ఇజ్రాయెల్-ఇరాన్ ఘర్షణ: పెట్రోల్ ధరలు పెరుగుతాయా, భారతీయులపై ప్రభావమెంత?

ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడి

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, అభినవ్ గోయల్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

మధ్య ప్రాచ్యంలో ఇరాన్, ఇజ్రాయెల్‌ మధ్య నెలకొన్న ఘర్షణలు ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు.

ఇరాన్ దాడి తర్వాత ప్రతీకారం గురించి ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు మాట్లాడారు.

‘‘ఇరాన్ పెద్ద తప్పు చేసింది. దీనికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది’’ అని ఆయన అన్నారు.

నెతన్యాహు ఇది చెప్పడానికి ఒక రోజు ముందు అంటే సెప్టెంబర్ 30న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనతో మాట్లాడారు. ఆ తర్వాత ‘‘మన ప్రపంచంలో ఉగ్రవాదానికి చోటు లేదు’’ అని ట్వీట్ చేశారు.

ఇలాంటి పరిస్థితుల్లో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య నేరుగా యుద్ధం ప్రారంభమైతే, భారత్‌పై పడే ప్రభావమెంత? అనేది చర్చనీయాంశంగా మారింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఇరాన్ దాడులు

ఫొటో సోర్స్, Getty Images

సామాన్య భారతీయుని జేబులకు చిల్లుపడుతుందా?

ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడి చేసిన తర్వాత, మధ్య ప్రాచ్యంలో ఘర్షణలు మరింత చెలరేగాయి. దీని ప్రభావం నేరుగా చమురు ధరలపై పడుతుంది.

ఇరాన్ క్షిపణి దాడులు చేస్తుందన్న అంచనాలతోనే, అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు 3% పెరిగాయంటే దాని ప్రభావాన్ని అర్థం చేసుకోవచ్చు.

అంతర్జాతీయంగా చమురు ధరలకు బ్రెంట్ క్రూడ్ అనేది బెంచ్‌మార్క్. ఈ బెంచ్‌మార్క్‌లో ఒక్కో బ్యారల్ ధర 1% పైగా పెరిగి 74.40 డాలర్లకు చేరుకుంది. మంగళవారం నాటి ట్రేడింగ్‌లో 5% పైగా పెరిగింది.

‘‘ఇరాన్, ఇజ్రాయెల్ మధ్యలో యుద్ధం మొదలైతే, భారత్‌లో సామాన్య ప్రజల జేబులపై నేరుగా ప్రభావం పడుతుంది’’ అని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ వరల్డ్ అఫైర్స్‌లోని సీనియర్ ఫెలో డాక్టర్ ఫజుర్ రెహమాన్ అన్నారు.

‘‘యుద్ధం వస్తే, దాని ప్రభావం కేవలం ఇరాన్‌కే పరిమితం కాదు. అఫ్గనిస్తాన్, ఇరాక్, సౌదీ అరేబియా, ఖతార్, యూఏఈలపై కూడా పడుతుంది. ఇవన్నీ భారత్‌కు పెద్ద ఎత్తున చమురు ఎగుమతి చేసే దేశాలు’’ అని ఫజుర్ రెహమాన్ పేర్కొన్నారు.

‘‘ఒకవేళ దాడులు తీవ్రమైతే చమురు సరఫరా తగ్గుతుంది, డిమాండ్ పెరుగుతుంది. ఇలాంటి పరిస్థితిలో, చమురు ధరలు పెరిగి భారత్‌పై నేరుగా ప్రభావం పడుతుంది’’ అని ఫజుర్ రెహమాన్ అన్నారు.

భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్.జైశంకర్

భారత్‌కు దౌత్యపరమైన సవాళ్లు

ఇరాన్, ఇజ్రాయెల్‌లతో భారత్‌కు మంచి దౌత్య సంబంధాలు ఉన్నాయి. ఇండియాకు చమురు సరఫరా చేసే దేశాల్లో ఇరాన్‌ ఒకటి.

అణు కార్యక్రమం కారణంగా ఇరాన్‌పై విధించిన అంతర్జాతీయ ఆంక్షలకు ముందు, ఇరాన్ భారతదేశానికి రెండో అతిపెద్ద చమురు ఎగుమతిదారు.

అంతర్జాతీయ ఆంక్షలు ఉన్నప్పటికీ, ఇరాన్‌తో భారత్ జాగ్రత్తగా సంబంధాలను కొనసాగిస్తోంది.

ఇటీవల ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించినప్పుడు, భారత ప్రభుత్వం ఒక రోజు సంతాప దినం ప్రకటించింది.

