అమెరికా ఎన్నికలు 2024: కమలా హారిస్‌తో మరో చర్చలో పాల్గొననని ట్రంప్ ఎందుకన్నారు?

కమలా హారిస్, ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కమలా హారిస్‌తో మరోసారి చర్చలో పాల్గొననని ట్రంప్ చెప్పారు

‘‘కమలా హారిస్‌తో మరోసారి చర్చలో పాల్గొనను’’ అని డోనల్డ్‌ ట్రంప్ చెప్పారు. నవంబర్‌లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరిగేలోపు మరోసారి ఆమెతో చర్చలో పాల్గొననని ఆయన స్పష్టం చేశారు.

ఫిలడెల్ఫియాలో కమలా హారిస్‌తో జరిగిన చర్చలో తాను గెలిచానని, అందుకే ఆమె ‘రీ మ్యాచ్’ కోరుకుంటున్నారని ట్రంప్ వ్యాఖ్యానించారు.

అయితే, మంగళవారం నాటి చర్చ తరువాత చాలా సర్వేలు జరిగాయి. ఆ చర్చలో కమలా హారిస్ పైచేయి సాధించారని ఎక్కువ మంది ఓటర్లు అభిప్రాయపడ్డారు.

మరోసారి చర్చలో పాల్గొననని ట్రంప్ చెప్పడంపై కమలా హారిస్ స్పందించారు. మరోసారి చర్చ జరగాల్సిందేనని ఆమె అన్నారు. ఓటర్లకు పూర్తి అవగాహన కల్పించడానికి, వారు మెరుగైన నిర్ణయం తీసుకోవడానికి మరో చర్చ కీలకమని ఆమె అన్నారు.

ఎన్నికలకు మరో రెండు నెలలే ఉంది. ప్రస్తుతానికి కమలా హారిస్, డోనల్డ్ ట్రంప్ పోటాపోటీగా ఉన్నారని సర్వేలు చెబుతున్నాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ట్రంప్, కమలా హారిస్

ఫొటో సోర్స్, Getty Images

‘కమలకు అనుకూలంగా వ్యవహరించారు’

ఏబీసీ న్యూస్‌లో మంగళవారం జరిగిన 90 నిమిషాల డిబేట్ తరువాత అభ్యర్థులిద్దరూ తమదే పైచేయి అని ప్రకటించుకున్నారు. చర్చలో ట్రంప్‌పై కమలా హారిస్ వ్యక్తిగతంగా మాటల యుద్ధానికి దిగి ఆయనను డిఫెన్స్‌లోకి నెట్టేశారు. వీటిల్లో 2021 జనవరి 6న క్యాపిటల్ భవనం వద్ద జరిగిన అల్లర్ల సమయంలో ఆయన ర్యాలీకి వచ్చిన జనాల సంఖ్య, అప్పట్లో ఆయన వ్యవహారశైలి గురించి చేసిన వ్యాఖ్యలు ఉన్నాయి.

అయితే, చర్చను నిర్వహించిన ఏబీసీ జర్నలిస్టులు ఇద్దరూ కమలా హారిస్‌కు అనుకూలంగా వ్యవహరించారని ట్రంప్, ఆయన మద్దతుదారులు ఆరోపిస్తున్నారు.

‘‘బాక్సింగ్‌లో ఓడిపోయిన వ్యక్తి నోటి నుంచి వచ్చే మొదటి మాట ‘మళ్ళీ మ్యాచ్ నిర్వహించాలి’,’’ అని అంటూ ట్రంప్ ‘ట్రూత్ సోషల్‌’లో గురువారం రాసుకొచ్చారు.

‘‘చర్చలో కమలా హారిస్‌పై నేను గెలిచినట్టు పోల్స్ స్పష్టంగా చూపుతున్నాయి. కానీ ఆమె వెంటనే మరోసారి చర్చ జరగాలని అంటున్నారు’’ అని ఆయన రాశారు.

ఆరిజోనాలో గురువారం ట్రంప్ ఓ ర్యాలీలో పాల్గొన్న అనంతరం, మీడియా సంస్థ టెలీముండో ఆరిజోనాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా కమలా హారిస్‌తో మరోసారి చర్చ విషయాన్ని ప్రస్తావిస్తూ ‘‘అది అంత ముఖ్యమైన విషయం కాదని భావిస్తున్నాం’’ అని చెప్పారు. ‘‘ఆ చర్చలో అన్ని విషయాలూ మాట్లాడాం. మరోసారి చర్చను వారు ఎందుకు కోరుకుంటున్నారో తెలియదు’’ అన్నారు.

అయితే, కమలా హారిస్ శిబిరం మాత్రం రెండోసారి చర్చకు పిలుపునిస్తోంది. ‘‘కమలా హారిస్ రెండోసారి చర్చకు సిద్ధం, అందుకు డోనల్డ్ ట్రంప్ సిద్ధమా?’’ అని ప్రశ్నిస్తున్నారు.

