రష్యా: యుద్ధంలో 70 వేల మందికి పైగా మృతి, వారిలో అత్యధికులు వలంటీర్లే..

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఓల్గా ఇవ్షినా
- హోదా, బీబీసీ ప్రతినిధి
యుక్రెయిన్‌తో యుద్ధంలో రష్యా సైన్యం తరపున పోరాడుతున్న 70,000 మందికి పైగా ప్రజలు మరణించినట్టు బీబీసీ విశ్లేషణలో వెల్లడైంది. 2022లో రష్యా యుక్రెయిన్‌పై పూర్తి స్థాయి దాడులు ప్రారంభించింది.
ఈ వలంటీర్లు యుద్ధం ప్రారంభమైన తర్వాత సాయుధ దళాలలో చేరిన సాధారణ పౌరులు.
ప్రతిరోజూ, యుక్రెయిన్ యుద్ధరంగంలో మరణించిన వారి పేర్లు, వారి సంస్మరణ ప్రకటనలు, వారి అంత్యక్రియల ఫొటోలు రష్యా అంతటా మీడియాలో, సోషల్ మీడియాలో ప్రచురితమవుతున్నాయి.
బీబీసీ రష్యన్, స్వతంత్ర వెబ్‌సైట్ మీడియాజోనా, రెండూ కలిసి, వీరందరి పేర్లను అధికారిక నివేదికలు, ఇతర ఓపెన్ సోర్స్‌ల నుంచి సేకరించాయి.
ఈ సమాచారాన్ని అధికారులు లేదా మరణించిన వారి బంధువులు పంచుకున్నారు. వారు యుద్ధంలో మరణించారని మేం నిర్ధరించుకున్నాం.

యుక్రెయిన్‌లో మరణించిన 70,112 మంది రష్యన్ సైనికుల పేర్లను మేం గుర్తించాం. అయితే వాస్తవానికి ఈ సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుందని అంచనా. కొన్ని కుటుంబాలు, తమ వారు మరణించిన వివరాలను బయటికి చెప్పడం లేదు.
మా విశ్లేషణలో మేము తనిఖీ చేయలేకపోయిన పేర్లను లేదా తూర్పు యుక్రెయిన్‌లోని రష్యా-ఆక్రమిత డోనెట్స్క్, లూహాన్స్‌క్‌లలోని సైనిక మరణాలను ఈ జాబితాలో చేర్చలేదు.
మరణించిన వారిలో 13,781 మంది వలంటీర్లు, అంటే దాదాపు 20%. ఈ వలంటీర్ల మరణాలు ఇప్పుడు ఇతర వర్గాలను మించిపోయాయి. గతంలో, తమ నేరాలకు క్షమాభిక్ష కోరుతూ సైన్యంలో చేరిన మాజీ ఖైదీలు మరణించినవారిలో ఎక్కువగా ఉండేవారు, కానీ ఇప్పుడు ధృవీకరించిన మరణాలలో వారు 19% ఉన్నారు. సమీకరించిన సైనికులు - పోరాటానికి ఇచ్చిన పిలుపును అందుకుని సైన్యంలో చేరిన పౌరులు - 13% మంది ఉన్నారు.
గత సంవత్సరం అక్టోబరు నుంచి, ప్రతి వారమూ మరణిస్తున్న వలంటీర్ల సంఖ్య 100 కంటే తగ్గలేదు - కొన్ని వారాలలో ఆ సంఖ్య 310 కంటే ఎక్కువగా నమోదైంది.

