1971 వార్: నాటి ఊచకోతకు పాకిస్తాన్ క్షమాపణ చెప్పాలన్న బంగ్లాదేశ్ ఇప్పుడు ఆ దేశానికే దగ్గరవుతోందా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఆర్చీ అతెంద్రిలా
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఒకసారి 1971 నాటి చరిత్రను గమనిస్తే, బంగ్లాదేశ్ - పాకిస్తాన్ మధ్య సంబంధాలు మొదటి నుంచీ సున్నితమైన అంశమే.
షేక్ హసీనా వాజిద్ పార్టీ అవామీ లీగ్ పాలనలో ఇరుదేశాల మధ్య సంబంధాలు మరింత క్షీణించాయి. మరీముఖ్యంగా యుద్ధనేరాల విచారణ విషయంలో దీని తీవ్రత ఎక్కువగా ఉంది.
అయితే, షేక్ హసీనా ప్రభుత్వ పతనం తర్వాత జరుగుతున్న అనేక ఇతర మార్పుల మాదిరిగానే, ఆ రెండు దేశాల మధ్య సంబంధాల్లో మార్పుల గురించి కూడా చర్చ జరుగుతోంది.
ఇటీవల, బంగ్లాదేశ్‌లో ఓ సంస్థ సెప్టెంబర్ 11న పాకిస్తాన్ వ్యవస్థాపకులు మొహమ్మద్ అలీ జిన్నా వర్ధంతిని కూడా నిర్వహించింది.
ఈ నేపథ్యంలో, పాకిస్తాన్ విషయంలో బంగ్లాదేశ్ దౌత్య విధానంలో ఏదైనా మార్పు వస్తుందా? దీనిపై పాకిస్తాన్ ఆసక్తిగా ఉందా? పాకిస్తాన్‌తో మెరుగైన సంబంధాల వల్ల బంగ్లాదేశ్‌కి ఒనగూరే ప్రయోజనాలేంటి?

బంగ్లాదేశ్ ప్రధాన సలహాదారుగా ప్రొఫెసర్ ముహమ్మద్ యూనస్ నియమితులైన తర్వాత ఇతర దేశాల మాదిరిగానే పాకిస్తాన్ కూడా శుభాకాంక్షలు తెలిపింది. బంగ్లాదేశ్‌లోని పాకిస్తాన్ రాయబార కార్యాలయం కూడా యాక్టివ్‌గా మారింది.
బంగ్లాదేశ్ ప్రస్తుత ప్రభుత్వ సలహాదారులతో పాకిస్తాన్ హైకమిషనర్ ఇటీవల సమావేశమయ్యారు.
అంతేకాకుండా, ఆయన ఖలీదా జియాకి చెందిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్‌పీ) నేతలను కూడా కలిశారు.

ఫొటో సోర్స్, RAHAT DAR/EPA-EFE/REX/Shutterstock
శుభాకాంక్షలు చెప్పిన షాబాజ్ షరీఫ్
బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాని ప్రొఫెసర్ ముహమ్మద్ యూనస్‌తో చర్చల సందర్భంగా ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించుకోవడంపై పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ ఆసక్తి వ్యక్తం చేశారు.
బంగ్లాదేశ్ విషయంలో పాకిస్తాన్ ఎప్పుడూ సానుకూల ధోరణితోనే ఉంటుందని పాక్ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ముంతాజ్ జహ్రా బలోచ్ వ్యాఖ్యానించారు.
''కొన్నిసార్లు సమస్యలు వస్తాయి. అయితే ఆ సమస్యలను పరిష్కరించుకుని, సంబంధాలను మెరుగుపరుచుకోవాలనే ఆకాంక్ష ఉన్నప్పుడు, ఇరువర్గాల ప్రయోజనాలను, అనుకున్న లక్ష్యాలను సాధించగలం'' అని ఆమె బీబీసీతో అన్నారు.
బంగ్లాదేశ్ గత 15 ఏళ్లుగా పాకిస్తాన్‌తో సంబంధాలను భారత్ కోణంలో చూసిందని, అలాగే ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు ఎప్పుడూ 1971 నాటి చరిత్ర చుట్టూ తిరుగుతుంటాయని బంగ్లాదేశ్‌కి చెందిన ప్రముఖ రచయిత ఫహామ్ అబ్దుల్ సలాం అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, Getty Images
పాకిస్తాన్ క్షమాపణ చెప్పాలన్న బంగ్లాదేశ్..
