‘కావాలంటే నన్ను రేప్ చేయండి, నా బిడ్డలను వదిలిపెట్టండి’- ఓ తల్లి ఆవేదన

ఫొటో సోర్స్, BBC/Mohanad Hashim
- రచయిత, బార్బరా ప్లెట్ అషర్
- హోదా, బీబీసీ ప్రతినిధి
హెచ్చరిక: ఈ కథనంలో కొన్ని అంశాలు మిమల్ని కలచివేయవచ్చు.
17 నెలలుగా సాగుతున్న తీవ్ర అంతర్యుద్ధం కారణంగా సూడాన్ అస్తవ్యస్తంగా మారింది. ఆ దేశ రాజధాని ఖార్టుమ్‌లో ప్రత్యర్థులైన ర్యాపిడ్ సపోర్టివ్ ఫోర్సెస్ ఆధీనంలో ఉన్న ప్రాంతాలే లక్ష్యంగా ఆ దేశ ఆర్మీ భారీ మిలిటరీ దాడులను మొదలుపెట్టింది.
అంతర్యుద్ధం మొదలైన తొలినాళ్లలోనే రాజధాని ఖార్టుమ్‌లోని మెజార్టీ ప్రాంతాన్ని ఆర్ఎస్‌ఎఫ్ తమ గుప్పిట్లోకి తెచ్చుకుంది. అయితే, నైలు నదికి అవతలవైపున ఉండే ఖార్టూమ్ జంట నగరం ఓందుర్మాన్ మాత్రం ఆర్మీ ఆధీనంలోనే ఉంది.
అయితే, రెండు సిటీలలో తమ పనులు చేసుకోవడానికి ప్రజలకు ఇప్పటికీ అవకాశం ఉంది.

ఆర్మీ ఆధీనంలో ఉన్న ఓందుర్మాన్‌కు సరిహద్దులో ఉన్న మార్కెట్‌లో ఆహార పదార్థాలు తక్కువ ధరలకే దొరుకుతాయి. వాటిని కొనుక్కోవడానికి దాదాపు 4 గంటల పాటు నడుస్తూ ఓ మహిళా బృందం అక్కడికి వచ్చింది. వారిని బీబీసీ ఆఫ్రికా కరస్పాండెంట్ బార్బరా ప్లెట్ అషర్ కలుసుకున్నారు.
వారు ఆర్ఎస్ఎఫ్ ఆధీనంలో ఉన్న ‘దార్ ఎస్ సలాం’ ప్రాంతం నుంచి వచ్చారు.
అక్కడ మగవారు ఇల్లు దాటి బయటికి రాలేరని ఆ మహిళలు బీబీసీ ప్రతినిధితో చెప్పారు.
“మగవాళ్లు బయటకు వస్తే ఆర్‌ఎస్ఎఫ్ దళాలు వారిని దారుణంగా కొడతాయి. సంపాదించిన డబ్బును లాగేసుకుంటాయి, లేదంటే కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తాయి” అని ఆమె చెప్పారు. .
“మా పిల్లల ఆకలి తీర్చాలి. మాకూ ఆకలిగా ఉంది. తినడానికి ఏదైనా కావాలి. అందుకే కష్టపడి ఇక్కడికి వచ్చాం” అని ఆ మహిళల్లో ఒకరు చెప్పారు.

