ఈ చెట్టే ఒక అడవి

pillalamarri
ఫొటో క్యాప్షన్, పిల్లలమర్రి
    • రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

దాదాపు 700 ఏళ్ల చరిత్ర కలిగిన పిల్లలమర్రి మహావృక్షం ప్రతికూల పరిస్థితులను తట్టుకుని మళ్లీ జీవం పోసుకుంది.

ఆరేళ్లుగా తీసుకుంటున్న చర్యలతో ఈ చెట్టు మళ్లీ ప్రాణం పోసుకుని సందర్శకులకు స్వాగతం పలుకుతోంది.

తెలంగాణలోని మహబూబ్‌నగర్ పట్టణానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది పిల్లలమర్రి.

ఈ మర్రిచెట్టు ఎప్పుడు పుట్టిందనే విషయంపై కచ్చితమైన సమాచారం లేనప్పటికీ, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా, తెలంగాణ టూరిజం డిపార్ట్‌మెంట్ నుంచి ఉన్న ధ్రువీకరణ మేరకు 700 ఏళ్ల నాటి వృక్షం ఇది.

భారత దేశంలోని అతిపెద్ద మర్రిచెట్లలో ఇది ఒకటని తెలంగాణ అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. ఈ చెట్టు మూడున్నర ఎకరాలలో విస్తరించి ఉంది.

మొదట ఈ చెట్టును పీర్ల మర్రిగా పిలిచేవారు. క్రమంగా పిల్లలమర్రిగా ప్రాచుర్యంలోకి వచ్చింది.

చెట్టు శాఖోపశాఖలుగా విస్తరించడంతో దీని మొదలు ఎక్కడ అనేది తెలుసుకోలేనంతగా మారింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
పిల్లల మర్రి
ఫొటో క్యాప్షన్, 2017 డిసెంబరు నుంచి చెట్టు వద్దకు సందర్శకులను అనుమతించడం ఆపేశారు

‘‘నేనే కాదు.. చుట్టుపక్కల ఊళ్ల నుంచి ఎంతో మందిమి మా చిన్నప్పుడు ఈ చెట్టుపై ఆడుకునేవాళ్లం. ఇక్కడే గొర్రెలు మేపేవాళ్లం. ఈ చెట్టుతో చాలా ఏళ్ల అనుబంధం ఉంది’’ అని శత్రునాయక్ బీబీసీతో చెప్పారు.

మహబూబ్‌నగర్ సమీపంలోని హనుమాన్ తండాకు చెందిన 70 ఏళ్ల శత్రునాయక్.. బాల్యం నుంచి తనకు చెట్టుతో అనుబంధం ఉన్నట్లు చెప్పారు.

‘‘అప్పట్లో ఏమైందో గానీ చెట్టుకు ఉన్న పెద్ద కొమ్మలు విరిగిపడే సరికి.. మళ్లీ చెట్టు బతుకుతుందో లేదో అనుకున్నాం. మేం ఆడుకున్న చెట్టు అలా అయిపోయే సరికి చాలా బాధేసింది. ఇప్పుడు చెట్టు కాస్త బాగైంది. కొనలు కూడా బాగా పెరిగాయి’’ అని అన్నారు శత్రునాయక్.

అసలు ఈ పిల్లలమర్రి చెట్టుకు ఏమైంది? తిరిగి దాన్ని పూర్వ స్థితికి ఎలా తెచ్చారు?

పిల్లలమర్రి
ఫొటో క్యాప్షన్, ప్రస్తుతం పిల్లలమర్రి పచ్చదనంతో కళకళలాడుతోంది.

మర్రిచెట్టుకు ఏం జరిగిందంటే..

మర్రిచెట్టును చెదపురుగులు తొలచివేయడంతో 2017 డిసెంబరు 16న దాని భారీ కొమ్మ ఒకటి విరిగిపడింది. దీంతో డిసెంబరు 20 నుంచి చెట్టు వద్దకు సందర్శకులను అనుమతించడం ఆపేశారు.