1971 నాటి ఊచకోతకు క్షమాపణ అంశం బంగ్లాదేశ్‌లో ఎప్పటికీ చర్చనీయమే. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఈ విషయంపై పలుమార్లు స్పందించినప్పటికీ, ప్రభుత్వ స్థాయిలో ఆ దిశగా ఇప్పటి వరకూ జరిగిందేమీ లేదు.
రెండు దేశాల్లోనూ 1971 నాటి ఘటనలపై విచారకరమైన పరిస్థితులు ఉన్నాయని ముంతాజ్ జహ్రా బలోజ్ అభిప్రాయపడ్డారు. అయితే, ఈ సమస్యకు ఇరుదేశాల అధినేతలు ముగింపు పలికారని, దీనికి సంబంధించి 1974లో ఒప్పందం కూడా జరిగిందని ఆమె పేర్కొన్నారు.
1971 నాటి యుద్ధం తర్వాత నాటి పాకిస్తాన్ అధ్యక్షుడు యాహ్యాఖాన్ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అనంతరం జుల్ఫికర్ అలీ భుట్టో అధికారంలోకి వచ్చినప్పటికీ బంగ్లాదేశ్, పాకిస్తాన్ మధ్య విభేదాలకు తెరపడలేదు.
అంతర్జాతీయ సమాజం చొరవతో, 1974లో పాకిస్తాన్, బంగ్లాదేశ్ నాయకులు ఒకరి దేశంలో మరొకరు పర్యటించారు.
1974 ఫిబ్రవరి 23న అప్పటి ప్రధాని జుల్ఫికర్ అలీ భుట్టో లాహోర్‌లో షేక్ ముజిబుర్ రెహ్మాన్‌కు స్వాగతం పలికారు. ఈ పర్యటన సందర్భంగా పాకిస్తాన్‌లో బంగ్లాదేశ్ జాతీయ గీతం వినిపించారు. దానికి ఒకరోజు ముందే పాకిస్తాన్ అధికారికంగా బంగ్లాదేశ్‌ను గుర్తించింది.
అదే ఏడాది జూన్‌లో జుల్ఫికర్ అలీ భుట్టో కూడా బంగ్లాదేశ్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ‘‘మీ నిర్ణయాన్ని పాక్ ప్రజలు గౌరవిస్తున్నారు. బంగ్లాదేశ్ సార్వభౌమాధికారాన్ని, స్వాతంత్య్రాన్ని పాకిస్తాన్ ప్రభుత్వం అంగీకరిస్తోంది’’ అని జుల్ఫికర్ అన్నారు.
1974 ఏప్రిల్‌లో బంగ్లాదేశ్, పాకిస్తాన్, భారత్ మధ్య త్రైపాక్షిక ఒప్పందం కూడా కుదిరింది. ఆ ఒప్పందం ప్రకారం, పాకిస్తాన్‌ను బంగ్లాదేశ్ ప్రజలు క్షమించాలని జుల్ఫికర్ అలీ భుట్టో అభ్యర్థించారు. గతాన్ని మరచి ముందుకు సాగాలని కోరారు.
గతాన్ని మరచి, కొత్త ప్రారంభం గురించి ఆలోచించాలని షేక్ ముజిబుర్ రెహ్మాన్ చేసిన వ్యాఖ్యలు 'న్యూయార్క్ టైమ్స్' ఆర్కైవ్ రిపోర్ట్‌లో కూడా ఉన్నాయి.

ఫొటో సోర్స్, Reuters
ఇరువురు నేతల ముందుచూపు రెండు దేశాలకూ అభివృద్ధి, పురోగతి మార్గాలను చూపిందని ముంతాజ్ జహ్రా బలోచ్ అన్నారు.
''ఇప్పటి పాకిస్తానీ తరం ఆ పాత ఘటనల తర్వాత పుట్టిన తరం. బంగ్లాదేశ్ ప్రజలను వారు ఎంతో గౌరవిస్తారు. కాబట్టి 50, 60 ఏళ్ల నాటి అంశాన్ని ఇప్పుడు మళ్లీ లేవనెత్తాల్సిన అవసరం లేదు'' అని ఆమె అన్నారు.
