భారత్‌పై ఇరాన్ అసంతృప్తికి పాకిస్తాన్‌తో సంబంధాలే కారణమా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, రెహాన్ ఫజల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఇరాన్ సుప్రీం లీడర్ సయ్యద్ అలీ ఖమేనీ భారతదేశంలోని ముస్లింల పరిస్థితిపై ఇటీవల తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ముస్లింలు అణచివేతకు గురవుతున్న దేశాలను ప్రస్తావించిన ఆయన అందులో భారత్ పేరు కూడా చెప్పారు.
దీనిపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఇరాన్ నాయకుడి వ్యాఖ్యలు 'ఆమోదయోగ్యం కాదు, ఖండించదగినవి' అని పేర్కొంది.
భారత్, ఇరాన్‌ల మధ్య చాలాకాలంగా సంబంధాలు ఉన్నాయి. రెండు దేశాల మధ్య సఖ్యతను 'రెండు నాగరికతల మధ్య సంబంధం' అని పిలుస్తుంటారు.


ఫొటో సోర్స్, Getty Images
1971 యుద్ధం
1971 భారత్-పాకిస్తాన్ యుద్ధం సమయంలో ఇరాన్ షా పాకిస్తాన్ గురించి ఆందోళన చెందారు. దీని వెనుక రెండు కారణాలు ఉన్నాయి.
మొదటిది, పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌కు ఇరాన్‌తో సరిహద్దు ఉండడం.
రెండోది.. ఆ సమయంలో జరిగిన సంఘటనల వల్ల సోవియట్ యూనియన్ ఈ ప్రాంతంలో జోక్యం చేసుకునే ప్రమాదం ఉందని ఇరాన్ భయపడడం.
'1971: గ్లోబల్ హిస్టరీ ఆఫ్ క్రియేషన్ ఆఫ్ బంగ్లాదేశ్' పుస్తకంలో శ్రీనాథ్ రాఘవన్ అప్పటి పరిస్థితులను వివరించారు.
‘1971 మేలో షాను కలవడానికి భారత విదేశాంగ కార్యదర్శి టీఎన్ కౌల్ తెహ్రాన్ వెళ్లారు. పాకిస్తాన్‌కు ఇరాన్ ఆయుధాల సరఫరాపై భారత్‌కు అప్పటికే నిఘా సమాచారం అందింది’ అని ఆ పుస్తకంలో రాశారు.
‘పాకిస్తాన్‌కు ఆయుధాలు ఇవ్వకూడదని షాను కౌల్ కోరారు. అది పెద్ద సంక్షోభంగా మారేంతగా సమస్యను పెంచవద్దని యాహ్యా ఖాన్(అప్పటి పాకిస్తాన్ అధ్యక్షుడు)ను ఒప్పించాలని షాను కోరారు. అయితే అప్పటికే తన విధానాన్ని మార్చుకోవాలని యాహ్యా ఖాన్‌కు షా సూచించారు’ అని రాశారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇందిరా గాంధీకి షా సందేశం..
1971 జూన్ 23న భారత్‌లోని ఇరాన్ రాయబారి అప్పటి ప్రధాని ఇందిరాగాంధీని కలిశారు. ఇందిరాగాంధీ, యాహ్యా ఖాన్‌లు మాట్లాడుకోవాలని షా మౌఖికంగా చెప్పారంటూ రాయబారి తెలిపారు.
పీఎం మ్యూజియం లైబ్రరీ (గతంలో నెహ్రూ మెమోరియల్)లో ఉన్న హక్సర్ పేపర్స్ ప్రకారం.. ఇందిరా గాంధీ దీనిని "వాస్తవాలతో సంబంధం లేని ఒక చిత్రమైన సూచన" అని భావించారని వెల్లడించింది.
"పాకిస్తాన్ సృష్టించిన సమస్య తీవ్రతను మీరు అర్థం చేసుకునేలా మేం చేయలేకపోయాం అని మాత్రమే చెప్పగలను" అంటూ ఇందిరాగాంధీ ఆ సందేశానికి తన స్పందన తెలిపారు. (హక్సర్ పేపర్స్, ఫైల్ 168).

ఫొటో సోర్స్, Getty Images
పాకిస్తాన్‌కు ఆయుధాలు
1971 యుద్ధానికి ముందు పాకిస్తాన్‌కు ఆయుధాలు పంపడానికి ఇరాన్ సహా కొన్ని దేశాలను అమెరికా ఎంచుకుంది.
కానీ ఇరాన్ అందుకు అంగీకరించలేదని శ్రీనాథ్ రాఘవన్ తన పుస్తకంలో రాశారు.
"సోవియట్ యూనియన్‌తో ఘర్షణను కోరుకోవడం లేదని, అందుకే యుద్ధ విమానాలు, పైలట్‌లను పాకిస్తాన్‌కు పంపడం లేదని అమెరికా రాయబారితో షా చెప్పారు. అయితే, జోర్డాన్‌కు విమానాలను పంపడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. అప్పుడు జోర్డాన్ తన విమానాలను పాకిస్తాన్ పంపించొచ్చు" అని ఇరాన్ తన అభిప్రాయాన్ని చెప్పిందని శ్రీనాథ్ రాఘవన్ తన పుస్తకంలో రాశారు.
