అన్నా సెబాస్టియన్: పని ఒత్తిడిపై కార్పొరేట్ ఉద్యోగులు ఏమంటున్నారు, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకోవడం ఎలా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, బి. నవీన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
కేరళకు చెందిన 26 ఏళ్ల చార్టర్డ్ అకౌంటెంట్ అన్నా సెబాస్టియన్ మృతితో దేశవ్యాప్తంగా కార్పొరేట్ ‘టాక్సిక్ వర్క్ కల్చర్’పై చర్చ మొదలైంది.
పుణెలో ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఇండియా (Ernst & Young-EY) కంపెనీలో నాలుగు నెలల కిందటే సెబాస్టియన్ ఉద్యోగంలో చేరారు. తమ కుమార్తె మృతికి పని ఒత్తిడే కారణమని ఆమె తల్లిదండ్రులు ఆరోపించారు.
‘‘తీవ్ర పని ఒత్తిడి వల్లే మా అమ్మాయి మరణించింది. ఈ కష్టం మరే కుటుంబానికి రాకూడదు’’ అంటూ ఎర్నెస్ట్ అండ్ యంగ్ కంపెనీకి అన్నా సెబాస్టియన్ తల్లి రాసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అయితే, అందరు ఉద్యోగస్తుల్లాగానే అన్నా స్టెబాస్టియన్‌కు వర్క్ ఇచ్చామని, పని ఒత్తిడి వల్లే ఆమె చనిపోయిందనడం సరికాదని అంటూ ఈవై కంపెనీ ఈ ఆరోపణలను ఖండించింది.
ఈ ఘటనతో కార్పొరేట్ సంస్థల్లో, స్టార్టప్‌లలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఒత్తిడిపై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది.


ఫొటో సోర్స్, Getty Images
వర్క్ కల్చర్‌పై కార్పొరేట్ ఉద్యోగులు ఏమంటున్నారు?
కార్పొరేట్ వర్క్ కల్చర్ ఎలా ఉంటుందన్న అంశంపై బీబీసీ కొందరు ఉద్యోగులతో మాట్లాడింది.
"వారం రోజుల్లో చేయాల్సిన పనిని రెండు రోజుల్లోనే పూర్తి చేయాలని క్లయింట్ కోరితే, ‘డు ఆర్ డై’ అన్నట్లుగా పూర్తి చేయాల్సిందే. వీక్ ఆఫ్స్, సెలవు రోజుల్లోనూ పని చేయాలని చెబితే ఒప్పుకొని తీరాల్సిందే” అని ఒక కార్పొరేట్ సంస్థలో పని చేస్తున్న మనోజ్ చెప్పారు.
“కార్పొరేట్ కంపెనీలలో వారానికి రెండు వీక్ ఆఫ్‌లు, సెలవులు ఉంటాయని ఇంకేం సంతోషమే కదా అని చాలామంది అంటారు. కానీ, అక్కడ ఉండే ఒత్తిడికి ఆ రెండు రోజులు కూడా రిలీఫ్ లేకుంటే ఉద్యోగులు పిచ్చెక్కిపోతారు.
వర్క్ ