బాంబే హైకోర్టు తీర్పు: శరీరాన్ని నేరుగా తాకకపోతే లైంగిక దాడిగా భావించలేం

ఫొటో సోర్స్, iStock
- రచయిత, దివ్య ఆర్య
- హోదా, బీబీసీ ప్రతినిధి
పన్నెండేళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో తనకు విధించిన శిక్షపై 39 ఏళ్ల వ్యక్తి బాంబే హైకోర్టులో అప్పీల్ చేశాడు.
ఈ కేసుపై విచారణ జరిపిన నాగ్‌పూర్ బెంచ్ "శరీరాన్ని తాకకుండా(skin to skin contact) చేసిన లైంగిక నేరాన్ని లైంగిక దాడి (sexual assault)గా భావించలేమని పేర్కొంటూ తీర్పునిచ్చింది.
నిందితుడికి పోక్సో చట్టంలోని 'లైంగిక దాడి' సెక్షన్ల కింది కోర్టు విధించిన మూడేళ్ల శిక్షను ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 354 ప్రకారం ఏడాది శిక్షగా మార్చింది.
పోక్సో ( ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్- POCSO) చట్టం ప్రకారం లైంగిక దాడికి పాల్పడినట్లు రుజువైతే నిందితులకు మూడేళ్లు శిక్ష పడుతుంది.
భారతీయ శిక్షాస్మృతిలో సెక్షన్ 354 ప్రకారం 'ఒక మహిళ శీలాన్ని చెరచాలనే ఉద్దేశంలో దాడి చేయడాన్ని నేరంగా పరిగణిస్తుంది. దీనికి ఒక సంవత్సరం నుంచి 5 సంవత్సరాల వరకు శిక్ష పడుతుంది.
అయితే ఈ కేసులో బాధితురాలిపై జరిగిన లైంగిక నేరాన్ని 'లైంగిక దాడి' అనడం సరికాదని నాగ్‌పూర్ బెంచ్ పేర్కొంది.
నిందితుడు బాధితురాలి దుస్తులు తొలగించలేదని గుర్తు చేసింది. "నిందితుడు బాధితురాలి దుస్తులను తొలగించి, ఆమె వక్షస్థలాన్ని తాకిన సందర్భం కాదిది.
శరీరాన్ని నేరుగా తాకకుండా జరిగిన నేరం కాబట్టి దీన్ని లైంగిక దాడిగా చెప్పలేము'' అని కోర్టు తన తీర్పులో పేర్కొన్నట్లు హిందుస్థాన్ టైమ్స్ పత్రిక పేర్కొంది. ఇది పోక్సో చట్టంలోని సెక్షన్ 7 పరిధిలోకి రాదంటూ ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 354 ప్రకారం కోర్టు శిక్షను ఖరారు చేసినట్లు వెల్లడించింది.
అయితే కోర్టు తీర్పును న్యాయ నిపుణులు, బాలల హక్కుల కార్యకర్తలు తప్పుబడుతున్నారు. లైంగిక దాడికి సంబంధించిన చట్టాలలో దుస్తుల తొలగింపుపై ఎలాంటి నిబంధనలు, సెక్షన్లు లేవని వారు వాదిస్తున్నారు.

ఫొటో సోర్స్, iStock
''కోర్టు నిర్ణయం నాకు ఆశ్చర్యం కలిగించింది. ముఖ్యంగా చట్టాలలో సంస్కరణలకు కోర్టులు పెద్ద పీట వేయాల్సి ఉంది'' అని మజ్లిస్ లీగల్ సెంటర్‌కు చెందిన ఆడ్రే డిమెలో బీబీసీతో అన్నారు.
ముంబయికి చెందిన ఈ సంస్థ లైంగిక వేధింపుల కేసులలో బాధితులకు చట్టపరమైన సహాయం అందిస్తుంది.
''నేర విచారణలో బాధితురాలికి దుస్తులు ఉన్నాయా లేవా అన్న అంశాన్ని చట్టం పరిగణించదు. కానీ లైంగిక దాడి చేయాలన్న ఉద్దేశాన్ని మాత్రం గుర్తించాలి. చట్టంలో లేని అంశాలను ప్రశ్నించడం బాధితులకు ఆందోళన కలిగించే అంశం'' అన్నారామె.
చట్టం ఏం చెబుతోంది?
భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 354లో ''ఒక వ్యక్తి ఒక మహిళను చెరచాలనే ఉద్దేశంతో దాడి చేస్తే అలాంటి వ్యక్తికి కనీసం ఒక సంవత్సరం నుంచి ఐదేళ్ల వరకు శిక్ష విధించవచ్చు'' అని ఉంది.
పోక్సో చట్టంలోని సెక్షన్ 7 ''లైంగిక వాంఛతో ఒక మైనర్ జననాంగాలు లేదా ఛాతీని, ఇతర అవయవాలను తన శరీరంతో తాకుతూ బలత్కారానికి పాల్పడితే అది లైంగిక దాడి అవుతుంది'' అని పేర్కొంటోంది.