వేతనాల కోసమే...
యుక్రెయిన్ విషయానికొస్తే - యుద్ధభూమిలో మరణాలపై ఆ దేశం చాలా అరుదుగా వ్యాఖ్యానిస్తుంది. 31,000 మంది యుక్రెయిన్ సైనికులు మరణించారని ఫిబ్రవరిలో ఆ దేశాధ్యక్షుడు జెలియెన్‌స్కీ తెలిపారు. అయితే అమెరికా నిఘా వర్గాల అంచనా ప్రకారం ఆ సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉంది.
మరణించిన వలంటీర్లలో రినాట్ ఖుస్నియారోవ్ గాథ చాలా విలక్షణమైనది. ఆయన బాష్‌కోర్టోస్తాన్‌లోని ఉఫాకు చెందినవారు. ఆయన ట్రామ్ డిపోలో, అదే సమయంలో ఒక ప్లైవుడ్ ఫ్యాక్టరీలో రెండు ఉద్యోగాలు చేస్తూ జీవనం సాగించేవారు. గతేడాది నవంబర్‌లో రష్యా సైన్యంతో ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు ఆయన వయసు 62 ఏళ్లు.
ఆయన యుద్ధానికి వెళ్లిన మూడు నెలలలోనే, ఫిబ్రవరి 27న మరణించారు. ఆయన సంస్మరణార్థం, స్థానిక ఆన్‌లైన్ మెమోరియల్ వెబ్‌సైట్‌లో, "కష్టపడి పనిచేసే మంచి వ్యక్తి" అంటూ ఆయన మరణవార్తను ప్రకటించారు.
బీబీసీ విశ్లేషించిన డేటా ప్రకారం, చాలా మంది పురుషులు రష్యాలోని చిన్న పట్టణాల నుంచి వచ్చారు. అక్కడ స్థిరమైన, ఎక్కువ జీతం చెల్లించే పనులు దొరకడం కష్టం.
రిపబ్లిక్ ఆఫ్ చెచెన్యాలోని కొందరు వ్యక్తులు మానవ హక్కుల కార్యకర్తలు, న్యాయవాదులకు, తమను బలవంతంగా, బెదిరించి సైన్యంలో చేర్చుకున్నారని చెప్పినా, చాలా మంది ఇష్టపూర్వకంగా చేరినట్లు కనిపిస్తోంది.
కొంతమంది వలంటీర్లు తాము సంతకం చేసిన ఒప్పందాలపై అది ముగిసే గడువు లేదని చెప్పారు. అందువల్ల వారు తమ సర్వీస్‌ను ముగించడంలో సహాయం కోసం, రష్యా అనుకూల జర్నలిస్టులను సంప్రదించి దానిలో విఫలమయ్యారు.
మిలిటరీలో జీతాలు దేశంలోని తక్కువ సంపన్న ప్రాంతాలలో సగటు వేతనాల కంటే ఐదు నుంచి ఏడు రెట్లు ఎక్కువగా ఉంటాయి. సైనికులు ఉచిత పిల్లల సంరక్షణ, పన్ను మినహాయింపులతో సహా ఇతర సామాజిక ప్రయోజనాలను పొందుతారు. రష్యాలోని అనేక ప్రాంతాల్లో ఒప్పందంపై సంతకం చేసే వ్యక్తులకు ఇచ్చే ఏకమొత్తం చెల్లింపులు కూడా చాలా పెరిగాయి.

ఫొటో సోర్స్, Getty Images
రష్యా ‘‘మీట్ గ్రైండర్’’ వ్యూహం
యుద్ధంలో చనిపోతున్న వలంటీర్లలో ఎక్కువ మంది 42-50 ఏళ్ల మధ్య వయసు వారు. 13,000 కంటే ఎక్కువ మంది వలంటీర్ల జాబితాలో, ఈ వయసు వారి సంఖ్య 4,100. మరణించిన అతిపెద్ద వలంటీర్ వయసు 71 సంవత్సరాలు, 60 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్న 250 మంది వలంటీర్లు యుద్ధంలో మరణించారు.
వలంటీర్లలో పెరుగుతున్న ప్రాణనష్టం కొంతవరకు అత్యంత కఠినమైన ప్రాంతాలలో, ముఖ్యంగా తూర్పున ఉన్న డొనెట్స్క్ ప్రాంతంలో ఉన్నట్లు సైనికులు బీబీసీకి తెలిపారు.
మేము మాట్లాడిన రష్యన్ సైనికులు వెల్లడించిన వివరాల ప్రకారం, రష్యా "మీట్ గ్రైండర్" వ్యూహం నిరాటంకంగా కొనసాగుతోంది. యుక్రెయిన్ దళాలను నిర్వీర్యం చేయడానికి, రష్యన్ ఫిరంగిదళాలు వారి స్థానాలపై దాడి చేసేందుకు వీలుగా, మాస్కో సైనికులను కనికరం లేకుండా ముందుకు పంపే విధానాన్ని ‘మీట్ గ్రైండర్’ అంటారు.
దీని వల్ల కొన్నిసార్లు, ఒకేరోజు కొన్ని వందల మంది మరణించారు. ఇటీవల రష్యా సైన్యం తూర్పు యుక్రెయిన్ పట్టణాలైన చాసివ్ యార్, పోక్రోవ్స్క్‌లను అలాంటి వ్యూహంతో స్వాధీనం చేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించి, విఫలమైంది.
రష్యన్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రాథమిక సైనిక వైద్య డైరెక్టరేట్ అధికారిక అధ్యయనం ప్రకారం, సైనికుల మరణాలలో 39% అవయవాలకు గాయాలు కావడం వల్ల సంభవించాయి. ప్రథమ చికిత్స, తదుపరి వైద్య సంరక్షణ మెరుగ్గా ఉంటే మరణాల రేటు గణనీయంగా తగ్గేదని వెల్లడైంది.
రష్యా ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇస్తామంటూ వలంటీర్ల కోసం పెద్ద ఎత్తున ప్రచారం చేపడుతోంది.
2022 నుంచి, శిక్ష పడిన ఖైదీలను సైన్యంలో చేరమని, బదులుగా వారిని విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఇప్పుడు కొత్త విధానం ప్రకారం, క్రిమినల్ ప్రాసిక్యూషన్‌ను ఎదుర్కొంటున్న వ్యక్తులు కూడా కోర్టులో విచారణను ఎదుర్కొనే బదులు యుద్ధానికి వెళతామని ఒప్పందం చేసుకోవచ్చు. దీనికి బదులుగా వారి కేసులను ఫ్రీజ్ చేస్తారు, తర్వాత నేరారోపణలను పూర్తిగా వెనక్కి తీసుకుంటారు.
మరణించిన వలంటీర్లలో ఇతర దేశాలకు చెందిన వారు తక్కువ సంఖ్యలో ఉన్నారు. బీబీసీ అలాంటి 272 మంది వ్యక్తుల పేర్లను గుర్తించింది. వీరిలో చాలామంది మధ్య ఆసియా నుంచి - 47 మంది ఉజ్బెకిస్తాన్, 51 మంది తజికిస్తాన్, 26 మంది కిర్గిజ్‌స్తాన్‌కు చెందిన వారున్నారు.
గత ఏడాది రష్యా - క్యూబా, ఇరాక్, యెమెన్, సెర్బియా పౌరులను రిక్రూట్ చేసుకున్నట్లు నివేదికలు వెల్లడించాయి. చెల్లుబాటు అయ్యే వర్క్ పర్మిట్లు లేదా వీసాలు లేకుండా రష్యాలో నివసిస్తున్న విదేశీయులు, ‘ప్రభుత్వం కోసం పని’ చేయడానికి అంగీకరిస్తున్నారు. దీని వల్ల ప్రభుత్వం వారిని బహిష్కరించబోమని వాగ్దానం చేస్తుంది, వారు యుద్ధం నుంచి ప్రాణాలతో బయటపడితే వారికి సరళీకృత మార్గంలో పౌరసత్వాన్ని ఇస్తారు.
భారత్, నేపాల్ ప్రభుత్వాలు తమ పౌరులను యుక్రెయిన్‌కు పంపడాన్ని నిలిపివేయాలని, చనిపోయినవారి మృతదేహాలను స్వదేశానికి తీసుకురావాలని రష్యాను కోరాయి. అయితే ఇప్పటివరకు దానిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

