హింస వేరుచేసిన రాష్ట్రంలో శాంతి ఎప్పుడో

మణిపుర్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మణిపుర్‌లో 59వేల మంది ప్రజలు ప్రభుత్వ సహాయ శిబిరాల్లో తలదాచుకుంటున్నారు.
    • రచయిత, మయూరేష్ కొన్నూరు
    • హోదా, బీబీసీ ప్రతినిధి

మణిపుర్‌లో ఇప్పటికీ దాదాపు 59వేల మంది ప్రజలు ప్రభుత్వ సహాయ శిబిరాల్లో తలదాచుకుంటున్నారు.

మణిపుర్‌లో వేలాది మంది నిరాశ్రయులు కావడానికి , 220మంది ప్రాణాలు కోల్పోవడానికి కారణమైన ఘర్షణలు జరిగి ఏడాది దాటింది.

కానీ ఇప్పటికీ ఆ రాష్ట్రంలో పరిస్థితులు కుదుటపడలేదు.

30 లక్షలమందికి పైగా ప్రజలు శాంతియుత వాతావరణం కోసం ఎదురుచూస్తూ రోజులు వెళ్లదీస్తున్నారు.

గత ఏడాది మేలో మెజార్టీలైన మెయితెయ్‌లకు, మైనార్టీలయిన కుకీ గ్రూపులకు మధ్య ఘర్షణలు చెలరేగాయి.

తమకు అధికారికంగా గిరిజన హోదా కల్పించాలన్న మెయితెయ్‌ల డిమాండ్లకు వ్యతిరేకంగా కుకీ గ్రూపు ప్రజలు ఆందోళనలకు దిగడంతో ఈ ఘర్షణలు మొదలయ్యాయి.

మణిపుర్‌లో ఎక్కువ సంఖ్యలో ఉన్న మెయితెయ్‌లకు గిరిజన హోదా కల్పిస్తే వారికి అనేక ప్రయోజనాలు దక్కే అవకాశముంది. దీంతో మైనార్టీలయిన కుకీలు దీన్ని వ్యతిరేకించారు.

రెండు వర్గాల మధ్య చెలరేగిన హింసతో వేలమంది నిరాశ్రయులయ్యారు. 59వేలమంది ప్రజలు ఇప్పటికీ ప్రభుత్వ పునరావాస శిబిరాల్లో జీవిస్తున్నారు.

ఈ ఘర్షణలతో సోదరభావం పోయి, ప్రజలు రెండుగా చీలిపోయారు.

వాట్సాప్
యుములెంబమ్ శివ సింగ్

ఫొటో సోర్స్, Anshul Verma

ఫొటో క్యాప్షన్, యుములెంబమ్ శివ సింగ్ కుటుంబం ఆయన జ్ఞాపకార్థం విగ్రహం ఏర్పాటు చేసింది.

ఒక్కరోజుతోనే ముగిసిన శాంతి ఒప్పందం

ఇప్పుడు మణిపుర్ రెండు శిబిరాలుగా చీలిపోయి ఉంది. మెయితెయ్‌లు ఇంఫాల్ లోయలో నివసిస్తుండగా కుకీలు కొండ ప్రాంతం చుట్టుపక్కల జీవిస్తున్నారు.

రెండు ప్రాంతాలను విడదీసే సరిహద్దులు, బఫర్ జోన్లకు భద్రత బలగాలు రక్షణ కల్పిస్తున్నాయి. చొరబాటుదారుల నుంచి తమ గ్రామాలను రక్షించుకునేందుకు చాలా మంది స్థానికులు స్వచ్ఛందంగా ఆయుధాలు పట్టుకుంటున్నారు.

కొన్ని ఆయుధాలను భద్రత బలగాల నుంచి అపహరించగా, మరికొన్ని స్థానికంగా దొరికే ఆయుధాలు.

రెండు గ్రూపుల మధ్య శాంతి చర్చలు నిర్వహించడం ద్వారా సంక్షోభానికి ముగింపు పలికేందుకు కేంద్ర, రాష్ట్ర అధికారులు ప్రయత్నాలు చేశారు. అయితే ఆ ప్రయత్నాలు ఫలించడం లేదని స్థానికులు అంటున్నారు.