ఫొటో సోర్స్, iStock
2012 నుంచి అమలులోకి వచ్చిన పోక్సో చట్టం మైనర్ల( బాలలు, బాలికలు ) పై జరిగే లైంగిక నేరాలకు నిర్వచనాలు, న్యాయ ప్రక్రియ, శిక్షలను నిర్ణయిస్తుంది. భారతీయ శిక్ష్మాస్మృతిలోని సెక్షన్ 354 కేవలం మహిళలపై జరిగే లైంగిక నేరాలపై శిక్షలు నిర్ణయిస్తుంది.
పిల్లల మీద లైంగిక నేరానికి పాల్పడితే, ఆ నేరంపై అంతకు ముందున్న చట్టాలు పోక్సో చట్టాలకు భిన్నంగా ఉన్నప్పుడు, పోక్సో చట్టంలోని నిబంధనలనే తుది పరిగణనలోకి తీసుకోవాలని సెక్షన్ 42 చెబుతోంది.
బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ ఈ కేసులో పోక్సోకు బదులుగా ఐపీసీ సెక్షన్ 354 ఆధారంగా శిక్షను ఖరారు చేసింది. ఈ నేరాన్ని లైంగిక దాడిగా పరిగణించటానికి న్యాయస్థానం నిరాకరించింది.
దేశంలోని 18 రాష్ట్రాల్లో పిల్లలపై లైంగిక హింసకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఎన్జీవో 'సేవ్ ది చిల్డ్రన్'లో పిల్లల రక్షణ విభాగానికి నాయకత్వం వహిస్తున్న ప్రభాత్ కుమార్ ఈ తీర్పుపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇది బాధితులను భయపెడుతుందని అన్నారు.
పోక్సో చట్టాన్ని పిల్లల రక్షణ కోసమే తీసుకొచ్చారని, దానికే ప్రాధాన్యమివ్వాలని స్పష్టంగా పేర్కొన్నారని ప్రభాత్ కుమార్ అన్నారు.
"ఇది నేరస్తులకు ఊరటనిచ్చే తీర్పు'' అన్నారు ప్రభాత్ కుమార్. పిల్లలపై లైంగిక నేరాలకు సంబంధించి ప్రాథమిక నియమాలను ఈ తీర్పు పట్టించుకోలేదని ఆయన వ్యాఖ్యానించారు.

ఏ నేరానికి ఎంతటి శిక్ష ?
నేర తీవ్రతను గుర్తించే అంశంలో కూడా కోర్టు తీర్పులో లోపాలు కనిపిస్తున్నాయని న్యాయ నిపుణులు అభిప్రాయపడ్డారు.
ఈ తీర్పులో పేర్కొన్న ప్రకారం నిందితుడు ఓ యువతిని బలవంతంగా గదిలోకి తీసుకెళ్లాడు. ఆమె దుస్తులు విప్పకుండానే, ఆమె ఛాతీని తాకే ప్రయత్నం చేశాడు. ఆమె వేసుకున్న సల్వార్ కమీజ్‌ను తొలగించడానికి ప్రయత్నించాడు.
బాధితురాలు పెద్దగా కేకలు వేయడంతో నిందితుడు ఆమె నోటికి తన చేతిని అడ్డుపెట్టాడు. ఆపై బయటి నుంచి ఎవరూ రాకుండా తలుపులు మూసేశాడు. అరుపులు విన్న బాధితురాలి తల్లి కూతురిని వెతుక్కుంటూ వచ్చి నిందితుడి నుంచి ఆమెను విడిపించగలిగింది.
నిందితుడికి ఐదేళ్ల వరకు శిక్షపడే అవకాశం ఉండగా న్యాయమూర్తి తక్కువ శిక్షతో సరిపెట్టారు. నేరం తీవ్రత తెలుసుకోవడానికి లైంగిక దాడికి గురైన బాలిక మానసిక స్థితిని కూడా అంచనా వేయాలని ప్రభాత్ కుమార్ అన్నారు.
''పరిణితి చెందిన మహిళలతో పోలిస్తే పిల్లలలో లైంగిక హింస ప్రభావం భిన్నంగా ఉంటుంది. పెద్దవాళ్లు తమను తాకరానిచోట తాకారన్న భావన వారిని మానసికంగా ఇబ్బంది పెడుతుంది'' అన్నారు ప్రభాత్ కుమార్
2012లో నిర్భయ అత్యాచారంతోపాటు, అంతకు ముందు అనే దశాబ్దాలుగా మహిళా ఉద్యమకారుల పోరాటంతో లైంగిక నేరాల చట్టంలో అనేక మార్పులు వచ్చాయి.
లైంగిక నేరాలకు నిర్వచనంతోపాటు బాధితులకు అనుకూలంగా ఉండేలా చట్టాలలో అనేక మార్పులు చేశారు. శిక్షలు కఠినం అయ్యాయి.
అయితే 'కనీస శిక్షలు' ఈ చట్టాల వల్ల బాధితులకు కలిగే ప్రయోజనాలను దెబ్బతీస్తున్నాయని న్యాయ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.

