హిజ్బుల్లా అనే బలమైన శత్రువుతో ఇజ్రాయెల్ తలపడుతోందా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జెరెమీ బోవెన్
- హోదా, ఇంటర్నేషనల్ ఎడిటర్, బీబీసీ న్యూస్
హిజ్బుల్లా మీద జరిపిన దాడుల్లో పురోగతిపై ఇజ్రాయెల్ నేతలు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. పేజర్లు, వాకీటాకీలను పేల్చడంతో మొదలైన ఈ దాడులు, ప్రాణాంతక వైమానిక దాడుల వరకూ చేరుకున్నాయి.
సోమవారం వైమానిక దాడుల తర్వాత రక్షణ మంత్రి యోవ్ గల్లాంట్ వాటిని మెచ్చుకోకుండా ఉండలేకపోయారు.
‘‘ఇవాళ ఒక అద్భుతమైన రోజు. హిజ్బుల్లా పుట్టినప్పటి నుంచి దానికి అత్యంత వరస్ట్ వీక్ ఇది. ఈ దాడి ఫలితాలే ఇందుకు నిదర్శనం’’ అని ఆయన అన్నారు.
ఇజ్రాయెల్ పౌరులకు ప్రమాదకరంగా మారే అవకాశం ఉన్న వేలాది రాకెట్లను తమ వైమానిక దాడులు ధ్వంసం చేశాయని గల్లాంట్ అన్నారు.
తమ పౌరులు 550 మందిని ఇజ్రాయెల్ చంపేసిందని, వారిలో 50 మంది చిన్నారులు ఉన్నట్లు లెబనాన్ చెబుతోంది.
2006లో ఇజ్రాయెల్, హిజ్బుల్లా మధ్య నెలపాటు జరిగిన యుద్ధంలో లెబనాన్‌లో చనిపోయిన వారిలో ఈ మరణాలు దాదాపు సగం.
ఇజ్రాయెల్ రాజకీయ నాయకులకు, సైనికాధినేతలకు విజయం కావాలి. యుద్ధం ప్రారంభమై సుమారు ఏడాది అవుతున్న సమయంలో గాజాలో పరిస్థితులు నరకప్రాయంగా ఉన్నాయి.
అయినప్పటికీ, హమాస్ దళాలు టన్నెళ్లలో దాక్కుని, ఇజ్రాయెల్ సైనికులను చంపడం, గాయపరచడం కొనసాగిస్తూనే ఉన్నాయి. కొందరు ఇజ్రాయెల్ బందీలు ఇంకా వారి చేతుల్లోనే ఉన్నారు.

గత ఏడాది అక్టోబర్‌లో ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి చేసింది. హమాస్ పెనుప్రమాదమని, దానివల్ల పర్యవసనాలను దారుణంగా ఉంటాయని ఇజ్రాయెలీలు ఎప్పుడూ భావించలేదు. కానీ, లెబనాన్ అలాంటిది కాదు.
2006లో హిజ్బుల్లాతో జరిగిన చివరి యుద్ధం మధ్యలోనే నిలిచిపోవడంతో, ఇజ్రాయెల్ రక్షణ దళాలు(ఐడీఎఫ్), మొసాద్ నిఘా సంస్థలు భవిష్యత్ యుద్ధానికి ప్రణాళికలు వేస్తూనే ఉన్నాయి.
హిజ్బుల్లా వద్ద మిగిలిపోయిన అధికారాన్ని దూరం చేసేందుకు ప్రస్తుత దాడులు అతిపెద్ద పురోగతిగా భావిస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు అన్నారు.
ఇజ్రాయెల్ సరిహద్దుల్లోకి హిజ్బుల్లా రాకెట్ల ప్రయోగాన్ని తాము అడ్డుకుంటామని ఆయన తెలిపారు.
అదేవిధంగా, సరిహద్దు నుంచి హిజ్బుల్లాను వెళ్లగొట్టేందుకు, తమకు ప్రమాదకరంగా మారిన స్థావరాలను ధ్వంసం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది.

ఫొటో సోర్స్, EPA
మరో గాజానా?
గత ఏడాది గాజాలో నెలకొన్న యుద్ధ పరిస్థితులు గతవారం లెబనాన్‌లోనూ నెలకొన్నాయి. గాజాలో మాదిరిగానే, తమ ప్రాంతాల నుంచి వెళ్లిపోవాలని లెబనాన్‌లోని పౌరులకు ఇజ్రాయెల్ హెచ్చరికలు పంపింది. హిజ్బుల్లా, హమాస్‌లు సామాన్య పౌరులను రక్షణ కవచంగా వాడుకుంటున్నాయని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది.
