విజయవాడ: బుడమేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితి ఇప్పుడెలా ఉంది?

విజయవాడ వరద బాధితులు
    • రచయిత, గరికిపాటి ఉమాకాంత్‌
    • హోదా, బీబీసీ కోసం

సరిగ్గా 24 రోజుల క్రితం సగం విజయవాడ నగరాన్ని ముంచెత్తిన బుడమేరు వరద పూర్తిగా తగ్గుముఖం పట్టినా, బురద మాత్రం ఇంకా తగ్గలేదు.

పది రోజులుగా విజయవాడలో విపరీతమైన ఎండలు కాస్తున్నా బురద ఇంకా అలాగే ఉంది.

ముంపు ప్రభావిత ప్రాంతాలన్నీ అపరిశుభ్రతతో కొట్టుమిట్టాడుతున్నాయి. వరద ముంచెత్తినప్పుడు స్పందించిన అధికారులు, ఆ తర్వాత కనీసం పట్టించుకోవడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు.

ఈనెల ఒకటో తారీఖున భారీ వర్షాల ప్రభావంతో ఒక్కసారిగా బుడమేరులో వరద ప్రవాహం పెరిగి, ఎక్కడికక్కడ గండ్లు పడి బెజవాడలోని సగభాగాన్ని ముంచెత్తింది.

అంపాపురం, సింగ్‌నగర్, పాయికాపురం, కండ్రిక, ఉడాకాలనీ, ఆంధ్రప్రభ కాలనీ, నందమూరినగర్‌‌ సహా చాలా కాలనీలు నీటమునిగాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
విజయవాడ

ఆయా ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయిన చాలామంది ప్రజలు దాదాపు పది రోజుల తర్వాత గానీఇంటి ముఖం పట్టలేకపోయారు.

వారం పది రోజుల కిందట వరద ప్రభావం తగ్గడంతో తిరిగి వెళ్లి ఇళ్లను, ఆయా కాలనీల్లోని వీధులను శుభ్రం చేసుకుంటున్నారు. వరద వచ్చినప్పుడు స్పందించిన అధికారులు ఆ తర్వాత జాడ లేకుండా పోయారని జక్కంపూడి వైఎస్సార్‌ కాలనీకి చెందిన వరద బాధితులు శివ పార్వతి, మంగ ఆరోపించారు. తమ కాలనీలో 275 బ్లాక్‌లు ఉంటే, ఒక్కో బ్లాక్‌లో 32 కుటుంబాలు ఉంటాయని వివరించారు.

పది రోజులుగా తమ కాలనీకి మంచి నీళ్లు రావడం లేదని, కార్పొరేషన్‌ సిబ్బందికి ఫోన్‌ చేసినా స్పందించడం లేదని వారు చెప్పారు. దాంతో వాటర్‌ క్యాన్‌ కోసం 2 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తోందని చెప్పారు. దీనిపై సంబంధిత కార్పొరేషన్‌ ఉద్యోగి మోషీని స్పందన కోరితే, కాలనీకి నీరు సరఫరా చేస్తున్నాం కానీ, సరిపడా ఇవ్వలేకపోతున్నామని, మరో ట్యాంక్‌ నిర్మాణం చేపడితే గానీ సరిపడా నీళ్లు ఇవ్వలేమని చెప్పారు.

బుడమేరు వరద

ముంపు బాధితులకు పరిహారం: జిల్లా కలెక్టర్‌ సృజన

విజయవాడ నగరంలోని 32 వార్డుల్లో నష్టగణన పూర్తి చేసినట్లు బీబీసీకి ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ జి.సృజన తెలిపారు. ఏ ఒక్క కుటుంబమూ నష్టపోకూడదనే ఉద్దేశంతో సచివాలయాల్లో బాధితుల జాబితాలను ప్రదర్శించామని, ఇంకా ఎవరైనా మిగిలి ఉంటే వారిని కూడా చేర్చుతామని వెల్లడించారు.