అప్పటి మహబూబ్ నగర్ కలెక్టర్ రోనాల్డ్ రోస్ పిల్లలమర్రి నిర్వహణ బాధ్యతలను టూరిజం శాఖ నుంచి అటవీ శాఖకు బదలాయించారు.

చెట్టు పునరుజ్జీవంలో కీలకంగా వ్యవహరించారు రోనాల్డ్ రోస్. ప్రస్తుతం ఆయన తెలంగాణ ట్రాన్స్ కో సీఎండీగా ఉన్నారు.

రోనాల్డ్ రోస్
ఫొటో క్యాప్షన్, రోనాల్డ్ రోస్

అప్పట్లో చెట్టుకు ఎందుకు అలా ఎందుకు జరిగిందనే విషయంపై రోనాల్డ్ రోస్ బీబీసీకి వివరించారు.

‘‘పిల్లలమర్రిని చూసేందుకు చాలామంది సందర్శకులు వచ్చేవారు. వారిలో కొందరు చెట్టు ఊడలు పట్టుకుని వేలాడేవారు. మర్రిచెట్టు విస్తరించాలన్నా లేదా ఎదగాలన్నా ఊడలు చాలా ముఖ్యం. కానీ అవి విరిగిపోవడంతో చెట్టు ఎదిగే అవకాశం తగ్గిపోయింది. చెట్టుపైకి ఎక్కి పేర్లు చెక్కడం, రాయడం కారణంగా కొమ్మలు పాడయ్యాయి. దీనికితోడు పురాతనమైన చెట్టు కావడంతో చెద పురుగులు భారీ కొమ్మలు, కాండాలను తొలచివేశాయి. దాన్ని గమనించకపోవడంతో తొర్రలు ఏర్పడ్డాయి. చెట్టు బలహీనంగా మారి కొమ్మలు ఒకదాని తర్వాత మరొకటి విరిగిపడ్డాయి’’ అని రోనాల్డ్ రోస్ చెప్పారు.

మర్రిచెట్టుకు సెలైన్ బాటిళ్లు

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, సెలైన్ బాటిళ్ల ద్వారా ద్రావణం వెళ్లేలా ఏర్పాట్లు చేశారు.

చెట్టును ఎలా కాపాడారంటే?

పిల్లలమర్రిని కాపాడేందుకు 2018 ఫిబ్రవరి నుంచి చికిత్స ప్రారంభించారు అధికారులు. అటవీ నిపుణులు, రిటైర్డ్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ మనోరంజన్ భాంజా పర్యవేక్షణలో చెట్టు పునరుజ్జీవ పనులు జరిగాయి.

ఈ పనులు వివిధ దశల్లో జరిగినట్లు మహబూబ్ నగర్ జిల్లా అటవీ అధికారి సత్యనారాయణ బీబీసీతో చెప్పారు.

‘‘ప్రజలు చెట్టు వద్దకు వచ్చినా దాన్ని తాకకుండా ఉండేలా ప్రహరీ నిర్మించాం. చెట్టును చూడాలనుకునే సందర్శకుల కోసం సమీపంలో ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మించాం. దానిపై నుంచే చూసేలా ఏర్పాట్లు చేశాం. ఆ తర్వాత చెద పురుగులు లేకుండా చేసేందుకు క్లోరోపైరిఫస్ ద్రావణాన్ని తొర్రల్లోకి పంపించాం. ఇందుకు సెలైన్ బాటిళ్లను వాడాం. చెట్ల కొమ్మలకు డ్రిల్లింగ్ చేసి, ద్రావణం వెళ్లేలా ఏర్పాట్లు చేశాం. దీంతో చెద పురుగులు తగ్గాయి’’ అని సత్యనారాయణ చెప్పారు .

పిల్లలమర్రి
ఫొటో క్యాప్షన్, చెట్ల మొదళ్ల వద్ద ఎర్రమట్టి, వర్మీ కంపోస్టుతో బలం అందించే ప్రయత్నాలు చేశారు.

ఇదే విషయంపై మనోరంజన్ భాంజా బీబీసీతో మాట్లాడారు.