మంగళవారం నాటి చర్చ అనంతరం ఫ్లోరిడా రిపబ్లికన్ ప్రతినిధి మాట్ గెట్జ్‌తో సహా పలువురు ట్రంప్ ప్రచారకర్తలు మాట్లాడుతూ ట్రంప్ మరో చర్చను స్వాగతిస్తారని తాము విశ్వసిస్తున్నట్టు చెప్పారు.

కానీ, మరుసటి రోజు ఉదయం ఫాక్స్ న్యూస్‌లో ట్రంప్ మాట్లాడుతూ, ఈ డిబేట్ రిగ్గింగ్‌కు గురైందని, మరోసారి చర్చకు అంత సుముఖంగా లేనని చెప్పారు.

‘‘మరో చర్చలో పాల్గొనను’’ అని ట్రంప్ గురువారం చేసిన ప్రకటన గతంలో ఆయన ఇచ్చిన ప్రకటనలకు విరుద్ధంగా ఉంది. బుధవారం ట్రంప్ సీనియర్ సలహాదారు జాసన్ మిల్లర్ సీఎన్ఎన్‌తో మాట్లాడుతూ ‘‘ట్రంప్ మూడు డిబేట్లలో పాల్గొననున్నట్టు చెప్పారు’’ అని తెలిపారు.

సెప్టెంబర్ 25న ఎన్‌బీసీ న్యూస్‌ చర్చలో పాల్గొనడంపై ఇరువర్గాలు చర్చిస్తున్నాయని వార్తలు వస్తున్నాయి. కానీ ట్రంప్ తాజా ప్రకటనపై ఎన్‌బీసీ న్యూస్ నెట్‌వర్క్ స్పందించలేదు.

కమలా హారిస్

ఫొటో సోర్స్, @KamalaHarris

‘కమలా హారిస్‌కే మేలు’

ట్రంప్ తాజా ప్రకటన కమలా హారిస్ ప్రచారానికి రెండు విధాలా మేలు చేస్తుందని ప్రోగ్రెసివ్ చేంజ్ క్యాంపైన్ కమిటీ సహ వ్యవస్థాపకుడు ఆడమ్ గ్రీన్ అన్నారు.

ట్రంప్ నిర్ణయంతో తాను ఆశ్చర్యపోలేదని యూటాకు చెందిన స్వతంత్ర ఓటరు జెరెమీ పీటర్సన్ బీబీసీకి చెప్పారు. ఫిలడెల్ఫియా డిబేట్ తర్వాత కమలా హారిస్‌కు మద్దతివ్వాలని నిర్ణయించుకున్నానని పీటర్సన్ తెలిపారు.

1960లో రిచర్డ్ నిక్సన్‌తో జాన్ ఎఫ్ కెనడీ తలపడినప్పటి నుంచి టెలివిజన్ డిబేట్లు ప్రారంభమయ్యాయి. సాధారణంగా అధ్యక్ష అభ్యర్థుల మధ్య రెండు లేదా మూడు డిబేట్లు జరుగుతాయి. అలాగే ఉపాధ్యక్ష అభ్యర్థుల మధ్య కనీసం ఒక డిబేట్ జరుగుతుంది.

జులైలో జరిగిన డిబేట్‌లో జో బైడెన్ పేలవ ప్రదర్శన తరువాత ఆయన ఎన్నికల నుంచి వైదొలిగారు.

ఆ తర్వాత కమలా హారిస్, ట్రంప్ మధ్య డిబేట్లు కొనసాగుతాయా, ఏ పరిస్థితుల్లో ముందుకు సాగుతాయనే దానిపై వారాల తరబడి చర్చ సాగింది.

ఫాక్స్ న్యూస్, ఎన్‌బీసీ న్యూస్‌లలో అదనపు డిబేట్లకు గతంలో ట్రంప్ సూచించినప్పటికీ కమలా హారిస్ ఏబీసీ డిబేట్‌కు మాత్రమే అంగీకరించారు.

అదనపు డిబేట్లు చేయడానికి తన ప్రత్యర్థి నిరాకరించారని ట్రంప్ గురువారం తన ట్రూత్ సోషల్ పోస్ట్‌లో పేర్కొన్నారు.

మీడియా అనలిటిక్స్ సంస్థ నీల్సన్ గణాంకాల ప్రకారం 67.1 మిలియన్ల మంది మంగళవారం నాటి వీరి డిబేట్‌ను వీక్షించారు. ట్రంప్, బైడెన్ మధ్య జూన్‌లో జరిగిన డిబేట్‌ను 51.3 మిలియన్ల మంది మాత్రమే వీక్షించారు.

కీలకమైన పెన్సిల్వేనియా, మిషిగాన్, విస్కాన్సిన్ రాష్ట్రాల్లో కమలా హారిస్, ట్రంప్ మధ్య గట్టి పోటీ ఉందని సర్వేలు చెబుతున్నాయి.

రాయిటర్స్/ఇప్సోసస్ పోల్ ప్రకారం, ట్రంప్ కంటే కమలా హారిస్ జాతీయస్థాయిలో ఐదు పాయింట్ల ఆధిక్యంలో ఉన్నారని, మంగళవారం జరిగిన డిబేట్‌లో ఆమె గెలిచారని 53 శాతం మంది చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)