అసలేం జరుగుతుందో తెలుసుకునే వీలు లేనంత వేగంగా ఈ హెచ్చరికలు వస్తున్నాయని, తమ ప్రాంతాలను ఖాళీ చేసేందుకు కుటుంబాలకు కనీస సమయం కూడా ఇవ్వడం లేదని ఇజ్రాయెల్ దాడులను తప్పుబడుతున్నవారు అంటున్నారు.
పౌరులను కాపాడాలని, బలగాలను ఇష్టమొచ్చినట్లు వాడటాన్ని ఆపాలని యుద్ధ చట్టాలు చెబుతున్నాయి.
మరోవైపు, ఇజ్రాయెల్‌పై హిజ్బుల్లా చేసిన కొన్ని దాడులు పౌరుల నివాస ప్రాంతాల్లో జరిగాయి. పౌరులకు రక్షణ కల్పించే చట్టాలను ఇవి ఉల్లంఘించాయి. అలాగే, ఇజ్రాయెల్ సైన్యాన్ని కూడా ఇవి లక్ష్యంగా చేసుకున్నాయి.
ఇజ్రాయెల్, అమెరికా, బ్రిటన్ వంటి దాని పశ్చిమ మిత్రదేశాలు హిజ్బుల్లాను ఉగ్రవాద సంస్థగా వర్గీకరించాయి.
తమ వద్ద మోరల్ ఆర్మీ ఉందని, నిబంధనలను ఇది గౌరవిస్తుందని ఇజ్రాయెల్ చెబుతోంది. కానీ, గాజాలో ఇది జరుపుతున్న దాడులను మాత్రం చాలా వరకు ప్రపంచం ఖండిస్తోంది.
పేజర్ దాడిని తీసుకుంటే.. పేజర్లు వాడుతున్న హిజ్బుల్లా ఆపరేటివ్స్‌ను తాము లక్ష్యంగా చేసుకున్నామని ఇజ్రాయెల్ చెప్పింది. కానీ, ఎప్పుడు, ఎలా పేజర్ల లోపలకు బాంబులొచ్చాయో తనకు తెలియదని ఇజ్రాయెల్ అంటోంది.
పేజర్లు పేలడంతో ఇళ్లల్లో, షాపుల్లో, ఇతర పబ్లిక్ ప్రాంతాల్లో ఉన్న చాలామంది గాయాలు పాలయ్యారు, చనిపోయారు. పౌరులకు, సైనిక దళాలకు మధ్య తేడా లేకుండా ఇజ్రాయెల్ ఈ ప్రాణాంతక దాడులు చేస్తోందన్నది వీటితో రుజువైందని కొందరు ప్రముఖ న్యాయవాదులు అన్నారు. ఇవి యుద్ధనిబంధనల ఉల్లంఘనగా పేర్కొన్నారు.
1980ల్లో ఇజ్రాయెల్, హిజ్బుల్లా మధ్య యుద్ధం మొదలైంది. కానీ, ఈసారి సరిహద్దు యుద్ధం అక్టోబర్ 7న హమాస్ జరిపిన దాడులతో మొదలైంది.
హమాస్‌కు పరిమితంగా సాయం చేయాలని తొలుత ఆదేశాలిచ్చారు హసన్ నస్రల్లా. కానీ, ప్రస్తుతం సరిహద్దుల్లో హమాస్‌కు మద్దతుగా ప్రతిరోజూ దాడులు జరుపుతున్నారు.
ఈ దాడులతో సరిహద్దు పట్టణాల్లో నివసిస్తున్న సుమారు 60 వేల మంది ఇప్పటికే తమ ఇళ్లను విడిచిపెట్టారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇజ్రాయెల్ గతంలో కూడా లెబనాన్‌పై దాడి చేసింది. తమపై పాలస్తీనియన్ల దాడులను నిరోధించడానికి 1982లో ఇజ్రాయెల్ సైన్యాలు బేరూత్‌లో ప్రవేశించాయి. అయితే, ఇజ్రాయెల్ దేశపు క్రైస్తవ మిత్రులు సబ్రా, షటిలా శరణార్ధి శిబిరాల్లో పాలస్తీనియన్లను ఊచకోత కోశారు. దీంతో దేశంలోనూ, అంతర్జాతీయంగానూ ఆగ్రహం వెల్లువెత్తింది. చివరకు అవమానకరమైన పరిస్థితుల్లో బేరూత్ నుంచి ఇజ్రాయెల్ వెనుదిరగాల్సి వచ్చింది.
