవుతోందని సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొంది.

‘’బ్రిటిష్ హయాంలో చేసిన చట్టం కుల వివక్ష చూపుతున్నది, స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా కులతత్వాన్ని నిర్మూలించలేకపోయాం. పౌరులందరికి న్యాయం, సమానత్వం అనే జాతీయ దృక్పథం అవసరం" అని సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొంది.

కుల ప్రాతిపదికన నిబంధనలను రూపొందించవచ్చని, అయితే వాటిని వారి భద్రత కోసం చేయాలి కానీ, వివక్ష కోసం కాదని కోర్టు సూచించింది.

కొన్ని వర్గాలకు చెందిన వ్యక్తులు నైపుణ్యం లేదా గౌరవప్రదమైన పని చేయడంలో అసమర్థులనే భావన ప్రోత్సహించేలా జైలు మాన్యువల్స్ ఉన్నాయని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.

'తక్కువ కులానికి చెందిన' వ్యక్తి తయారుచేసిన ఆహారాన్ని 'అగ్ర కులానికి చెందిన' వ్యక్తి తినడానికి నిరాకరించడం వంటి నిబంధనలు అంటరానితనం, కుల వ్యవస్థకు చట్టపరమైన గుర్తింపు ఇచ్చినట్లుగా సూచిస్తున్నాయని సుప్రీంకోర్టు పేర్కొంది. దీనిని బలవంతపు పనిగా సుప్రీంకోర్టు పరిగణించింది.

వెనుకబడిన కులాలకు చెందిన ఖైదీలను మరుగుదొడ్లు శుభ్రం చేయడం, ఊడ్చటం, తుడవడం వంటి పనులు అది కూడా వారి ఇష్టాలను పరిగణనలోకి తీసుకోకుండా కేవలం వారి కుల ప్రాతిపదికన చేయించడం బలవంతం కిందకే వస్తుందని కోర్టు అభిప్రాయపడింది.

చట్టం

ఫొటో సోర్స్, Getty Images

కోర్టు ఈ కింది ఆదేశాలు ఇచ్చింది:

  • 11 రాష్ట్రాల జైలు మాన్యువల్స్‌ వివక్ష, ప్రాథమిక రాజ్యాంగ హక్కులకు హానికరమంటూ ఆ నిబంధనలను కొట్టివేసింది.
  • కుల వివక్షకు సంబంధించిన నిబంధనలను కేంద్ర ప్రభుత్వం మూడు నెలల్లోగా మార్చాల్సి ఉంటుంది.
  • ఖైదీలు, అండర్ ట్రయల్ ఎవరికైనా జైలు రిజిస్టర్‌లో కులాన్ని తెలిపే కాలమ్ తొలగించాలి.
  • జైలు రికార్డులలో ‘హేబిట్యుయల్ అఫెండర్స్’ అనే పదం రాష్ట్ర శాసనసభ ఆమోదించిన చట్టాల ప్రకారం మాత్రమే ఉపయోగించాలి.
  • ఎలాంటి కారణం లేకుండా 'డీ-నోటిఫైడ్ ట్రైబ్స్'‌ను అరెస్ట్ చేయరాదని పోలీసులు గుర్తుంచుకోవాలి.
  • కులం, జెండర్, వైకల్యం ఆధారంగా జైళ్లలో వివక్షను కోర్టు పర్యవేక్షిస్తుంది, మూడు నెలల్లో కేసును సమీక్షిస్తుంది. అన్ని రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం ఆ లోపు సమ్మతి నివేదికను సమర్పించాలి.
  • వివక్ష కొనసాగకుండా చూసేందుకు జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ, జైలు సందర్శకుల బోర్డు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాలి.
  • కేంద్ర ప్రభుత్వం మూడు నెలల్లోగా ఈ తీర్పు కాపీని అన్ని రాష్ట్రాలకు పంపాలి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)