సూసైడ్ పాడ్: ఈ మెషీన్‌లో ఒక మహిళ ఆత్మహత్య తర్వాత పలువురిని అరెస్టు చేసిన స్విట్జర్లాండ్ పోలీసులు, ఏం జరిగింది?

సూసైడ్ పాడ్

ఫొటో సోర్స్, Getty Images

హెచ్చరిక: ఈ కథనంలో మిమ్మల్ని కలిచివేసే అంశాలుంటాయి.

‘సూసైడ్ పాడ్’ అని చెప్పే ఒక పరికరంలో ఒక మహిళ ఆత్మహత్య చేసుకున్న కేసుకు సంబంధించి స్విట్జర్లాండ్‌ పోలీసులు పలువురిని అరెస్టు చేశారు. ఈ దేశంలో ఇది మొదటి కేసు.

పోలీసులు సోమవారం షఫ్‌హౌజన్ ప్రాంతంలో సార్కో అనే సంస్థ తయారు చేసిన ఈ పాడ్‌ను ఉపయోగించుకొని ఆ మహిళ ఆత్మహత్య చేసుకున్నారని గుర్తించారు. ఆమెను ఆత్మహత్యకు ప్రేరేపించి, సహకరించారన్న అనుమానంపై పలువురిని అరెస్టు చేసినట్లు తెలిపారు.

ఘటనా స్థలంలో అధికారులు ఆ పాడ్‌ను, ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

స్విట్జర్లాండ్‌లో కొన్ని ప్రత్యేక పరిస్థితులలో వేరొకరి సహాయంతో మరణించడం (అసిస్టెడ్ డైయింగ్) చట్టబద్ధమే అయినా, దానిపై చాలా నిబంధనలు ఉన్నాయి.

సార్కో సంస్థ తయారు చేసిన పాడ్ విషయంలో గతంలో చాలా వ్యతిరేకత వ్యక్తమైంది. తమ జీవితాన్ని చాలించాలని కోరుకునే వ్యక్తి స్వయంగా ఈ మెషీన్‌ను ఆపరేట్ చేసుకోవచ్చని దీనిని తయారు చేసిన సార్కో సంస్థ ప్రచారం చేసింది.

తక్కువ జనాభా ఉండే మెరిషౌసెన్ ప్రాంతంలోని అడవిలో ఉన్న ఒక గుడిసెలో ఆ పాడ్‌ను ఉపయోగించుకున్నారని పోలీసులు తెలిపారు.

ఈ పరికరం ద్వారా ఆత్మహత్య చేసుకుంటున్న విషయం గురించి ఒక న్యాయ సంస్థ ద్వారా తమకు సమాచారం అందిందని పోలీసులు వెల్లడించారు. అరెస్టయిన వాళ్లు ఎంతమంది, వాళ్ల వివరాలు ఏమిటి అన్నది పోలీసులు వెల్లడించలేదు. మృతురాలి పేరునూ బయటపెట్టలేదు.

బీబీసీ వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఆత్మహత్యల గ్లామరైజ్?

ఈ సార్కో పరికరాన్ని ప్రోత్సహిస్తున్న ఒక గ్రూపు ఈ సంవత్సరంలో మొదటిసారి దీనిని ఉపయోగింబోతున్నట్లు జులైలో తెలిపింది.

ఈ పాడ్‌ ద్వారా మందులు లేదా వైద్యులపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా ఆత్యహత్య చేసుకోవచ్చు. ఈ పోర్టబుల్ పరికరాన్ని 3డీ-ప్రింట్ చేసి ఇంట్లోనే అసెంబుల్ చేసుకోవచ్చు. ఇలాంటి వాటి వల్ల యుథనేషియా (కారుణ్య మరణం) కేసులు పెరిగే అవకాశం ఉందని న్యాయ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

స్విట్జర్లాండ్‌లో ‘అసిస్టెడ్ డైయింగ్’కు సంబంధించి అత్యంత కట్టుదిట్టమైన చట్టాలు కొన్ని ఉన్నా, ఇలాంటి వాటిపై వ్యతిరేకతా ఉంది.

ఈ పాడ్ డిజైన్, ఆత్మహత్యను గ్లామరైజ్ చేస్తుందని విమర్శకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వైద్యపరమైన పర్యవేక్షణ లేకుండా దీన్ని ఆపరేట్ చేయవచ్చనే ఆలోచన భయాందోళనలు కలిగిస్తోంది.

యూకేలో, అనేక ఇతర యూరోపియన్ దేశాలలో ‘అసిస్టెడ్ డైయింగ్’ చట్టవిరుద్ధం. అయితే చాలా ఏళ్లుగా, ఆత్మహత్య చేసుకోవడానికి వేలాదిమంది స్విట్జర్లాండ్‌కు వెళుతున్నారు.

ఆత్మహత్య ఆలోచనల నుంచి విముక్తికి భారత్‌లో ఎలాంటి సహాయం అందుతుంది?

మానసిక ఆరోగ్య సమస్యలను మందులు, చికిత్సతో నయం చేయవచ్చు. దీని కోసం వారు మానసిక వైద్యుని సహాయం తీసుకోవాలి.

ఆత్మహత్య ఆలోచనలు వస్తున్నట్లయితే అలాంటి వారు AASRA వెబ్‌సైట్ ద్వారా సహాయాన్ని పొందవచ్చు.

ఆత్మహత్య ఆలోచనలను నుంచి తప్పించుకోవడానికి అవసరమైన కౌన్సెలింగ్ కోసం సంక్షేమ శాఖ హెల్ప్‌లైన్ – 104 లేదా స్నేహా సూసైడ్ ప్రివెన్షన్ హెల్ప్‌లైన్ – 044-24640050 కు ఫోన్ చేయవచ్చు.

మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో‌సైన్సెస్‌కు చెందిన హెల్ప్‌లైన్ నంబర్‌‌ 08046110007 ను కూడా సంప్రదించవచ్చు .

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)