తిరుమల లడ్డూ వివాదం: మాజీ సీఎం జగన్ ఇంటి దగ్గర ఏం జరిగింది? ప్రధానికి రాసిన లేఖలో జగన్ ఏం చెప్పారు?

ఫొటో సోర్స్, X/BJP4Andhra
- రచయిత, గరికిపాటి ఉమాకాంత్
- హోదా, బీబీసీ కోసం, విజయవాడ నుంచి
తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడారనే వివాదం అంతకంతకూ ముదురుతోంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో స్వచ్ఛమైన నెయ్యికి బదులు ‘యానిమల్ ఫ్యాట్’ కలిసిన నెయ్యి ఉపయోగించారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం (సెప్టెంబర్ 18) ఆరోపించడంతో ఈ వివాదం మొదలైంది.
ఆదివారం (సెప్టెంబర్ 22) గుంటూరు జిల్లా తాడేపల్లిలోని మాజీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి నివాసాన్ని భారతీయ జనతా యువ మోర్చా(బీజేవైఎం) కార్యకర్తలు ముట్టడించే యత్నం చేశారు.
ఇంటి గేట్ల ఎదుట బైఠాయించి నినాదాలు చేశారు. జగన్ ఇంటి గోడలపై ఎరన్రి సింధూరం పూశారు. గేట్లకు కాషాయ రంగు రాశారు.
పోలీసులు వారిని అడ్డుకోవడంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీజేవైఎం శ్రేణులను పోలీసులు అదుపులోకి తీసుకుని, అక్కడి నుంచి తరలించారు.

ఫొటో సోర్స్, YSJagan/FB
ప్రధాని మోదీకి జగన్ లేఖ
మరోవైపు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఏపీ మాజీ సీఎం వైఎస్. జగన్మోహన్ రెడ్డి లేఖ రాశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు తప్పుడు ప్రచారాలతో టీటీడీ ప్రతిష్టను దిగజార్చుతున్నారంటూ జగన్ ఆ లేఖలో రాశారు.
‘‘లడ్డూ వివాదంలో వాస్తవాలు ప్రపంచానికి తెలియాలి. నిజాలు నిగ్గు తేల్చాలి’’ అని జగన్ అన్నారు.
’’చంద్రబాబు దుష్ప్రచారం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్ల మంది భక్తుల మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉంది. సున్నితమైన అంశాన్ని రాజకీయ అవసరాల కోసం వాడుకుంటున్నారు. సీఎం పదవి ప్రతిష్టను దిగజార్చే విధంగా వ్యవహరించారు. టీటీడీ సంప్రదాయాలపై అనుమానాలు పెంచే విధంగా మాట్లాడారు’’ అని ఆ లేఖలో పేర్కొన్నారు.
తిరుమలకు వచ్చే నెయ్యి నాణ్యతను పరీక్షించే విధానం దశాబ్దాలుగా కొనసాగుతోందని జగన్ చెప్పారు.
గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా 14 నుంచి 15 సార్లు నెయ్యి ట్యాంకర్లను వెనక్కి పంపారని, తాము అధికారంలో ఉన్నప్పుడు కూడా 18 సార్లు నెయ్యి ట్యాంకర్లను వెనక్కి పంపామని ఆ లేఖలో వివరించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1

ఫొటో సోర్స్, @Ganta_Srinivasa
జగన్ లేఖపై టీడీపీ స్పందన
తిరుమల లడ్డూ వివాదంపై ప్రధాన మంత్రి మోదీకి మాజీ సీఎం వైఎస్. జగన్ లేఖ రాయడంపై టీడీపీ సీనియర్ నేత, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు స్పందించారు.
‘‘దొంగే దొంగా దొంగా అని అరిచినట్టుగా వైఎస్ జగన్ తీరు ఉంది. ఆయన ప్రభుత్వ హయాంలో తప్పులు జరిగితే ఆయనే ప్రధానమంత్రికి లేఖ రాయడం ఏంటి?’’ అని శ్రీనివాసరావు అన్నారు.
‘‘వైసీపీ ప్రభుత్వ హయాంలో తప్పులు జరిగినట్టు అన్ని సంస్థలూ ధ్రువీకరిస్తుంటే.. మాజీ సీఎం జగన్ ఇంకా ఇలా మాట్లాడటం సరికాదు’’ అని గంటా అన్నారు.

ఫొటో సోర్స్, JanaSenaParty
పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష
తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడారంటూ.. ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. గుంటూరు జిల్లా నంబూరులోని దశావతార వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఈ దీక్ష చేస్తున్నారు. 11 రోజులపాటు దీక్ష కొనసాగించి, అనంతరం తిరుమలకు వెళ్లనున్నారు.
తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో మహా అపచారం జరిగిందని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.
దాదాపు 300 ఏళ్లుగా తిరుమలలో లడ్డూ ప్రసాదాన్ని అందిస్తున్నారని, భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా చూడాల్సిన బాధ్యత పాలకులపై ఉందన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