1990ల నాటికి ఇజ్రాయెల్ సరిహద్దుల్లో ఉన్న లెబనీస్ భూభాగాలను తన ఆధీనంలోకి తీసుకుంది. ఇప్పుడు ఇజ్రాయెల్ సీనియర్ సైనికాధికారులు అప్పటికి యువకులు.
అప్పట్లో వారు హిజ్బుల్లా మీద తీవ్రమైన పోరాటం చేశారు. ఇజ్రాయెల్‌ను అక్కడి నుంచి తరిమి కొట్టడమే లక్ష్యంగా హిజ్బుల్లా అప్పుడప్పుడే బలం కూడదీసుకుని ఎదుగుతోంది.
2000లో అప్పటి ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి, ఐడీఎఫ్‌కు మాజీ చీఫ్ కూడా అయిన ఎహుద్ బరాక్ ‘సెక్యూరిటీ జోన్’గా చెప్పే ప్రాంతం నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు.
ఇక్కడ ఉండటం వల్ల ఇజ్రాయెల్‌కు పెద్దగా లాభం లేకపోగా, దేశభద్రత మరింత ప్రమాదకరంగా మారిందని, అనేకమంది సైనికులను ఇది బలిగొంటోందని అప్పట్లో ఆయన తన నిర్ణయానికి వివరణ ఇచ్చుకున్నారు.
2006లో సరిహద్దుల దగ్గర హిజ్బుల్లా చేసిన దాడుల్లో అనేకమంది ఇజ్రాయెల్ సైనికులు చనిపోగా చాలామంది బందీలుగా చిక్కారు. అయితే, అప్పటి ఇజ్రాయెల్ ప్రధాని ఎహుద్ ఓల్మర్ట్ యుద్ధానికి దిగారు. ఇజ్రాయెల్ ఇంత తీవ్రంగా స్పందిస్తుందని ముందే ఊహించి ఉంటే తాను ఈ దాడులకు దిగేవాడిని కానని హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా అప్పట్లో అంగీకరించారు.
ఇజ్రాయెల్ మీదకు విరుచుకుపడే రాకెట్ దాడులను తమ వాయుసేన అడ్డుకుంటుందని మొదట్లో ప్రధాని ఓల్మర్ట్ భావించారు. అది జరగకపోవడంతో ఇజ్రాయెల్ సైనిక పటాలాలు, ట్యాంకులు లెబనాన్ సరిహద్దుల నుంచి వెనక్కి రావాల్సి వచ్చింది. యుద్ధం చివరి రోజు వరకు ఇజ్రాయెల్ మీదకు లెబనాన్ రాకెట్లను పంపుతూనే ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
యుద్ధం మొదలైంది...మున్ముందు ఏం జరుగుతుంది?
లెబనాన్‌లోకి ప్రవేశించడమనేది గాజాలో యుద్ధం చేసినంత ఈజీ కాదని ఇజ్రాయెల్ సైనికాధికారులకు తెలుసు. 2006 తర్వాత హిజ్బుల్లా కూడా పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతూ వచ్చింది. స్వదేశంలో బలంగా మారుతూ వచ్చింది. దాని కొండప్రాంతాలు యుద్ధతంత్రానికి కేంద్రాలుగా మారాయి.
గాజాలో హమాస్ తవ్విన సొరంగాలన్నింటినీ ఇజ్రాయెల్ ధ్వంసం చేయలేకపోయింది. దక్షిణ లెబనాన్ సరిహద్దుల్లో హిజ్బుల్లా గత 18 సంవత్సరాలుగా పటిష్టమైన రాతి నేలలో సొరంగాలు, స్థావరాలను సిద్ధం చేసుకుంది. ఇందులో ఇరాన్ అందించిన బలమైన ఆయుధాలున్నాయి. గాజాలో హమాస్‌కు సరఫరాలకు భిన్నంగా, ఈ ఆయుధాలు నేరుగా సిరియా భూభాగం నుంచి లెబనాన్‌లోకి వస్తాయి.
హిజ్బుల్లా దగ్గర దాదాపు 30 వేలమంది యాక్టివ్ ఫైటర్‌లు, 20 వేలమంది వరకు రిజర్వ్ సైనిక జవాన్లు ఉన్నారని వాషింగ్టన్ డీసీకి చెందిన థింక్ ట్యాంక్ ‘సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్’ సంస్థ వెల్లడించింది.
సిరియాలో అసద్ పాలనకు మద్దతుగా పోరాడిన వీరికి, యుద్ధానుభవం కూడా ఉంది.
