అమిత్ షా వ్యాఖ్యలపై బంగ్లాదేశ్ తీవ్ర అభ్యంతరం, భారత డిప్యూటీ హైకమిషనర్‌కు పిలుపు, అసలేం జరిగింది?

ఫొటో సోర్స్, ANI
ఝార్ఖండ్‌లో ఉంటున్న బంగ్లాదేశీయుల గురించి కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
సెప్టెంబర్ 23వ తేదీ రాత్రి బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేస్తూ ''భారత హోం మంత్రి అమిత్ షా ఝార్ఖండ్‌లో బంగ్లాదేశ్ పౌరులను ఉద్దేశించి చేసిన దురదృష్ణకర వ్యాఖ్యలను మేం తీవ్రంగా ఖండిస్తున్నాం'' అని పేర్కొంది.
ఢాకాలోని భారత డిప్యూటీ హైకమిషనర్‌ను పిలిపించి, ఈ వ్యవహారంపై నిరసన తెలియజేస్తూ లేఖను కూడా అందజేసింది.
అమిత్ షా వ్యాఖ్యలపై బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ అభ్యంతరం తెలపడంతో పాటు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
ఇలాంటి అభ్యంతరకరమైన, ఆమోదయోగ్యం కాని వ్యాఖ్యలు చేయకూడదని భారత ప్రభుత్వం తమ నాయకులకు సూచించాలని బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది.

అమిత్ షా ఏమన్నారు?
ఈ ఏడాది చివర్లో ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
సెప్టెంబర్ 20న ఝార్ఖండ్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో అమిత్ షా మాట్లాడుతూ, ''ఝార్ఖండ్ ప్రభుత్వాన్ని ఒక్కసారి మార్చేయండి. రోహింజ్యాలను, బంగ్లాదేశ్ చొరబాటుదారులను గుర్తించి ఝార్ఖండ్ నుంచి తరిమికొట్టే బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకుంటుందని హామీ ఇస్తున్నా. వాళ్లు మన సంస్కృతిని నాశనం చేస్తున్నారు, మన ఆస్తులను లాగేసుకుంటున్నారు'' అన్నారు.
షా మాట్లాడుతూ, ''వాళ్లు అనేక రకాలుగా, మన అమ్మాయిలను దొంగ పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. మన జీవనోపాధిని కొల్లగొడుతున్నారు. కేవలం బీజేపీ ప్రభుత్వం మాత్రమే ఝార్ఖండ్‌లో చొరబాటుదారులకు చోటు లేకుండా చేయగలదు.'' అని చెప్పారు.
''మన ఝార్ఖండ్‌లో ఇదే స్థాయిలో చొరబాట్లు కొనసాగితే, వచ్చే 25 - 30 ఏళ్లలో ఇక్కడ ఆ చొరబాటుదారులే మెజారిటీ అవుతారు'' అని షా అన్నారు.
షా వ్యాఖ్యలపై స్పందించిన బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ, ''బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్న వ్యక్తులు పొరుగుదేశాల పౌరులపై చేసే ఇలాంటి వ్యాఖ్యలు పరస్పర గౌరవం, అవగాహనను దెబ్బతీస్తాయి'' అని పేర్కొంది.
అయితే, బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటనను భారత మాజీ విదేశాంగ కార్యదర్శి కన్వాల్ సిబల్ అవివేకపూరిత ప్రకటనగా పేర్కొన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ గత మూడు రోజులుగా అమెరికా పర్యటనలో ఉన్నారు. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత ముహమ్మద్ యూనస్ కూడా అమెరికాలోనే ఉన్నారు, అయినప్పటికీ ఇద్దరి మధ్య ఎలాంటి సమావేశం జరగలేదు.
ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ అనేక మంది ప్రపంచ నేతలను కలిసినా, యూనస్‌తో మాత్రం భేటీ కాలేదు. భారత్ - బంగ్లాదేశ్ మధ్య సంబంధాల్లో ప్రతిష్ఠంభనతో ఇది ముడిపడి ఉంది. అయితే, భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ సలహాదారు తౌహీద్ హుస్సేన్‌తో భేటీ అయ్యారు.
