జగ్గయ్యపేట: మనిషి మాంసం తినే అరుదైన బ్యాక్టీరియా, బాలుడు కాలు కోల్పోవడానికి అదే కారణమా?

విజయవాడ వరదలు, డెంగీ, జ్వరాలు,

ఫొటో సోర్స్, ugc

    • రచయిత, గరికిపాటి ఉమాకాంత్
    • హోదా, బీబీసీ కోసం

గమనిక: ఈ కథనంలోని విషయాలు మిమ్మల్ని కలచివేయవచ్చు

నెల రోజుల కిందట కనీవినీ ఎరుగని విధంగా బెజవాడ పరిసర ప్రాంతాలపై భారీ వరద విరుచుకుపడింది. అది సృష్టించిన నష్టం నుంచి ప్రజలు ఇంకా కోలుకోలేదు.

వేలాది ఇళ్లు, వందలాది కాలనీలను ముంచెత్తిన వరద పూర్తిగా తగ్గుముఖం పట్టినా బురద మాత్రం ఇంకా తగ్గలేదు.

పగటి పూట విపరీతమైన ఎండలు కాస్తున్నా రాత్రిళ్లు వర్షాలు కురుస్తుండటంతో బురద ఇంకా వీడటం లేదు. ముంపు ప్రభావిత ప్రాంతాలన్నీ అపరిశుభ్రతతో కొట్టుమిట్టాడుతున్నాయి.

ఫలితంగా నగరంలో చాలా చోట్ల వ్యాధులు విజృంభిస్తున్నాయి. అంటువ్యాధులు, జ్వరాల కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి.

బీబీసీ వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
విజయవాడ, వరదలు, సింగ్ నగర్, రాజరాజేశ్వరి పేట, బుడమేరు

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, బాలుడి శరీరంలోకి ఈ.కొలి, క్లెబిసిల్లా క్రిములు వెళ్ళినట్టు తేలింది.

వరద నీటి వల్లనే ఆ బాలుడికి అలా అయ్యిందా?

ఈ నెల తొలి వారంలో విజయవాడను వరద ముంచెత్తిన సమయంలో, ఎన్టీఆర్‌ జిల్లాలోని జగ్గయ్యపేట పట్టణంలోనూ పలు ఇళ్లు వరద నీటిలో మునిగాయి.

మనిషి మాంసాన్ని తినే బ్యాక్టీరియా ఈ పట్టణానికి చెందిన 12 ఏళ్ల ఓ బాలుడి జీవితాన్ని ఛిద్రం చేసింది. ఎటువంటి గాయాలు లేకుండానే బాలుడి శరీరంలోకి ప్రమాదకరమైన బ్యాక్టీరియా ప్రవేశించడంపై వైద్యులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఏడో తరగతి విద్యార్థి 12 ఏళ్ల భవదీప్‌ కుటుంబం ఉండే ఇంట్లోకి కూడా వరద నీరు చేరింది.

ఆ వరద నీరు తగ్గే వరకు కుటుంబంతో అతడు ఇంట్లోనే ఉన్నాడు. ఇంట్లోని సామాన్లు తడవకుండా అమ్మానాన్నలకు సాయం చేశాడు.

"వరద తగ్గిన తర్వాత ఓ రోజు రాత్రి చలి జ్వరం రావడంతో వైరల్‌ ఫీవర్‌ ఏమో అని బాబును స్థానిక ఆర్‌ఎంపీ దగ్గర చూయించాను. ఆయన యాంటీబయాటిక్స్‌ ఇచ్చి ఇంజెక్షన్లు వేశారు. అయినా పరిస్థితి కుదుటపడకపోవడంతో టెస్టులు చేయించగా డెంగీ సోకినట్లు తేలింది. ఆ తరువాత ఉన్నట్టుండి రెండు కాళ్లలో తొడల నుంచి అరికాళ్ల వరకు వాపు వచ్చేసింది. మూత్రం రావడం ఆగిపోయింది. దీంతో పిన్నమనేని సిద్ధార్థ వైద్య కళాశాలకు తీసుకువెళ్లాను" అని బాలుడి తండ్రి నాగరాజు బీబీసీతో చెప్పారు.

ఆ ఆసుపత్రి డాక్టర్ల సలహాతో భవదీప్‌ను విజయవాడలోని అంకుర్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు.