అనేక అంచనాలబట్టి చూస్తే హిజ్బుల్లా దగ్గర 120,000 నుంచి 200,000 వరకు క్షిపణులు, రాకెట్లు ఉన్నాయి. వీటిలో చాలామటుకు ఇజ్రాయెల్‌లోని అనేక సిటీలను తాకగల అన్ గైడెడ్ ఆయుధాలు.
గాజాలాగే లెబనాన్‌లోని పట్టణాలన్నింటినీ ధ్వంసం చేస్తానన్న భయంతో తన దగ్గరున్న ఆయుధాలన్నింటినీ లెబనాన్ వాడేస్తుందా? బహుశా ఇదే ఉద్దేశంతో హిజ్బుల్లాను రెచ్చగొట్టి ఇజ్రాయెల్ రిస్క్ తీసుకుంటూ ఉండవచ్చు.
లెబనాన్ తన దగ్గరున్న ఆయుధాలన్నింటినీ వాడేయడానికి ఇరాన్ కూడా ఒప్పుకోదు. ఎందుకంటే ఆ దేశం దగ్గర కొన్ని ఆయుధాలు మిగిలి ఉండటం వల్ల, తన అణు స్థావరాల మీద ఇజ్రాయెల్ దాడులు జరగకుండా వాటిని బెదిరింపు కోసం ఇరాన్ ఉపయోగించుకోవచ్చు.
గాజాలో యుద్ధం కొనసాగుతుండటం, ఆక్రమిత వెస్ట్‌బ్యాంక్‌లో హింస పెరుగుతుండటంతో, ఇప్పుడు లెబనాన్ పై దాడి చేస్తే మూడో వైపు నుంచి కూడా ఇజ్రాయెల్ సెగను ఎదుర్కోవాల్సి ఉంటుంది. సైనికులు ఇప్పటికే ట్రైనింగ్ పొంది సిద్ధంగా ఉన్నప్పటికీ, ఇజ్రాయెల్‌కు అసలైన శక్తి అయిన రిజర్వ్ యూనిట్లు ఏడాదిగా సాగుతున్న యుద్ధంతో అలసిపోయి ఉన్నాయి.
దౌత్య మార్గాలు మూసుకుపోయాయా?
యునైటెడ్ స్టేట్స్ నేతృత్వంలోని ఇజ్రాయెల్ మిత్రదేశాలు, ఇజ్రాయెల్- హిజ్బుల్లాల మధ్య యుద్ధాన్ని కోరుకోవడం లేదు. సరిహద్దుల దగ్గర ఉద్రిక్తతలు తగ్గాలంటే దౌత్యమే మార్గమని అవి చెబుతున్నాయి.
2006లో ఐక్యరాజ్యసమితి భద్రతా తీర్మానం 1701ను ఆధారంగా చేసుకుని ఒక అమెరికన్ రాయబారి ఓ ఒప్పందాన్ని రూపొందించారు. దీని ద్వారా అప్పుడు యుద్ధం ముగిసింది.
కానీ, గాజాలో కాల్పుల విరమణ లేకుండా దౌత్యవేత్తల చేతులు కట్టివేశారు. మరోవైపు గాజాలో యుద్ధం ఆపినప్పుడే ఇజ్రాయెల్‌పై దాడులను ఆపుతామని హిజ్బుల్లా నేత హసన్ నస్రల్లా అంటున్నారు.
గాజాలో కాల్పుల విరమణ ఒప్పందానికి, పాలస్తీనా ఖైదీలతో ఇజ్రాయెలీల బందీల మార్పిడికి ఇజ్రాయెలీలుగానీ, హమాస్‌గాని సిద్ధంగా లేవు.
లెబనాన్‌లో ప్రస్తుతం ఇజ్రాయెల్ వైమానిక దాడులు కొనసాగుతుండటంతో, అక్కడి కుటుంబాలు తీవ్ర ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి.
గత ఏడాది ఎదుర్కొన్న నష్టానికి మించిన విపత్కర పరిస్థితులను హిజ్బుల్లా కలిగించనుందని ఇజ్రాయెల్‌కు తెలుసు.
హిజ్బుల్లాను తమ సరిహద్దుల నుంచి పంపించే సమయం ఆసన్నమైందని ఇజ్రాయెల్ నమ్ముతోంది. కానీ, ఇదే సమయంలో అత్యంత ఆయుధాలు ఉన్న, శత్రువును ఇది ఎదుర్కోవాలి.
ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి జరిపిన తర్వాత ఏడాది కాలంగా జరుగుతున్న యుద్ధానికి ఇది అత్యంత ప్రమాదకరమైన సమయం. ఇది మరింత తీవ్రరూపం దాల్చకుండా ఏదీ ఆపలేకపోతుంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