ముహమ్మద్ యూనస్‌ను కలిసేందుకు ప్రధాని మోదీ నిరాకరించారని, ఇది బంగ్లాదేశ్ ప్రజలను అవమానించడమేనని గతంలో భారత్‌లో పాకిస్తాన్ హై కమిషనర్‌గా పనిచేసిన అబ్దుల్ బాసిత్ ఆరోపించారు.

ఫొటో సోర్స్, Getty Images
బంగ్లాదేశ్‌తో సంబంధాలు - షా వ్యాఖ్యలు
ఇటీవలి కాలంలో బంగ్లాదేశ్ - భారత్ సంబంధాల్లో చాలా మార్పులొచ్చాయి. ఆగస్ట్ 5న, షేక్ హసీనా బంగ్లాదేశ్‌లో తన అధికారాన్ని వదిలేసి భారత్‌కు రావాల్సి వచ్చింది.
ఆ తర్వాత, ముహమ్మద్ యూనస్ నాయకత్వంలో బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైంది. ఖాలిదా జియా నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) ప్రభావం కూడా పెరగడం ప్రారంభమైంది.
షేక్ హసీనాను భారత్ మద్దతుదారుగా, బీఎన్‌పీని భారత్ వ్యతిరేకిగా భావిస్తారు.
ఇలాంటి పరిస్థితుల్లో, బంగ్లాదేశ్‌లోని భారత హైకమిషనర్ ఇటీవల బీఎన్‌పీ నేతలను కలిశారు. షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత భారత దౌత్యవేత్తలు బీఎన్‌పీ నేతలతో సమావేశం కావడం ఇదే తొలిసారి.
భారత అధికారులతో సమావేశం అనంతరం బీఎన్‌పీ నేత ఫక్రుల్ ఇస్లాం ఆలంగీర్ మాట్లాడుతూ, ''బీఎన్‌పీతో సంబంధాల విషయంలో భారత్ సానుకూల వైఖరి అవలంబించాలని అనుకుంటోంది. భారత రాజకీయ పార్టీలతో బీఎన్‌పీ సంబంధాలు బలంగా ఉండాలని కోరుకుంటోంది. ఇటీవల చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో, బంగ్లాదేశ్‌తో సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని కోరుకుంటున్నట్లు భారత్ తెలిపింది'' అన్నారు.
సెప్టెంబర్ ఆరంభంలో, పలువురు భారత అధికారులు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ప్రతినిధులతో సమావేశమయ్యారు.
ఈ సమావేశాల ద్వారా ఎన్నికల్లో కీలకమైన రాజకీయ పార్టీలతో సంప్రదింపులకు సిద్ధంగా ఉన్నామనే సందేశం పంపేందుకు భారత్ ప్రయత్నించింది.
2024 జనవరిలో జరిగిన ఎన్నికలకు ముందు భారత్‌ను సంప్రదించేందుకు బీఎన్‌పీ చాలాసార్లు ప్రయత్నించిందనీ, కానీ భారత్ స్పందించలేదని కొద్దికాలం కిందట ఆలంగీర్ చెప్పారు.
ఆ ఎన్నికలను బీఎన్‌పీ బహిష్కరించింది. కానీ, ఇప్పుడు పరిస్థితి మారిపోయింది.
దేశంలో ఎన్నికలు నిర్వహించాలని బీఎన్‌పీ ఇటీవల తాత్కాలిక ప్రభుత్వాన్ని కోరింది. ఆగస్ట్ 25న ముహమ్మద్ యూనస్ దేశంలో ఎన్నికల నిర్వహణ గురించి మాట్లాడారు. అయితే, అందుకు సంబంధించి ఎలాంటి తేదీలు ప్రకటించలేదు.
బంగ్లాదేశ్‌లో ఎన్నికల్లో బీఎన్‌పీ కీలకం. ఈ నేపథ్యంలో భారత్, బీఎన్‌పీతో సంబంధాలను మెరుగుపరుచుకోవడంపై దృష్టి పెట్టింది.
అయితే, అమిత్ షా వ్యాఖ్యలతో సంబంధాల మెరుగుదలలో కాస్త వేగం తగ్గొచ్చు.
ముఖ్యంగా, బంగ్లాదేశ్‌లో ఇటీవల వచ్చిన వరదలకు భారత్‌లో డ్యామ్‌ల నుంచి నీటిని విడుదల చేయడమే కారణమని కొన్ని సంస్థలు కూడా ఆరోపణలు చేశాయి. కానీ, ఆ వాదనలను భారత ప్రభుత్వం తోసిపుచ్చింది.

