‘నా ఇద్దరు కూతుళ్లను బలవంతంగా సన్యాసినులుగా మార్చారు’.. ఈషా యోగా సెంటర్‌పై ఓ తండ్రి పోరాటం.. సుప్రీంకోర్టు ఏం చెప్పింది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, శారద.వి
- హోదా, బీబీసీ ప్రతినిధి, చెన్నై
ఈషా యోగా సెంటర్‌పై చర్యలు నిలిపివేయాలని తమిళనాడు పోలీసులను సుప్రీంకోర్టు ఆదేశించింది.
ఈషా యోగాసెంటర్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం ఈ ఆదేశాలిచ్చింది.
భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ సహా ముగ్గురు సభ్యుల ధర్మాసనం ఈషా యోగాసెంటర్ పిటిషన్‌ను విచారణ జరిపింది.
ఈషా యోగా సెంటర్‌లో ఇద్దరు మహిళలను బంధించారన్న ఆరోపణలు వచ్చాయి.
విచారణ సమయంలో ఆ ఇద్దరు మహిళలతో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు మాట్లాడారు.
తాము ఇష్టపూర్వకంగా ఈషా యోగాసెంటర్‌లో ఉంటున్నామని ఆ మహిళలు చెప్పారని చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ అన్నారు.
మహిళల తండ్రి మద్రాస్ హైకోర్టులో వేసిన పిటిషన్‌ను ధర్మాసనం సుప్రీంకోర్టుకు బదలాయించింది.
ఈషా యోగాసెంటర్‌లో ఉన్న తన ఇద్దరు కుమార్తెలను అక్కడి నుంచి బయటకు తీసుకురావాలని కోరుతూ కామరాజ్ అనే రిటైర్డ్ ప్రొఫెసర్ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేశారు.
ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన మద్రాస్ హైకోర్టు ఈషా యోగాసెంటర్‌పై నమోదైన అన్ని క్రిమినల్ కేసుల వివరాలు సమర్పించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది.
తన కుమార్తెలకు బ్రెయిన్ వాష్ చేసి ఈషా యోగాసెంటర్‌లో బంధించారని కామరాజ్ ఆరోపించారు.
అయితే తమ ఇష్టప్రకారమే ఈషా యోగాసెంటర్‌లో ఉంటున్నామని వారిద్దరూ మద్రాస్ హైకోర్టుకు చెప్పారు.
ఎవరినీ బలవంతంగా పెళ్లిచేసుకోవడం గానీ, సన్యాసినిలుగా మార్చడంగానీ తమ దగ్గర ఉండవని ఈషా యోగా సెంటర్ కూడా తెలిపింది.
ఈ కేసులో పోలీసుల దర్యాప్తుకు ఆదేశించిన మద్రాస్ హైకోర్టు అక్టోబరు 4న నివేదిక సమర్పించాలని కోరింది.
కోర్టు ఆదేశాల ప్రకారం పోలీసులు, ఇతర విభాగాలకు చెందిన అనేకమంది అధికారులు ఈషా యోగా సెంటర్‌పై దాడులు జరిపారు.
అక్టోబరు 2 సాయంత్రం వరకు ఈ ఆపరేషన్ సాగింది.
ఈషా యోగా సెంటర్‌లోకి ఈ తరహాలో పోలీసులు వెళ్లడం అనుమతించరానిదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.


పోలీసుల దాడులు
కోయంబత్తూరులో ఉన్న ఈషా యోగా సెంటర్‌పై రెండు రోజుల పాటు దాడులు జరిగాయి. కోయంబత్తూరు ఎస్పీ కార్తికేయన్ నేతృత్వంలో 150 మంది పోలీసులు, సాంఘిక సంక్షేమ అధికారులు, శిశుసంక్షేమ అధికారుల బృందం బుధవారం(అక్టోబరు 2)వరకు యోగా సెంటర్‌లో సోదాలు నిర్వహించారు.
లైంగిక ఆరోపణలు సహా అన్ని క్రిమినల్ కేసులపై సమగ్రనివేదిక సమర్పించాలని ఈషా యోగా సెంటర్‌ను మద్రాస్ హైకోర్టు ఆదేశించిన తర్వాత పోలీసుల దాడులు జరిగాయి.
ఈషా సెంటర్‌లో ఉన్న సన్యాసినులతో పాటు అనేకమందిని పోలీసులు విచారించారు.
దర్యాప్తు నివేదికను అక్టోబరు 4న సమర్పించాలని మద్రాస్ హైకోర్టు పోలీసులను ఆదేశించింది.
