బిల్కిస్‌ బానో కేసు: గుజరాత్ ప్రభుత్వ రివ్యూ పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు, అసలేం జరిగిందంటే..

బిల్కిస్ బానో

ఫొటో సోర్స్, CHIRANTANA BHATT

ఫొటో క్యాప్షన్, బిల్కిస్ బానో

బిల్కిస్‌ బానో కేసుకు సంబంధించి 2024 జనవరిలో ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలంటూ గుజరాత్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.

ఈమేరకు సుప్రీంకోర్టు గురువారం తీర్పు వెలువరించింది. ఈ విషయాన్ని బీబీసీ ప్రతినిధి ఉమాంగ్ పొద్దార్ ధృవీకరించారు.

బిల్కిస్‌ బానో కేసులో 11 మంది దోషులను గుజరాత్ ప్రభుత్వం 2022 ఆగస్టులో విడుదల చేసింది. దానిని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. వారిని విడుదల చేసే అధికారం గుజరాత్ ప్రభుత్వానికి లేదని 2024 జనవరి 8న సుప్రీంకోర్టు చెప్పింది.

అయితే, ఆ తీర్పును పునఃసమీక్షించాలంటూ గుజరాత్ ప్రభుత్వం 2024 ఫిబ్రవరిలో సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

సుప్రీంకోర్టు చేసిన కొన్ని వ్యాఖ్యలను ఉటంకిస్తూ, "ఈ వ్యాఖ్యలు పూర్తిగా అసమంజసమైనవని, కేసు రికార్డుకు విరుద్ధమైనవి మాత్రమే కాదు, రాష్ట్ర ప్రభుత్వానికి అప్రతిష్ఠ తెచ్చేవి కూడా" అని గుజరాత్ ప్రభుత్వం పేర్కొంది.

దోషులను రక్షించే విధంగా గుజరాత్ ప్రభుత్వం వ్యవహరించినట్లు కనిపిస్తోందని, దోషుల్లో ఒకరైన రాధేశ్యామ్ భగవాన్ దాస్ షాను రక్షించడంలో ప్రభుత్వ ప్రమేయం స్పష్టంగా కనిపిస్తోందని కోర్టు వ్యాఖ్యానించింది.

ఈ వ్యాఖ్యలను తొలగించాలంటూ గుజరాత్ ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేసింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
సుప్రీంకోర్టు

ఫొటో సోర్స్, Getty Images

సుప్రీంకోర్టు ఏం చెప్పింది?

2024 జనవరి 8న ఇచ్చిన తీర్పులో ఎటువంటి పొరపాట్లు లేవని, రివ్యూ పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఉజ్వల్ భుయాన్‌లతో కూడిన సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది.

‘‘రివ్యూ పిటిషన్‌ను క్షుణ్ణంగా పరిశీలించాం. ఆ తీర్పులో ఎటువంటి పొరపాట్లు లేవు. ఆ తీర్పును పునఃసమీక్షించాలంటూ దాఖలైన ఈ పిటిషన్‌కు విచారణార్హత లేదు’’ అంటూ సుప్రీంకోర్టు గుజరాత్ ప్రభుత్వ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది.

ఈ పిటిషన్‌తోపాటు బిల్కిస్‌ బానో కేసులో మరో దోషి అయిన రమేష్ రూపాభాయ్ చందన్ తనను తిరిగి జైలుకు పంపించాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రద్దుచేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా ధర్మాసనం తోసిపుచ్చింది.

బిల్కిస్ బానో

ఫొటో సోర్స్, Getty Images

అసలు కేసు ఏంటి?

2002 గుజరాత్ అల్లర్ల సమయంలో అహ్మదాబాద్ సమీపంలోని రంధిక్‌పూర్ గ్రామంలో అయిదు నెలల గర్భవతిగా ఉన్న బిల్కిస్ బానోపై ఓ గుంపు సామూహిక అత్యాచారానికి పాల్పడింది. ఆమె మూడేళ్ల కూతురు సాలేహాను దారుణంగా హత్య చేశారు.

బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారానికి పాల్పడి, ఆమె కుటుంబ సభ్యుల్లో ఏడుగురిని హత్య చేసిన కేసులో 11 మందికి 2008 జనవరి 21న ముంబయిలోని సీబీఐ ప్రత్యేక కోర్టు జీవిత ఖైదు విధించింది. తరువాత ఆ శిక్షను బాంబే హైకోర్టు సమర్థించింది.

దోషుల్లో ఒకరైన రాధే శ్యామ్ షా, 15 సంవత్సరాలకు పైగా జైలు శిక్ష అనుభవించిన తరువాత క్షమాభిక్ష కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ఆయన క్షమాభిక్ష అంశాన్ని పరిశీలించాలని గుజరాత్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఆ తరువాత, గుజరాత్ ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కేసులో మొత్తం 11 మంది దోషుల శిక్షను రద్దు చేయాలని ఈ కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయించింది. వారిని విడుదల చేయాలని సిఫారసు చేసింది. చివరకు, ఆగస్టు 15న జీవిత ఖైదు అనుభవిస్తున్న ఆ 11 మంది జైలు నుంచి విడుదలయ్యారు.

వారిని విడుదల చేయడాన్ని బిల్కిస్ బానోతోపాటు పలువురు సుప్రీంకోర్టులో సవాలు చేశారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)