పంజాబ్: జైలులో జీవిత భాగస్వామితో ఏకాంతంగా గడిపేందుకు వేయికి పైగా ఖైదీల దరఖాస్తులు

- రచయిత, గీతా పాండే, అరవింద్ చాబ్రా
- హోదా, బీబీసీ న్యూస్
జైలులో ఖైదీలు ఏకాంతంగా గడపడానికి అనుమతి ఇచ్చిన మొదటి రాష్ట్రంగా పంజాబ్ నిలిచింది. హత్య కేసులో నిందితుడిగా ఉన్న 60 ఏళ్ల వ్యక్తి మొదటగా ఈ వెసులుబాటును ఉపయోగించుకున్నారు.
హత్యా నేరం కింద గుర్జీత్ సింగ్ కొన్ని నెలలుగా తర్న్ తరన్ జిల్లాలోని గోయింద్‌వాల్ జైలులో ఉన్నారు. ''జైలులో ఒంటరితనంతో దిగులుగా ఉండేది. కానీ, ఇప్పుడు చాలా ఊరటగా ఉంది. నా భార్యతో రెండు గంటల పాటు ఏకాంతంగా గడిపే అవకాశం ఇచ్చారు'' అని ఆయన బీబీసీతో చెప్పారు.
జైలులో మంచి ప్రవర్తనతో ఉండే ఖైదీలను ప్రతీ రెండు నెలలకు ఒకసారి రెండు గంటల పాటు వారి భాగస్వాములను కలిసేందుకు అనుమతిస్తామని పంజాబ్ జైలు అధికారులు చెప్పారు. ఆ తర్వాతే గుర్జీత్‌కు తన భార్యను కలిసే అవకాశం దక్కింది.
అప్పటినుంచి 1000కి పైగా ఖైదీలు తమ భాగస్వాములను కలిసేందుకు అనుమతివ్వాలని కోరుతూ దరఖాస్తు చేశారని, ఇందులో సగం మంది ఇప్పటికే వారి భాగస్వాములను కలిసినట్లు బీబీసీతో జైలు అధికారులు చెప్పారు.
సత్ప్రవర్తన కలిగిన ఖైదీలు తమ కుటుంబాలతో కలిసి బహిరంగ జైళ్లలో ఉండేందుకు రాజస్థాన్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలు అనుమతించాయి. ఖైదీలు సంతానం కోసం లేదా వైవాహిక సంబంధాలను కొనసాగించడానికి దేశవ్యాప్తంగా చాలా కోర్టులు అనుమతించాయని సుప్రీం కోర్టు న్యాయవాది సునీల్ సింగ్ చెప్పారు.
దేశంలోని 5 లక్షలకు పైగా ఖైదీల్లో ఎక్కువమంది తమ జీవిత భాగస్వాములను ఏళ్ల పాటు కలుసుకునే అవకాశం ఉండదని ఆయన అన్నారు.

గత నెలలో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టడం ద్వారా ఇలాంటి సమావేశాలను అనుమతించిన తొలి భారతీయ రాష్ట్రంగా పంజాబ్ అవతరించింది.
సెప్టెంబర్ 20న రాష్ట్రంలోని 25 జైళ్లలో మూడింటిలో ఈ పథకాన్ని ప్రారంభించారు. అక్టోబర్ 3నాటికి దీన్ని 17 జైళ్లకు విస్తరించారు. సౌకర్యాలను ఏర్పాటు చేయడానికి మిగతా జైళ్లు చాలా చిన్నవని, ఒకటి పిల్లల కోసం కేటాయించిన జైలు అని అధికారులు చెప్పారు.
ఈ పథకాన్ని అమలు చేసే జైళ్లు.. మంచం, అటాచ్డ్ బాత్రూంతో కూడిన ఒక గదిని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ సమయంలో భార్యభర్తలు సన్నిహితంగా మెలగవచ్చని ప్రభుత్వ ఆదేశాల్లో ఉంది.
''ఖైదీల ఒత్తిడి స్థాయిలను అదుపులో ఉంచడానికి, సమాజంలో తిరిగి వారు కలిసిపోయేలా చేయడానికి ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు'' అని బీబీసీతో జైలు శాఖ సీనియర్ అధికారి హర్‌ప్రీత్ సిద్దు చెప్పారు.
