అమృత ప్రణయ్ దుస్తుల మీద ట్రోలింగ్ ఎందుకు? భర్త చనిపోయిన మహిళలు నచ్చినట్లు జీవించకూడదా?

అమృత ప్రణయ్

ఫొటో సోర్స్, Amrutha Pranay/FB

    • రచయిత, పద్మ మీనాక్షి
    • హోదా, బీబీసీ కోసం

కొన్ని రోజులుగా అమృత ప్రణయ్ అనే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ వేసుకున్న దుస్తుల మీద సోషల్ మీడియాలో చాలా చర్చ నడుస్తోంది.

“భర్త చనిపోయిన అమ్మాయి, ఇలాంటి డ్రెస్‌లు వేసుకోవడం అవసరమా?” అంటూ ఒక వర్గం, “ఆ అమ్మాయి వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూసే హక్కు ఎవరికీ లేదు” అంటూ మరో వర్గం.. ఇలా సోషల్ మీడియాలో వాదోపవాదాలు చోటు చేసుకుంటున్నాయి.

తెలంగాణలోని నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన అమృత.. ప్రణయ్ అనే దళిత యువకుడిని ప్రేమ వివాహం చేసుకున్నారు. 2018లో ప్రణయ్‌ని కొందరు హత్య చేశారు. అది ‘‘కుల దురహంకార హత్య’’ అని, ప్రణయ్‌ని అమృత తండ్రే చంపించారని అప్పుడు పోలీసులు చెప్పారు.

ఆ కేసులో నిందితునిగా ఉన్న అమృత తండ్రి కొంతకాలం తర్వాత ఆత్మహత్య చేసుకున్నారు.

భర్త చనిపోయే నాటికి 5 నెలల గర్భిణిగా ఉన్న అమృతకు ఆ తరువాత బాబు పుట్టాడు.

తర్వాత ఆమె సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా మారారు. అనేక బ్రాండ్స్‌ని తన సోషల్ మీడియా ఛానెళ్లలో ప్రమోట్ చేస్తుంటారు. తన వ్యక్తిగత జీవితం, తన కొడుకుతో ఆమె గడిపే క్షణాలు.. ఇలా లైఫ్ స్టైల్, ఫ్యాషన్ ట్రెండ్స్‌పై వ్లాగ్స్ కూడా చేస్తూ ఉంటారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
అమృత ప్రణయ్

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, ఈ ఫొటోను కొందరు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు

వివాదం ఏంటి?

మోకాళ్ల పైకి ఉండేలా వేసుకున్న డ్రెస్‌తో అమృత ఉన్న వీడియో ఒకటి ఇటీవల సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అదొక బ్యూటీ పార్లర్ కోసం చేసిన ప్రమోషనల్ వీడియో. అది పాత వీడియో పోస్ట్. కానీ, ఆ వీడియోపై కొందరు నెటిజన్లు కామెంట్లు, చర్చలు మొదలుపెట్టారు.

కొంతమంది ఆమె డ్రెస్‌తో పాటు వ్యక్తిత్వాన్ని కూడా ప్రశ్నిస్తూ ట్రోల్ చేస్తున్నారు.

"భర్త చనిపోయిన వాళ్లు ఇలాంటి డ్రెస్ వేసుకోవాలా?"

"భర్తను పోగొట్టుకున్న అమ్మాయి ఇలా పొట్టి డ్రెస్ వేసుకుంది."

ఇలా కొందరు ట్రోల్స్ చేస్తే.. మరికొందరు అసభ్యకరంగా కామెంట్స్ పెట్టారు.

దీనికి సమాధానంగా మరికొంత మంది, ‘‘ఇందులో ఆమె తప్పేంటి?’’ అని నిలదీస్తూ పోస్టులు, కామెంట్లు పెడుతున్నారు. ఇలా రెండు వర్గాల మధ్య సోషల్ మీడియా వేదికగా వార్ జరుగుతోంది.

సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ ట్రోలింగ్ మరోసారి మహిళల వస్త్రధారణ మీద చర్చకు తెరతీసింది. భర్త చనిపోయిన మహిళలకు నచ్చినట్టు బతికే స్వేచ్ఛ లేదా? అనే ప్రశ్న కూడా ఇప్పుడు వినిపిస్తోంది.

ఇది ఈ రోజు కొత్తగా మొదలైన చర్చ కాదు. కానీ, సోషల్ మీడియా ఎప్పటికప్పుడు ఒక వర్గపు సమాజపు ఆలోచనా తీరును తెరపైకి తీసుకొచ్చి కొత్తగా చర్చను లేవదీస్తుంది.

"ఈ తీరును లోతుగా పరిశీలించాలంటే మధ్య యుగానికి వెళ్లాల్సి ఉంటుంది. అప్పటి సమాజంలో బాల్య వివాహాలు, భార్యాభర్తల మధ్య వయసు వ్యత్యాసం, నిరక్షరాస్యత ఉండేవి. స్త్రీకి ఆర్థిక స్వాతంత్రం ఉండేది కాదు. ఒక అమ్మాయి రెండో పెళ్లి చేసుకోవడాన్ని ఆమె పవిత్రతకు భంగం కలిగించే పనిగా మను సిద్ధాంతాన్ని కూడా బాగా బలపరిచారు. సమాజం ఆమోదించిన విషయాన్ని సత్యంగా, ఆమోదించని విషయాన్ని విచిత్రంగా లేదా చేయరాని పని చేసినట్లుగా సమాజం చిత్రిస్తుంది" అని తెలంగాణ ప్రభుత్వ భాష, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ అన్నారు.