ఫొటో సోర్స్, Getty Images
శిక్షణపై విమర్శలు
మిలిటరీలో చేరిన చాలా మంది కొత్తవారు తాము పొందిన శిక్షణను విమర్శించారు. గత ఏడాది నవంబర్‌లో రష్యా సైన్యంతో ఒప్పందం కుదుర్చుకున్న వ్యక్తి బీబీసీతో మాట్లాడుతూ, యుద్ధంలోకి పంపే ముందు తనకు షూటింగ్ రేంజ్‌లో రెండు వారాల శిక్షణ ఇస్తామని వాగ్దానం చేశారని తెలిపారు.
"కానీ నిజానికి మమ్మల్ని అందరినీ పెరేడ్ గ్రౌండ్‌లోకి విసిరేసి, ఏవో కొన్ని రక్షణ పరికరాలు ఇచ్చారు," అని చెప్పారు. అయితే అవి నాసిరకానివి అని ఆయన అన్నారు.
“ఆ తర్వాత మమ్మల్ని రైళ్లు, ట్రక్కులలో ఎక్కించి, యుద్ధానికి పంపించారు. మాలో కొంతమంది రిక్రూట్‌మెంట్ కార్యాలయం నుంచి కేవలం వారంలోనే యుద్ధరంగానికి వెళ్లారు,” అని ఆయన చెప్పారు.
యూకేలోని రాయల్ యునైటెడ్ సర్వీసెస్ ఇన్‌స్టిట్యూట్‌లో విశ్లేషకుడు శామ్యూల్ క్రానీ-ఇవాన్స్, ‘కేమఫ్లాజ్, కనిపించకుండా దాచుకోవడం లేదా రాత్రిపూట నిశ్శబ్దంగా ఎలా కదలాలి, ఇలాంటి విషయాలపై ప్రాథమిక అవగాహన ఉండాలి, వాటిని ప్రాథమిక పదాతిదళ నైపుణ్యాలుగా బోధించాలి’ అని అన్నారు.
మరొక సైనికుడు బీబీసీతో మాట్లాడుతూ, తమకు చాలా నాసిరకం పరికరాలను ఇచ్చారని తెలిపారు. సరిపోని యూనిఫామ్‌లు, ఒక రోజులో అరిగిపోయే బూట్లు, 20వ శతాబ్దం మధ్యలో తయారు చేసిన కిట్ బ్యాగ్ ఇచ్చారని ఆయన చెప్పారు.
“వారు ఏదో ఒక బుల్లెట్ ప్రూఫ్ వెస్ట్, చౌక రకం హెల్మెట్ ఇస్తారు, వాటితో యుద్ధం చేయడం అసాధ్యం. మీరు బతకాలనుకుంటే, మీరు మీ సొంత పరికరాలను కొనుక్కోవాలి,’’ అని ఆయన అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