ఫొటో సోర్స్, Getty Images
గతంలోనూ బంగ్లాదేశ్‌పై షా తీవ్ర వ్యాఖ్యలు
అమిత్ షా వ్యాఖ్యలపై బంగ్లాదేశ్ అభ్యంతరం వ్యక్తం చేయడం ఇదేమీ తొలిసారి కాదు.
2019లో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై వాదనల సమయంలోనూ బంగ్లాదేశ్‌లో హిందువుల అణచివేత గురించి అమిత్ షా వ్యాఖ్యానించారు. దీనిపై బంగ్లాదేశ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
బంగ్లాదేశ్ అప్పటి విదేశాంగ మంత్రి డాక్టర్ ఏకే అబ్దుల్ మోమెన్ మాట్లాడుతూ, ''హిందువులపై అణచివేత గురించి వారు చెబుతున్నది అప్రస్తుతం, అసత్యం కూడా. బంగ్లాదేశ్ తరహాలో మతసామరస్యం కలిగిన దేశాలు ప్రపంచంలో చాలా తక్కువ'' అన్నారు.
భారత్‌లో ఎన్‌ఆర్‌సీ, కొత్త పౌరసత్వ చట్టం వంటి సమస్యలను కూడా బీఎన్‌పీ లేవనెత్తుతోంది.
''భారత్‌లోని అస్సాంలో నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్ (ఎన్ఆర్‌సీ) అమలు బంగ్లాదేశ్ స్వాతంత్య్రానికి, సార్వభౌమత్వానికి ముప్పు'' అని బీఎన్‌పీ నేత మీర్జా ఫక్రుల్ ఇస్లాం ఆలంగీర్ 2019లో అన్నారు.
అంతేకాకుండా, డాక్టర్ ఏకే మోమెన్ 2019లో మాట్లాడుతూ, ''మా పరిస్థితి బావుంది కాబట్టే భారతీయులు బంగ్లాదేశ్ వస్తున్నారు. మా ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంది. ఇక్కడికి వచ్చిన వారికి ఉద్యోగావకాశాలు దొరుకుతున్నాయి. అట్టడుగు వర్గాల ప్రజలకు ఇక్కడ సులభంగా తిండి దొరుకుతుంది'' అన్నారాయన.
అప్పుడు, భారతీయులు బంగ్లాదేశ్‌లోకి ప్రవేశిస్తున్నారా? అనే ప్రశ్న మోమెన్‌కి ఎదురైంది.
దానిపై మోమెన్ మాట్లాడుతూ, ''బంగ్లాదేశ్‌లో అక్రమంగా ఉంటున్న భారతీయులను వెనక్కి పంపుతాం. మా ఆర్థిక వ్యవస్థ భారత ఆర్థిక వ్యవస్థ కంటే బలంగా ఉంది. అక్కడ భారతీయులకు ఉద్యోగాలు దొరకడం లేదు, అందుకే బంగ్లాదేశ్‌కు వస్తున్నారు. బంగ్లాదేశ్‌లో సులభంగా తిండి దొరుకుతుందని కొంతమంది మధ్యవర్తులు భారత్‌లోని పేదవర్గాలను నమ్మిస్తున్నారు'' అన్నారు.
''బంగ్లాదేశీయులు ఎవరైనా అక్రమంగా అక్కడ నివసిస్తుంటే తెలియజేయాలని, వెంటనే వారిని వెనక్కి రప్పిస్తామని భారత్‌కు చెప్పాం'' అని మోమెన్ అన్నారు.
2021 మార్చిలో ప్రధాని మోదీ బంగ్లాదేశ్ పర్యటనను కూడా అక్కడి ముస్లిం, విద్యార్థి సంఘాలకు చెందిన కొందరు వ్యతిరేకించారు.
బీజేపీ నేతలు కూడా తరచూ బంగ్లాదేశ్ వైపు నుంచి చొరబాట్లపై మాట్లాడుతున్నారు.