ఓ జిల్లాలో ఇటీవల కుదిరిన శాంతి ఒప్పందం ఒక్కరోజులోనే ముగిసిపోయింది. రెండు గ్రూపులవారికి ఒకరిపై ఒకరికి నమ్మకం లేదు.

ఘర్షణలు ప్రారంభమైనప్పుడు కలిగిన అపనమ్మకం ఇప్పటికీ అలాగే ఉంది. హింసాత్మక ఘటనలు, భద్రత సిబ్బందిని హతమార్చడం వంటివి అక్కడ సాధారణమైపోయాయి.

‘‘మణిపుర్‌లో ఇప్పటికీ పరిస్థితి ఉద్రిక్తంగానే ఉంది. ప్రజలు ఒకరిని ఒకరు నమ్మడం లేదు. నమ్మకంతో ప్రజలు ముందుకెళ్లాలి. గతంలో ఇందుకు తగ్గ పరిస్థితులు ఏర్పడి ఉండాలి. కానీ అలాంటిది కనిపించడం లేదు’’ అని ఈశాన్య రాష్ట్రాల వ్యవహారాల నిపుణుడు, రచయిత సంజయ్ హజారికా చెప్పారు.

మణిపుర్

ఫొటో సోర్స్, Getty Images

పరస్పర ఆరోపణలు, నిందలు

హింసను ప్రేరేపించడంపై రెండు గ్రూపులు ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్నాయి.

పొరుగు దేశం మియన్మార్‌తో పాటు ఇతర ప్రాంతాల నుంచి ప్రజలు అక్రమంగా వలసరావడమే సంక్షోభానికి కారణమని రాష్ట్ర ప్రభుత్వం, మెయితెయ్‌ తెగ తరచూ ఆరోపిస్తుంటాయి.

అయితే, మియన్మార్‌తో సరిహద్దును పంచుకుంటున్న ప్రాంతంలో కుకీ తెగ ఎక్కువగా నివసిస్తోంది. దీంతో సొంత రాష్ట్రంలో తమను లక్ష్యంగా చేసుకోవడానికే ఇవన్నీ చేస్తున్నారని కుకీలు ఆరోపిస్తున్నారు.

‘‘రాష్ట్ర వ్యవహారాలను పూర్తిస్థాయిలో కొలిక్కి తేవాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంది. హింసకు ముగింపు పలకడానికి ఆర్మీని ఉపయోగించాలి. ప్రజలకు నమ్మకం కలగించడానికి చర్చలు ప్రారంభించాలి. కుకీలకు, మెయితెయ్‌లకు ఒకరిపై ఒకరికి నమ్మకం కలిగే పరిస్థితులు సృష్టించడం చాలా ముఖ్యం. ఈ నమ్మకాన్ని పునరుద్ధరించడం ఒక్కరోజులో సాధ్యం కాదు’’ అని ఇంఫాల్‌కు చెందిన రాజకీయ విశ్లేషకులు శ్రీమా నింగొమ్‌బామ్ చెప్పారు.

ఇంఫాల్‌కు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న సుగ్ను గ్రామంలో రెండు తెగల మధ్య ఏర్పడిన విభజన స్పష్టంగా కనిపిస్తోంది.

ఒకప్పుడు ఆ గ్రామంలో మెయితెయ్‌లు, కుకీలు నివసించేవారు. కానీ ఘర్షణలు మొదలైన తర్వాత తగలబడిన ఇళ్లను, దోపిడీ తర్వాత ఏమీ మిగలని ఇళ్లను వదిలి చుట్టుపక్కల కొండ ప్రాంతాలకు వాళ్లు పారిపోయారు.

గ్రామాల సరిహద్దుల్లో ప్రవేశం దగ్గర స్థానికులు సొంతంగా భద్రత ఏర్పాటు చేసుకున్నారు. మెయితెయ్‌ మహిళలు గ్రూపులుగా ఏర్పడి భద్రత కల్పించుకున్నారు. ఈ గ్రూపులను మైరా పైబిస్‌గా పిలుస్తారు.

భారీ భద్రత ఉన్నప్పటికీ బయటి వ్యక్తుల నుంచి ప్రతీకార దాడులు జరుగుతాయన్న భయాందోళన మధ్య ఆ గ్రామాల ప్రజలు జీవిస్తున్నారు.

