తిరుమల లడ్డూ ప్రసాదంపై వివాదం: సమాధానం లేని ప్రశ్నలు..

- రచయిత, బళ్ళ సతీశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
తిరుమల ప్రసాదం విషయంలో ఇంకా తేలని ప్రశ్నలు కొన్ని ఉన్నాయి. ఓ పక్క వివాదం కొనసాగుతుండగా, మరోపక్క ఈ మౌలిక ప్రశ్నలకు ఇంకా సమాధానం తెలియాల్సి ఉంది.
ముఖ్యంగా ప్రసాదంలో సాధారణ వెజిటబుల్ ఆయిల్ కల్తీ అంటే.. వనస్పతి, పామాయిల్ లేదా గేదె నెయ్యి వంటివి అయితే సమస్య ఇంత పెద్దది అయ్యేది కాదు. కానీ బీఫ్, చేప, పంది కొవ్వు నూనె కలిసిందని చెప్పడం వివాదం పెరగడానికి కారణమైంది.
ఈ సమయంలో చాలామంది మదిలో కొన్ని ప్రశ్నలు మెదులుతున్నాయి.

ఫొటో సోర్స్, TTD
టీటీడీ సమాధానం చెప్పాల్సి న ప్రశ్నలు:
1. ఏఆర్ డెయిరీ ఫుడ్ సంస్థ నుంచి పది నెయ్యి ట్యాంకర్లు రాగా ఆరు ఉపయోగించామని, మిగతా నాలుగు ట్యాంకర్ల శాంపిళ్లను పరీక్షల కోసం పంపించామని టీటీడీ ఈవో శ్యామలరావు చెప్పారు. మొత్తంగా ఏఆర్ డెయిరీ సంస్థ తన పీరియడ్‌లో సరఫరా చేసిన మొత్తం నెయ్యి పరిమాణం ఎంత? అందులో వాడింది ఎంత? తిరస్కరించింది ఎంత?
2. అనుమానం వచ్చిన ట్యాంకర్లను పరీక్షించి వెనక్కి పంపినప్పుడు, భక్తులకు చేరిన ప్రసాదాల్లో ఆ నెయ్యి కలవనట్టా? కలిసినట్టా? ఒకవేళ ఆ ఆరు ట్యాంకర్ల నెయ్యి కూడా అనుమానస్పదంగా ఉండి ఉంటే వారు వాటిని కూడా శాంపిళ్లకు పంపించేవారు కదా?
- ఆ ఆరు ట్యాంకర్లూ బాగున్నాయి అనుకుంటే.. భక్తులకు జంతు కొవ్వు వల్ల కల్తీ అయిన నెయ్యితో చేసిన పదార్థాలు అందలేదనట్లే. అలా కాదు, ఆ ఆరు కూడా కల్తీవే అనుకుంటే, అప్పుడు ప్రొసీజర్ ప్రకారం టెస్టులు ఎందుకు చేయలేదు? అనే ప్రశ్న వస్తుంది.
3. జులై 23న ల్యాబ్ నివేదిక వచ్చింది. మరుసటి రోజు ఈవో మాట్లాడుతూ.. వెజిటబుల్ ఫ్యాట్‌ల గురించి చెప్పారు తప్ప, యానిమల్ ఫ్యాట్ గురించి చెప్పలేదు. దానిపై పాత్రికేయులు ప్రశ్నించినప్పుడు తాను నివేదికను అర్థం చేసుకోవడానికి సమయం పట్టిందని ఆయన చెప్పారు. ఎక్కడ వెజిటబుల్ ఫ్యాట్ గురించి రాశారో అదే పేజీలో యానిమల్ ఫ్యాట్ గురించి కూడా రాసి ఉంది. కాబట్టి గమనించకపోయే ప్రశ్నే లేదు. పోనీ దానికి సంబంధించిన సాంకేతిక సమాచారం తెలియదు అనుకుంటే, టీటీడీకి సొంత డెయిరీ ఉంది. మైసూరు సీఎఫ్టీఆర్ఐ (కేంద్ర ఆహార సాంకేతిక పరిశోధనా సంస్థ) వారు టీటీడీ సిబ్బందికి శిక్షణ ఇస్తున్నారని ఆయనే చెప్పారు. ఎస్వీ యూనివర్సిటీ ఉంది. రెండు తెలుగు రాష్ట్రాలు సహా దేశమంతా టీటీడీ ఈవో ఫోన్ చేస్తే వివరాలు చెప్పనివారు ఉండరు. ఆఖరికి ఆ పరీక్షలు చేసిన ల్యాబ్ వారికి ఫోన్ చేసినా వివరాలు చెబుతారు. వీరెవ్వరిని అయినా టీటీడీ ఈవో సంప్రదించి ఆ రిపోర్టులో ఏముందో తెలుసుకోవచ్చు కదా?
ఆయన తెలుసుకునే ప్రయత్నం చేయలేదా? లేక తెలిసినప్పటికీ విషయం బయట పెట్టలేదా?
ఏ రకంగా వెజిటబుల్ ఫ్యాట్ మాత్రమే కలిసిందని అప్పుడు, యానిమల్ ఫ్యాట్ కూడా కలిసిందని ఇప్పుడు నిర్ధరణ చేయగలిగారు?