అయితే, మగవారితో పోల్చితే మహిళలు అక్కడ సురక్షితంగా ఉన్నారా ? లైంగిక వేధింపుల సంగతేంటి? అని బీబీసీ ప్రతినిధి ఓ మహిళను అడిగారు.
ఈ ప్రశ్నతో ఒక్కసారిగా వారంతా మూగబోయారు. ఆ గుంపులోని ఓ మహిళ మాట్లాడటం మొదలుపెట్టారు.
“ఈ ప్రపంచం ఎక్కడకి పోయింది..? ఈ సమాజం మాకు ఎందుకు సాయం చేయట్లేదు?” అని ఆ మహిళ కన్నీళ్లతో ప్రశ్నించారు.
“ఇక్కడ చాలా మంది మహిళలు అత్యాచారానికి గురయ్యారు. అయినా, దీని గురించి ఎవరు నోరు మెదపరు. ఒకవేళ మాట్లాడిన ఏమైనా మార్పు వస్తుందా?” అని ఆమె ప్రశ్నించారు.
‘‘రాత్రిపూట మార్కెట్ నుంచి ఆలస్యంగా వచ్చే అమ్మాయిలను ఆర్ఎస్ఎఫ్ దళ సభ్యులు వీధుల్లో అటకాయిస్తారు. ఐదారు రోజులు తమ దగ్గరే ఉంచుకుంటారు’’ అని ఇంకొక బాలిక చెప్పారు.
ఆ బాలిక ఈ విషయం చెబుతుండగానే, పక్కనే ఉన్న ఆమె తల్లి తనను చేతిలోకి తీసుకొని ఏడవడం మొదలుపెట్టారు. దీంతో పక్కనే ఉన్న మిగతా వారు కూడా ఒక్కసారిగా ఏడ్చారు.
“మీరుండే ప్రాంతంలో మీ బిడ్డ బయటికి వెళితే ఆమెను అలాగే వదిలేస్తారా? ఆమెను వెతడానికి వెళ్లరా? కానీ, ఇక్కడ మమ్మల్ని ఏం చేయమంటారు చెప్పండి. మా చేతిలో ఏం లేదు, మమ్మల్ని ఎవరూ పట్టించుకోరు. ఈ అంతర్జాతీయ సమాజం ఎక్కడుంది ? మాకు ఎందుకు సాయం చేయదు?” అని ఆమె ప్రశ్నించారు.

ఫొటో సోర్స్, BBC/Ed Habershon
అంతర్యుద్ధం, అశాంతి కారణంగా ఆ దేశంలో కోటి మందికిపైగా ప్రజలు ఇళ్లు వదిలిపెట్టి పోయారని ఐక్యరాజ్యసమితి చెప్పింది.
అయితే, ఈ సంఘర్షణల్లో లైంగిక వేధింపులు కీలకంగా మారాయి. ఆర్మీ, ఆర్ఎస్ఎఫ్‌ల మధ్య ఆధిపత్యపోరులో ఇది కీలకమైన అంశంగా మారింది.
“రేప్‌ను యుద్ధంలో ఓ ఆయుధంగా వాడుతున్నారు” అని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల హై కమిషనర్ వోల్కర్ టర్క్ అన్నారు.
సూడాన్‌లో మహిళలు ఎదుర్కొంటున్న అత్యాచార ఘటనలు, లైంగిక వేధింపులపై ఐక్యరాజ్యసమితి ఫ్యాక్ట్- ఫైండింగ్ మిషన్ ఓ డాక్యుమెంట్ రూపొందించింది.
అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తూ అధిక సంఖ్యలో ఆర్ఎస్ఎఫ్, దాని అనుబంధ దళాలు ఈ దాడులకు పాల్పడినట్లు ఆ డాక్యుమెంట్‌లో పేర్కొన్నారు.
తనపై జరిగిన అత్యాచారానికి కారణం ఆర్ఎస్ఎఫ్ అంటూ ఓ మహిళ బీబీసీతో చెప్పారు. ఆ మహిళను బీబీసీ ప్రతినిధి సౌక్ అల్-హార్ మార్కెట్ దగ్గర కలిశారు.
నిరుపేదలకు అత్యంత తక్కువ ధరలకే ఆహార పదార్థాలు అందిచండం ఓందుర్మాన్‌లోని ఈ మార్కెట్ ప్రత్యేకత.
యుద్ధం మొదలైనప్పటి నుంచి ప్రజల అవసరాల మేరకు ఈ మార్కెట్ క్రమంగా విస్తరించుకుంటూ పోతోంది.

