మణిపుర్: ‘హింస, కర్ఫ్యూతో జీవితం కష్టంగా మారింది, అసలు ప్రభుత్వం ఉందా’?

ఫొటో సోర్స్, ANI
- రచయిత, దిలీప్ కుమార్ శర్మ
- హోదా, బీబీసీ ప్రతినిధి
సెప్టెంబర్ 17న మణిపుర్ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ రాజధాని ఇంఫాల్‌లోని బీజేపీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన జీవితం, సాధించిన విజయాలను తెలిపే ఫోటో ఎగ్జిబిషన్‌ను ప్రారంభించిన సందర్బంఅది.
అయితే ఈ కార్యక్రమానికి బీజేపీ నుంచి చాలా కొద్దిమంది మాత్రమే హాజరయ్యారు.
వాస్తవానికి ఒకరిద్దరు ఎమ్మెల్యేలు మినహా పార్టీకి చెందిన సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులెవరూ ఈ కార్యక్రమంలో కనిపించలేదు.
సీఎం బీరేన్‌సింగ్ తన ప్రసంగాన్ని మెయితీ భాషలో ప్రారంభిస్తూ సోషల్ మీడియాలో వచ్చిన విమర్శలను హాస్యభరితంగా ప్రస్తావించారు.
ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనల సమయంలో నిరసనకారులు ముఖ్యమంత్రిని 'ఎగతాళి' చేయడం, 'అసభ్యకరమైన నినాదాలు' చేయడం గురించి ఆయన ప్రస్తావిస్తూ ప్రభుత్వాన్ని బలహీనపరిచే ప్రయత్నాలు చెయ్యవద్దని చెప్పారు.
నిజానికి మణిపూర్‌లో 16 నెలలుగా హింసాకాండ ఆగలేదు.
రాష్ట్రంలో ప్రారంభమైన జాతుల హింస ఇళ్లను తగలబెట్టడం లేదా కాల్పులకు మాత్రమే పరిమితం కాలేదు. సెప్టెంబర్‌లో జరిగిన హింసాత్మక ఘటనల్లో లాంగ్-రేంజ్ రాకెట్లు, డ్రోన్ బాంబుల ప్రయోగం లాంటివి కూడా ఉన్నాయి.
నిరుడు మే3 నుంచి తెగల మధ్య మొదలైన హింసను నియంత్రించేందుకు రాష్ట్రంలో 60 వేల మందికి పైగా భద్రతా బలగాలు, 44 వేల మందికి పైగా రాష్ట్ర పోలీసులను మోహరించారు. అయినప్పటికీ హింస తగ్గినట్లు కనిపించలేదు.
దీంతో ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ రాజీనామా చేయాలనే ఒత్తిడి పెరుగుతోంది.


‘సీఎంకు పరిమిత అధికారాలు’
మణిపుర్‌లోని 16 జిల్లాల్లో 32 లక్షలకు పైగా జనాభా ఉంది.
గత ఏడాది హింస ప్రారంభమైనప్పటి నుంచి ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ ఒక్కసారి కూడా కుకీలు అధికంగా ఉండే పర్వత ప్రాంత జిల్లాలను సందర్శించలేదు.
“ఆయన కేవలం మైతీ ప్రజలకే ముఖ్యమంత్రి. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఉంటే అందరినీ సమానంగా చూసేవారు. వందలమంది కుకీలు ఈ హింసాకాండలో ప్రాణాలు కోల్పోయారు. అయినప్పటికీ ముఖ్యమంత్రి ఏ మాత్రం పట్టించుకోలేదు” అని పర్వత ప్రాంత జిల్లా కాంగ్‌పోకికి చెందిన 38 ఏళ్ల మార్గరెట్ చెప్పారు.