ఫొటో సోర్స్, RAJESH
4. నెయ్యి శాంపిళ్లు తీసుకునే విధానం, ఆ నెయ్యి తయారీ కోసం వాడిన పాలను ఇచ్చిన ఆవులు తిన్న దాణాలో నూనె గింజల మోతాదు, గేదె నెయ్యి కలవడం, ఆవు పోషణ సరిగా లేకపోవడం.. ఇలా అనేక అంశాలు ఆ పరీక్ష ఫలితాలకు మినహాయింపుగా ఎన్‌డీడీబీ ల్యాబ్ చెబుతోంది.
బీబీసీ మాట్లాడిన ముగ్గురు నిపుణులు కూడా ఆ పరీక్షలతో జంతు కొవ్వు కలిసినట్లు పూర్తి స్థాయి నిర్థరణకు రాలేమని చెప్పారు, మరి దానిని పూర్తి స్థాయిలో ఎలా నిర్థరిస్తారు?
5. ఏఆర్ డెయిరీ జూన్ 12 నుంచి మాత్రమే నెయ్యి సరఫరా ప్రారంభించింది. జులైలో లోపాలను గుర్తించారు. అంటే కనీసం జూన్ ముందు వరకైనా లడ్డూ యానిమల్ ఫ్యాట్‌తో కల్తీ కాలేదని తేల్చవచ్చా?

ఫొటో సోర్స్, YV SUBBA REDDDY/FACEBOOK
వైసీపీ హయాంలో పనిచేసిన ఈవోలు, చైర్మన్లు చెప్పాల్సిన విషయం:
1. బహిరంగ మార్కెట్ కంటే అతి తక్కువ ధరకు నెయ్యి సరఫరా సాధ్యమా? అని టీటీడీ తన ప్రొక్యూర్‌మెంట్, తన సొంత డెయిరీ విభాగాలు లేదా ప్రభుత్వ రంగ విభాగాలతో ఎందుకు సంప్రదించలేదు?
యానిమల్ ఫ్యాట్‌తో కల్తీ జరగడం అనేది పూర్తిగా నిర్థరించలేమని చెప్పిన నిపుణులు సైతం ఏదో రూపంలో అయితే కల్తీ అయిందని మాత్రం చెప్పగలుగుతున్నారు.
బీబీసీ మాట్లాడిన దాదాపు నిపుణులంతా యానిమల్ ఫ్యాట్‌ను నిర్ధరించనప్పటికీ, ప్రొక్యూర్‌మెంట్ ధర ఆధారంగా కల్తీ నిర్ధరిస్తున్నారు. ఆ ధరకు ఇవ్వడం సాధ్యం కాదని అంటున్నారు. మరి ఆ కనీస పరిజ్ఞానం వైసీపీ హయాంలో పనిచేసిన బోర్డుకు, అధికారులకు ఎందుకు లేదు?
2. స్వామి వారి కైంకర్యాల కోసం వాడే నెయ్యి 60 కేజీలు లక్ష రూపాయలకు తెస్తున్నామని వైవీ సుబ్బారెడ్డి మీడియా ముందు చెప్పారు. ఒక చేత్తో అంత ధరకు కొంటూ, మరో చేత్తో కేజీ 320 చెల్లించినప్పుడు ఇంత వ్యత్యాసం ఎలా వస్తుంది? అన్న ఆలోచన ఎందుకు చేయలేదు?
- వాస్తవానికి ఈ నెయ్యి కోసం రాజస్థాన్, గుజరాత్‌లలో సంప్రదాయ గోశాలల నుంచి నెయ్యి తెస్తున్నట్టూ, పైగా అలాంటి గోశాలలు టెండర్లలో పాల్గొని ధర విషయంలో పోటీ పడలేవు కాబట్టి, దాతల సహాయంతో నేరుగా ఆ నెయ్యిని దానం రూపంలో తీసుకుంటున్నట్టు అప్పటి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మీడియాతో చెప్పారు.
- అంటే స్వచ్ఛమైన ఆవు నెయ్యి టెండర్లలో పోటీపడటం కష్టమనుకున్న సుబ్బారెడ్డి, అదే నెయ్యి కోసం ఏకంగా రివర్స్ టెండరింగ్‌కు కూడా వెళ్లారు. అప్పుడు కల్తీ అవుతుందన్న బేసిక్ లాజిక్ ఎందుకు వదిలేశారు?