'లైంగిక హింస నేరాల్లో శిక్షలు ప్రకటించే సమయంలో న్యాయమూర్తులు నిందితుడి నేపథ్యాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారు. అంటే అంత ముందు ఏవైనా నేరాలకు పాల్పడ్డారా, కుటుంబం నేపథ్యం, పోషణ బాధ్యతలాంటి అంశాలు కూడా ఇందులో ఉంటాయి. ఇలాంటి తీర్పులు ఇంతకు అనేకం వచ్చాయి'' అని ఆడ్రే డిమెలో అన్నారు .
కానీ ప్రతిసారి ఇలా కనీస శిక్షలతో తీర్పులు ఇవ్వడం మంచిదికాదని ఆడ్రే డిమెలో అన్నారు. కఠిన శిక్షలే పరిస్థితిని దారిలోకి తీసుకు వస్తాయని భావించడం సరికాకపోయినా, నేరం జరిగిన తీరును, స్వభావాన్ని కూడా గమనించాలని ఆమె సూచించారు.
ఇలాంటి కేసుల్లో ప్రస్తుత చట్టాలు సవ్యంగా ఉన్నాయా లేదా అన్నదానిపై పార్లమెంటులో చర్చ జరగాలని ఆమె అన్నారు. బాధితులకు న్యాయం చేయడానికే ఈ చట్టాల ప్రథమ ప్రాధాన్యం కావాలని ఆమె అభిప్రాయపడ్డారు.
ఇవి కూడా చదవండి
- కరోనావైరస్ కొత్త రకాల మీద కూడా పనిచేస్తున్న మోడెర్నా వ్యాక్సీన్...
- మదనపల్లె హత్యలు: కన్న కూతుళ్లను తల్లితండ్రులే చంపిన కేసులో కీలక ఆధారాలు
- కార్నేలియా సొరాబ్జీ: తొలి భారత మహిళా న్యాయవాదిపై ఎందుకు విష ప్రయోగం జరిగింది?
- స్పేస్ ఎక్స్ ప్రపంచ రికార్డ్: ఒకే రాకెట్లో అత్యధిక సంఖ్యలో ఉపగ్రహాల ప్రయోగం
- భారత్-చైనా సరిహద్దుల్లో మళ్లీ ఘర్షణలు: రెండు వైపులా భద్రతా సిబ్బందికి గాయాలు
- అజింక్య రహానె: భారత్ క్రికెట్‌కు కెప్టెన్‌ను చేయాలంటూ డిమాండ్లు. కోహ్లీపై ఒత్తిడి పెరుగుతోందా ?
- ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలు యథావిధిగా నిర్వహించాలి: సుప్రీంకోర్టు
- ఆసిఫాబాద్ జిల్లాలో పులి కలకలం.. అసలైనదా? అధికారులు సృష్టించిందా?
- విశాఖపట్నం: ఈ అమ్మాయిలు బుల్లెట్ల మీద దూసుకెళ్తారు... కరాటే పాఠాలు కూడా నేర్పిస్తారు
- సెక్స్ పట్ల సమాజానికి గౌరవం ఉందా?
- ‘రాజకీయాలు దిగజారాయని మనం దిగజారకూడదు’ - అశోక్ గజపతి రాజు ఇంటర్వ్యూ
- హిందూ దేవతల విగ్రహాలు ధ్వంసం చేశానన్న ప్రవీణ్ చక్రవర్తి అసలు ఎవరు?
- వాజినిస్మస్: 'నా శరీరం సెక్స్‌కు సహకరించదు'
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