2002లో, ఢాకాను సందర్శించిన అప్పటి పాకిస్తాన్ మిలిటరీ ప్రెసిడెంట్ జనరల్ పర్వేజ్ ముషారఫ్ కూడా 1971 నాటి ఘటనలపై విచారం వ్యక్తం చేశారు. కానీ, అది అధికారిక క్షమాపణగా కనిపించలేదు.
అయితే, క్షమాపణ కోసం ఒత్తిడి చేయాల్సిన అవసరం లేదని, పాకిస్తాన్‌ను ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదని బంగ్లాదేశ్‌కు చెందిన ఆసిఫ్ మునీర్ అన్నారు. ఈయన 1971 యుద్ధంలో మరణించిన మేధావి మునీర్ చౌధరి కుమారుడు.
1971 నాటి ఘటనల గురించి పాక్ ప్రజల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయనడంలో ఎలాంటి సందేహం లేదని, అలాగని వారిలో విచారం లేదనుకోనక్కరలేదని ఆయన అన్నారు.
1970లలో పాకిస్తానీ కళాకారులు, రచయితలు కూడా బంగ్లాదేశ్ కోసం తమ గళం వినిపించేందుకు ప్రయత్నించారని ఆసిఫ్ మునీర్ అన్నారు.
1998లో పాకిస్తాన్ వెళ్లినప్పుడు తనకు ఎదురైన అనుభవాన్ని ఫహామ్ అబ్దుల్ సలాం చెప్పారు.
తాను బంగ్లాదేశ్ నుంచి వచ్చానని ట్యాక్సీ డ్రైవర్‌తో అన్నప్పుడు, ఆ డ్రైవర్ తనకు క్షమాపణ చెప్పారని ఆయన గుర్తు చేసుకున్నారు.
''అతను నా చెయ్యి పట్టుకుని 1971లో జరిగిన దానికి క్షమాపణ చెప్పారు. ఆ ఘటనతో నేను చలించిపోయాను'' అని సలాం అన్నారు.
బంగ్లాదేశ్ విషయంలో పాకిస్తానీయులందరికీ ఒకే అభిప్రాయమేమీ లేదని అబ్దుల్ సలాం కూడా ఒప్పుకున్నారు. అయితే పాకిస్తాన్‌లో అపరాధ భావన మాత్రం కచ్చితంగా ఉందని ఆయన విశ్వసిస్తున్నారు.
''1971లోనో, 1972లోనో, ఆ తర్వాతనో పుట్టిన వారెవరైనా దీనికి కారణమా? మీ తాత చేసిన నేరానికి మీరు బాధ్యులు అవుతారా?'' అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
సంబంధాలు మెరుగవడం వల్ల కలిగే ప్రయోజనాలేంటి?
పాకిస్తాన్ ట్రేడ్ డెవలప్‌మెంట్ అథారిటీ వెబ్‌సైట్ ప్రకారం, బంగ్లాదేశ్‌లోని తోలు పరిశ్రమ, టెక్స్‌టైల్, గార్మెంట్స్ రంగాల్లో పాకిస్తానీయులు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టారు.
పాకిస్తాన్ నుంచి పత్తి, వస్త్రాలు, రసాయనాలు, ఖనిజాలు, ఎలక్ట్రికల్ వస్తువులు, యంత్రాలను బంగ్లాదేశ్ దిగుమతి చేసుకుంటోంది. అలాగే, జూట్, జూట్ ఆధారిత ఉత్పత్తులు, హైడ్రోజన్ పెరాక్సైడ్, సింథటిక్ ఫైబర్, వస్త్రాలు, వైద్య పరికరాలను బంగ్లాదేశ్ నుంచి పాకిస్తాన్ దిగుమతి చేసుకుంటోంది.
పాకిస్తాన్ అధికారిక గణాంకాల ప్రకారం, 2023లో దాదాపు 60.33 కోట్ల డాలర్ల(సుమారు రూ.5000 కోట్లు ) కంటే ఎక్కువ విలువైన వస్తువులను పాకిస్తాన్‌కు బంగ్లాదేశ్ ఎగుమతి చేసింది. అలాగే, 65.50 కోట్ల డాలర్ల ( సుమారు రూ. 5400 కోట్లు) విలువైన వస్తువులను పాకిస్తాన్ నుంచి దిగుమతి చేసుకుంది.