ఫొటో సోర్స్, Sridhr Raju
3. ఆవు పాలలో సహజంగా కొవ్వు శాతం 4 ఉంటుందని చెబుతారు. ఆ ప్రకారం సుమారు రోజుకు టీటీడీ 15 టన్నుల నెయ్యి కావాలంటే దాన్ని దాదాపు 6 లక్షల లీటర్ల ఆవు పాల నుంచి తీయాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. మొత్తం భారత దేశంలో అన్ని లక్షల లీటర్ల ఆవు పాలు సేకరించే సామర్థ్యం ఉన్న డెయిరీలను వేళ్లపై లెక్క పెట్టవచ్చు. మరి ప్రైవేటు వారు అంత నెయ్యి ఎలా తెస్తారన్న పరిజ్ఞానం టీటీడీకి అప్పుడు ఎందుకు లేకుండా పోయింది?
4. నెయ్యి టెండర్లలో పాల్గొనే డెయిరీకి కనీసం 4 లక్షల లీటర్ల పాలను ప్రాసెస్ చేసే సామర్థ్యం ఉండాలి, తమ మార్కెట్ కెపాసిటీ కంటే 8 టన్నుల నెయ్యి అదనంగా ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉండాలనే నిబంధనలు ఎందుకు సడలించారు? 250 కోట్ల కనీస టర్నోవర్ నిబంధనను 150 కోట్లకు ఎందుకు తగ్గించారు? (ఇది సీఎం చంద్రబాబు స్టేట్మెంట్‌లోని వివరం)

ఫొటో సోర్స్, I&PR
తెలుగు దేశం పార్టీ చెప్పాల్సిన సమాధానాలు:
- జులై 23న టీటీడీకి వచ్చిన నివేదికను సెప్టెంబర్ 18న ముఖ్యమంత్రి మాట్లాడటం, సెప్టెంబర్ 19న ఏ అధికారిక వ్యక్తి నుంచీ కాకుండా, తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేఖర్ల సమావేశంలో ఆ నివేదిక విడుదల కావడం, 20వ తేదీన ఈవో దాన్ని ధ్రువీకరించడం – ఈ మూడూ వరుసగా జరిగాయి.
- యానిమల్ ఫ్యాట్ పక్కాగా వాడారని ఎప్పుడు తెలిసింది? ఏ ప్రాతిపదికన యానిమల్ ఫ్యాట్ కల్తీని నిర్ధరిస్తారు? తెలిసిన తరువాత బయట పెట్టడానికి ఇంత ఆలస్యం ఎందుకు జరిగింది? టీటీడీ బోర్డు కాకుండా తెలుగుదేశం నాయకులు నివేదిక విడుదల చేయడంలో ఉన్న మతలబు ఏంటి?
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














