తిరుపతి లడ్డూ ప్రసాదం: నెయ్యి చుట్టూ నెలకొన్న వివాదం ఏంటి? టీటీడీ ఈవో ఏం చెప్పారు?

ఫొటో సోర్స్, FACEBOOK
- రచయిత, బళ్ల సతీశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
తిరుమల ప్రసాదాల్లో జంతు కొవ్వు కలిసిందన్న చంద్రబాబు వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. టీటీడీ ఈవో శ్యామల రావు కూడా వాటిని ధృవీకరించారు.
తిరుమలలో ప్రసాదాల కోసం పెద్ద ఎత్తున నెయ్యి వాడతారు. అయితే గతంలో వనస్పతి మాత్రమే కలిసి కల్తీ అయిందని చెప్పిన ఈవో శ్యామల రావు, తాజాగా పాత్రికేయుల సమావేశంలో జంతు కొవ్వు కూడా ఉందని ప్రకటించారు.
కొత్త ప్రభుత్వం వచ్చాక తిరుమల తిరుపతి దేవస్థానాల ఈవోగా శ్యామల రావును నియమించింది.
‘‘నేను బాధ్యతలు తీసుకునే సమయంలో సీఎంను కలవగానే, ప్రసాదాల నాణ్యత గురించే ఆయన నాకు చెప్పారు. అందుకే నాణ్యత మీద దృష్టి పెట్టాను. అప్పటికి ఐదు ప్రైవేటు సంస్థలు నెయ్యి సరఫరా చేస్తుండగా, నాణ్యత విషయంలో మేం హెచ్చరించిన తరువాత అందరూ వైఖరి మార్చుకున్నారు. కానీ ఒక సంస్థ నాణ్యత పాటించలేదు. దీంతో వారిని బ్లాక్ లిస్టులో పెట్టే ప్రక్రియ ప్రారంభించాం’’ అని ఈవో మీడియాతో అన్నారు.

జూలై 23న జరిగిన పాత్రికేయుల సమావేశంలో శాకాహార కొవ్వు (వనస్పతి)తో నెయ్యి కల్తీ అయిందని మీడియా ముందు చెప్పిన ఈవో, గురువారం జరిగిన సమావేశంలో మాత్రం జంతు కొవ్వు కూడా కలిసిందని చెప్పారు.
ల్యాబ్ ఇచ్చిన నివేదికను నిపుణులతో మాట్లాడి అర్థం చేసుకునేందుకు తనకు సమయం పట్టిందని అన్నారు. శాకాహార కొవ్వుతో కల్తీని నిర్ధరించే బీటాసైటోస్టెరాల్ కూడా అందులో ఉందని ఈవో చెప్పారు.
తమిళనాడుకు చెందిన ఏఆర్ డెయిరీ ఫుడ్స్ అనే సంస్థ నుంచి పది ట్యాంకర్ల నెయ్యి రాగా, అందులో ఆరు ఉపయోగించామని, నాలుగు ట్యాంకర్ల శాంపిల్ పంపించామని, వాటిపై వచ్చిన ఫలితాల్లోనే ఈ కల్తీ గురించి తెలిసిందని ఆయన అన్నారు.
అయితే ఉపయోగించినవి ఆరు ట్యాంకర్లేనా, ఇంకా ఉన్నాయా, ఉపయోగించిన ట్యాంకర్లలో కల్తీ పరీక్షలు చేశారా? చేయలేదా? అన్న సమాచారంపై స్పష్టత రావాల్సి ఉంది.
ఏఆర్ ఫుడ్స్‌ను బ్లాక్ చేసే ప్రక్రియ ప్రారంభించడంతో పాటూ, చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్టు ఈవో శ్యామల రావు తెలిపారు.
అయితే దీనిపై ఏఆర్ డెయిరీ ఫుడ్స్ సంస్థ స్పందించింది. ‘‘జూలైలో మొత్తం 16 టన్నుల నెయ్యి టీటీడీకి సరఫరా చేశాం. ఎలాంటి కల్తీలేని స్వచ్ఛమైన నెయ్యి ఇచ్చాం’’ అని ఆ సంస్థ ప్రకటించింది.
దాంతో పాటూ ఎస్ఎంఎస్ ల్యాబ్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ ల్యాబులో జూన్ 3వ తేదీన చేయించిన పరీక్షల రిపోర్టును జత చేసింది.
