హసన్ నస్రల్లా మరణం: హిజ్బుల్లా, ఇజ్రాయెల్, ఇరాన్ తర్వాత ఏం చేయవచ్చు?

హసన్ నస్రల్లా, ఇజ్రాయెల్, ఇరాన్, హిజ్బుల్లా

ఫొటో సోర్స్, Reuters

    • రచయిత, ఫ్రాంక్ గార్డ్‌నర్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

లెబనాన్ రాజధాని బేరూత్‌లో ఇజ్రాయెల్ చేసిన వైమానిక దాడిలో హిజ్బుల్లా నాయకుడు హసన్ నస్రల్లా చనిపోయారు.

ఈ పరిణామం మధ్య ప్రాచ్యంలో జరుగుతున్న యుద్ధాన్ని మరింత విస్తృతం చేయడంతో పాటు తీవ్రం చేస్తుంది.

అంతేకాదు ఈ యుద్ధంలోకి ఇరాన్, అమెరికాలూ ప్రవేశించే అవకాశం ఉంది.

ఇప్పుడిది ఇక్కడి నుంచి ఎక్కడికి వెళుతుంది? అనేది మూడు ప్రశ్నల మీద ఆధారపడి ఉంది.

1. ఇప్పుడు హిజ్బుల్లా ఏం చేస్తుంది?

హిజ్బుల్లాకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది.

హిజ్బుల్లా నాయకత్వ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నది. డజను మందికి పైగా హిజ్బుల్లా టాప్ కమాండర్లను ఇజ్రాయెల్ చంపేసింది. పేజర్లు, వాకీ టాకీల పేలుళ్లతో దాని సమాచార వ్యవస్థ కూడా ధ్వంసమైంది. ఇజ్రాయెల్ తాజా వైమానిక దాడుల్లో హిజ్బుల్లా ఆయుధాగారాలు, ఆయుధాలు చాలావరకు ధ్వంసమయ్యాయి.

“హసన్ నస్రల్లాను కోల్పోవడం హిజ్బుల్లాపై తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. అది ఆ సంస్థను అస్థిరపరచవచ్చు. రానున్న రోజుల్లో హిజ్బుల్లా రాజకీయ, సైనిక వ్యూహాలను మార్చుకునేలా చేయవచ్చు” అని అమెరికాలోని పశ్చిమాసియా భద్రత విశ్లేషకులు మొహమ్మద్ అల్ బాషా చెప్పారు.

అయితే, ఇజ్రాయెల్‌ను తీవ్రంగా వ్యతిరేకించే హిజ్బుల్లా యుద్ధాన్ని ఆపేసి ఇజ్రాయెల్ షరతులకు లోబడి శాంతి ప్రతిపాదనకు అంగీకరిస్తుందనే అంచనాలు కూడా తప్పే అవకాశం ఉంది.

యుద్ధాన్ని కొనసాగిస్తామని హిజ్బుల్లా ఇప్పటికే ప్రకటించింది. ఆ సంస్థకు ఇప్పటికీ వేల మంది ఫైటర్లు ఉన్నారు. వారిలో చాలా మంది ఇటీవలి వరకు సిరియాలో పోరాడారు.

ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో చాలా వరకు ధ్వంసమైనప్పటికీ హిజ్బుల్లా దగ్గర ఇంకా కొన్ని క్షిపణులు ఉన్నాయి. అందులో చాలా వరకు ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌, ఇతర నగరాలకు చేరుకోగల దీర్ఘశ్రేణికి చెందినవి ఉన్నాయి. హిజ్బుల్లా వాటిని ఉపయోగించే అవకాశం ఉంది.

వాళ్లు అలా చేస్తే, ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ మీద భారం పెరుగుతుంది. అలాగే ఇజ్రాయెల్‌లో ప్రాణనష్టం జరిగే అవకాశం ఉంటుంది. అలా జరిగితే ఇజ్రాయెల్ స్పందన కూడా తీవ్రంగా ఉంటుంది. ఇజ్రాయెల్ భారీ దాడికి పూనుకుంటే.. అది లెబనాన్ మౌలిక సదుపాయాలను పూర్తిగా ధ్వంసం చేయవచ్చు లేదా యుద్ధం ఇరాన్ వరకు వెళ్లవచ్చు.

బీబీసీ
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
హసన్ నస్రల్లా, ఇజ్రాయెల్, ఇరాన్, హిజ్బుల్లా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బేరూత్‌లో నస్రల్లా చిత్రపటాన్ని పట్టుకుని నినాదాలు చేస్తున్న ఆయన మద్దతుదారులు

2. ఇరాన్ ఏం చేస్తుంది?

