మోదీని పొగుడుతూనే భారత్‌ను విమర్శించిన డోనల్డ్ ట్రంప్.. అసలేమన్నారు?

మోదీతో డోనల్డ్ ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, డోనల్డ్ ట్రంప్‌తో ప్రధాని మోదీ (2020 ఫిబ్రవరి నాటి ఫొటో)

ప్రధాని నరేంద్ర మోదీ మూడు రోజుల పర్యటనలో భాగంగా అమెరికా వెళ్లారు. అధ్యక్షుడు జో బైడెన్ తన పదవీ కాలం ముగుస్తున్న సందర్భంగా, క్వాడ్ దేశాల నేతలను అమెరికాకు ఆహ్వానించారు.

క్వాడ్ గ్రూప్‌లో అమెరికా, ఆస్ట్రేలియా, భారత్, జపాన్ దేశాలున్నాయి.

శనివారం (సెప్టెంబర్ 21)న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నిర్వహిస్తోన్న క్వాడ్ లీడర్స్ సమ్మిట్‌లో మోదీ పాల్గొంటారు.

బైడెన్ తన స్వస్థలమైన డెలావర్‌లోని విల్మింగ్‌టన్‌లో ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఇది ఆరో క్వాడ్ సమావేశం.

వచ్చే ఏడాది క్వాడ్ సమావేశానికి భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది.

అమెరికా పర్యటనలో ఉన్న మోదీ అక్కడి ప్రవాస భారతీయులను, అమెరికా వ్యాపారవేత్తలను కలవనున్నారు.

న్యూయార్క్‌లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో జరిగే ‘సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్’ను ఉద్దేశించి కూడా సెప్టెంబర్ 23న మోదీ ప్రసంగించనున్నారు.

నరేంద్ర మోదీని కలవనున్నట్లు అమెరికా మాజీ అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ చెప్పారు.

‘‘మోదీ, అమెరికా వస్తున్నారు. నేను ఆయన్ను కలుస్తాను. ఆయనొక అద్భుతమైన వ్యక్తి’’ అని సెప్టెంబర్ 17న మిషిగాన్‌లోని ఫ్లింట్ టౌన్‌ హాల్ సందర్భంగా ట్రంప్ అన్నారు. రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిగా డోనల్డ్ ట్రంప్ పోటీ చేస్తున్నారు.

అయితే, ప్రధాని మోదీతో జరిగే సమావేశం గురించి ట్రంప్ ఎలక్షన్ క్యాంపెయిన్ ఇంకా సమాచారం ఇవ్వలేదు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

మోదీపై ప్రశంసలు, భారత్‌పై విమర్శలు

ఇటీవల టౌన్ హాల్‌ సందర్భంగా తన మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగించిన ట్రంప్, ‘‘మోదీ ఒక అద్భుతమైన వ్యక్తి. అద్భుతంగా పనిచేసే ఇతర నేతలు కూడా చాలామంది ఉన్నారు. వారు ఏ విషయంలోనూ తగ్గట్లేదు. తమ ఆటలో ముందుకు సాగుతూ, మాకు వ్యతిరేకంగా తమ విధానాలను ఉపయోగిస్తున్నారు. కానీ, భారత్‌, బ్రెజిల్‌‌లతో చాలా కష్టం. మీ అందరికీ నేనిది చెప్పదలుచుకున్నాను’’ అని వ్యాఖ్యానించారు.

ప్రధాని మోదీని పొగుడుతూనే, భారత విధానాలను ట్రంప్ విమర్శించారు.

అమెరికా నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై భారత్‌లో భారీగా పన్నులు విధిస్తున్నారని ట్రంప్ అన్నారు. అలాగే, అమెరికాకు ఎగుమతి చేసే వస్తువులపై ఎవరూ పన్నులు కట్టడాన్ని కోరుకోవట్లేదని వ్యాఖ్యానించారు.

ఈ వ్యవహారంలో భారత్ విధానాలు సరిగా లేవని ట్రంప్ విమర్శించారు.

‘‘ట్రంప్ ఇంకా హార్లీ డేవిడ్‌సన్ దగ్గరే ఆగిపోయినట్లున్నారు. తమకు అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే అమెరికా స్వేచ్ఛా వాణిజ్యం గురించి మాట్లాడుతుంది. డాలర్‌తో ప్రపంచ ఆర్థిక వ్యవస్థను నియంత్రిస్తున్న, ప్రపంచంలో అతిపెద్ద ఎకానమీ అయిన అమెరికా, భారత్‌ నుంచి సమానత్వాన్ని ఎలా ఆశిస్తోంది? అమెరికాకు సమస్య చైనా, భారత్ కాదు’’ అని ట్రంప్ వ్యాఖ్యలపై భారత మాజీ విదేశాంగ కార్యదర్శి కన్వల్ సిబాల్ స్పందించారు.