ఈ ఏఆర్ సంస్థ 2024 మార్చి 12న టెండర్ వేయగా, మే 8న టెండరు ఖరారై, మే 15న సరఫరా ప్రారంభించిందని, ఈ సంస్థ కిలో ఆవు నెయ్యి 319 రూపాయలకు ఇవ్వడానికి అంగీకరించిందని ఈవో శ్యామలరావు వెల్లడించారు.
కానీ, ఆ తర్వాత ప్రభుత్వానికి టీటీడీ సమర్పించిన నివేదికలో జూన్ 12 నుంచి సరఫరా ప్రారంభించినట్లు పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, TTD
ఎన్డీడీబీ కాఫ్ నివేదికలో ఏముంది?
నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డు (ఎన్డీడీబీ) వారి సీఏఎల్ఎఫ్ ల్యాబుకు పరీక్ష కోసం నెయ్యి శాంపిళ్లను పంపింది టీటీడీ.
ఆ శాంపిళ్లు జూలై 17న తమకు అందినట్టు 23న పరీక్షలు పూర్తి చేసినట్టు ఆ నివేదికలో ఉంది. వాటర్ అండ్ ఫుడ్ అనాలసిస్ లేబొరేటరీ, టీటీడీ పేరుతో ఈ నివేదిక వచ్చింది. అందులోని అనెగ్జర్ 1 ఇప్పుడు వివాదానికి కేంద్రం.
‘‘నెయ్యి ఎస్ వాల్యూ పరిమితి కంటే సంఖ్య ఎక్కువ, లేదా తక్కువ ఉంది. అలా ఉంటే, ఆ నెయ్యిలో వేరే ఏదో బయటి కొవ్వులు చేరినట్టు భావించాలి’’ అంటూ ఆ నివేదికలో ఆ ఎస్ వాల్యూ, బయటి కొవ్వుల జాబితా రాశారు.
ఈ ల్యాబ్ ఫలితాల ప్రకారం, ఐదు ఎస్ వాల్యూలను పరిశీలించగా, ఐదుకు ఐదు శాంపిళ్లు నాణ్యతా ప్రమాణాల్లో విఫలమయ్యాయి.
ఎస్ వాల్యూ ప్రకారం చూస్తే టీటీడీ పంపిన రెండు శాంపిళ్లూ, ఐదు ప్రమాణాల్లోనూ కల్తీ అయినట్టు.
అయితే వారిచ్చిన నివేదికలో కల్తీ కారకాలలో శాకాహార కొవ్వులు, మాంసాహార కొవ్వులూ రెండూ కలగలసి ఉన్నాయి.
కేవలం నాలుగో కల్తీకారకం మాత్రమే లాడ్ అంటే పంది కొవ్వు విడిగా ఉంది. మూడవ కల్తీకారకంగా పామ్ ఆయిల్, బీఫ్ కొవ్వు-రెండూ ఇచ్చారు. పామాయిల్ వల్ల కల్తీయా లేక బీఫ్ వల్ల కల్తీయా అన్నది మాత్రం స్పష్టంగా లేదు.
సరిగ్గా, మూడవ నంబర్ కల్తీరకం విషయంలోనే, ఉండాల్సిన మోతాదుకు, శాంపిల్‌కూ మధ్య విపరీతమైన వ్యత్యాసం ఉంది. ఓవరాల్ నాణ్యత చూపే పారామీటర్లో కూడా ఆ శాంపిళ్లు విఫలం అయ్యాయి.
ఈ నివేదికపై ల్యాబ్ యజమాని ఎన్డీడీబీని బీబీసీ ప్రతినిధులు సంప్రదించారు.
‘‘మాకు అందిన శాంపిళ్ల వివరాలు రహస్యంగా ఉంటాయి. పంపిన వారి పేరు, ఊరు వివరాలు ఉండవు. మాకు శాంపిల్ అందినది వాస్తవం. కానీ, అందులో వచ్చిన ఫలితాల గురించి మేమేమీ చెప్పబోము. ఇక్కడ ప్రక్రియ అంతా రహస్యంగానే ఉంటుంది. ఆ శాంపిల్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఎవరికీ తెలియదు. మా దగ్గర నిపుణులు అడిగిన పరీక్షలు చేసి ఇస్తారు అంతే’’ అని ఎన్డీడీబీ అధికారి ఒకరు బీబీసీతో చెప్పారు.
అదే సమయంలో తమ పేర్లను వెల్లడించేందుకు ఇష్టపడని ఇద్దరు నిపుణులతో కూడా బీబీసీ మాట్లాడింది. వారిద్దరూ డెయిరీ, ఫుడ్ సేఫ్టీ రంగంలో పనిచేసేవారే. వారు ఆ ల్యాబ్ నివేదికలను చూశారు.
