డీఆర్ కాంగో: జబ్బు పడ్డారని వేలమంది ఖైదీలను వదిలేసిన ప్రభుత్వం

ఫొటో సోర్స్, DR Congo Ministry of Justice
- రచయిత, ఎమెరీ ముకుమెనో, డేమియన్ జేన్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (డీఆర్ కాంగో)లో అత్యంత నరకప్రాయమైన జైళ్లల్లో ఒకటైన మకాలా జైలు నుంచి 1,685 మంది ఖైదీలు విడుదల అయ్యారు.
తీవ్ర అస్వస్థతతో ఉన్నారంటూ ప్రభుత్వం వీరిని విడుదల చేసింది.
ఈ జైలులో పరిమితికి మించి ఖైదీలను ఉంచుతున్నారనే ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి.
రద్దీని తగ్గించే క్రమంలో భాగంగా డీఆర్ కాంగో రాజధాని కిన్షాసాలో ఉన్న మకాలా జైలు నుంచి ఈ ఖైదీలను గత ఆదివారం విడుదల చేశారు.
ఈ నెల ప్రారంభంలో ఇదే జైలులో, గోడలు బద్దలు కొట్టి పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా, 129 మంది ఖైదీలు చనిపోయారు.
వీరిలో కొందర్ని భద్రతా బలగాలు కాల్చి చంపగా, మరికొందరు ఇరుకైన ప్రదేశంలో తొక్కిసలాట కారణంగా ఊపిరాడక మరణించినట్లు అధికారులు చెప్పారు.
జైలులో ఖైదీల రద్దీని తగ్గించే ప్రణాళికలను వేగవంతం చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఈ జైలులో పరిస్థితులు నరకంలా ఉంటాయని ఆరోపణలు ఉన్నాయి.

జైలు నుంచి విడుదలైన కొందరు ఖైదీల ఫోటోలు ఆ దేశ న్యాయశాఖ ఫేస్‌బుక్ పేజీపై కనిపించాయి.
ఈ ఫోటోలు ఒకదానిలో కుడి కాలు చుట్టూ మురికి బ్యాండేజ్ వేసుకుని ఉన్న ఒక మతి స్థిమితం లేని వ్యక్తి కనిపించారు.
తీవ్ర పౌష్టికాహార లోపంతో ఉన్న వందల సంఖ్యలో వ్యక్తులను కూడా మరో ఫోటోలో చూడొచ్చు. గాయాలకు ఎలాంటి బ్యాండేజ్ లేకుండా, గాయాలతోనే కింద కూర్చుని ఉన్నారు మరోవ్యక్తి.
కొందరి పరిస్థితి మరీ దారుణంగా ఉంది.
కనీసం నిల్చోడానికి కూడా ఓపిక లేని ఒక ఖైదీ తన జీవితం మార్చుకునేందుకు వెళుతున్నానంటూ అరుస్తున్నారు. ఇతరుల బాధకు తానిక కారణం కాబోనని అంటున్నారు. తమను విడిచిపెట్టడంలో సాయపడిన అధికారులకు, న్యాయ మంత్రికి ఆయన ధన్యవాదాలు చెప్పారు.
వైద్య చికిత్స అవసరమయ్యే వారికి చికిత్స అందిస్తామని, అలాగే ఇతరులను బస్సుల ద్వారా ప్రభుత్వం ఇంటికి పంపుతుందని న్యాయశాఖ మంత్రి కాన్‌స్టాంట్ ముతంబా చెప్పినట్లు వార్తా సంస్థ ఏపీ రిపోర్ట్ చేసింది.
జైలులో ఖైదీల సంఖ్యను తగ్గించేందుకు మకాలా జైలు నుంచి వేల మందిని విడుదల చేయాలని మంత్రి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. కొత్త ఖైదీలను ఈ జైలుకు తరలించడాన్ని కూడా నిషేధించారు.
1.4 కోట్ల మంది జనాభా ఉన్న కిన్షాసా నగరంలో రెండు జైళ్లు ఉన్నాయి. మకాలా కాకుండా, ఎన్‌డోలెలో ఉన్న మిలటరీ జైలు సామర్థ్యం 500 మంది.
జైలు పరిస్థితులపై పోరాడిన బిల్ క్లింటన్ ఫౌండేషన్ ఫర్ పీస్ అధినేత ఇమ్మాన్యుయేల్ అడు కోలె ఖైదీల విడుదలను స్వాగతించారు.
కానీ, జైలులో అంతర్గతంగా ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు మరిన్ని చర్యలు అవసరమని అన్నారు.
1950ల్లో నిర్మించిన ఈ జైలు సామర్థ్యం 1500 మంది. కానీ, ఈ నెలలో జైలు గోడలు బద్దలు కొట్టేనాటికి దీనిలో 12 వేల మంది ఉన్నట్లు అంచనా.

