‘అర్జున ఆస్టరాయిడ్ బెల్ట్’ నుంచి భూమికి రెండో చంద్రుడు.. సెప్టెంబర్ 29న వస్తున్నాడు

ఫొటో సోర్స్, Getty Images
భూమికి రెండో చంద్రుడు రానున్నాడు. భూమి గురుత్వాకర్షణ శక్తి పరిధిలోకి ఓ చిన్న గ్రహశకలం వచ్చి చేరింది. ఇప్పుడదే ‘‘చిన్నపాటి చంద్రుడి’’ గామారింది.
సెప్టెంబర్ 29 నుంచి ఈ బుల్లి జాబిలి కొన్నినెలలపాటు ఉంటుంది. తరువాత అది భూ గురుత్వాకర్షణ శక్తి నుంచి విడిపోతుంది.
అతి చిన్నగా, మసకగా ఉండే ఈ బుజ్జి చందమామను ప్రొఫెషనల్ టెలిస్కోప్ లేకపోతే చూడలేం.
ఆగస్టు 7న నాసాకు చెందిన ఆస్టరాయిడ్ టెరెస్టిరియల్ ఇంపాక్ట్ లాస్ట్ అలర్ట్ సిస్టమ్ (అట్లాస్)ఈ గ్రహశకలాన్ని గుర్తించింది.
అమెరికన్ ఆస్ట్రనామికల్ సొసైటీకి చెందిన అధ్యయన పత్రంలో ఆ గ్రహశకలం గమనం గురించి శాస్త్రవేత్తలు ప్రచురించారు.
శాస్త్రవేత్తలు 2024 పీటీ5 గా పిలిచే ఈ గ్రహశకలం ‘అర్జున ఆస్టరాయిడ్ బెల్ట్’ నుంచి వచ్చింది. ఇది భూమి లాంటి కక్ష్య లక్షణాలను కలిగి ఉంది.
అప్పుడప్పుడు, ఈ గ్రహశకలాలు భూమికి 28 లక్షల మైళ్ల (45 లక్షల కిలోమీటర్లు) దూరం వరకు వస్తాయి.


ఫొటో సోర్స్, Nicolas Economou/Getty Images
ఇలాంటి గ్రహశకలాలు నెమ్మదిగా కదులుతాయి. ఇవి గంటకు 3,540 కిలోమీటర్ల వేగంతో కదిలేటప్పుడు.. భూగురుత్వాకర్షణ శక్తి వాటిపై బలమైన ప్రభావం చూపుతుంది.
ఇప్పుడు కూడా ఇదే జరగబోతోంది. ఈ వారాంతం నుంచి ఈ చిన్న గ్రహశకలం సుమారు రెండు నెలలపాటు భూమి చుట్టూ పరిభ్రమిస్తుంది.
ఈ గ్రహశకలం సెప్టెంబర్ 29న కక్ష్యలోకి ప్రవేశించి.. నవంబర్ 25న కక్ష్య నుంచి విడిపోతుందని ఖగోళ శాస్త్రవేత్త, ఆసమ్ ఆస్ట్రానమీ పాడ్‌కాస్ట్ ప్రయోక్త డాక్టర్ జెన్నిఫర్ మిల్లర్డ్ ‘బీబీసీ టుడే’ కార్యక్రమంలో చెప్పారు.
‘ఇది మన భూమి చుట్టూ పూర్తిగా పరిభ్రమించదు. కేవలం తాను తిరిగే కక్ష్యను కొంతమార్చుకుంటుంది. భూమి దాని భ్రమణాన్ని స్వల్పంగా మార్చుతుంది. తరువాత ఆ గ్రహశకలం తనదైన దారిలో సాగిపోతుంది’’ అని ఆమె తెలిపారు.
ఈ గ్రహశకలం సుమారు 32 అడుగుల (10 మీటర్లు) పొడవు ఉంటుంది. మన చంద్రుడితో పోలిస్తే చిన్నది. చంద్రుడి వ్యాసం సుమారు 3,474 కిలోమీటర్లు.
ఇది చాలా చిన్నది. అందుకే మనకు కనిపించదు. బైనాక్యులర్స్, సాధారణ టెలిస్కోప్‌లతో దీనిని చూడలేం.
‘‘ప్రొఫెషనల్ టెలిస్కోప్స్ ఉపయోగించి దీని చిత్రాలు తీయవచ్చు. ఈ చిన్నచుక్క వేగంగా నక్షత్రాలను దాటుతూ సాగించే ప్రయాణానికి సంబంధించిన అద్భుత చిత్రాలను ఆన్‌లైన్‌లో చూడొచ్చు’’ అని డాక్టర్ మిల్లార్డ్ చెప్పారు.
గతంలోనూ మినీ మూన్స్ కనిపించాయని, మన దృష్టికి రానివి కూడా ఎన్నో ఉండి ఉంటాయని భావిస్తున్నారు.
కొన్ని మినీ మూన్స్ మరోసారి కూడా దర్శనమిస్తుంటాయి. 2021 ఎన్ఎక్స్1 గ్రహశకలం 1981లో మినీమూన్‌గా మారింది, తిరిగి 2022లోనూ ఇది కనిపించింది.
కాబట్టి, ఈ చిన్నచందమామ ఇప్పుడు కనిపించకపోయినా.. 2025లో మరోసారి భూ కక్ష్యలోకి వస్తుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