‘‘నెయ్యి కల్తీ అనేది వాస్తవం. కానీ అది శాకాహర కొవ్వులా, జంతువుల కొవ్వులా అనేది కేవలం ఈ నివేదికలోని పరీక్షలతో మాత్రమే చెప్పలేం. దానికి మరిన్ని పరీక్షలు చేయాలి. సాధారణంగా 6 లక్షల లీటర్ల ఆవుపాలు ప్రాసెస్ చేస్తే, 15 టన్నుల నెయ్యి వస్తుంది. అంత పెద్దస్థాయిలో ఆవు పాల సేకరణ వ్యవస్థ టీటీడీకి సరఫరా చేసే కంపెనీలకు లేదని నా అభిప్రాయం. పైగా వారిచ్చే ధర చాలా తక్కువ. కాబట్టి, కచ్చితంగా కల్తీ ఉండి ఉంటుంది. కానీ దేనితో కల్తీ అనేది నేను చెప్పలేను’’ అని వారిలో డెయిరీ రంగానికి చెందిన నిపుణుడు అన్నారు.
‘‘ఈ విషయంలో నాకు ఒక సంగతి తెలుసు. గతంలో నాకు తెలిసిన, ఒక ప్రభుత్వ రంగ డెయిరీ సంస్థ ప్రతినిధులు, తాము నెయ్యి ఇస్తామని టీటీడీ దగ్గరకు వెళ్ళగా వారు పట్టించుకోలేదు. ప్రస్తుత కంపెనీలు ఇస్తున్నంత తక్కువ ధరకు నెయ్యి ఇవ్వడం సాధ్యం కాదని సదరు డెయిరీ ప్రతినిధి టీటీడీ పాత ఈవో, చైర్మన్లకు చెప్పారు. కానీ వారు వినలేదట’’ అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, RAJESH
‘‘ఈ ఒక్క నివేదిక ఆధారంగా జంతు కొవ్వు కలిసిందా లేదా అని చెప్పలేం. కలసి ఉండొచ్చు, కలవకపోనూ ఉండొచ్చు. నిర్ధరణ చేయలేం. కాకపోతే భారతదేశంలో సాధారణంగా నెయ్యి కల్తీలో ఎక్కువగా పామాయిల్ వాడతారు. టీటీడీ విషయంలో ఏం జరిగిందో నాకు తెలియదు’’ అని ఫుడ్ సేఫ్టీ రంగంలో పనిచేస్తున్న నిపుణుడు బీబీసీతో అన్నారు.
అయితే, అదే నివేదికలో కింద పలు షరతులు కూడా పేర్కొన్నారు. ఒకవేళ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో శాంపిల్ సేకరిస్తే, అప్పుడు ఫలితాలు తప్పుగా వచ్చే అవకాశం ఉందని ఆ ల్యాబ్ నివేదికలో ఉంది.
ఒకే ఆవు పాల నుంచి తీసిన నెయ్యి, రేప్ సీడ్ (ఆవాల తరహా నూనె), పామాయిల్, ప్రత్తి నూనె వంటివి ఆ ఆవులకు మేతలో విపరీతంగా వాడినా, ఆవుకు విపరీతమైన పోషకాహార లోపం లేదా తక్కువ ఆహారం అందినా, జున్ను పాల నుంచి చేసినా, కొలెస్ట్రాల్ తీసేయడం వంటివి చేసినా, కొన్ని ప్రత్యేక పద్ధతుల్లో శాంపిళ్లు తీసుకున్నా ఫలితాలు తప్పుగా వచ్చే అవకాశం ఉందని ఆ నివేదికలో రాశారు.
అసలు ఎన్డీడీబీ ల్యాబ్ నివేదిక స్పష్టంగా ఏం చెబుతోంది? అని అర్థం చేసుకునేందుకు పలువురు డెయిరీ, నూట్రిషన్, కెమికల్, ఫుడ్ సేఫ్టీ రంగాలకు చెందిన వారితో మాట్లాడేందుకు బీబీసీ ప్రయత్నించింది. కానీ, వివాదం తీవ్రత దృష్ట్యా దానిపై మాట్లాడటానికి ఎవరూ ఆసక్తి చూపలేదు.
ఇదే మొదలా?
నిజానికి టీటీడీ వారు నెయ్యి ట్యాంకర్లను వెనక్కు పంపడం చాలా సందర్భాల్లో జరిగింది.
