ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలు యథావిధిగా నిర్వహించాలి: సుప్రీంకోర్టు

సుప్రీంకోర్టు

ఫొటో సోర్స్, Getty Images

ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలు వాయిదా వేయాలని కోరుతూ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.

ఎన్నికలను యథావిధిగా నిర్వహించాలని ఆదేశించింది.

ఎన్నికల నిర్వహణలో పాలుపంచుకోలేమని, సహకరించబోమని చెప్పిన ఏపీ ఉద్యోగ సంఘాల తీరునూ కోర్టు తప్పుపట్టింది.

ఉద్యోగులు పనిచేయకుండా పిటిషన్ వేయడం ప్రమాదకరమని ధర్మాసనం ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది.

‘ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోం’

ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో తాము జోక్యం చేసుకోమని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ వాదనను రాష్ట్ర హైకోర్టు తిరస్కరించగా.. దీన్ని సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్‌ను వేసింది. ఈ పిటిషన్‌ను జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారించింది. జస్టిస్‌ హృషికేష్‌ రాయ్‌ కూడా ధర్మాసనంలో ఉన్నారు.

‘కరోనా తీవ్రంగా ఉన్న కేరళలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి’

''ఉద్యోగ సంఘాలు చట్టవ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాయి. కరోనావైరస్ తీవ్రత ఉన్నప్పుడు ఎన్నికలు కావాలన్నారు.. కరోనా ప్రభావం తగ్గినప్పుడు ఎన్నికలు వద్దంటున్నారు...'' అని జస్టిస్ కౌల్ విచారణ సందర్భంగా వ్యాఖ్యానించారు.

''పశ్చిమబెంగాల్లో ఎన్నికల కోసం మేమే ఆదేశాలిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు ఆపాలని ఎలా చెప్పాలి?'' అని న్యాయమూర్తి ప్రశ్నించారు.

''రాజ్యాంగబద్ధమైన వ్యక్తులు ఏం చేయాలో కోర్టు చెప్పాలా? ఎన్నికలు వాయిదా వేసుకుంటూ వెళ్లడం సరికాదు. కరోనావైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న కేరళలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి'' అని జస్టిస్ కౌల్ వ్యాఖ్యానించారు.

నిమ్మగడ్డ రమేశ్ కుమార్

‘ఎస్ఈసీ తన విధిలో భాగంగా ఎన్నికలు నిర్వహిస్తారు’

పిటిషన్ విచారణలో ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్‌ లాయర్‌ ముకుల్‌ రోహత్గి వాదించారు.

గోవా సహా పలు రాష్ట్రాల్లో స్థానిక ఎన్నికలు వాయిదా పడ్డాయని, కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కోసం ఆయా రాష్ట్రాల్లో ఎన్నికలను వాయిదా వేశారని రోహత్గి ధర్మాసనానికి నివేదించారు. అయితే.. ఎన్నికలు ప్రతిసారీ వాయిదా పడుతూ వస్తున్నాయని, ఎస్ఈసీ తన విధిలో భాగంగానే ఎన్నికల ప్రక్రియ చేపడతారని జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ పేర్కొన్నారు. ఈ ఎన్నికల ప్రక్రియలో తాము జోక్యం చేసుకోబోమని తేల్చిచెప్పారు.

సుప్రీం తీర్పును గౌరవిస్తామన్న ప్రభుత్వం

స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో సుప్రీం కోర్టు తీర్పును గౌరవిస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఎస్ఈసీ నిర్ణయించినట్లుగానే ఎన్నికలు జరుగుతాయని ఆయన అన్నారు.

ఇంతకాలం ప్రజారోగ్యం కోసమే ఎన్నికలు వద్దనుకున్నామని, ప్రభుత్వానికి ఎలాంటి భేషజాలు లేవని అన్నారు.

అయితే, పంచాయతీ ఎన్నికలను ఇప్పటికిప్పుడు తీసుకురావడంలో రాజకీయ కుట్ర ఉందని రామకృష్ణారెడ్డి ఆరోపించారు.

అంతేకాకుండా, పంచాయతీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ, కమిషనర్ గిరిజా ప్రసాద్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఈ ఇద్దరు అధికారులను బదిలీ చేయాలని గతంలో ఎస్ఈసీ రమేశ్ కుమార్ ఇచ్చిన ఆదేశాలను ప్రభుత్వం ఆచరణలో పెట్టింది. ఆ స్థానాలలో ఎవరిని నియమించాలనే విషయంలో మూడు పేర్లతో ప్రతిపాదనల జాబితాను చీఫ్ సెక్రటరీ పంపించనున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)