‘‘చెట్ల కొమ్మలు బలహీనంగా ఉండటంతో పడిపోకుండా కాంక్రీట్ స్తంభాలతో ఊతం ఇచ్చాం. తర్వాత చెద పురుగులు రాకుండా మందు ఇంజెక్ట్ చేశాం. చెట్ల మొదళ్ల వద్ద ఎర్రమట్టి, వర్మి కంపోస్టుతో బలం అందించే ప్రయత్నాలు చేశాం. చెట్టుకు రంధ్రాలు ఏర్పడిన చోట ఫంగస్ సోకకుండా కాపర్ సల్ఫేట్‌తో నింపాం. ఈ చర్యలతో చెట్టుకు కొంత బలం లభించింది’’ అని చెప్పారు.

చెట్టుకు బలం అందించేందుకు మొదట్లో వారానికోసారి పంచగవ్య, మరోసారి యూబిక్ యాసిడ్ చల్లినట్లు భాంజా వివరించారు.

మర్రిచెట్టుకు పీవీసీ పైపులు

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, పైపులు ఏర్పాటు చేసి, అందులో మట్టి, నాచు నింపారు.

పైపులతో భూమిలోకి ఊడలు వెళ్లేలా..

మొత్తం చెట్టును కొన్ని సెక్టార్లుగా విభజించుకుని పునరుజ్జీవ కార్యక్రమాలు చేపట్టినట్లు రోనాల్డ్ రోస్ చెప్పారు.

కన్హా శాంతివనం నుంచి నిపుణులు వచ్చి సలహాలు అందించారని అన్నారు.

‘‘మేం తీసుకున్న చర్యలతో చెట్టుకు కొత్తగా చిన్నపాటి ఊడలు రావడం కనిపించాయి. సహజంగా ఆ ఊడలు భూమిని తాకాలంటే రెండేళ్లు పడుతుంది. నాలుగు అంగుళాల వెడల్పున్న పీవీసీ పైపులు ఏర్పాటు చేసి, అందులో మట్టి, నాచు, కోకోపిట్ నింపాం. కొత్తగా వచ్చిన ఊడలు పైపుల్లోకి వెళ్లే ఏర్పాట్లు చేశాం. ఇలా చేయడం వల్ల రెండు నెలల్లోనే ఊడలు భూమిని తాకి.. లోపలికి చొచ్చుకు వెళ్లాయి. మొత్తంగా ఆరు నెలల్లో ఫలితం కనిపించింది’’ అని రోనాల్డ్ రోస్ చెప్పారు.

మూడు దశల్లో 140 ఊడలను భూమిలోకి వెళ్లేలా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అవన్నీ బలంగా విస్తరిస్తున్నాయి.

అటవీ శాఖాధికారి సత్యనారాయణ
ఫొటో క్యాప్షన్, అటవీ శాఖ అధికారి సత్యనారాయణ

మరో నాలుగైదు ఏళ్లపాటు చికిత్స

దాదాపు రెండున్నరేళ్లపాటు చికిత్స కొనసాగినట్లు అధికారులు చెబుతున్నారు. చెట్టుకు పునరుజ్జీవం లభించిన తర్వాత పోషకాలు అందిస్తున్నారు.

మొదట్లో వారానికి ఒకసారి పంచగవ్య అందించగా.. ఇప్పుడు 15 రోజులకోసారి పిచికారీ చేస్తున్నారు. దీన్ని మరో నాలుగైదేళ్లపాటు కొనసాగించనుంది అటవీ శాఖ.

మొత్తంగా ఇప్పటివరకు పిల్లలమర్రి పునరుజ్జీవ, నిర్వహణ కోసం సుమారు రూ. 6 కోట్లు ఖర్చు పెట్టినట్లు అటవీ అధికారి సత్యనారాయణ బీబీసీకి చెప్పారు.