మరోవైపు, ఇజ్రాయెల్‌తో కూడా భారత్‌కు దౌత్య సంబంధాలు ఉన్నాయి. ఇజ్రాయెల్ 1948లో ఒక దేశంగా ఉనికిలోకి వచ్చింది. 1992 నుంచి భారత్ దానితో దౌత్య సంబంధాలు మొదలు పెట్టింది. అప్పటి నుంచి రెండు దేశాల మధ్య సంబంధాలు రోజురోజుకూ బలపడుతూ వచ్చాయి.

ఇప్పుడు భారతదేశానికి ఆయుధాలు, టెక్నాలజీ ఎగుమతి చేస్తున్న అగ్రదేశాల్లో ఇజ్రాయెల్ కూడా ఒకటి.

‘‘ఇరు దేశాల మధ్యలో దౌత్య సంబంధాలను బ్యాలెన్స్ చేయడం భారత్‌కు సవాలే. ఇప్పటి వరకు ఈ పనిని చాలా అద్భుతంగా చేసింది. భారత దౌత్యం గత పదేళ్లలో ఎక్కడా కూడా ఒకవైపు మాత్రమే ఉండేలా నిర్ణయాలు తీసుకోలేదు’’ అని ఫజుర్ రెహమాన్ అన్నారు.

‘‘ఇరు దేశాల మధ్య ఈ విధంగా సమతుల్యతను పాటించడమే దౌత్యం. భారత్ ఎవర్నీ నిరాశపరచదు’’ అని జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలో నెల్సన్ మండేలా సెంటర్ ఫర్ పీస్ అండ్ కాన్‌ఫ్లిట్ రిజొల్యూషన్ శాఖ ప్రొఫెసర్ రేష్మి కాజీ అన్నారు.

‘‘ఒకవేళ ఇజ్రాయెల్ వైపుకు భారత్ మొగ్గుచూపితే, ఇరాన్‌తో సంబంధాలపై ప్రభావం పడుతుంది. దీనివల్ల గల్ఫ్‌లో జీవిస్తున్న భారతీయులు వ్యక్తిగతంగా ప్రభావితులవుతారు’’ అని ఆమె అన్నారు.

‘‘ఇటీవల పోర్చుగీస్ జెండాతో వెళ్తున్న కార్గో నౌకను ఇరాన్ నియంత్రణలోకి తీసుకున్నప్పుడు, ఆ నౌకలో 17 మంది భారతీయులు ఉన్నారు. భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్.జైశంకర్ జోక్యం తర్వాత భారతీయులను విడుదల చేశారు. ఇరాన్ విషయంలో ఏదైనా వివక్ష చూపితే, వారు ఎలా స్పందిస్తారన్నదాన్ని ఇలాంటి ఘటనల ద్వారా అర్ధం చేసుకోవచ్చు’’ అని కాజీ అన్నారు.

చాబహార్ పోర్టు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, చాబహార్ పోర్టు

భారత ప్రాజెక్టులకు ఎదురుదెబ్బ అవుతుందా?

ఇరాన్ చాబహార్ పోర్టు భారత్‌కు చాలా కీలకం. ఈ పోర్టు సాయంతో అఫ్గనిస్తాన్, మధ్య ఆసియాతో వాణిజ్యం కోసం పాకిస్తాన్ గుండా వెళ్ళాల్సిన అవసరం భారత్‌కు లేకుండా పోయింది.

చాబహార్‌లో షాహిద్ బెహెస్తీ పోర్టును అభివృద్ధి చేసేందుకు ఇరు దేశాలు 2015లో ఒప్పందం చేసుకున్నాయి.

‘‘ఇజ్రాయెల్ మధ్యలో యుద్ధం మొదలైతే, చాబహార్ లాంటి ప్రాజెక్టులను ఇరాన్ పక్కనబెట్టొచ్చు. ఇజ్రాయెల్‌తో పోరాటం వారికి ప్రాధాన్యంగా మారుతుంది. దీని వల్ల ప్రాజెక్టు పనులు ఆగిపోతాయి’’ అని ఫజుర్ రెహమాన్ అన్నారు.

మధ్య ప్రాచ్యంలోని భౌగోళిక రాజకీయ పరిస్థితుల కారణంగా చాబహార్ ప్రాజెక్టు ఇప్పటికే బాగా ప్రభావితమైందని రేష్మి కాజీ అన్నారు. ఈ ప్రాజెక్టు మళ్లీ ఆగిపోయే పరిస్థితి ఉందని కాజీ అభిప్రాయపడ్డారు.

మధ్య ప్రాచ్యంలో చాలా పెద్ద ప్రాజెక్టులలో భారత్ భాగమైందని, ఒకవేళ యుద్ధం మొదలైతే, ఈ ప్రాజెక్టుల నుంచి ఫోకస్ పూర్తిగా పక్కకు పోతుందని, సమయానికి పూర్తయ్యే అవకాశం తగ్గుతుందని ఫజుర్ రెహమాన్ అన్నారు.