స్పష్టమైన లెక్క ఇంకా అందనప్పటికీ, వైసీపీ, తెలుగుదేశం రెండు ప్రభుత్వాల హయాంలోనూ పదుల సంఖ్యలో నెయ్యి ట్యాంకర్లను, నాణ్యత బాగాలేని కారణంగా వెనక్కు పంపినట్టు పలువురు టీటీడీ పాలక మండలి సభ్యులు, అధ్యక్షులు చెప్పారు.
అయితే, టీటీడీ వద్ద నెయ్యి పరీక్షించే ల్యాబ్ లేదని ఈవో చెప్పగా, దాని నాణ్యతను ఎలా పరీక్షించారు, ఏ ప్రాతిపదికన ఆ ట్యాంకర్లను వెనక్కు పంపారు అన్నది మాత్రం తెలియలేదు.

ఫొటో సోర్స్, RAJESH
మళ్లీ నందిని నెయ్యి
సెప్టెంబరు 4 వ తేదీ నుంచి కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ వారి నందిని నెయ్యి తిరిగి టీటీడీకి రావడం మొదలైంది.
ఆరోజు టీటీడీ విడుదల చేసిన ప్రెస్ నోట్‌లో కూడా ఒక కంపెనీ కల్తీ నెయ్యి సరఫరా చేస్తున్నట్టు నిర్ధరణ అయిందని ఈవో చెప్పారు. కానీ, జంతు కొవ్వు అనే మాట ఆయన వాడలేదు.
కొత్తగా వేసిన టెండర్లలో పలు నిబంధనలు విధించి, నాణ్యమైన నెయ్యిని సేకరిస్తున్నట్టు అప్పట్లో ఆయన చెప్పారు. ఆ దిశగా ఒక టెండర్ కూడా విడుదల అయింది. ఇంకా ఆ టెండర్ గడువు పూర్తి కాలేదు.
ధర తేడానే అసలు కారణమా?
గత ప్రభుత్వ హయాంలో టెండర్ ఇచ్చినప్పుడు 319 రూపాయలకే కేజీ ఆవు నెయ్యి సరఫరా చేసేలా కంపెనీ అంగీకరించింది.
కానీ, బయటి పరిస్థితులు చూసినప్పుడు ఆ ధరకు ఆవు నెయ్యి ఇవ్వడం సాధ్యం కాదని, కల్తీ జరుగుతుందని పలువురు నిపుణులు విశ్లేషించారు.
ఇప్పుడు అదే విషయాన్ని టీటీడీ అంగీకరించింది. ప్రస్తుతం కేజీ 475 రూపాయలకు నందిని సంస్థ నుంచి నెయ్యిని తీసుకుంటోంది. దీంతో పాటూ ఇతర సంస్థల నుంచి కూడా నెయ్యిని కొంటోంది టీటీడీ.

ఫొటో సోర్స్, Getty Images
ప్రసాదం చుట్టూ రాజకీయం:
అయితే ప్రసాదం నాణ్యత, జంతు కొవ్వు అంశంపై భక్తుల మనోభావాలు దెబ్బతినడంతో పాటూ రాజకీయం కూడా అంతే తీవ్రంగా జరుగుతోంది.
‘‘నెయ్యి శాంపిళ్లు బాగా లేకపోతే గతంలో కూడా తిరస్కరించి, ట్యాంకర్లను వెనక్కు పంపారు. ఇతర వస్తువులు కూడా నాణ్యత లేకపోతే తిరస్కరిస్తారు. కానీ ప్రత్యర్థులపై దాడికి దీన్ని వాడకూడదు. నిజంగా తప్పు జరిగిందని తేలితే ఎవర్నీ వదలకుండా శిక్షించండి’’ అని తిరుమలకు చెందిన కార్మిక సంఘాల నాయకుడు మురళి అన్నారు.