హసన్ నస్రల్లా హత్య వల్ల హిజ్బుల్లాకు ఎంత నష్టమో ఇరాన్‌కు కూడా అంతే నష్టం. నస్రల్లా మృతికి ఇరాన్ ఐదు రోజుల సంతాప దినాలను ప్రకటించింది.

దీంతో పాటు అత్యవసరమైన జాగ్రత్తలు తీసుకుంది. తమ నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీని కూడా చంపేస్తారేమోననే భయంతో ఆయనను దాచి పెట్టింది.

జులైలో ఇరాన్ హమాస్ రాజకీయ నేత ఇస్మాయిల్ హనియే తెహ్రాన్‌లోని గెస్ట్ హౌస్‌లో హత్యకు గురయ్యారు. ఈ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ నాయకులు ప్రకటనలు చేశారు.

తాజాగా జరిగిన నస్రల్లా హత్య ఇరాన్‌ నేతలను ఒక రకంగా ఆలోచించేలా చేస్తుంది.

“తిరుగుబాటు కూటమి”గా పిలుచుకునే మధ్య ప్రాచ్యం అంతటా విస్తరించి ఉన్న సాయుధ సైన్యాలన్నీ ఇరాన్ చేతిలో ఉన్నాయి.

హిజ్బుల్లా మాదిరిగానే యెమెన్‌లో హూతీలు, సిరియా, ఇరాక్‌లలో అనేక గ్రూపులు ఇందులో ఉన్నాయి. మధ్య ప్రాచ్యంలో ఉన్న ఇజ్రాయెల్, అమెరికన్ స్థావరాలపై దాడులు చేయాలని ఇరాన్ ఈ గ్రూపులను కోరవచ్చు.

అయితే ఇరాన్ దేన్ని ఎంచుకున్నా, అదో పెద్ద యుద్ధానికి దారి తీయవచ్చు. అలాంటి యుద్ధమే జరిగితే అందులో ఇరాన్ గెలుస్తుందని ఆశించే పరిస్థితి లేదు.

హసన్ నస్రల్లా, ఇజ్రాయెల్, ఇరాన్, హిజ్బుల్లా

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, లెబనాన్ సరిహద్దు దగ్గర ఇజ్రాయెల్ సైనికులు

3. ఇజ్రాయెల్ ఏం చేస్తుంది?

హసన్ నస్రల్లా హత్యకు ముందు ఎవరికైనా సందేహాలు ఉన్నా, ఇప్పుడు అలాంటివేమీ ఉండకపోవచ్చు.

లెబనాన్‌లో 21 రోజుల కాల్పుల విరమణ పాటించాలని ఇజ్రాయెల్‌కు అత్యంత సన్నిహిత మిత్రపక్షమైన అమెరికా సహా మరో 12 దేశాలు కోరుతున్నా.. ఇజ్రాయెల్‌కు మాత్రం ఈ యుద్ధాన్ని ఆపే ఉద్దేశ్యం ఏమాత్రం లేదని అర్థమవుతోంది.

ఇజ్రాయెల్ సైన్యం అంచనాల ప్రకారం హిజ్బుల్లా ప్రస్తుతం వెనుకబడింది. అందుకే హిజ్బుల్లా వద్ద ఉన్న క్షిపణుల్ని పూర్తిగా నాశనం చేసేవరకూ దాడులను కొనసాగించాలని ఇజ్రాయెల్ సైన్యం పట్టుబడుతుంది.

హిజ్బుల్లా లొంగిపోయేలా చేసుకోవడం దాదాపు అసాధ్యం. అలాంటి పరిస్థితుల్లో భూతల దాడులు చేయకుండా ఇజ్రాయెల్ తన యుద్ధ లక్ష్యాలను సాధించడం చాలా కష్టం.

ఇజ్రాయెల్ సైనికులు లెబనాన్ సరిహద్దుల్లో సన్నాహాలు చేస్తున్న దృశ్యాలను ఇజ్రాయెల్ భద్రతా బలగాలు విడుదల చేశాయి.

అయితే హిజ్బుల్లా కూడా18 ఏళ్ల కిందట యుద్ధం చేసినప్పటి నుంచి తర్వాత చేయబోయే యుద్ధం కోసం శిక్షణ తీసుకుంటోంది. ఇజ్రాయెల్ దక్షిణ లెబనాన్‌లో అడుగు పెడితే అదొక “చారిత్రక అవకాశం” అవుతుందని చనిపోవడానికి ముందు నస్రల్లా తన అనుచరులకు చెప్పారు.

లెబనాన్‌లో అడుగు పెట్టడం ఇజ్రాయెల్ బలగాలకు చాలా తేలిక. అయితే బయటకు రావడానికి మాత్రం గాజాలో మాదిరిగానే కొన్ని నెలలు పట్టవచ్చు.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)