ఈ ఆలోచన మూలాలు మధ్యయుగంలో వచ్చిన భారతీయ సంప్రదాయాల్లో దాగి ఉన్నాయని ఆయన అన్నారు.

"స్త్రీ స్వేచ్ఛా స్వరాన్ని వినిపించిన ప్రతిసారీ పురుషుడు తనకి తగినట్లుగా ఏదో ఒక సంప్రదాయాన్ని ముందుకు తెస్తూ, సమాజాన్ని తనకు అనువుగా మార్చుకుంటూనే ఉన్నాడు. ఈ ఆలోచనా ధోరణి స్త్రీని ఒక వస్తువుగా, ఆస్తిగా చూడటం వల్ల వచ్చిన పురుషాధిక్యత వల్ల వచ్చింది. ఇదంతా సరైందే అనే రీతిలో ఆమెకి మెంటల్ కండీషనింగ్ కూడా చేశారు. ఒక తప్పుడు పద్ధతిని సంప్రదాయంగా ప్రచారం చేశారు" అని హరికృష్ణ అభిప్రాయపడ్డారు.

"సాంస్కృతికంగా మహిళలు ధరించే దుస్తులను సమాజం నిర్వచించేసింది. ఏ దుస్తులు ధరించాలి, ఎవరెలా ఉండాలి అనే ఒక స్టీరియోటిపికల్ (మూస ఆలోచన) నుంచి పుట్టేవే ఈ ట్రోలింగ్‌లు" అని హైదరాబాద్‌కు చెందిన సైకాలజిస్ట్ జీసీ కవిత అంటారు.

"రంగులు, పూలు, అలంకరణ మనిషిలో ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని కలిగిస్తాయి. వీటిని దూరం చేసినప్పుడు స్త్రీ జీవితం నిస్సారంగా మారి జీవితం పట్ల ఉత్సాహాన్ని కోల్పోతుంది. ఈ ఆలోచన నుంచి పుట్టిందే తెల్ల చీర, పూలు పెట్టుకోకపోవడం, బొట్టు తీసేయడం లాంటివన్నీ" అని ఆమె అన్నారు.

"స్త్రీ వితంతువుగా మారిన వెంటనే ఆమె జీవితంలో ఎటువంటి ఆనందం, రంగులు ఉండకూడదనే ఆలోచనను తెచ్చి పెట్టుకున్న సంప్రదాయాలు, మన సినిమాలు కూడా మన మెదళ్లలో నూరిపోశాయి. నిజానికి నగరాల్లో, చిన్న పట్టణాల్లో కూడా వితంతువులు, సింగిల్ ఉమన్‌ని చూసే తీరు చాలా వరకు మారింది. వాళ్లు కూడా ధైర్యంగా బయటకు వస్తున్నారు. ఉద్యోగాలు చేస్తున్నారు. తమకి నచ్చిన విధంగా బతుకుతున్నారు. విద్య, ఆర్థిక స్వాతంత్రం ఇందుకు సహకరించాయి" అని కవిత వివరించారు.

అమృత ప్రణయ్

ఫొటో సోర్స్, Amrutha Pranay/FB

"మోరల్ పోలీసింగ్"

ఈ డిజిటల్ యుగంలో కూడా ఇటువంటి దాడులు ఎందుకు జరుగుతున్నాయి అని ప్రశ్నించినప్పుడు, "సోషల్ మీడియాలో ఒక వర్గం తమ వాదాన్ని సంప్రదాయవాదంగా చూపిస్తూ, ప్రతి విషయాన్ని సంస్కృతికి, వేదాలకు ముడిపెడుతూ సోషల్ మీడియా, వాట్సాప్ ద్వారా తమకు అనుగుణంగా ఉండే ఒక కొత్త వాదాన్ని ప్రచారం చేయడం మొదలుపెట్టాయి. ఈ వర్గపు ఆలోచనలను సామాజికంగా ప్రభావితం చేయాలని చూడటం వల్ల వచ్చిందే ఈ సమస్య. నైతిక, సాంస్కృతిక పోలీసింగ్ చేస్తూ స్వతంత్ర మహిళలు గొంతు విప్పకుండా చేసే దాడి" అని హరికృష్ణ అన్నారు.

భారత ప్రభుత్వం 1956లో హిందూ వితంతు పునర్వివాహ చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. వాళ్లకి ఆస్తి హక్కును కూడా కల్పించారు.

ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో భర్త చనిపోతే సంప్రదాయం పేరుతో భార్య బొట్టు, గాజులు తీయడాన్ని ఒక కార్యక్రమంలా నిర్వహిస్తారు. పూర్వకాలంలో ఇలాంటి ఆచారాలు నిర్వహించినట్లు పురాణాల్లో కూడా ఎక్కడా ఆధారాలు లేవని కొంత మంది చరిత్రకారులు అంటారు.