రష్యా, జర్మనీ, ఫ్రాన్స్, బెల్జియం, స్పెయిన్, ఫిలిప్పీన్స్, కెనడా, సౌదీ అరేబియా, డెన్మార్క్‌లతో పాటు అమెరికాలోని కొన్ని రాష్ట్రాలు జైళ్లలో ఏకాంత సందర్శనలను అనుమతిస్తున్నాయి. బ్రెజిల్, ఇజ్రాయెల్‌లో స్వలింగ భాగస్వాములకు కూడా ప్రవేశం కల్పిస్తున్నారు.
''కానీ, భారత్‌లోని జైళ్లు... జైలు పరిసర ప్రాంతాల్లో సందర్శకులతో శారీరక సంబంధాన్ని అనుమతించవు'' అని లాయర్ అమిత్ సాహ్ని చెప్పారు.
2019లో సాహ్ని, దిల్లీ హైకోర్టులో ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఖైదీలకు 'ఏకాంత సందర్శన'ను ప్రాథమిక హక్కుగా మార్చాలంటూ ఆయన వ్యాజ్యంలో కోరారు.
''భాగస్వాములు కలుసుకున్నప్పుడు కౌగిలించుకోవాలనుకోవడం, చేతులు పట్టుకోవాలనుకోవడం చాలా సహజం. కానీ, జైలు అధికారుల సమక్షంలో ఈ సమావేశాలు జరుగుతాయి కాబట్టి వారు భాగస్వాములతో ఇలా ప్రవర్తించలేరు.
నేరం చేసిన వారిని శిక్షించడం సమంజసమే. కానీ, వారి భాగస్వాముల సంగతి ఏంటి? వారు తమ హక్కులను ఎందుకు కోల్పోవాలి?'' అని సాహ్ని అన్నారు.
ఆయన పిటిషన్‌పై విచారణ జరుగుతోంది. వైవాహిక సంబంధాలను కొనసాగించడం కోసం లేదా సంతానం కోసం పెరోల్ కావాలంటూ ఖైదీల భాగస్వాములు కోర్టులను ఆశ్రయించారు. ఇలాంటి చాలా కేసుల్లో వారి అభ్యర్థనకు కోర్టులు అంగీకారం తెలిపాయి.

2018లో మద్రాస్ హైకోర్టు, తమిళనాడులోని తిరునల్వేలీ జిల్లాలో జీవిత ఖైదు అనుభవిస్తోన్న 40 ఏళ్ల దోషిని, సంతానం కోసం రెండు వారాల పాటు ఇంటికి వెళ్లేందుకు అనుమతించింది. దాంపత్యపు సందర్శనలు (కాంజుగల్ విజిట్స్) ఒక హక్కు అని విశేషాధికారం కాదని ఈ సందర్భంగా జడ్జిలు వ్యాఖ్యానించారు.
జైళ్లలో ఒకే లింగం కలిగిన వ్యక్తుల మధ్య లైంగిక సంబంధాల కారణంగా అసంఖ్యాకంగా పెరుగుతోన్న హెచ్‌ఐవీ-ఎయిడ్స్ కేసుల నివేదికలను ప్రస్తావిస్తూ జైళ్లలో సంస్కరణలు చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని కోర్టు ఆదేశించింది.
2014లో పంజాబ్, హరియాణా హైకోర్టు జస్టిస్ సూర్యకాంత్... ఏకాంత సందర్శనలు, కృత్తిమ గర్భధారణకు ఖైదీలకు అనుమతిచ్చారు.
''సంతానాన్ని పొందడం, ఖైదీలకు ఒక ప్రాథమిక హక్కు'' అని ప్రస్తుతం సుప్రీం కోర్టు జడ్జిగా ఉన్న జస్టిస్ సూర్యకాంత్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దోషుల్లోని కేటగిరీలను బట్టి రాష్ట్రాలు దీనిపై నిర్ణయం తీసుకోవచ్చని తెలిపారు.
పెరోల్ లేకుండా ఎక్కువ కాలం జైళ్లలో ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వాలని పంజాబ్ ప్రభుత్వ ఉత్తర్వులు చెబుతున్నాయి. కొన్ని కేటగిరీల్లో ఉన్న దోషులకు ఈ అవకాశం కల్పించవద్దని కూడా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అవేంటంటే..
- అధిక ముప్పు ఉన్న ఖైదీలు, గ్యాంగ్‌స్టర్లు, తీవ్రవాదులు
- చిన్నారులపై వేధింపులకు పాల్పడ్డవారు, లైంగిక నేరాలకు చెందిన వారు, గృహ హింస పాల్పడినవారు.