డోనల్డ్ ట్రంప్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, అమెరికా మాజీ అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్

భారత్ పట్ల ట్రంప్ ద్వంద్వ వైఖరి

డోనల్డ్ ట్రంప్ గతంలో కూడా భారత్ గురించి మాట్లాడారు. ఆయన కొన్నిసార్లు మోదీని ప్రశంసిస్తారు, కొన్నిసార్లు భారత్‌ను విమర్శిస్తారు.

2016లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరిగే సమయంలో, న్యూజెర్సీ ప్రచార ర్యాలీలో మాట్లాడిన ట్రంప్, ‘‘నేను హిందువులకు పెద్ద అభిమానిని. భారత్‌కూ అతిపెద్ద అభిమానిని’’ అంటూ చెప్పుకొచ్చారు.

భారత్ చాలా బాగా పనిచేస్తోందని, ఎవరూ దీని గురించి మాట్లాడరని అమెరికన్ న్యూస్ చానల్ సీఎన్ఎన్‌తో అన్నారు ట్రంప్.

2019 ఆగస్టులో ట్రంప్, మోదీ ఫ్రాన్స్ వేదికగా సమావేశమయ్యారు. ఆ సమయంలో మీడియా ముందు మోదీ హిందీలో మాట్లాడారు. ‘‘ ముందు మా ఇద్దరినీ మాట్లాడుకోనివ్వండి. ఒకవేళ అవసరమనుకుంటే, ఆ సమాచారాన్ని మీకు తెలియజేస్తాం’’ అని అన్నారు.

దానికి స్పందించిన ట్రంప్, ‘‘మోదీ చాలా బాగా ఇంగ్లీష్‌ మాట్లాడగలరు. కానీ, ఆయనకు ఇంగ్లీష్‌లో మాట్లాడటం ఇష్టం లేదు అంతే’’ అని చెప్పారు.

డోనల్డ్ ట్రంప్ 2020 ఫిబ్రవరిలో భారత్‌కు వచ్చినప్పుడు, అహ్మదాబాద్‌ స్టేడియంలో ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ట్రంప్, మోదీ ఇద్దరూ కలిసి అహ్మదాబాద్‌లో పెద్ద రోడ్ షో చేపట్టారు.

మోదీ అమెరికాకు వెళ్లినప్పుడు, ‘హౌడీ మోదీ’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ కార్యక్రమంలో ట్రంప్ పాల్గొన్నారు.

 అమెరికా మాజీ అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, అమెరికా మాజీ అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్

భారత్‌ను ట్రంప్ టార్గెట్ చేసినప్పుడు..

2016 నుంచి 2020 మధ్య కాలంలో ట్రంప్ చాలాసార్లు భారత్‌ను లక్ష్యంగా చేసుకున్నారు.

ఇటీవల ఎన్నికల ర్యాలీలో మాట్లాడినప్పుడు కూడా, ‘‘ చైనాలో ఏదైనా తయారు చేయాలనుకుంటే, ఇక్కడే వాటిని తయారుచేసి, అక్కడకు పంపమని వారు కోరతారు. తర్వాత వాటిపై 250 శాతం దిగుమతి సుంకం విధిస్తారు. మేం దీన్ని చేయాలనుకోం. తర్వాతే మా దేశం వచ్చి ప్లాంట్ పెట్టమని వారే ఆహ్వానిస్తారు. అప్పుడు ఇక్కడి కంపెనీలు అక్కడికి వెళ్లిపోతాయి’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు.

దీని తరువాత ట్రంప్ భారత్ గురించి ప్రస్తావించారు.

‘‘హార్లీ డేవిడ్‌సన్‌ విషయంలో భారత్ కూడా ఇలాగే చేసింది. హార్లీ డేవిడ్‌సన్ తన బైకులను అక్కడ అమ్ముకోలేదు. ఎందుకంటే వాటిపై భారత్ 200 శాతం దిగుమతి సుంకం విధించింది’’ అని చెప్పారు.

హార్లీ డేవిడ్‌సన్ ప్రపంచంలోనే చాలా పేరున్న టూ వీలర్ కంపెనీ.

ఈ కంపెనీ బైకుల ధరలన్నీ లక్షల రూపాయల్లోనే ఉంటాయి. సూపర్‌బైక్‌గా పేరున్న ఇది బాగా డబ్బున్నవారి దగ్గరే ఎక్కువగా కనిపిస్తుంది.