సమంత

ఫొటో సోర్స్, INSTAGRAM/SAMANTHARUTHPRABHUOFFL

సెలెబ్రిటీలను కూడా వదలని ట్రోలింగ్

సెలెబ్రిటీల దుస్తులపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరగడం మొదటిసారి కాదు. గతంలో ప్రియాంక చోప్రా, దీపికా పదుకొణె, శ్రీయ లాంటి సెలెబ్రిటీలు కూడా వాళ్లు ధరించిన దుస్తుల వల్ల ట్రోల్స్‌కి గురయ్యారు.

2022లో క్రిటిక్స్ చాయిస్ అవార్డుల సమయంలో సమంత వేసుకున్న డ్రెస్‌కి కూడా ఆమెని నెటిజన్లు ట్రోల్ చేశారు. కొన్ని టాబ్లాయిడ్స్ అయితే సమంత వేసుకున్న డ్రెస్‌కి, ఆమె విడాకులకు కూడా ముడి పెట్టాయి. సమంత 2021 అక్టోబర్‌లో నాగచైతన్య నుంచి విడాకులు తీసుకున్నారు.

"ఒక వ్యక్తి వ్యక్తిత్వంపై ముద్రను వేసేటప్పుడు ఆ భావన ఎలా ఉంటుందో ఒక మహిళగా నాకు తెలుసు. ఒక మహిళ వేసుకునే దుస్తులు, రంగు, జాతి, చదువు, సామాజిక స్థాయి, కనిపించే తీరు.. వీటన్నిటి ఆధారంగా ఒక అమ్మాయిని జడ్జ్ చేసేస్తాం. ఒక అమ్మాయి ధరించిన దుస్తుల ఆధారంగా ఆమెని జడ్జ్ చేయడం ఎవరైనా అతి సులభంగా చేయగలిగే పని. మనం 2022లో ఉన్నాం. ఇప్పటికైనా ఒక మహిళ మెడ, నడుము వంపుల గురించి మాట్లాడటం మానేసి, మన గురించి మనం ఆలోచిద్దామా? మనమేంటో తెలుసుకుని, మనల్ని మనం మలచుకోవడంపై దృష్టి పెడితే, పరిణతి సాధిస్తాం. మన అభిప్రాయాలను అవతలి వాళ్లపై రుద్దడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఒక వ్యక్తిని అంచనా వేయడాన్ని, అర్థం చేసుకునే విధానాన్ని సున్నితంగా తిరిగి నిర్వచిద్దాం" అంటూ సమంత గట్టిగా సమాధానమిచ్చారు.

అమృత ప్రణయ్

ఫొటో సోర్స్, Amrutha Pranay/FB

"అధికారాన్ని చూపించాలనే తపన"

"సమాజంలో ప్రతి ఒక్కరికీ ఎవరికి నచ్చిన విధంగా వారు జీవించే హక్కు ఉంది. కానీ, ఒక మనిషి వ్యక్తిత్వాన్ని దుస్తుల ఆధారంగా నిర్వచించి జడ్జ్ చేయడం సరైంది కాదు. వ్యక్తిగత జీవితాన్ని, ప్రొఫెషనల్ జీవితాన్ని కలిపి చూడటం వల్లే ఇలాంటి సమస్యలు వస్తాయి" అని కవిత అన్నారు.

"చాలా మంది వర్చువల్ స్పేస్‌లో తమని తాము స్వతంత్రులుగా, శక్తిమంతులుగా భావిస్తారు. వాళ్లు బాల్యంలో లేదా ఎప్పుడో అణిచిపెట్టుకున్న భావాలను సోషల్ మీడియా ద్వారా ప్రకటించి గొప్పగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇదే వ్యక్తులను పబ్లిక్‌గా వచ్చి మాట్లాడమన్నప్పుడు మాత్రం ముందుకు రాలేరు, తమ వాదన వినిపించలేరు. వర్చువల్ స్పేస్‌లో ఎవరూ నేరుగా దాడి చేయరనే ధీమాతో తోచిన అర్థరహితమైన కామెంట్లను చేసి తమ ఆధిపత్యాన్ని చాటుకుంటారు. తమని తాము శక్తిమంతులుగా భావిస్తారు. అవతలి వ్యక్తుల మనోభావాలను పట్టించుకోరు.

వీళ్ల ట్రోలింగ్ వెనుక సమాజాన్ని బాగుచేయాలనో, సంస్కృతిని పరిరక్షించాలనో ఉద్దేశం మాత్రం ఏమీ ఉండదు. సంస్కృతి, సంప్రదాయాల ముసుగులో అధికారాన్ని చాటుకునే ఒక వర్గం" అని కవిత అన్నారు.

"స్త్రీ శీలం అనే పదానికి కనిపించని ఆచ్ఛాదన వేసి సమాజం తమ ఆధిపత్యాన్ని చాటుకుంటూ ఉంటుంది" అని హరికృష్ణ అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)