చైల్డ్‌పోర్నోగ్రఫీ కేసు: సుప్రీంకోర్టు తీర్పుతో పోక్సోచట్టంలో వచ్చే మార్పేంటి?

పోక్సో యాక్ట్, చైల్డ్ పోర్నోగ్రఫీ, సుప్రీంకోర్టు, మద్రాస్ హైకోర్టు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, సిరాజ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

“అశ్లీల చిత్రాలను డౌన్‌లోడ్ చేసి చూడటం నేరం కాదు, వాటిని ఇతరులతో పంచుకోవడం నేరం” అని మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్. ఆనంద్ వెంకటేశ్ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు తప్పుపట్టింది.

చెన్నైకు చెందిన యువకుడు దాఖలు చేసిన కేసులో ఆనంద్ వెంకటేష్ ఆ తీర్పు చెప్పారు. అలాగే ఆ యువకుడిపై పెట్టిన కేసు కొట్టివేయాలని ఆదేశించారు.

ఈ తీర్పుపై 'జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ అలయన్స్' అనే స్వచ్ఛంద సంస్థ సుప్రీంకోర్టులో అప్పీలు చేసింది.

దీనిపై విచారణ జరిపిన చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం “పిల్లలకు సంబంధించిన అశ్లీల చిత్రాలను వీక్షించడంపై మద్రాస్ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేస్తున్నట్లు” సెప్టెంబర్ 23న తీర్పు చెప్పింది.

అసలీ కేసు వెనుక ఏం జరిగింది? పిల్లల అశ్లీల చిత్రాలు చూడటం గురించి చట్టం ఏం చెబుతోంది.

బీబీసీ వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
మద్రాస్ హైకోర్టు, సుప్రీంకోర్టు, తమిళనాడు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మద్రాస్ హైకోర్టు తీర్పుని సుప్రీంకోర్టు ధర్మాసనం తప్పు పట్టింది.

మద్రాసు హైకోర్టు తీర్పు

చైల్డ్ పోర్నోగ్రఫీ వీడియోలను డౌన్‌లోడ్ చేసిన 28 ఏళ్ల యువకుడిపై పిల్లలపై లైంగిక నేరాల నిరోధక చట్టం (పోక్సో), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం (ఐటి చట్టం)లోని సెక్షన్ల కింద చెన్నైలోని అంబత్తూరు పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది.

తనపై ఉన్న కేసులను కొట్టివేయాలని కోరుతూ 2024 జనవరిలో ఆ యువకుడు మద్రాసు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.

ఈ వ్యాజ్యాన్ని విచారించిన న్యాయమూర్తి ఎన్.ఆనంద్ వెంకటేష్ “అశ్లీల చిత్రాలను డౌన్‌లోడ్ చేసి చూడటం నేరం కాదు, ఇతరులతో పంచుకోవడం నేరం. అందుకే పోక్సో, ఐటీ చట్టాల ప్రకారం పిటిషనర్‌పై అభియోగాలు మోపలేరు” అని చెప్పారు. అంతే కాకుండా ఆ యువకుడిపై కేసు రద్దు చేయాలని సూచించారు.

“పోక్సో చట్టం 2012 సెక్షన్ 14 (1) ప్రకారం ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి పిల్లలను అసభ్య ప్రయోజనాల కోసం ఉపయోగించడం నేరం. ఐ.టి చట్టం-2000, సెక్షన్ 67 (బి) ప్రకారం పిల్లల అశ్లీల దృశ్యాలను చిత్రీకరించడం, చిత్రాలను ప్రచురించడం, పంపిణీ చేయడం నేరం. పిటిషనర్ అటువంటి నేరానికి పాల్పడలేదు. అందుకే అతనిపై కేసు రద్దు చేయడమైనది” అని మద్రాస్ హైకోర్టు తన తీర్పులో పేర్కొంది.

సుప్రీంకోర్టు, మద్రాస్ హైకోర్టు, పోక్సో చట్టం, ఐటీ చట్టం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సెల్‌ఫోన్‌లో చిన్నారుల అశ్లీల చిత్రాలను స్టోర్ చేయడం, వాటిని చూడటం పోక్సో చట్టం ప్రకారం నేరమని సుప్రీంకోర్టు పేర్కొంది.

సుప్రీంకోర్టు అసంతృప్తి

మద్రాస్ హైకోర్టు తీర్పుపై 'జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ అలయన్స్' అనే స్వచ్ఛంద సంస్థ 2024 మార్చిలో సుప్రీంకోర్టులో అప్పీలు చేసింది.

చెన్నై హైకోర్టు ఉత్తర్వులు బాలల హక్కులకు, చట్టానికి విరుద్ధమని సుప్రీంకోర్టులో వాదించింది.

మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి ఎన్.ఆనంద్ వెంకటేష్ ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది.

“సింగిల్ జడ్జి ఇలా ఎలా ఆదేశించగలరు? ఇది చాలా క్రూరమైనది” అని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అసహనం వ్యక్తం చేశారు. అప్పీలుపై సెప్టెంబర్ 23న తీర్పు చెప్పారు.

‘‘పిల్లల అశ్లీల చిత్రాలను చూడటంపై మద్రాసు హైకోర్టు ప్రత్యేక న్యాయమూర్తి జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేస్తున్నాం’’ అని సుప్రీంకోర్టు తెలిపింది.

సెల్‌ఫోన్‌లో చిన్నారుల అశ్లీల చిత్రాలను స్టోర్ చేయడం, వాటిని ప్రైవేట్‌గా చూడటం పోక్సో చట్టం కింద నేరమని పేర్కొంది.