2019లో, 83 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 700 కోట్లు ) కంటే ఎక్కువ విలువైన వస్తువులను పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ దిగుమతి చేసుకుంది.
ఈ గణాంకాల ప్రకారం, పాకిస్తాన్ నుంచి వచ్చే దిగుమతులపై బంగ్లాదేశ్ ఆధారపడినట్లు కనిపిస్తోంది. ఇది భారీ వాణిజ్య లోటు. అయినా ఇదేమీ పెద్ద సమస్య కాబోదని బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ సలహాదారు (బంగ్లాదేశ్ ఫారిన్ అడ్వైజర్) తౌహీద్ హుస్సేన్ అభిప్రాయపడ్డారు.
అమెరికా, యూరప్‌లకు భారీగా ఎగుమతులు చేస్తున్న భారత్, దిగుమతుల విషయంలో చైనా మీద ఎక్కువగా ఆధారపడుతోంది. ఆర్థిక, వాణిజ్య రంగాల్లో ఇవి చాలా సాధారణ విషయాలని వారు అర్థం చేసుకున్నారని ఆయన అన్నారు.
ఇరుదేశాల మధ్య సంబంధాలు మెరుగుపడితే కొత్త వాణిజ్య అవకాశాలు ఏర్పడతాయని ఫహామ్ అబ్దుల్ సలాం అభిప్రాయపడ్డారు.
బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ఆర్థిక, వాణిజ్య మంత్రిత్వ శాఖ సలహాదారు కూడా ఇటీవల వాణిజ్య సంబంధాల బలోపేతంపై మాట్లాడారు.
వాణిజ్య అంశాలకు పాకిస్తాన్ ప్రాధాన్యమిస్తోందని ముంతాజ్ జహ్రా బలోచ్ కూడా అన్నారు. వాణిజ్యం, వ్యవసాయం, శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఇరుదేశాల మధ్య ఇప్పటికే సంబంధాలు ఏర్పడ్డాయని ఆమె తెలిపారు.
అంతర్జాతీయ సంస్థలైన సార్క్, ఓఐసీ సభ్యదేశాలుగా రెండుదేశాలు సమష్టిగా కీలకపాత్ర పోషించగలవని కూడా ఆమె అభిప్రాయపడ్డారు.
ఆమే కాకుండా, నిపుణులు కూడా ఇరుదేశాల ప్రజలు మరింత చేరువ కావాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రయాణ సౌకర్యాలు
బంగ్లాదేశ్ నుంచి పాకిస్తాన్‌కు నేరుగా విమాన సర్వీసులు నడిపేందుకు ఆసక్తిగా ఉన్నామని సూచించేలా, బంగ్లాదేశ్ పౌరులకు వీసా ఫీజులను పాకిస్తాన్ మాఫీ చేసింది.
బంగ్లాదేశ్‌లోని విద్యాసంస్థల్లో చదువుకోవడం కోసం పాకిస్తానీ విద్యార్థులు బంగ్లాదేశ్ వెళ్తుంటారు. అలాగే, బంగ్లాదేశ్ ప్రజలకు ఇష్టమైన సందర్శనీయ స్థలాలు ఎన్నో పాకిస్తాన్‌లో ఉన్నాయి.
అయితే, బంగ్లాదేశ్ చుట్టూ మూడువైపులా భారత్ విస్తరించి ఉండడంతో వైద్యం, లేదా ఇతర అవసరాల కోసం తక్కువ ఖర్చులో అయిపోతుందని భారత్‌కు వస్తుంటారు.
కాకపోతే, ఒకసారి పాకిస్తాన్ వెళ్లొస్తే మళ్లీ భారత్‌కు వెళ్లడం కష్టమని భావించే ఏ బంగ్లాదేశ్ పౌరుడు కూడా పాకిస్తాన్ వెళ్లరని తౌహీద్ హుస్సేన్ చెప్పారు.
ఇప్పటికే పాకిస్తాన్, చైనాలతో భారత్ సంబంధాలు ఉద్రిక్తంగా ఉన్నాయి. అవామీ లీగ్ హయాంలో చైనాతో బంగ్లాదేశ్‌కు సత్సంబంధాలే ఉన్నాయి.
ఏదేమైనా, భారత్‌ను బంగ్లాదేశ్ పూర్తిగా విస్మరించలేదు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