మణిపుర్‌లో హింసాకాండ వల్ల తలెత్తిన సమస్యలపై మైతేయి వర్గానికి చెందిన 21 ఏళ్ల విద్యార్థి మచలంబి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
“ఇక్కడ పదే పదే కర్ఫ్యూ విధిస్తున్నారు. దీని వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. నాన్నకు అనారోగ్యం, అమ్మ రోడ్డు పక్కన కూరగాయలు అమ్ముతారు. మా ప్రజలపై రోజూ దాడులు జరుగుతున్నాయని, ప్రభుత్వం మనదేనని ఆమె అంటోంది. అటువంటి పరిస్థితిలో, మన సమస్యలను ఎవరికి చెప్పుకోవాలి?” అని మచలంబి ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ తీవ్ర ప్రతికూలతను ఎదుర్కొంటున్నారని రాష్ట్ర పరిస్థితుల్ని గమనిస్తున్న నిపుణులు చెబుతున్నారు.
మణిపూర్ ప్రస్తుత పరిస్థితి సంక్లిష్టంగా ఉందని సీనియర్ జర్నలిస్ట్ ప్రదీప్ ఫంజౌబమ్ అన్నారు.
"ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పటికీ బీరేన్ సింగ్‌కు పెద్దగా అధికారాలు లేవు. సీఎం ఇప్పుడు ఏకీకృత కమాండ్‌కు నాయకుడు కాదు. ఆయన అధికార పరిధి ఇంఫాల్ వ్యాలీకి పరిమితం అయింది. లోయ భద్రతను మణిపుర్ పోలీస్ చూసుకుంటుంది. పర్వత ప్రాంతాల్లో భద్రతను కేంద్ర బలగాలు పర్యవేక్షిస్తున్నాయి. పోలీసులు, భద్రతా బలగాల మధ్య సమన్వయం లేకపోవడంతో అంతా అయోమయంగా మారింది” అని ప్రదీప్ చెప్పారు.
తమపై దాడి చేసిన వారి మీద చర్యలు తీసుకోవడం లేదని మెయితీ ప్రజలు కేంద్ర బలగాలను నిందిస్తున్నారు. అదే సమయంలో కుకీ ఆధిపత్య ప్రాంతాలలో కేంద్ర బలగాలకు మద్దతుగా పోస్టర్లు కనిపిస్తున్నాయి.
"మా ప్రాంతంలో నిరంతరం దాడులు జరుగుతున్నాయి, ఇటీవల, ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ ఆడియో క్లిప్ వైరల్ అయ్యింది. ఆయన మీద మాకసలు నమ్మకం లేదు. ఆయన అధికారంలో ఉన్నంత వరకు మణిపుర్‌లో శాంతి స్థాపన అసాధ్యం” అని లీమాఖోంగ్ గ్రామస్తురాలు సిల్వియా ఆవేశంగా చెప్పారు.
“కుకీ ప్రాబల్య ప్రాంతాల నుంచి కేంద్ర బలగాలను తొలగించాలని ముఖ్యమంత్రి ప్రణాళిక రచిస్తున్నారు. ఈ ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ విద్యార్ధులంతా ప్రదర్శన నిర్వహించారు. కుకీ ప్రాబల్య ప్రాంతాల భద్రతను బీరేన్ సింగ్‌కు అప్పగిస్తే ఆయన మమ్మల్ని అందర్నీ నాశనం చేస్తారు” అని సిల్వియా అన్నారు.

ఫొటో సోర్స్, ANI
సీఎం రాజీనామాకు డిమాండ్
రాష్ట్రంలో బీరేన్ సింగ్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్న ప్రతిపక్షాలు ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.
"మణిపుర్‌లో జరుగుతున్న హింస వల్ల అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక్కడసలు ప్రభుత్వం లేదనిపిస్తోంది. సెప్టెంబర్ 1 నుండి ప్రారంభమైన దాడులతో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. వాళ్లు అత్యాధునిక ఆయుధాలు ప్రయోగిస్తున్నారు. బాంబులు వేస్తున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఇలాంటి పరిస్థితుల మధ్య ముఖ్యమంత్రికి అధికారంలో ఉండే హక్కు ఎక్కడుంది? అని మణిపుర్ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు కె మేఘచంద్ర సింగ్ బీబీసీతో అన్నారు.
ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వానికి దేని మీదా పట్టు లేదు. రాష్ట్రం అధికారాలన్నింటినీ కేంద్రం రద్దు చేసింది. కాస్త అటు ఇటుగా ఆర్టికల్ 356ను అమలు చేస్తున్నారు. కేంద్రం అలాంటి అదేశాలేమీ జారీ చేయకున్నా, ప్రస్తుత ముఖ్యమంత్రికి ఎలాంటి అధికారం లేదు” అని మణిపుర్ కాంగ్రెస్ చీఫ్ చెప్పారు.
ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలన్న విపక్షాల డిమాండ్‌పై సీఎం బీరేన్ సింగ్ స్పందించారు. “నేనెందుకు రాజీనామా చేయాలి? నేనేమైనా దొంగతనం చేశానా? అవినీతి, అక్రమాలకు పాల్పడ్డానా? రాష్ట్రానికి లేదా దేశానికి వ్యతిరేకంగా ఏదైనా కుట్రలు పన్నానా?” అని ఆయన ఆగ్రహంగా ప్రశ్నించారు.

ఫొటో సోర్స్, Getty Images
బీరేన్ ఎలా ఎదిగారు?
జాతీయ స్థాయి ఫుట్‌బాల్ ప్లేయర్‌గా గుర్తింపు తెచ్చుకున్న నోంగ్‌థొంబమ్ బీరేన్ సింగ్ రాజకీయాల్లో అగ్రనాయకుల్ని అధిగమించి వేగంగా ఎదిగారు.
బీరేన్ సింగ్ 2002లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఆ తర్వాత ఏడాదికే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆయనకు మంత్రి పదవిని ఇచ్చారు నాటి ముఖ్యమంత్రి ఓక్రమ్ ఇబోబి సింగ్.
ఆ సమయంలో, ముఖ్యమంత్రి ఇబోబి సింగ్ ప్రభుత్వాన్ని నడపడంలో అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చింది.
అయితే బీరేన్ సింగ్ ఆయనకు ట్రబుల్ షూటర్‌గా పని చేస్తూ వచ్చారు. తర్వాత కొన్నేళ్లలోనే ఇబోబి సింగ్ స్థాయికి ఎదిగారు.
"మైతేయ్ కమ్యూనిటీ నుండి వచ్చిన బీరేన్ సింగ్‌పై మణిపుర్ ప్రజలు చాలా అంచనాలు పెట్టుకున్నారు, ఎందుకంటే ఆయనకు సుదీర్ఘ పాలనా అనుభవం ఉంది." అని సీనియర్ జర్నలిస్ట్ జర్నలిస్ట్ ఫంజౌబమ్ చెప్పారు.
బీరేన్‌సింగ్ ఇబోబిసింగ్ నుంచి విడిపోయిన తర్వాత 2016లో బీజేపీలో చేరారు.
ఏడాది తర్వాత 2017లో మణిపూర్‌లో బీజేపీ నాయకత్వంలో తొలి ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయ్యారు.
రాజకీయాల్లో వేగంగా ఎదుగుతున్న సమయంలో తన పరిపాలనలో ఈ స్థాయిలో జాతుల మధ్య హింస చెలరేగుతుందని ఆయన అస్సలు ఊహించి ఉండకపోవచ్చనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.
ఫుట్‌బాల్ ప్లేయర్‌గా లెఫ్ట్ బ్యాక్ పొజిషన్‌లో ఆడిన బీరేన్ సింగ్ ఆటలో అద్భుతమైన డిఫెన్స్ ఆడేవాడని, ప్రత్యర్థులు తన వెనక్కు రాకుండా అడ్డుకునే వారని చెబుతారు.
ప్రస్తుతం రాష్ట్రంలో అదుపు తప్పిన హింసాత్మక పరిస్థితులకు బీరేన్ సింగే కారణమని అందరూ ఆరోపిస్తున్నారు.