అక్కడ పరీక్షలు చేసిన డాక్టర్లు, ఆ బాలుడికి అత్యంత అరుదైన ‘నెక్రోటైజింగ్‌ ఫాసియైటిస్‌’ వ్యాధి సోకిందని తెలిపారు.

విజయవాడ వరదలు, బుడమేరు, ప్రకాశం బ్యారేజ్
ఫొటో క్యాప్షన్, వరదకు ముందు తమ బాలుడికి ఎలాంటి సమస్యలూ లేవని తండ్రి నాగరాజు చెప్పారు

మాంసం తినే బ్యాక్టీరియా

ఈ వ్యాధికి మరో పేరు ఫ్లెష్‌ ఈటింగ్‌ డిసీజ్‌.

ఈ వ్యాధికి కారణమైన బ్యాక్టీరియా భవదీప్‌ శరీరంలోకి చొచ్చుకుపోయి.. కండరాలను తినేసిందని వైద్యులు చెప్పారు.

దీంతో వెంటనే అప్రమత్తమైన డాక్టర్లు ఇన్‌ఫెక్షన్‌ మరింత పెరగకుండా.. ఈ నెల 17న కుడి కాలును తొడ భాగం వరకు తొలగించారు. ఎడమ మోకాలి కింద భాగంలో కూడా 30 శాతం మేర కండను సూక్ష్మక్రిములు తినేసినట్లు గుర్తించారు.

‘‘మాములుగా ఈ వ్యాధి షుగర్‌ ఉన్నవారిలో ఎక్కువగా వస్తుంది. కానీ ఎటువంటి గాయాలు లేకుండానే భవదీప్‌ శరీరంలోకి ప్రమాదకరమైన బ్యాక్టీరియా ఎలా వెళ్లిందనేది అంతుచిక్కడం లేదు. మురుగు నీటిలో భవదీప్‌ తిరగడం వల్లనే బ్యాక్టీరియా ప్రభావం చూపించిందా అంటే.. అది కూడా కచ్ఛితంగా చెప్పలేం’’ అని ఆ బాలుడికి చికిత్స అందిస్తున్న చిన్నపిల్లల వైద్యుల నిపుణులు డాక్టర్‌ వరుణ్‌కుమార్, డాక్టర్‌ రవి బీబీసీకి తెలిపారు.

అయితే, వరద రాకముందు భవదీప్‌‌కు ఎలాంటి సమస్యలూ లేవని, వరదలో తడిచిన తర్వాతే ఈ సమస్య మొదలైందని నాగరాజు చెప్పారు.

బాలుడి శరీరంలో కుళ్లిన భాగాల నుంచి తీసిన నమూనాలకు పరీక్షలు చేయించారు. అతని శరీరంలోకి ఈ.కొలి, క్లెబిసిల్లా క్రిములు వెళ్లినట్టు తేలింది.

"ఈ క్రిముల్లో ప్రమాదకర రకాలు ఉంటాయి. వాటి వల్లనే కాళ్లు బాగా వాచాయి" అని డాక్టర్లు రవి, వరుణ్‌ కుమార్ చెప్పారు.

‘‘వరద నీటిలో మురుగునీరు కలుస్తుంటుంది. అప్పుడు బ్యాక్టీరియా వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో బ్యాక్టీరియా శరీరంలో చేరి ఉండొచ్చు. మరోవైపు జ్వరంతో ఉన్న సమయంలో భవదీప్‌కు యాంటీబయాటిక్‌ స్టెరాయిడ్‌ ఇంజెక్షన్లు ఇచ్చారు. అలా చేయడం ప్రమాదకరం’’ అని డాక్టర్లు తెలిపారు.

భవదీప్‌ చికిత్స కోసం సీఎం రిలీఫ్‌ ఫండ్‌ నుంచి రూ.10 లక్షలు మంజూరు అయ్యాయని బాలుడి తండ్రి నాగరాజు బీబీసీకి తెలిపారు.

బాబు పూర్తిగా కోలుకునేందుకు ఇంకా మూడు నెలల సమయం పడుతుందని డాక్టర్లు చెబుతున్నారనీ, ఈలోగా అయ్యే వైద్య ఖర్చుల కోసం దాతల సాయం ఆర్థిస్తున్నానని ఆయన అన్నారు.