ఫొటో సోర్స్, DR Congo Ministry of Justice
‘మకాలా నిజంగానే నరకం’ అని అక్కడి మాజీ ఖైదీ, జర్నలిస్ట్ స్టానిస్ బుజకేరా అంతకుముందు బీబీసీతో చెప్పారు.
ఓ ప్రతిపక్ష నేత మరణంలో సైన్యం ప్రమేయం ఉందన్న ఆరోపణలపై కథనం రాశారన్న అభియోగం మీద బుజకేరాను అధికారులు మకాలా జైలుకు పంపారు.
ఆయన అక్కడ ఆరునెలలు గడిపారు.
‘‘మకాలా ఒక జైలు కాదు, కాన్సంట్రేషన్ క్యాంపులను తలపించే నిర్బంధ కేంద్రం. చనిపోయేలా చేయడానికే అక్కడికి పంపిస్తారు’’ అని ఆయన చెప్పారు.
చిన్నపాటి నేరాలు చేసేవారి నుంచి రాజకీయ ఖైదీలు, హంతకుల వరకు అందరూ ఇందులో ఉన్నారు.
పారిపోయేందుకు ప్రయత్నించిన వారిపై కాల్పులు జరిపిన ఘటనలో ప్రాణాలతో బయటపడిన నలుగురు ఖైదీలు న్యూయార్క్ టైమ్స్‌తో మాట్లాడుతూ జైలులోని దుర్భర పరిస్థితులను వివరించారు.
తాము తప్పించుకోవడానికి ప్రయత్నించడానికి ఒక రోజున్నర ముందు నుంచి జైల్లో మంచినీటి సరఫరాలేదని, కరెంటు లేక ఫ్యాన్లు తిరగలేదని వారు చెప్పారు.
ఆ ఉక్కపోత, వేడిని తట్టుకోలేక కొంతమంది ఖైదీలు తొలుత బయటకు వచ్చారని చెప్పారు.
మకాలా జైలులో పరిస్థితులు అసాధారణంగా ఉంటాయని, నీటి పంపులు ఎప్పుడూ ఎండిపోయి ఉంటాయని, కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలియదని, ఖైదీలు రోజుల తరబడి చీకట్లోనే ఉండాల్సి వస్తుందని బుజకేరా తెలిపారు.
‘ఖైదీలను వారి ఖర్మానికి వదిలేస్తారు. విపరీతమైన రద్దీ, అపరిశుభ్రమైన వాతావరణం వల్ల వ్యాధులు వ్యాపిస్తాయి’ అని చెప్పారు.
జైలు లోపలున్న పరిస్థితులను రహస్యంగా వీడియోలు చిత్రీకరించారు బుజకేరా. జైలులో రద్దీ సమస్య ఉందని అధికారులు సైతం ఒప్పుకుంటున్నారు.
జైళ్లలో రద్దీ పెరిగిపోవడానికి మేజిస్ట్రేట్లు కారణమని నిందిస్తూ.. కేసుల్లో అనుమానితులను కూడా జైలుకు పంపుతున్నారని కొందరు అధికారులు అంటున్నారు.
నిజానికి చాలామంది ఖైదీలు నేరారోపణ రుజువై శిక్ష అనుభవించడం లేదు. కేవలం విచారణ కోసం ఎదురుచూస్తూ జైల్లో గడుపుతున్నారు.
2020లో జైలులో ఉన్నవారిలో కేవలం 6 శాతం మందికి మాత్రమే మరణశిక్ష పడింది. మిగిలిన కేసులు డీఆర్ కాంగో న్యాయ వ్యవస్థలో ఏళ్ల తరబడి మగ్గుతూ వస్తున్నాయి.
కాంగోకు చెందిన మానవ హక్కుల సంస్థ ‘లా వోయిక్స్ డెస్ సాన్స్ వోయిక్స్’ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రోస్టిన్ మాన్‌కేటా అనేకసార్లు మకాలా జైలును సందర్శించారు.
ఎవరినైనా ఆ జైలుకు పంపారంటే వారిని నరకానికి పంపినట్లేనని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, Stanis Bujakera
స్నానాల గది గోడలపై నిద్ర
మకాలాలో ఉన్న సమయంలో బుజకేరా తీసిన వీడియోలు ఆ జైలులోని దుర్భర పరిస్థితులను కళ్లకు కట్టాయి.
కిక్కిరిసిపోయిన ప్రదేశంలో నేలపై అనేకమంది ఖైదీలు నిద్రపోతుండడం అందులో కనిపిస్తుంది.
కాలు చాపడానికి కూడా వీలులేని దుర్భర పరిస్థితి అది. కొందరు స్నానాల గదుల గోడలపైనా నిద్రపోతూ కనిపించారు.
‘అయితే మకాలా జైలులో వీఐపీల సెల్‌లో పరిస్థితులు మెరుగ్గా ఉన్నాయి. అక్కడ మంచం, కొద్దిగా విశాలమైన స్థలం దొరుకుతాయి. కానీ చాలా కొద్దిమందికి మాత్రమే అవి దొరుకుతాయి’ అని బుజకేరా చెప్పారు.
వీఐపీ సెల్‌లో ఉండటానికి తనను 3 వేల అమెరికన్ డాలర్లు (సుమారు 2 లక్షల 50వేల రూపాయలు) అడిగారని.. తాను 450 అమెరికన్ డాలర్లు (సుమారు 38 వేల రూపాయలు) ఇచ్చి ఆ సౌకర్యాలు పొందానని బుజకేరా చెప్పారు.
‘మకాలాలో వార్డెన్ల ప్రమేయం తక్కువగా ఉంటుంది. జైలు లోపల శాంతిభద్రతల నిర్వహణను ఖైదీలకే అప్పగిస్తారు. ఖైదీలు వారిని వారే పాలించుకుంటారు’’ అని మానవ హక్కుల కార్యకర్త ఫ్రెడ్ బౌమా చెప్పారు.
మార్చి 2015 నుంచి ఆగస్టు 2016 వరకు మకాలా జైలులో గడిపిన ఆయన, బీబీసీ ఫోకస్ ఆన్ ఆఫ్రికా పాడ్‌కాస్ట్‌లో మాట్లాడారు.
ఖైదీల స్వయంపాలన వారి మధ్య గొడవలకు, హింసకు దారితీస్తోందని బుజకేరా చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