అయితే, హైకోర్టుకు కాకుండా దర్యాప్తు నివేదికను తమకు అక్టోబర్ 18న సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

ఫొటో సోర్స్, Getty Images
కేసు నేపథ్యం ఏంటి?
తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలో ఉన్న వెల్లియంగిరిలో 1992లో ఈషా యోగా సెంటర్‌ను జగ్గీ వాసుదేవ్ స్థాపించారు.
వేలాదిమంది వివాహితులు, అవివాహితులతో పాటు బ్రహ్మచర్యాన్ని అనుసరించే మరికొందరు ఈ కేంద్రంలో ఉంటున్నారు.
ఈషా యోగా సెంటర్ నుంచి తన ఇద్దరు కూతుళ్లను వెనక్కి తీసుకురావాలని డిమాండ్ చేస్తూ కోయంబత్తూరులోని వడవల్లి ప్రాంతానికి చెందిన కామరాజ్ మద్రాస్ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు.
కామరాజ్ తమిళనాడు అగ్రికల్చరల్ యూనివర్శిటీలో అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ విభాగం మాజీ అధిపతి. ఆయనకు 42, 39 ఏళ్ల వయసున్న ఇద్దరు కూతుళ్లున్నారు.
కామరాజ్ పెద్ద కూతురు ఇంగ్లండ్‌లోని ప్రఖ్యాత యూనివర్శిటీ నుంచి మెకట్రానిక్స్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేశారు.
2008లో భర్త నుంచి విడిపోయిన ఆమె తర్వాత ఈషా సెంటర్‌లో చేరారు.
కామరాజ్ చిన్న కూతురు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. ప్రస్తుతం అక్కాచెల్లెళ్లిద్దరూ ఈషా సెంటర్‌లో ఉంటున్నారు.
మెదడు సరిగ్గా పనిచేయకుండా తన కుమార్తెలకు మందులు ఇచ్చారని, దీనివల్లే వారిద్దరూ కుటుంబంతో సంబంధాలు తెంచుకున్నారని తన పిటిషన్‌లో కామరాజ్ ఆరోపించారు.
ఈషా సెంటర్‌కు వచ్చే కొందరిని బ్రెయిన్ వాష్ చేసి, వారిని సన్యాసినులుగా మారుస్తున్నారని, తల్లిదండ్రులను కలుసుకునేందుకు కూడా వారిని అనుమతించడం లేదని కామరాజ్ ఆరోపించారు.
ఈ ఏడాది జూన్ 15న సాయంత్రం 6 గంటలకు తన పెద్ద కుమార్తె తనకు ఫోన్ చేసి, ఈషా యోగా సెంటర్‌కు వ్యతిరేకంగా తాను పెట్టిన కేసును ఉపసంహరించుకునేదాకా తన చిన్న కూతురు నిరాహారదీక్ష చేస్తుందని చెప్పిందని కామరాజ్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

తండ్రి ఆరోపణలపై కుమార్తెల స్పందనేంటి?
కేసు విచారణ జరుగుతున్నప్పుడు కామరాజ్ ఇద్దరు కూతుళ్లు మద్రాస్ హైకోర్టులో హాజరయ్యారు. ఈషా యోగా సెంటర్‌లో తన కుమార్తెలను బంధించారని కామరాజ్ చెబుతోంటే....వారు మాత్రం తమనెవరూ బలవంతం చేయడం లేదని, ఇష్టపూర్వకంగా తామే యోగా సెంటర్‌లో నివసిస్తున్నామని తెలిపారు.
తమ జీవితాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునే హక్కు పెద్దలకు ఉంటుందని ఈషా యోగా సెంటర్ తరఫున వాదించిన కె. రాజేంద్ర కుమార్ అన్నారు.
ఇద్దరు మహిళల వ్యక్తిగత నిర్ణయాల్లో కోర్టు కల్పించుకోవాల్సిన అవసరం లేదని రాజేంద్ర కుమార్ అన్నారు. అయితే న్యాయమూర్తులు ఈ వాదనతో ఏకీభవించలేదు.

ఫొటో సోర్స్, Getty Images
తండ్రి విజ్ఞప్తి ఏంటి?
చెన్నైలోని ప్రఖ్యాత ఇంజినీరింగ్ కాలేజ్‌లో చదువుతున్నప్పుడు ఓ ఈవెంట్‌లో తన చిన్నకూతురు జగ్గీ వాసుదేవ్ ప్రభావానికి లోనయిందని కామరాజ్ చెప్పారు.
తన కూతురుతో పాటు ఆ కాలేజ్‌లో చదివిన 20 మంది అమ్మాయిలు తమ ఉద్యోగాలు వదిలిపెట్టి ఈషా కేంద్రంలో చేరారని కామరాజ్ బీబీసీతో చెప్పారు.
‘‘ నా కూతుళ్లిద్దరూ 2016లో ఈషా కేంద్రంలో చేరారు. నేను అదే ఏడాది కోర్టులో పిటిషన్ వేశాను. నా కూతుళ్లను కలిసేందుకు కోర్టు అనుమతిచ్చింది. 2017లో నా కుమార్తెలు జిల్లాకోర్టులో నాకు వ్యతిరేకంగా కేసు వేశారు. ఈషా కేంద్రాన్ని నేను అప్రతిష్టపాలుచేస్తున్నానని ఆరోపించారు. ఈ కేసు ముగియడానికి ఆరేళ్ల సమయం పట్టింది. అప్పటివరకు నేను నా కూతుళ్లను కలుసుకోలేకపోయాను. గత ఏడాది మద్రాస్ హైకోర్టు కల్పించుకోవడంతో మళ్లీ వాళ్లను కలుసుకోవడానికి నాకు అనుమతి లభించింది’’ అని కామరాజ్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
మద్రాస్ హైకోర్టు ఏం చెప్పింది...?
ఈషా సెంటర్‌పై సమగ్ర దర్యాప్తుకు మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తులు ఎస్.ఎమ్.సుబ్రమణియమ్, వి.శివజ్ఞానమ్ ఆదేశించారు.
తన కుమార్తెకు పెళ్లి చేసిన జగ్గీవాసుదేవ్, ఇతర మహిళలను మాత్రం సన్యాసినులుగా మారాలని ఎందుకు ప్రోత్సహిస్తున్నారని న్యాయమూర్తులు ప్రశ్నించారు.
‘‘ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకున్నామని మీరు చెబుతున్నారు. మీ తల్లిదండ్రులను వదిలిపెట్టడం మీకు తప్పుగా అనిపించడం లేదా’’ అని విచారణకు హాజరైన ఇద్దరు మహిళలను న్యాయమూర్తులు ప్రశ్నించారు.
దీని వెనక ఉన్న నిజాన్ని గుర్తించేందుకు తదుపరి దర్యాప్తు అవసరమని మద్రాస్ హైకోర్టు అభిప్రాయపడింది.
ఈషా సెంటర్ ఏం చెబుతోంది..?
ఈ విషయంపై ఈషా యోగా సెంటర్‌ను బీబీసీ సంప్రదించింది. ఆ సెంటర్ ప్రతినిధి బీబీసీకి లిఖితపూర్వక ప్రకటన ఇచ్చారు.
‘‘పెళ్లి చేసుకోవాలని గానీ, సన్యాసం తీసుకోవాలని కానీ ఈషా యోగా సెంటర్ ఎవరినీ బలవంతం చేయదు, ప్రోత్సహించదు, ప్రేరేపించదు. బ్రహ్మచారిణులుగా ఉన్న ఆ ఇద్దరు మహిళల తల్లిదండ్రులు గత 8 ఏళ్లుగా తప్పుడు కేసులు పెడుతున్నారు. ఏదో ఒక దురుద్దేశంతో అనవసర వివాదాలు సృష్టిస్తున్నారు. ఈషా యోగా సెంటర్‌లో తన ఇద్దరు కూతుళ్లను కామరాజ్ కలుసుకున్నారనడానికి ఆధారాలున్నాయి. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ను కోర్టుకు అందించాం’’ అని ఆ ప్రకటనలో ఉంది.
‘‘2016లో కోయంబత్తూరు జిల్లా న్యాయమూర్తుల కమిటీ కామరాజ్ పిటిషన్‌పై విచారణ జరిపింది. ఈషా యోగా సెంటర్‌లో కమిటీ అక్కాచెల్లెళ్లిద్దరినీ కలిసింది’’ అని ఆ ప్రకటనలో తెలిపింది.
తల్లిదండ్రులు నమోదు చేసిన కేసు నిజమైనది కాదు. నిర్బంధంలో ఉన్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్లు తమ ఇష్టపూర్వకంగా ఈషా యోగా సెంటర్‌లో నివసిస్తున్నారు అని న్యాయమూర్తుల కమిటీ చెప్పినట్టు ఈషా యోగా సెంటర్ తెలిపింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