‘‘భారతదేశంలో మీ కంపెనీ వ్యాపారం ఎలా సాగుతోందని నేను హార్లీ డేవిడ్‌సన్‌ హెడ్‌ను అడిగాను. అంత బాగాలేదని సమాధానం వచ్చింది. మనమెందుకు 200 శాతం దిగుమతి సుంకం చెల్లించాలి. మనం బైకులు అమ్ముతాం. వాళ్లు మనపై భారీగా సుంకాలు విధిస్తారు.’’ అని ట్రంప్ అన్నారు.

‘‘200 శాతం పన్నులు ఉంటే మీరు బైకులు అమ్మలేరు అని నేను వారికి చెప్పాను. కానీ, తమ దేశంలో ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని హార్లీ డేవిడ్‌సన్‌ను భారత్ ఆహ్వానించింది. ఆ కంపెనీ కూడా అక్కడకు వెళ్లింది. ఇప్పుడేమో వారు ఇలా వ్యవహరిస్తున్నారు. నేను దీనికి భారత్‌దే బాధ్యత అనను. ఇలా జరిగేందుకు అవకాశమిచ్చినందుకు నేనే బాధ్యత తీసుకుంటాను. ఇకపై ఇలా జరగనివ్వను’’ అని అన్నారు ట్రంప్.

ట్రంప్ అంతకుముందు ప్రకటనలను తీసుకుంటే, సుంకాల విషయంలో మరో రకంగా కూడా స్పందించారు.

ట్రంప్, మోదీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 2020 ఫిబ్రవరిలో అహ్మదాబాద్‌ స్టేడియంలో ప్రధాని మోదీ, ట్రంప్

మోదీని స్నేహితునిగా ట్రంప్ ఎప్పుడు చెప్పారు?

డోనల్డ్ ట్రంప్ 2019లో మాట్లాడినప్పుడు, ‘‘మనమేమీ తెలివి తక్కువవాళ్లం కాదు. భారత్ వంక చూడండి. నరేంద్ర మోదీ నాకు మంచి స్నేహితుడు. ఆయనేం చేశారో చూడండి. మోటారు సైకిళ్లపై ఆయన 100 శాతం పన్ను విధించారు. కానీ మనం వారిపై ఎటువంటి పన్నులు వేయం. నేను ఫోన్ చేయగానే మోదీ ఆ పన్నును 50 శాతానికి తగ్గించారు. కానీ అది కూడా ఆమోదనీయం కాదు. భారత్ ఇంకా దాని గురించి ఆలోచిస్తోంది’’ అని చెప్పారు.

కాలుష్యం విషయంలో భారత్‌ను టార్గెట్‌గా చేసి 2019 నవంబర్‌లో మరోసారి ట్రంప్ విమర్శించారు.

భారత్‌లో చాలా ప్రాంతాల్లో గాలి నాణ్యత సూచీ ప్రమాదకర స్థాయిలకు పడిపోయిందని చెప్పారు.

‘‘భారత్, చైనా, రష్యాల నుంచి వ్యర్థాలు లాస్‌ ఏంజిల్స్‌ వరకు పారుతున్నాయి. ఇక్కడ ఇది సమస్యగా మారుతుంది. వారితో పోలిస్తే మనది చాలా చిన్న దేశం. ఇతర దేశాలతో పోలిస్తే చైనా, రష్యా, భారత్‌ వంటి దేశాలు వ్యర్థాలను శుభ్రపరిచేందుకు, పొగను ఆపేందుకు ఏమీ చేయడం లేదు. సముద్రంలో ఆ వ్యర్థాలను కలుపుతున్నారు. అవి అక్కడ నుంచి లాస్ ఏంజిల్స్‌కు చేరుకుంటున్నాయి’’ అని అన్నారు.

పాకిస్తాన్ ఉగ్రవాదానికి మద్దతు ఇస్తోందని ట్రంప్ అధ్యక్షుడు అయిన తర్వాత అన్నారు.

గల్వాన్ లోయలో హింసాత్మక ఘర్షణ తర్వాత, మధ్యవర్తిత్వంపై ట్రంప్ మాట్లాడారు. కానీ, భారత్ ఆ మధ్యవర్తిత్వాన్ని తిరస్కరించింది. ఈ విషయంలో చైనాకు ట్రంప్ మద్దతు ఇచ్చారు.

అధ్యక్షుడిగా తన పదవీ కాలం ముగియడానికి ముందు వరకు, హెచ్1బీ వీసా సిస్టమ్‌లో డోనల్డ్ ట్రంప్ చాలా మార్పులు తీసుకొచ్చారు.

ట్రంప్ ఈ నిర్ణయం వల్ల చాలా మంది భారతీయులు ప్రభావితం అయ్యారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)