మొహమ్మద్ యూనస్ పుస్తకం ప్రకారం "వాస్తవానికి, భారత్-పాకిస్తాన్‌ల మధ్య యుద్ధం జరిగితే.. కరాచీ గగనతల భద్రతకు ఇరాన్ హామీ ఇచ్చేలా రహస్య ఒప్పందం కుదిరింది. యాహ్యా కూడా ఈ ఒప్పందాన్ని ఇరాన్‌కు గుర్తు చేశారు. కానీ షా ఆ వాగ్దానాన్ని నెరవేర్చలేదు. భారత్, పాకిస్తాన్ యుద్ధం కేవలం రెండు దేశాల మధ్య యుద్ధం కాదనేది ఆయన వాదన".

ఫొటో సోర్స్, Getty Images
ఇండియా, ఇరాన్ నేతల రాకపోకలు
1953లో ఇరాన్ షా తిరిగి అధికారంలోకి వచ్చినప్పుడు, పశ్చిమ దేశాలకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు, అయితే భారతదేశం అలీన విధానాన్ని ఎంచుకుంది.
పాకిస్తాన్‌ను గుర్తించిన తొలి దేశం ఇరాన్. 1965, 1971.. రెండు యుద్ధాలలోనూ పాకిస్తాన్‌కు ఇరాన్ మద్దతు ఇచ్చింది.
1969లో షా తొలిసారి భారత్‌కు వచ్చారు. 1973లో ఇందిరా గాంధీ ఇరాన్‌లో పర్యటించారు. 1974 అక్టోబర్‌లో షా మరోసారి ఇండియా వచ్చారు.
భారతదేశం మొదటి అణుపరీక్ష జరిపిన కొన్ని నెలల తర్వాత జరిగిన ఈ పర్యటన చాలా ముఖ్యమైనది.
అనంతరం, ఇరాన్ నుంచి భారత్ పెద్ద మొత్తంలో ముడి చమురును దిగుమతి చేసుకోవడం ప్రారంభించింది.
కుద్రేముఖ్ ఇనుప ఖనిజం ప్రాజెక్టును అభివృద్ధి చేయడానికి రెండు దేశాల మధ్య ఒప్పందం కూడా కుదిరింది.

ఫొటో సోర్స్, Getty Images
1979 ఇస్లామిక్ విప్లవం ఇరాన్ అంతర్గత, బాహ్య పరిస్థితులను మార్చింది.
కశ్మీర్‌పై ఇరాన్ వైఖరి.. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలతో భారత్‌కు సాన్నిహిత్యం పెరుగుతుండడం వంటి అంశాలున్నా ఇరాన్ కొత్త నాయకత్వం భారతదేశంతో సంబంధాలను మెరుగుపరచుకోవడంపై ఆసక్తి ప్రదర్శించింది.
1980, 1990లలో భారతదేశానికి ముడి చమురు ప్రధాన సరఫరాదారుగా ఇరాన్ మారింది. చాబహార్ పోర్ట్ ప్రాజెక్ట్, మధ్య ఆసియాను ఆప్గానిస్తాన్‌తో అనుసంధానం చేయడంలో ఇరాన్, భారత్‌లు కలిసి పనిచేశాయి.
2003లో ప్రెసిడెంట్ మొహమ్మద్ ఖతామీ భారత్ వచ్చారు. ఆ సమయంలో ఇండియా, ఇరాన్‌ల మధ్య 'దిల్లీ డిక్లరేషన్' కుదిరింది. దీని కింద ప్రాంతీయ భద్రత, తీవ్రవాద వ్యతిరేకత, పరస్పర వాణిజ్యాన్ని పెంచడంపై ప్రత్యేక దృష్టి పెట్టారు.
ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు విధించినప్పుడు ఈ సంబంధాలు సవాళ్లను ఎదుర్కొన్నాయి. ఇరాన్ చమురును కొనుగోలు చేయవద్దని అనేక దేశాలపై అమెరికా ఒత్తిడి తెచ్చింది, అందులో భారతదేశం కూడా ఉంది.
ఇరాన్‌కు వ్యతిరేకంగా భారత్ ఓటు
అవినాష్ పలివాల్ రాసిన 'మై ఎనిమీస్ ఎనిమీ' పుస్తకం ప్రకారం.. 'ఇరాన్ అణు కార్యక్రమానికి వ్యతిరేకంగా భారతదేశం 2009లో అంతర్జాతీయ అణుశక్తి ఏజెన్సీ (ఐఏఈఏ) వేదికపై ఓటు వేసింది.
అయితే 2013లో మన్మోహన్ సింగ్, 2016లో నరేంద్ర మోదీ ఇరాన్‌లో పర్యటించారు.