ఫొటో సోర్స్, Getty Images
ఒక్కొక్కరిదీ ఒక్కో భయానక అనుభవం
మిరియం( ఇది ఆమె అసలు పేరు కాదు) తన సోదరుడితో కలిసి ‘దార్ ఎస్ సలాం’లోని ఇంటిని వదిలేసి ఇక్కడికి వలస వచ్చారు.
ప్రస్తుతం ఆమె టీ కొట్టులో పని చేస్తున్నారు. యుద్ధం మొదలైన తొలినాళ్లలో ఇద్దరు ఆర్మీ జవాన్లు తన ఇంట్లోకి చొరబడి తన పదేళ్ల పాపను, 17 ఏళ్ల అమ్మయిని రేప్ చేయడానికి ప్రయత్నించారని ఆమె చెప్పారు.
“నా వెనక్కి రండి అని నా బిడ్డలకు చెప్పాను. ఎవరినో ఒకరిని రేప్ చేయడమే మీ లక్ష్యమైతే నన్ను రేప్ చేయండి” అని ఆర్ఎస్ఎఫ్ వాళ్లకు మొరపెట్టుకున్నానని ఆమె చెప్పారు.
“వాళ్లు నన్ను కొట్టారు. నా దుస్తులు విప్పేయాలని ఆదేశించారు. దుస్తులు తీసేస్తా కానీ నా పిల్లల్ని వదిలేయాలని కోరా. ఐతే ఓ సైనికుడు నా బిడ్డలను తీసుకుని ఫెన్సింగ్ దూకి పారిపోయాడు. ఇంకొకడు నా మీద పడిపోయాడు” అని ఆమె చెప్పారు.
ఆర్ఎస్ఎఫ్ బలగాలు మాత్రం మానవ హక్కులకు భంగం కలగకుండా, లైంగిక వేధింపులు జరగకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని అంతర్జాతీయ విచారణ అధికారులకు చెప్పారు.

ఫొటో సోర్స్, Reuters
ఫాతిమా( ఇది ఆమె అసలు పేరు కాదు) కవల పిల్లలకు జన్మనివ్వడానికి ఓందుర్మాన్‌కు వచ్చారు. తరువాత కూడా ఇక్కడే ఉండాలని అనుకుంటున్నట్లు ఆమె చెప్పారు.
15 ఏళ్ల బాలిక కూడా గర్భం దాల్చినట్లు ఫాతిమా పక్కనే ఉన్న మరో మహిళ చెప్పారు. అలాగే, తనతోపాటు తన 17 ఏళ్ల చెల్లిపై నలుగురు ఆర్ఎస్ఎఫ్ సైనికులు అత్యాచారానికి పాల్పడ్డారని ఆమె చెప్పారు.
“భయంతో మేము కేకలు వేయడంతో ఏం జరుగుతుందోనని చూడటానికి చుట్టుపక్కల వాళ్లు వచ్చారు. మీ ఇళ్లకు తిరిగి వెళ్లకపోతే చంపేస్తామని ఆ సైనికులు వారిని బెదిరించారు” అని ఆ మహిళ చెప్పారు.
ఆ మరుసటి రోజు ఉదయం, శరీరంపై లైంగిక వేధింపుల గుర్తులతో ఇద్దరు బాలికలు కనిపించారు. వారి పెద్ద సోదరుడిని ఓ రూంలో బంధించి ఉంచినట్లు గుర్తించారు.
“అంతర్యుద్ధం కారణంగా ఆర్ఎస్ఎఫ్ బలగాలు ఎప్పుడైతే ఇక్కడికి వచ్చాయో..అప్పటి నుంచే అత్యాచారాల గురించి వినడం మొదలైంది. మొదట్లో ఇలాంటి ప్రచారంపై మాకు సందేహాలు ఉండేవి. కానీ, ఆర్ఎస్ఎఫ్ బలగాల చేతిలో బలైపోయిన అమ్మాయిలను చూసిన తరువాత ఇది వాస్తవమని తెలుసుకున్నా” అని ఫాతిమా చెప్పారు.
ఆర్ఎస్ఎఫ్ ఆధీనంలో ఉన్న తమ ఇళ్లకు తిరిగి వెళ్లడానికి మిగతా మహిళలంతా ఒకచోటకు వచ్చారు. వాళ్లంతా నిరుపేదలు. ‘దార్ ఎస్ సలాం’ను వదిలిపెట్టి మిరియంలాగా కొత్త జీవితాన్ని ప్రారంభించాలనే ఆశతో ఉన్నామని వారు చెప్పారు.
కానీ, ఈ యుద్ధం కొనసాగుతున్నంత కాలం ఆ నరకంలోకి తిరిగి వెళ్లడం తప్ప వారికి ఇంకో మార్గం లేదు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