- క్షయ, హెచ్‌ఐవీ, లైంగికంగా సంక్రమించే వ్యాధులు ఉన్నవారికి
- గత మూడు నెలల్లో జైలులో ఎటువంటి నేరాలకు పాల్పడని వారు
- గత మూడు నెలల్లో జైలులో తమ విధుల నిర్వహణను సక్రమంగా నిర్వహించని వారు
- జైలులో ఉత్తమ ప్రవర్తన ప్రదర్శించని వారు ఈ అవకాశాన్ని పొందలేరు.
జంట లోపలికి వెళ్లిన తర్వాత తలుపు బయట నుంచి గడియ వేస్తామని, మార్గదర్శకాల ప్రకారం అన్ని కిటికీలు, బయటకు వెళ్లడానికి ఉన్న మార్గాలు అన్నింటినీ మూసివేస్తామని గోయింద్‌వాల్ జైలు సూపరింటెండెంట్ లలిత్ కోహ్లి చెప్పారు.
కొన్ని నెలల పాటు కుటుంబాన్ని చూడలేకపోయినందుకు మానసికంగా కుంగిపోయినట్లు చీటింగ్ కేసులో అండర్ ట్రయల్ నిందితుడిగా ఉన్న 37 ఏళ్ల జోగా సింగ్ చెప్పారు. అయితే, తన భార్యను జైలులో కలుసుకునేందుకు తొలుత సంశయించానని, ఆమె జైలుకు వస్తే జైలు సిబ్బంది ఆమెను ఎలా చూస్తారో అని ఆందోళన చెందినట్లు తెలిపారు.
''కానీ, నేను భయపడినట్లు ఏం జరగలేదు. అంతా సవ్యంగా జరిగింది'' అని ఆయన చెప్పారు.
అయితే, జైళ్లలో ఇలా నేరస్తులకు సౌకర్యాలు కల్పించడం బాధితులను, వారి కుటుంబాలను బాధపెడుతుందని విమర్శకులు అంటున్నారు.
ఇటీవల హత్యకు గురైన పాప్ సింగర్ సిద్ధూ మూసేవాలా తల్లి చరణ్ కౌర్ దీనిపై స్పందించారు.
''నా కొడుకును హత్య చేసిన నేరస్తులకు పంజాబ్ ప్రభుత్వం జైలులో మంచాలు, కంచాలు ఏర్పాటు చేసి సౌకర్యాలు కల్పిస్తోంది'' అని విమర్శించారు.
అయితే, జైలు అధికారులు ఈ విమర్శలను ఖండించారు - మూసేవాలా హత్య కేసులో అరెస్టయిన వ్యక్తులు గ్యాంగ్‌స్టర్స్ అయినందున వారు దాంపత్య సందర్శనలకు అర్హులు కాదని వారు అంటున్నారు.
ప్రస్తుతం భారతదేశంలోని అన్ని జైళ్లకు ఈ దాంపత్య సందర్శన సౌకర్యాన్ని విస్తరించాలని, ఖైదీలను సంస్కరించడంలో ఇది గొప్ప ముందడుగు అని న్యాయవాది అమిత్ సాహ్ని అన్నారు.
"చట్టాల ఉద్దేశ్యం ఖైదీలను శిక్షించడమే కాదు, వారిని సంస్కరించడం కూడా. తద్వారా వారు బయటకు వచ్చిన తర్వాత, తిరిగి సమాజంలో కలిసిపోతారు" అని ఆయన అన్నారు.
ఇవి కూడా చదవండి:
- Deepfake: ‘నా ముఖాన్ని మార్ఫింగ్ చేసి సెక్స్ వీడియోలలో వాడారు’
- చైనా: కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్ నుంచి మాజీ అధ్యక్షుడిని బలవంతంగా బయటకు పంపించారు... కలకలం రేపుతున్న వీడియో
- తిరుమల: రక్తదానంతో ప్రత్యేక ఉచిత దర్శనం, 1985 నుంచి ఉన్న ఈ పథకం గురించి మీకు తెలుసా?
- మహిళలపై ఆర్ఎస్ఎస్ వైఖరి మారుతోందా... బీజేపీకి ఓట్ల కోసమే అలా చేస్తున్నారా?
- పవన్ కల్యాణ్ జనసేన దారేది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