ఈనెల 25వ తేదీన పరిహారం అందిస్తామని కలెక్టర్ చెప్పారు. నేరుగా బాధితుల బ్యాంకు ఖాతాల్లోనే డబ్బులు జమ చేస్తామని తెలిపారు.

ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం, గ్రౌండ్ ఫ్లోర్‌ మునిగిపోయినవారికి రూ. 25 వేలు, ఫస్ట్‌ ఫ్లోర్‌లో నివసించే కుటుంబానికి పది వేల చొప్పున అందిస్తామని చెప్పారు.

ప్రస్తుతానికి 70 వేల కుటుంబాల వరకు లెక్క తేలిందని, ఇంకా వస్తున్న దరఖాస్తులను పరిశీలిస్తే మరో పది వేలు పెరిగే అవకాశం ఉందని కలెక్టర్‌ సృజన తెలిపారు.

నగరం పరిధిలోకి రాని ప్రాంతాల్లోని బాధిత కుటుంబాలకు కూడా పది వేల చొప్పున అందిస్తామని ఆమె బీబీసీతో చెప్పారు.

విజయవాడ

జాబితాలో తమ పేర్లు లేవంటూ ఆందోళన

తాము వరద బారిన పడినా, తమకు జరిగిన నష్టం వివరాలు నమోదు చేయడం లేదంటూ విజయవాడ నగరంలోని పలు చోట్ల స్థానికులు ఆందోళన చేపట్టారు.

పశ్చిమ నియోజకవర్గం పరిధిలో 38, 39 డివిజన్లలోని ఇళ్లల్లోకి కూడా నీళ్లు వచ్చినా, వరద నష్టం అంచనాకు ఎన్యుమరేషన్‌ బృందాలు రాకపోవడంతో స్థానికులు కుమ్మరిపాలెం సెంటర్‌లో ధర్నా నిర్వహించారు.

దీనిపై జిల్లా కలెక్టర్‌ సృజన బీబీసీతో మాట్లాడుతూ.. ఆ ఏరియా ముంపు ప్రభావిత ప్రాంతం కాదని అధికారులు చెప్పారనీ, బాధితుల ఆందోళనను పరిగణనలోకి తీసుకుని వారికి న్యాయం చేస్తామని భరోసానిచ్చారు.

 కలెక్టర్‌ సృజన

ఫొటో సోర్స్, X/Srijana Gummalla

ఫొటో క్యాప్షన్, కలెక్టర్‌ సృజన

మరోవైపు, వరద నష్టం నమోదుపై వివరాలు చెప్పాలని అడిగితే సచివాలయ సిబ్బంది దురుసుగా వ్యవహరిస్తున్నారంటూ సింగ్ నగర్‌, రాజీవ్‌ నగర్‌ ప్రాంతాల మహిళలు నిరసన చేపట్టారు. ఇంకోవైపు, జక్కంపూడి వైఎస్సార్‌ కాలనీ వాసులు కూడా తమ పేర్లను నమోదు చేసుకోలేదని ఆందోళన చేశారు.

స్థానిక మహిళ గరిక వీరమ్మ మాట్లాడుతూ, తాము ఈ నెల ఒకటో తారీఖున ఒక్కసారిగా వచ్చిన వరద తాకిడితో కుటుంబమంతా ఇల్లు ఖాళీ చేసి వేరే చోటుకు వెళ్లి ప్రాణాలు కాపాడుకున్నామని, ఇంట్లోని సామాను మునిగి పాడైందని చెప్పారు. కానీ అధికారులు ‘డోర్‌ లాక్‌’ అంటూ తమ పేర్లను నమోదు చేయలేదని ఆరోపించారు.

అదే ప్రాంతానికి చెందిన వెంకట లక్ష్మీ కూడా తమ పేర్లను పరిహారానికి అర్హులైనవారి జాబితాలో చేర్చలేదని చెప్పారు. దీనిపై జిల్లా కలెక్టర్‌ సృజన బీబీసీతో మాట్లాడుతూ, అర్హులైన వారందర్నీ జాబితాలో చేరుస్తామని, ఎవరూ ఆందోళన చెందనక్కర్లేదని తెలిపారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)