పిల్లలమర్రికి కొత్త చిగుళ్లు, ఆకులు, పండ్లు
ఫొటో క్యాప్షన్, పిల్లలమర్రికి కొత్త చిగుళ్లు, ఆకులు, పండ్లు

ఆరేళ్ల తర్వాత సందర్శకులకు అనుమతి

చెట్టుకు కొత్త కొమ్మలు పుట్టుకొచ్చాయి. ప్రస్తుతం పిల్లలమర్రి పచ్చదనంతో కళకళలాడుతోంది. మర్రి పళ్లు కూడా అక్కడక్కడ కనిపిస్తున్నాయి.

ఉడుతలు, కొన్ని రకాల పక్షులు చెట్టును ఆవాసంగా చేసుకుంటున్నాయి. ప్రస్తుతం కొన్ని నిబంధనల మధ్య సందర్శకులను పిల్లలమర్రి ప్రాంగణంలోకి అనుమతిస్తున్నారు.

బీబీసీ పిల్లలమర్రిని సందర్శించినప్పుడు చెట్టు కొమ్మలు, కాండం వద్దకు వెళ్లకుండా సందర్శకులను నియంత్రించేలా ఏర్పాట్లు కనిపించాయి. అందుకు ప్రత్యేకంగా అక్కడ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు.

సందర్శకులు నడిచేందుకు వీలుగా వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేశారు. అటవీ శాఖ టికెటింగ్ వ్యవస్థను ప్రవేశపెట్టింది.

పిల్లలమర్రి
ఫొటో క్యాప్షన్, తెలంగాణలోని మహబూబ్‌నగర్ పట్టణానికి 4 కిలోమీటర్ల దూరంలో పిల్లలమర్రి చెట్టు ఉంది.

‘‘ప్రస్తుతం సందర్శకులు చెట్టును ముట్టుకోకుండా చూడొచ్చు. ఆ ప్రాంగణంలో ఆహ్లాదంగా గడపవచ్చు. చెట్టును ముట్టుకుంటే ఫైన్ వేస్తాం. త్వరలో సీసీ కెమెరాలు పెడుతున్నాం’’ అని సత్యనారాయణ చెప్పారు.

పిల్లలమర్రి ప్రాంతంలో రూ.5 కోట్లతో జింకల పార్కు, మ్యూజియం, జూ పార్కు, ఎకో పార్కును మరింత సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళిక రూపొందించినట్లు ఆయన వివరించారు.

పిల్లలమర్రి

సమస్య పూర్తిగా తొలగిపోలేదు

‘‘పిల్లలమర్రికి ఇటీవల సందర్శకులను అనుమతిస్తున్నప్పుడు అక్కడి నుంచి నాకు ఫొటోలు పెట్టారు. చాలా సంతోషంగా అనిపించింది’’ అని బీబీసీతో రోనాల్డ్ రోస్ చెప్పారు.

‘‘700 ఏళ్ల చరిత్ర గల చెట్టు.. గొప్ప చరిత్రకు సాక్ష్యంగా నిలిచింది. ఆ చెట్టును కోల్పోయి ఉంటే అది ‘నేషనల్ లాస్’ (జాతీయ స్థాయిలో నష్టం) అయ్యుండేది. పిల్లలమర్రికి మళ్లీ జీవం పోయడం సమాజానికి నా వంతు సహకారంగా భావిస్తాను’’ అని అన్నారు.

పిల్లలమర్రిని ప్రజలందరూ వారసత్వ సంపదగా భావించి కాపాడుకుంటేనే భవిష్యత్తు తరాలకు అందించగలుగుతామని మనోరంజన్ భాంజా అంటున్నారు.

‘‘పిల్లల మర్రి విషయంలో చెట్టు విస్తరణకు అవకాశం తక్కువగా ఉంది. సమస్య ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. రసాయనాల ప్రభావం తగ్గిన తర్వాత చెద పురుగులు మళ్లీ రావొచ్చు. ఎప్పటికప్పుడు పర్యవేక్షణ అవసరం. అంతేకాకుండా, అభివృద్ధి కార్యక్రమాలు చేసేటప్పుడు చెట్టు పరిరక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవాలి’’ అని భాంజా వివరించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)