2023లో దిల్లీలో జరిగిన జీ20 సదస్సులో ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరప్ ఎకనామిక్ కారిడార్ ప్రాజెక్ట్‌పై సంతకాలు జరిగాయి. భారత్, అమెరికా, సౌదీ అరేబియా, యూఏఈ, యూరోపియన్ యూనియన్, ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీలు దీనిలో భాగస్తులు.

పెద్ద ఎత్తున రవాణా నెట్‌వర్క్‌ను నెలకొల్పడమే ఈ కారిడార్ లక్ష్యం. ఈ కారిడార్ సాయంతో, భారత్ ఉత్పత్తులు గుజరాత్‌లోని కాండ్ల పోర్టు నుంచి యూఏఈ, సౌదీ అరేబియా, ఇజ్రాయెల్, గ్రీస్ మీదుగా యూరప్‌కు సులభంగా చేరుకుంటాయి.

యుద్ధం వస్తే, ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరప్ ఎకనామిక్ కారిడార్‌కు అతిపెద్ద నష్టం. ఈ కారిడార్ టైమ్‌లైన్ పూర్తిగా దెబ్బతింటుంది. అంతేకాక, ఐ2యూ2 లాంటి వ్యాపార బృందాలు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటాయి. ఈ గ్రూప్‌లో భారత్, ఇజ్రాయెల్, అమెరికా, యూఏఈలు ఉన్నాయి.

ఇరాన్ కరెన్సీ

ఫొటో సోర్స్, Getty Images

విదేశీ మారకపు నిల్వలపై ప్రభావం

పని కోసం చాలామంది భారతీయులు గల్ఫ్‌కు వెళ్తుంటారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం, సౌదీ అరేబియా, యూఏఈ, ఒమన్, బహ్రెయిన్ , ఖతార్, కువైట్‌లో 90 లక్షల మంది భారతీయులు జీవిస్తున్నారు.

వీరిలో ఎక్కువమంది అంటే దాదాపు 35 లక్షల మందికిపైగా యూఏఈలో ఉన్నారు. సౌదీలో 25 లక్షల మంది, కువైట్‌లో 9 లక్షల మంది, ఖతార్‌లో 8 లక్షల మంది, ఒమన్‌లో 6.5 లక్షల మంది, బహ్రెయిన్‌లో 3 లక్షల మందికి పైగా భారతీయులు ఉంటున్నారు.

ఇరాన్, ఇజ్రాయెల్‌లలో కూడా భారతీయులు వేలల్లో ఉన్నారు. ఈ ప్రాంతాల్లో నివసించే వారు తాము సంపాదించిన డబ్బులో కొంత భారత్‌కు పంపుతుంటారు.

భారత రూపాయితో పోలిస్తే గల్ఫ్ దేశాల కరెన్సీలు చాలా బలంగా ఉంటాయి. దీని నుంచి కార్మికులు ప్రయోజనం పొందుతున్నారు. బహ్రెయినీ దినార్ విలువ సుమారు రూ.222, ఒక ఒమనీ రియాల్ విలువ సుమారు రూ.218 పలుకుతుంది.

‘‘గల్ఫ్ దేశాల్లో నివసించే భారతీయులు లక్షల డాలర్లను స్వదేశానికి పంపుతుంటారు. దీనివల్ల భారత విదేశీ మారకపు రిజర్వులు బలంగా ఉంటున్నాయి. ఒకవేళ ఇరాన్, ఇజ్రాయెల్ మధ్యలో యుద్ధం మొదలైతే, ఈ నిల్వలపై నేరుగా ప్రభావం పడుతుంది’’ అని డాక్టర్ ఫజుర్ రెహమాన్ చెప్పారు.

17వ లోక్‌సభలో విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ రిపోర్టును నివేదించినప్పుడు, 2023 డిసెంబర్ వరకు సౌదీ అరేబియా, యూఏఈ, ఒమన్, బహ్రెయిన్, ఖతార్, కువైట్‌ల నుంచి 120 బిలియన్ డాలర్ల (రూ.10,07,556 కోట్లను) విదేశీ మారక ద్రవ్యాన్ని భారత్ పొందింది.

‘‘యుద్ధం వస్తే, గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న భారతీయులను వెనక్కి తీసుకురావడం భారత్‌కు అతిపెద్ద సవాలు. వారికి దేశంలో ఆశ్రయం కల్పించడం అంత తేలికైన పని కాదు’’ అని రెహమాన్ అభిప్రాయపడ్డారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)