‘యుద్ధం ముగిస్తేనే’

గ్రామాల దగ్గర రక్షణ కల్పించే మహిళల్లో ఒకరైన యుములెంబమ్ మనితోంబి గత ఏడాది జరిగిన హింసలో 29 ఏళ్ల కొడుకును పోగొట్టుకున్నారు. ఆమె ముగ్గురు పిల్లల్లో అతనే పెద్దవాడు. కుటుంబానికి ఆయనే ఏకైక ఆధారం.

కొడుకు విగ్రహాన్ని వారు తమ ఇంటి ఆవరణలో ఏర్పాటు చేసుకున్నారు. ఆయన మరణానికి గల కారణాన్ని కూడా విగ్రహం కింద చెక్కించారు. 2023లో జరిగిన కుకీ, మెయితెయ్‌ల యుద్ధం వల్ల ఆయన చనిపోయారని అందులో రాసి ఉంది.

‘‘నాకు శాంతి కావాలి. ఈ యుద్ధాన్ని ముగించడం ఒక్కటే నా కోరిక. అంతకంటే నేనేమీ కోరుకోవడం లేదు’’ అని మనితోంబి చెప్పారు.

నెంగ్‌నెయ్ చోంగ్

ఫొటో సోర్స్, Dilip Kumar Sharma

ఫొటో క్యాప్షన్, హింస నుంచి తప్పించుకోవడానికి నెంగ్‌నెయ్ చోంగ్ పొరుగు రాష్ట్రమైన మిజోరం పారిపోయారు.

సర్వం కోల్పోయారు

ఘర్షణకు కేంద్రమైన కుకీల ఆధిపత్యం ఉండే చురాచాంద్‌పూర్‌లోనూ ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. ప్రజలు సొంతంగా భద్రత కల్పించుకుంటున్నారు. ఈ నగరంలోకి ప్రవేశించే చోట ఒక స్మారక చిహ్నం ఉంటుంది. ఘర్షణల్లో చనిపోయిన కుకీలకు గుర్తుగా ఇది ఏర్పాటు చేశారు.

ఘర్షణల నుంచి తప్పించుకునేందుకు బొయిను హావోకిప్, ఆమె కుటుంబం గత ఏడాది సుగ్ను నుంచి చురాచాంద్‌పూర్‌కు పారిపోయారు. ఇప్పుడు వారు అక్కడ జీవించడం కోసం చాలా కష్టమైన పనులు చేయాల్సి వస్తోంది.

మణిపుర్‌లో జరిగన హింసపై పరిశోధన చేస్తున్న హవోకిప్ తన భవిష్యత్ అంధకారంగా కనిపిస్తోందని చెప్పారు.

‘‘నేను చదువుకోవాలి. నా కుటుంబం బాగోగులు చూసుకోవాలి. తరతరాలుగా మేం పేదరికంలో ఉన్నాం. ఇప్పుడిప్పుడే మేం ఆ పేదరికం నుంచి బయటపడటం ప్రారంభించాం. కానీ ఇంతలోనే హింస చెలరేగింది. ఈ హింసతో మేం మళ్లీ దశాబ్దం కాలం వెనక్కి వెళ్లిపోయాం’’ అని హవోకిప్ చెప్పారు.

మిగిలిన వాళ్లకూ భవిష్యత్తు గురించి అనేక ప్రశ్నలు ఎదురవుతున్నాయి. స్కూళ్లు పునరావాస శిబిరాలుగా మారిపోయాయి. ప్రజలు వ్యాపారాలు, ఇళ్లు, స్థలాలు, ఉద్యోగాలు కోల్పోయారు. దాచుకున్న డబ్బులన్నీ అయిపోయాయి.

సంక్షోభం వాళ్లను పొరుగు రాష్ట్రం మిజోరంలోని సహాయక శిబిరాలకు సైతం పారిపోయేలా చేసింది. ఆహారం, నీళ్లు, మందులు దొరక్క ప్రజలు చాలా కష్టమైన పనులు చేసి జీవనం సాగిస్తున్నారు.

'ఎందుకొచ్చామని బాధపడుతున్నాం'

52 ఏళ్ల నెంగ్‌నెయ్ చోంగ్ తన ఇద్దరు కొడుకులతో కలిసి పారిపోయి వచ్చారు.