'చైల్డ్ పోర్నోగ్రఫీ' అనే పదాన్ని హైకోర్టులు, రాజ్యాంగంలోని సెక్షన్లలో ఉపయోగించారు. ఈ పదానికి బదులుగా 'చైల్డ్ సెక్సువల్ అండ్ ఎక్స్‌ప్లాయిటేటివ్ అబ్యూజ్ మెటీరియల్-CSEAM' అనే పదాన్ని ఉపయోగించాలి" అని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది.

ఇందుకోసం పోక్సో చట్టాన్ని సవరించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ధర్మాసనం సిఫార్సు చేసింది.

పోక్సో చట్టం, సుప్రీంకోర్టు, మద్రాస్ హైకోర్టు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సెక్స్ కోసం మైనర్లను రవాణా చేసే వ్యక్తులకు కూడా పోక్సో చట్టం వర్తిస్తుంది

పోక్సో చట్టం ఏం చెబుతోంది?

భారతదేశంలో లైంగిక నేరాల నుంచి మైనర్లను రక్షించేందుకు జువెనైల్స్ రక్షణ చట్టం (పోక్సో యాక్ట్)ను 2012లో ప్రత్యేకంగా తీసుకొచ్చారు.

ఈ చట్టం 2012 నవంబర్ 12 నుంచి అమల్లోకి వచ్చింది.

లైంగిక దాడి, లైంగిక వేధింపులు, అశ్లీల చిత్రాలు తీయడం వంటివాటిని ఈ చట్టం కింద నేరాలుగా వర్గీకరించారు.

భారతదేశంలో 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న బాలురు లేదా బాలికలు లైంగిక సంబంధిత సమస్యలను ఎదుర్కొన్నా, దాని కారణంగా మానసిక లేదా శారీరకంగా నష్టం కలిగినా ఈ చట్టం రక్షణ కల్పిస్తుంది.

సెక్స్ కోసం మైనర్లను రవాణా చేసే వ్యక్తులకు కూడా ఈ చట్టం వర్తిస్తుంది.

నేరం రుజువైతే, నేరం స్వభావాన్ని బట్టి గరిష్టంగా జీవిత ఖైదును విధించవచ్చు.

చట్టాన్ని మరింత బలోపేతం చేసేందుకు 2019లో కొన్ని సెక్షన్లు జోడించారు.

హత్యలు, పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడిన వారికి మరణశిక్ష విధించేలా చట్టాన్ని సవరించారు.

ఈ విషయమై న్యాయవాది అజిత బీబీసీతో మాట్లాడారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని చెప్పారు.

"పోక్సో చట్టంలోని సెక్షన్ 15 ప్రకారం,ఎలక్ట్రానిక్ పరికరాలలో పిల్లల అశ్లీల వీడియోలు లేదా కంటెంట్‌ను నిల్వ చేయడం లేదా కలిగి ఉండటం శిక్షార్హమైన నేరం" అని ఆమె అన్నారు.

"చైల్డ్ పోర్నోగ్రఫీకి బదులుగా 'చైల్డ్ సెక్సువల్ అండ్ ఎక్స్‌ప్లోయిటేటివ్ అబ్యూజ్ మెటీరియల్'ని ఉపయోగించాలనే నిర్ణయం కేవలం వీడియోలకు మాత్రమే కాకుండా, ఫోటోలు, టెక్స్ట్ మెసేజ్‌లు లేదా పిల్లలకు లైంగికంగా హాని కలిగించే ఏదైనా కంటెంట్‌కు కూడా వర్తిస్తుందని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.’’ అని లాయర్ అజిత చెప్పారు.

పోక్సో యాక్ట్, సుప్రీంకోర్టు, మద్రాస్ హైకోర్టు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఎన్‌సీఆర్ బ్యూరో ప్రకారం, 2021లో దేశవ్యాప్తంగా పిల్లలపై నేరాలకు సంబంధించి దాదాపు 1.5 లక్షల కేసులు నమోదయ్యాయి.

పిల్లలపై పెరుగుతున్న నేరాలు

“నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఏటా విడుదల చేసే డేటాను పరిశీలిస్తే పిల్లలపై నేరాలు పెరుగుతున్నాయని తేలింది. అందుకే 'పిల్లలకు సంబంధించిన అశ్లీల చిత్రాలు చూడటంలో తప్పులేదు' అని మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పుని జీర్ణించుకోలేకపోయాం. సుప్రీంకోర్టు తీర్పు ఓదార్పునిస్తోంది'' అని బాలల హక్కుల కార్యకర్త ఆండ్రూ శేషురాజ్ బీబీసీతో చెప్పారు.

నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం, 2021లో దేశవ్యాప్తంగా పిల్లలపై నేరాలకు సంబంధించి దాదాపు 1.5 లక్షల కేసులు నమోదయ్యాయి. ఇది అంతకు ముందు ఏడాది 2020తో పోలిస్తే 16.2% ఎక్కువ. వీటిలో పోక్సో కేసులు 38% ఉన్నాయి.

2022లో పిల్లలపై నేరాలకు సంబంధించి దాదాపు 1.6 లక్షల (1,62,449) కేసులు నమోదయ్యాయి. 2021తో పోలిస్తే ఇవి 8.7% పెరిగాయి. వీటిలో 39.7% కేసులు పోక్సో చట్టం కింద నమోదయ్యాయి.

“భారతదేశంలో పిల్లలపై జరుగుతున్న నేరాలలో 50 శాతం కంటే తక్కువ ఘటనలపైనే కేసులు నమోదవుతున్నాయి. పోలీసుల దృష్టికి రాని కేసులు చాలా ఉన్నాయి” అని శేషురాజ్ చెప్పారు.

"అటువంటి కేసులతో వ్యవహరించేటప్పుడు, మనం నిందితుల కోణం నుంచి ఆలోచించకూడదు. పిల్లల ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరించాలి" అని శేషురాజ్ కోరారు.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)