బీజేపీకి దూరంగా నేతలు
ప్రస్తుతం, మైతేయి, కుకీ తెగలు తమ భద్రతకు సంబంధించి బీరేన్ సింగ్ పనితీరుపై ప్రశ్నలు సంధిస్తున్నాయి.
విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవారు ప్రభుత్వం ఇచ్చే రేషన్ కోసం చాంతాడంత క్యూలలో నుంచుంటున్నారు.
మణిపూర్‌లోని ఏ వర్గానికి చెందిన వారితో మాట్లాడినా.. బీజేపీ ప్రభుత్వంపై వారికి ఉన్న కోపం స్పష్టంగా అర్థమవుతుంది.
ఇంఫాల్‌లో మహిళలు నిర్వహించే అతిపెద్ద మార్కెట్ 'నూపి కైతాల్'లో మీరాదేవికి దుకాణం ఉంది. "హింస, కర్ఫ్యూ మమ్మల్ని ఆకలి అంచుల వరకు తీసుకువచ్చాయి. జీవితం చాలా కష్టంగా మారింది. ఎవరికి చెప్పాలి, ఇక్కడ ప్రభుత్వం ఉందా?" అని ఆమె ప్రశ్నించారు.
హింసను అరికట్టడంలో వైఫల్యం, భద్రతాబలగాల చర్యల విషయంలో ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ మీద సొంత పార్టీ నేతలే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సిఎం తన సొంత పార్టీలోనే అసంతృప్తిని ఎదుర్కొంటున్నారు. పలువురు ఎమ్మెల్యేలు ఆయన నాయకత్వాన్ని, నిర్ణయాధికారాన్ని బహిరంగంగా విమర్శిస్తున్నారు.
రాష్ట్ర బీజేపీలో ఒకప్పుడు బీరేన్ సింగ్‌కు సన్నిహితంగా ఉండే కొందరు వ్యక్తులు ఇప్పుడు ఆయనకు దూరమయ్యారు.
"హింసను ఆపడంలో విఫలం కావడంతో రాష్ట్రం చాలా నష్టపోయింది. రెండు వర్గాల ప్రజలు బీజేపీపై ఆగ్రహంతో ఉన్నారు" అని పేరు చెప్పడానికి ఇష్టపడని బీజేపీ యువమోర్చా నేత ఒకరు బీబీసీతో చెప్పారు.
‘‘లోక్‌సభ ఎన్నికల ఫలితాలతో ప్రజల ఆగ్రహం తెరపైకి వచ్చింది. అధికార పీఠంపై కూర్చున్న వారు ఇప్పటికీ పరిస్థితిని అర్థం చేసుకోలేకపోతున్నారు. 2027లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే పార్టీ మనుగడే కష్టంగా మారుతుంది” అని బీజేపీ యువ మోర్చా నేత చెప్పారు.

ఫొటో సోర్స్, ANI
కేంద్ర బలగాలపై సీఎం అల్లుడి లేఖ
రాష్ట్రం నుంచి కేంద్ర బలగాలను ఉపసంహరించాలని కోరుతూ బీజేపీ ఎమ్మెల్యే రాజ్‌కుమార్ ఇమోసింగ్ సెప్టెంబర్ ప్రారంభంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు.
“మణిపూర్‌లో ఉన్న దాదాపు 60 వేల మంది కేంద్ర బలగాలు శాంతిని నెలకొల్పలేక పోతున్నాయి” అని బీరేన్ సింగ్ అల్లుడు రాజ్‌కుమార్ కేంద్ర భద్రతా బలగాలపై ప్రశ్నలు సంధించారు.
పార్టీ మీద, ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి బీరేన్‌సింగ్‌కు పూర్తి స్థాయి అధికారాలు అప్పగించాలని రాష్ట్రంలోని మైతేయి వర్గానికి చెందిన సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి.
దీంతో పాటు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రాజీవ్ సింగ్‌ను కూడా తొలగించాలనేది వారి డిమాండ్.