డాక్టర్ హరిహరన్
ఫొటో క్యాప్షన్, డాక్టర్ హరిహరన్

విజయవాడలో పెరుగుతున్న జ్వరం కేసులు

విజయవాడ నగరంలో జ్వరాల కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయని విజయవాడ నర్సింగ్‌ హోం అండ్‌ పోలిక్లినిక్‌కు చెందిన వైద్యుడు డాక్టర్‌ హరిహరన్‌ బీబీసీకి తెలిపారు.

"విజయవాడలో మునుపెన్నడూ లేని విధంగా వరదలు, అత్యధిక వర్షపాతం నమోదవడం వల్ల పేషెంట్లు పెరిగారు. సహజంగా ఆగస్టు, సెప్టెంబర్‌లలో జ్వరాల కేసులు పెరుగుతాయి. కానీ ఈ సారి వైరల్‌ ఫీవర్‌ బాధితులు పెరిగారు. ప్రజలు, ముఖ్యంగా ముంపు ప్రభావిత ప్రాంతాల ప్రజలు వరద నీటితో జాగ్రత్తగా ఉండాలి. వరద నీటిలో తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్నపాటి జ్వరం వచ్చినా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్లకు చూపించుకోవాలి’’ అని ఆయన సూచించారు.

హాస్పిటల్, వరదలు, బీపీ, షుగర్
ఫొటో క్యాప్షన్, డాక్టర్ జ్యోతిర్మయి

అప్రమత్తత అవసరం

వరద నీటిలో తిరిగేటప్పుడు, వరద తగ్గిన తర్వాత కూడా ప్రజలు పలు జాగ్రత్తలు తీసుకోవాలని విజయవాడ ప్రభుత్వ వైద్యశాల అసొసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ జ్యోతిర్మయి సూచించారు. ఆమె ఏం చెప్పారంటే..

  • వరదలు, వర్షాల సీజన్‌లో హైరిస్క్‌ పేషెంట్లుగా భావించే మధుమేహం, రక్తపోటు బాధితులు, కిడ్నీ వ్యాధి గ్రస్తులు, చిన్నపిల్లలు, వృద్ధులు, బాలింతలు జాగ్రత్తగా ఉండాలి.
  • నీళ్లల్లో తడవకుండా జాగ్రత్త పడాలి, మురుగు నీళ్లతో మరింత జాగ్రత్తగా ఉండాలి.
  • కాచి చల్లార్చిన నీటినే తాగాలి. పరిశుభ్రమైన వేడి ఆహారాన్నే తీసుకోవాలి.
  • ఎప్పటికప్పుడు డాక్టర్లు సిఫార్సు చేసిన మందులను వేసుకోవాలి.
  • అంటు వ్యాధులు ప్రబలకుండా చూసుకోవాలి.
  • దోమల నివారణకు జాగ్రత్తలు తీసుకోవాలి
వైద్య శిబిరాలు, విజయవాడ, వరదలు, కృష్ణానది, బుడమేరు

ఫొటో సోర్స్, National Health Authority

మెడికల్ క్యాంపులతో తప్పిన ముప్పు

"వరద పోయిన తర్వాత జ్వర బాధితుల సంఖ్య పెరగవచ్చని భావించి ప్రభుత్వాసుపత్రిలో బెడ్లు సిద్ధం చేశాం. అయితే ప్రభుత్వం ఎక్కడికక్కడ వైద్య శిబిరాలు నిర్వహించి మందులు పంపిణీ చేయడం వల్ల పెద్దాసుపత్రికి పేషెంట్ల తాకిడి పెరగలేదు" అని డాక్టర్‌ జ్యోతిర్మయి తెలిపారు.

విజయవాడ నగరంతో పాటు ఎన్టీఆర్‌ జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఈనెల 2వ తేదీ నుంచి 23వ తేదీ వరకు రెండు లక్షల 699 మంది ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి వైద్య సహాయం అందించి మందులు పంపిణీ చేశామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ సుహాసిని బీబీసీకి తెలిపారు.

మొత్తం 253 వైద్యశిబిరాలు నిర్వహించామని ఆమె వెల్లడించారు.

ఎక్కడ, ఎప్పుడు ఎవరికి వైద్య సాయం అవసరమైనా తమ శాఖ సిద్ధంగా ఉందని ఆమె చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)