మిజోరం రాజధాని ఐజ్వాల్ బయట ఉన్న ఒక శిబిరంలో వాళ్లు జీవిస్తున్నారు. కానీ తన ప్రాంతాన్ని విడిచి రావడంపై ఆమె పశ్చాత్తాపంతో ఉన్నారు.

తమ ఇంటి దగ్గర చనిపోయినా ఇంతకంటే బాగుండేదని నెంగ్‌నెయ్ ఆవేదన వ్యక్తంచేశారు.

రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పరిమిత వనరులే ఉన్నాయని మిజోరం ఎమ్మెల్యే టీబీసీ లాల్వెన్‌చుంగ అన్నారు.

‘‘రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సమస్యలతో సతమతమవుతోంది. మేం నిరంతరాయంగా చేస్తున్న విజ్ఞప్తులకు కేంద్ర ప్రభుత్వం స్పందిస్తే (మరిన్ని నిధుల కోసం), శరణార్థులకు మరింత మెరుగ్గా మేం సహాయం చేయగలం’’ అని ఆయన చెప్పారు.

రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలు

హింసను అడ్డుకునేందుకు మణిపుర్‌లోని రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన స్థాయిలో చర్యలు చేపట్టడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.

రాజకీయ ప్రయోజనాల కోసం అధికారులు, మెయితెయ్‌‌ల హింసాత్మక చర్యలను చూసీచూడకుండా వదిలేస్తున్నారని కుకీ గ్రూపులు ఆరోపిస్తున్నాయి.

సంక్షోభం సుదీర్ఘకాలం కొనసాగడానికి కేంద్రం కారణమని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. మణిపుర్‌ను సందర్శించకపోవడంపై ప్రధాని నరేంద్ర మోదీని కాంగ్రెస్ తరచుగా విమర్శిస్తోంది. అయితే ప్రభుత్వం ఈ ఆరోపణలను ఖండిస్తోంది.

‘‘మణిపుర్‌లో సాధారణ పరిస్థితులు సృష్టించడానికి మా ప్రభుత్వం తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తోంది. చాలా ప్రాంతాల్లో స్కూళ్లు, కళాశాలలు, ఆఫీసులు తెరుచుకుని యథావిధిగా పనిచేస్తున్నాయి. శాంతియుత పరిస్థితులు ఏర్పడతాయన్న ఆశ కనిపిస్తోంది’’ అని ప్రధాని మోదీ ఇటీవల పార్లమెంట్‌లో ప్రకటించారు.

ఇంఫాల్‌లోని సహాయక శిబిరం

ఫొటో సోర్స్, Mayuresh Konnur

ఫొటో క్యాప్షన్, ఇంఫాల్‌లోని సహాయక శిబిరంలో లెంబి చింగథమ్ (ఎడమ నుంచి రెండో వ్యక్తి) పిల్లలకు చదువు చెబుతున్నారు.

రెండు కమ్యూనిటీల మధ్య అపనమ్మకం మాత్రమే పెరిగిపోయిందని, రెండు వర్గాల మధ్య విభేదాలు చాలా ఎక్కువగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

తమకు ప్రత్యేక అధికార యంత్రాంగం కావాలని కుకీలు బలంగా వినిపిస్తున్న డిమాండ్‌ను మెయితెయ్‌‌లు తీవ్రంగా వ్యతిరేకిస్తుండటం విభేదాలను ఇంకా పెంచిపోషిస్తోందని తెలిపారు.

‘‘శాంతియుత వాతావరణం ఏర్పాటుచేయడం చాలా కష్టమైన విషయం. అంతేకాకుండా ఇది చాలా నిదానంగా జరుగుతోంది. శాంతిని నెలకొల్పడం కన్నా హింసను ప్రేరేపించడం చాలా తేలిక. కేంద్రం రెండు వర్గాలను శాంతిచర్చలకు ఒప్పించగలిగితే సాధారణ పరిస్థితుల కోసం ఒక అడుగు ముందుకుపడినట్టే’’ అని హజారికా చెప్పారు.

అయితే ఇది అంత వేగంగా పూర్తయ్యే ప్రక్రియ కాదని హజారికా హెచ్చరించారు.

‘‘మనం నిజంగా ముందుకు వెళ్లగలమనుకుంటే కోలుకోవడానికి కొంత సమయం, సహనం అవసరం’’ అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)