బుల్డోజర్ యాక్షన్: ‘నిందితుడైనంత మాత్రాన ఇల్లు కూల్చేస్తారా?’ - సుప్రీంకోర్టు ప్రశ్న

ఫొటో సోర్స్, Getty Images
దేశంలోని కొన్ని రాష్ట్రాలలో నిందితుల స్థిరాస్తులను ‘బుల్డోజర్ యాక్షన్’ పేరుతో కూల్చివేస్తుండటంపై సుప్రీంకోర్టు సోమవారం తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
కేవలం నిందితుడైనంత మాత్రాన వారి ఇంటిని ఎలా కూల్చేస్తారని జస్టిస్ బీఆర్ గవయీ, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది.
కూల్చివేతలకు సంబంధించి సుప్రీంకోర్టు మార్గదర్శకాలను తయారుచేస్తుందని, ఏ కేసులోనైనా కూల్చివేతలు చేపట్టే ముందు ఈ మార్గదర్శకాలను పాటించాలని బెంచ్ సూచించింది.
‘‘ఒక కేసులో నిందితుడిగా ఉన్నంత మాత్రాన ఆ వ్యక్తికి సంబంధించిన ఇంటిని ఎలా కూల్చివేస్తారు?’’ అని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తరఫున వాదిస్తున్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను సుప్రీం కోర్టు ప్రశ్నించింది.
‘‘ఒకవ్యక్తి దోషిగా తేలినప్పటికీ, చట్టపరమైన నిబంధనలను అనుసరించకుండా ఆ వ్యక్తి ఇంటిని కూల్చివేయకూడదు’’ అని జస్టిస్ గవయీ అన్నారు.


ఫొటో సోర్స్, ANI
యూపీ ప్రభుత్వ స్పందన ఏంటి?
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ.. నిందితుడనే కారణంతో ఎవరి భవనాలనూ కూల్చేయలేదని చెప్పారు.
‘‘కూల్చివేసిన నిర్మాణాలకు సంబంధించి చాలా కాలం కిందటే నోటీసులు ఇచ్చిన విషయాన్ని అఫిడవిట్‌లో చూపాం’’ అని ఆయన తెలిపారు.
కూల్చివేత ప్రక్రియ ఒక స్వతంత్ర వ్యవహారమని, దీనికి ఎలాంటి నేరాలతో, నిందితులతో సంబంధం లేదని వివరించారు.
మరోవైపు పిటిషనర్ల తరఫు న్యాయవాదులు దుష్యంత్ దవే, సీయూ సింగ్ స్పందిస్తూ, ఏదో ఒక కేసులో నిందితులుగా ఉన్నందువల్లే వారి ఇళ్లను కూల్చివేశారని ఆరోపించారు.

ఫొటో సోర్స్, Getty Images
సుప్రీంకోర్టు మార్గదర్శకాలు
భవనాల కూల్చివేతకు చట్టాలు ఉన్నాయని, కానీ వాటిని తరచూ ఉల్లంఘిస్తున్నారని ధర్మాసనం మౌఖికంగా వ్యాఖ్యానించింది.
‘‘మేం దేశం మొత్తానికి మార్గదర్శకాలు నిర్ణయిస్తాం. అంటే దానర్థం మేం అక్రమ నిర్మాణాలను కాపాడతామని కాదు’’ అని సుప్రీంకోర్టు బెంచ్ స్పష్టంగా చెప్పింది.
ఈ విషయంలో మార్గదర్శకాలను రూపొందించడానికి రెండు పక్షాలు సూచనలతో తమ వద్దకు రావాలని కోరిన ధర్మాసనం, తదుపరి విచారణను సెప్టెంబర్ 17కి వాయిదా వేసింది.

పిటిషన్ వేసింది ఎవరు?
దేశంలోని పలు రాష్ట్రాలలో అధికారులు బుల్డోజర్లను ఉపయోగించి అనేక భవంతులను నేలమట్టం చేస్తున్న ఘటనలు ఎన్నో ఉన్నాయి.
దిల్లీలోని జహంగిర్‌పురిలో 2022 ఏప్రిల్‌లో ఇళ్ల కూల్చివేతకు సిద్ధమైనప్పుడు సుప్రీంకోర్టులో అనేక పిటిషన్లు దాఖలయ్యాయి.
2022లో జహంగిర్‌పురిలో హనుమాన్ జయంతి సందర్భంగా జరిగిన శోభాయాత్రలో మతపరమైన హింస రేగింది. దీని తరువాత ఆ ప్రాంతంలోని అక్రమ నిర్మాణాలకు నోటీసులు పంపిన అధికారులు బుల్డోజర్‌తో చర్యలకు దిగారు.
అయితే సుప్రీంకోర్టు దీనిపై స్టే విధించింది. అయితే, అధికారులెవరూ శిక్ష రూపంలో బుల్డోజర్లు ప్రయోగించరాదన్న డిక్లరేషన్ ఇవ్వాలని పిటిషనర్లు కోరారు.
పిటిషనర్లలో రాజ్యసభ మాజీ ఎంపీ, సీపీఎం నేత బృందా కారత్ కూడా ఒకరు. అప్పట్లో ఆమె జహంగిర్‌పురిలో బుల్డోజర్ ఆపరేషన్ జరుగుతున్నప్రాంతానికి చేరుకున్నారు.
ఈ కేసును సెప్టెంబర్ 2023లో కోర్టు విచారిస్తున్న సందర్భంలో.. కొంతమంది పిటిషనర్ల తరపున వాదిస్తున్న దుష్యంత్ దవే రాష్ట్రప్రభుత్వం నిందితుల ఇళ్లను కూల్చేసే కేసుల సంఖ్య పెరిగిపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కులో ఇంటి హక్కు కూడా ఒక భాగమని ఆయన అప్పట్లో వాదించారు.
కూలగొట్టిన ఇళ్లను తిరిగి నిర్మించేలా ఆదేశాలు ఇవ్వాలని ఆయన కోర్టును అభ్యర్థించారు.
రాహుల్, అఖిలేష్ ఏమన్నారు?
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
‘‘బుల్డోజర్ అన్యాయం కంటే న్యాయం పరిధి చాలా ఎక్కువని’’ ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాది పార్టీ నాయకుడు అఖిలేష్ యాదవ్ ‘బుల్డోజర్ యాక్షన్’ పై ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
‘‘ బీజేపీ రాజ్యాంగ విరుద్ధ అన్యాయమైన 'బుల్డోజర్ పాలసీ'పై సుప్రీంకోర్టు వ్యాఖ్యలను స్వాగతిస్తున్నామని లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ‘‘బుల్డోజర్ కింద మానవత్వాన్ని, న్యాయాన్ని అణచివేస్తున్న బీజేపీ రాజ్యాంగ వ్యతిరేక ముఖచిత్రం ఇప్పుడు దేశం ముందు బట్టబయలైంది’’ అని ఆయన రాశారు.
అత్యంత సున్నితమైన ఈ అంశంపై సుప్రీంకోర్టు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేస్తుందని రాహుల్ గాంధీ ఆశాభావం వ్యక్తం చేశారు.
సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యలపై స్పందించారు. ‘‘న్యాయపరమైన పాలనకు పొంచి ఉన్న ముప్పును ఎట్టకేలకు గుర్తించిన సుప్రీంకోర్టును అభినందించాలి. న్యాయాన్ని ధ్వంసం చేసేందుకు బుల్డోజర్ ను ఉపయోగిస్తున్నారు'’ అని ఆయన ‘ఎక్స్’లో రాశారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