‘‘కర్ణాటక తప్ప మరే రాష్ట్రంలోనూ పెద్ద సంఖ్యలో ఆవులు లేవు. పంజాబ్‌లో ఉన్నా దూరం వల్ల ఇక్కడకు నెయ్యి తీసుకురావడం కష్టం. కానీ, కర్ణాటక డెయిరీ నుంచి ధరల వంకతో కొనడం మానేసి, ప్రైవేటు కంపెనీలకు ఇవ్వడం వల్లనే సమస్య అంతా వచ్చింది. ప్రైవేటు కంపెనీల వారు విదేశాల నుంచి తెప్పించిన బటర్ ఆయిల్‌తో (బటర్ ఆయిల్ అంటే వెన్న, చీజ్ వంటి వాటి నుంచి తీసే పదార్థం) నెయ్యిని కల్తీ చేస్తారు. దానికి రంగు కలుపుతారు. టీటీడీ దగ్గర సరైన పరీక్షా సదుపాయాలు కూడా లేవు. నిజానికి టీటీడీ టెండర్ దక్కాలంటే రెండున్నర లక్షల లీటర్ల పాలను ప్రాసెస్ చేసే సామర్థ్యం ఉండాలి. అవేవీ చూడకుండా టెండర్ ఇచ్చారు. ఇప్పటికీ నందిని నుంచి 35 శాతమే వస్తోంది. మిగతాది ప్రైవేటు కంపెనీల నుంచే వస్తోంది’’ అని తెలుగుదేశం నాయకులు ఓవీ రమణ బీబీసీతో అన్నారు .
గతంలో తీసిన నెయ్యి శాంపిళ్లు కూడా ఉన్నాయి. వాటన్నింటినీ మళ్లీ పరీక్షకు పంపాలని ఆయన డిమాండ్ చేశారు.
తిరుమలకు సొంతంగా నెయ్యి పరీక్షించే ల్యాబ్ లేదని, 75 లక్షల రూపాయలు ఖర్చయ్యే ఆ ల్యాబ్‌ను గతంలో ఎందుకు ఏర్పాటు చేయలేదో తనకు తెలియదని ప్రస్తుత ఈవో శ్యామల రావు మీడియాతో అన్నారు.
అయితే, గుజరాత్ ఎన్డీడీబీ వారు ప్రస్తుతానికి ఆ ల్యాబ్ సామాగ్రిని టీటీడీకి దానంగా ఇవ్వడానికి అంగీకరించారని, త్వరలోనే ఆ ల్యాబ్ ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు.
ప్రస్తుతానికి మైసూరులోని సీఎఫ్‌టీఆర్ఐ సంస్థలో శిక్షణ పొందిన సిబ్బంది ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహిస్తున్నట్టు శ్యామల రావు చెప్పారు.
దీనిపై శుక్రవారంనాడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి కూడా స్పందించారు. బాబు వంద రోజుల పాలన బాగాలేదని జనం మాట్లాడకుండా ఉండేందుకు డైవర్షన్ కోసం ఈ అంశం తెచ్చారని, చంద్రబాబు దేవుడిని కూడా రాజకీయాలకు వాడుకునే దుర్మార్గుడని వ్యాఖ్యానించారు.
‘‘స్వచ్ఛమైన నెయ్యి సేకరించేందుకు టీటీడీలో మంచి పద్ధతులు ఉన్నాయి. అనేక సందర్భాల్లో నెయ్యి నాణ్యంగా లేదని ట్యాంకర్లను టీటీడీ తిప్పి పంపింది. టీటీడీలో 3 పరీక్షలు పాసైన తరువాత మాత్రమే నెయ్యి వాడతారు. గతంలో బాబు హయాంలో 14-15 ట్యాంకర్లు, మా హయాంలో 18 ట్యాంకర్ల నెయ్యి వెనక్కు పంపాం. అది సర్వసాధారణ ప్రక్రియ. కానీ, జూలై 23న వచ్చిన నివేదికను రెండు నెలలు ఆపి, సరిగ్గా వంద రోజుల పాలన సమయంలో విడుదల చేయడం ఏంటి? రెండు నెలలు ఈ నివేదికను ఎందుకు ఆపారు? పైగా ఆ నివేదిక టీటీడీ నుంచి కాకుండా తెలుగుదేశం ఆఫీసు నుంచి ఎందుకు విడుదల అయింది. ఎందుకు ఆలస్యం చేశారు?’’ అని జగన్ ప్రశ్నించారు.
వైవీ సుబ్బారెడ్డి 45 సార్లు అయ్యప్పమాల వేసుకున్నారని, అంతకంటే మంచి వ్యక్తిని టీటీడీకి ఎలా తెస్తాం అని ఆయన ప్రశ్నించారు.
బీజేపీ, జనసేన, కాంగ్రెస్ సహా భారతదేశంలో పలువురు ముఖ్య నాయకులు, ఇతరత్రా ప్రముఖులు ఈ నెయ్యి విషయంపై స్పందించారు. సమగ్ర విచారణ జరగాలని డిమాండ్ చేశారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