అనేక సందర్భాల్లో బంగ్లాదేశ్ చొరబాటుదారులపేరుతో ముస్లింలపై కొన్ని హిందూ సంస్థలు దాడి చేయడం కనిపించింది. ఈ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఫొటో సోర్స్, ANI
బంగ్లాదేశ్, చొరబాట్లు
బంగ్లాదేశ్ నుంచి భారత్‌లోకి చొరబాట్లు చాలాకాలంగా ఉన్న సమస్య. 1971లో బంగ్లాదేశ్ ఏర్పడే వరకు శరణార్థులు భారత్‌కు వస్తూనే ఉన్నారు. ఆ సమయంలో, భారత్ నుంచి అమెరికాకు వెళ్లే శరణార్థుల సమస్యపై అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ కూడా తీవ్రమైన ప్రశ్నలు ఎదుర్కోవాల్సి వచ్చింది.
అప్పుడు ఇందిరా గాంధీ, ''పరిస్థితులు ఇప్పుడు చేయిదాటిపోయాయి. ప్రతి మతానికి చెందిన శరణార్థులూ తిరిగి రావాలి. కానీ, వారిని ఇప్పుడు మా జనాభాతో కలపలేం'' అన్నారు.
ఇప్పటికీ బీజేపీ నేతలు బంగ్లాదేశ్ చొరబాట్ల గురించి నిత్యం ప్రకటనలు చేస్తూనే ఉన్నారు.
వారిలో అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ కూడా ఉన్నారు.
''ఇద్దరు బంగ్లాదేశ్ చొరబాటుదారులను రెండు వేర్వేరు ప్రదేశాల్లో అస్సాం పోలీసులు పట్టుకుని తిరిగి బంగ్లాదేశ్‌కు పంపించారు'' అని ఆయన సెప్టెంబర్ 22న సోషల్ మీడియాలో రాశారు.
బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వలస వచ్చిన వారిని గుర్తించాలని ఆగస్టులో ఝార్ఖండ్ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనిని తీవ్ర ఆందోళనకర అంశంగా కోర్టు అభివర్ణించింది.
బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వలస వచ్చిన వారి సంఖ్య 2 కోట్ల వరకూ ఉంటుందని 2016లో మోదీ ప్రభుత్వం పార్లమెంట్‌కు తెలిపింది.
ప్రభుత్వ గణాంకాల ప్రకారం, 2004 నాటికి భారత్‌లో అక్రమంగా నివసిస్తున్న బంగ్లాదేశీయుల సంఖ్య 1 కోటి 20 లక్షలు.
2017లో భారత్ - బంగ్లాదేశ్ సరిహద్దులో 1175 మంది పట్టుబడగా, 2018లో 1118, 2019లో 1351 మంది పట్టుబడ్డారు.
గత మూడేళ్లలో బంగ్లాదేశ్ నుంచి పశ్చిమ బెంగాల్‌లోకి అత్యధిక సంఖ్యలో చొరబాట్లు జరిగాయని 2020 ప్రారంభంలో కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో చెప్పింది.
2014 మేలో, సీఏఏ కింద 300 మందికి భారత పౌరసత్వం లభించినట్లు కథనాలు వెలువడ్డాయి.
కేంద్రం లెక్కల ప్రకారం, 2015 - 2019 మధ్య దాదాపు 15 వేల మంది బంగ్లాదేశీయులకు భారత పౌరసత్వం లభించింది.
పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) కింద, 1988 నుంచి అస్సాంలో నివసిస్తున్న బంగ్లాదేశ్ హిందువుకు ఆగస్టులో భారత పౌరసత్వం లభించింది. సీఏఏ కింద ఈశాన్య భారతంలో పౌరసత్వం పొందిన మొదటి వ్యక్తి ఈయనే.
మేలో, దిల్లీలో జరిగిన కార్యక్రమంలో, 14 మందికి సీఏఏ కింద భారత పౌరసత్వ ధ్రువీకరణ పత్రాలను అందించారు.
సీఏఏలో భాగంగా, పొరుగుదేశాల్లో నివసిస్తున్న హిందూ, సిక్కు, పార్శీ, జైన్, బౌద్ధ మతాలకు చెందిన మైనారిటీలకు భారత పౌరసత్వం మంజూరు చేసే నిబంధన ఉంది.
అయితే, దిల్లీతో సహా భారత్‌లోని అనేక ప్రాంతాల్లో సీఏఏకి వ్యతిరేకంగా నిరసనలు జరిగాయి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