"మిలిటెంట్లు కొండల మీద నుంచి మా నివాసాల వైపు రాకెట్ బాంబులు వేస్తున్నారు. ప్రభుత్వం ఏమీ చెయ్యడం లేదు. మణిపుర్ తొలి ముఖ్యమంత్రి ఎం కోయిరెంగ్ ఇంటిపై రాకెడ్ దాడి జరిగింది. ఈ దాడిలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. అయినప్పటికీ ఈ ప్రభుత్వం ఏమీ చెయ్యలేదు” అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ విద్యార్ధి నేత బీబీసీతో చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
చిన్నగొడవలకూ కాల్పులే
రాష్ట్రంలో సామాన్య పౌరుల చేతుల్లో తుపాకులు ఉండటం శాంతిభద్రతల విషయంలో తీవ్ర ఆందోళన కలిగిస్తోందని పోలీసు అధికారి ఒకరు తెలిపారు.
కొంతమంది భద్రత కోసమే కాకుండా చిన్న చిన్న నిరసనల సమయంలో పోలీసులతో గొడవలు జరిగినప్పుడు కూడా కాల్పులు జరుపుతున్నారని ఆయన చెప్పారు.
"సెప్టెంబర్ 14న, సింగ్‌జమీ పోలీస్ స్టేషన్‌లో నిరసనకు వచ్చిన ప్రజలను చెదరగొట్టడానికి పోలీసులు ప్రయత్నించినప్పుడు వారిలో కొంతమంది పోలీసుల మీద దాడి చెయ్యడానికి ప్రయత్నించారు. అలాంటి పరిస్థితుల్లో శాంతి భద్రతల పరిరక్షణ చాలా కష్టంగా ఉంటుంది” అని ఆయన చెప్పారు. ఆయన కూడా తన పేరు వెల్లడించవద్దని కోరారు.
కొన్ని రోజులుగా రాజధాని ఇంఫాల్‌తో సహా లోయలోని నాలుగు జిల్లాల్లో కర్ఫ్యూ అమల్లో ఉంది. గత వారం ఇంటర్‌నెట్ సేవలను పూర్తిగా ఆపేశారు. నిత్యం భద్రతాబలగాలు, ప్రజలకు మధ్య జరుగుతున్న హింసాత్మక ఘర్షణలు సీఎం బీరేన్ సింగ్‌కు మరింత సమస్యగా మారాయి.
మణిపుర్‌లో పరిస్థితుల్ని గమనిస్తున్న ప్రజలు హింసను ఆపడంలో ముఖ్యమంత్రి ఆలస్యం చేశారని, ఇప్పుడు పరిస్థితి ఆయన చేయి దాటి పోయిందని భావిస్తున్నారు.

ఫొటో సోర్స్, Reuters
బీజేపీ ఏం చెబుతోంది?
మణిపుర్ ముఖ్యమంత్రి మీద ప్రజల్లో ఆగ్రహం పెరగిందనే విషయాన్ని రాష్ట్ర బీజేపీ గుర్తించింది. అయితే బీజేపీ కేంద్ర నాయకత్వం మాత్రం ఆయనకు ఇప్పటికీ ప్రజల మద్దతు ఉందని భావిస్తోంది.
“మణిపుర్‌లో హింసాత్మక ఘటనల వెనుక తీవ్రవాదుల హస్తం ఉంది. ముఖ్యమంత్రి పరిస్థితిని అదుపు చేయలేకపోయారని అనడం సరికాదు. ఓపియం సాగుపై బీరేన్ సింగ్ చర్యలు చేపట్టారు. రాష్ట్రంలో అక్రమంగా నివశిస్తున్న వారిని గుర్తిస్తున్నారు. అంతకు ముందున్న ప్రభుత్వాలు ఈ సమస్యల గురించి పట్టించుకోలేదు” అని మణిపుర్ రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి సురేష్ కుమార్ చెప్పారు.
(బీబీసీ తెలుగు కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