ఇజ్రాయెల్, సౌదీ అరేబియాలతో భారతదేశం కలయిక.. ఇరాన్ సంబంధాలపై ప్రభావం చూపాయి. ఇరాన్‌తో వాణిజ్యం, ఇంధన వ్యాపారం ద్వారా ఈ విభేదాలను తగ్గించడానికి ప్రయత్నించినప్పటికీ, రెండు దేశాల మధ్య రాజకీయ విభేదాలు కొనసాగాయి.
గార్డియన్ వార్తాపత్రికలో ఎమ్మా గ్రాహం హారిసన్.. 'అఫ్గాన్ తాలిబాన్ ప్రతినిధి బృందాన్ని ఇరాన్‌కు పంపింది' అనే శీర్షికతో కథనం రాశారు.
"అఫ్గానిస్తాన్‌లో తాలిబాన్, ఇతర అమెరికా వ్యతిరేక గ్రూపులకు ఇరాన్ గూఢచార సంస్థలు ఆర్థిక సహాయాన్ని అందించడం ప్రారంభించాయి. యాంటీ తాలిబాన్, యాంటీ పాకిస్తాన్ ప్రచారంలో ఇరాన్ నుంచి క్రియాశీల సహకారాన్ని ఆశిస్తున్న భారత పాలకులకు ఇది పెద్ద సవాలు" అని ఆ కథనంలో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
డ్యాం నిర్మాణంపై ఇరాన్ ఆగ్రహం
అఫ్గానిస్తాన్‌లో భారత్ సల్మా డ్యాంను నిర్మించింది. అయితే ఇది కాబుల్, తెహ్రాన్‌ల మధ్య ఉద్రిక్తతను సృష్టించడమే కాకుండా ఇరాన్‌కు భారతదేశంపై కోపం తెప్పించింది.
అవినాష్ పలివాల్ పుస్తకం ప్రకారం.. “హరిరుద్ నదిపై ఈ డ్యాం నిర్మించడం ఇరాన్‌కు ఇష్టంలేదు. సల్మా డ్యాం కారణంగా ఇరాన్‌కు వెళ్లే నీటిపై అఫ్గానిస్తాన్ నియంత్రణ సాధించింది.
అంతకుముందు 1971లో హెల్మాండ్ నది నీటిని పంచుకునే సందర్భంలో ఇరుదేశాల దౌత్యవేత్తలు ఆరోపణలు చేసుకున్నారు. 1998లో మజార్-ఎ-షరీఫ్‌లో ఇరాన్ దౌత్యవేత్తలు కిడ్నాప్ కావడంతో అఫ్గానిస్తాన్‌పై దాడి చేస్తామని ఇరాన్ బెదిరించింది.
అవినాష్ పలివాల్ పుస్తకం ప్రకారం.. "తాలిబాన్ ప్రభుత్వం హెల్మాండ్ నదిని దక్షిణం వైపు మళ్లించడంతో హమున్-ఎ-హెల్మాండ్ సరస్సు ఎండిపోయింది. దీంతో ఆ ప్రాంతంలోని పంటలు, వన్యప్రాణులకు తీవ్ర నష్టం వాటిల్లింది"
2005 ఫిబ్రవరి 28న, అప్పటి ఇరాన్ విదేశీ వ్యవహారాల శాఖా మంత్రి భారత ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్‌ను కలిశారు.
సల్మా డ్యామ్ నిర్మాణంపై అధికారికంగా ఫిర్యాదు చేశారు. అయితే, ఈ విషయంపై ఇరాన్, అఫ్గానిస్తాన్ పరస్పరం మాట్లాడుకోవాలని భారత్ సూచించింది.
అనేక విషయాల్లో ఇరాన్‌తో సంబంధాలు దెబ్బతిన్నా, అమెరికా వ్యతిరేకత ఉన్నా కూడా రెండు దేశాలు చాబహార్ వంటి ప్రాజెక్టులపై కలిసి పని చేస్తూనే ఉన్నాయి.
అమెరికాతో భారత్ సంబంధాలు, చైనాతో ఇరాన్‌కు పెరుగుతున్న సాన్నిహిత్యం.. గల్ఫ్, ఆప్గానిస్తాన్ ప్రాంతీయ రాజకీయాలు, తాలిబాన్ తిరిగి అధికారంలోకి రావడం జరిగినప్పటికీ, ఇరాన్ నుంచి భారత్ దూరం కాలేదు.
పశ్చిమ దేశాల నుంచి పెరుగుతున్న ఒత్తిడి దృష్ట్యా, ఇరాన్ కూడా తన చమురు ఎగుమతికి భారత్‌ను ఒక ముఖ్యమైన దేశంగా పరిగణిస్తోంది. రాజకీయ ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ భారతదేశానికి ఇరాన్ వ్యూహాత్మక ప్రాముఖ్యం ఇవ్వడం తగ్గలేదు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














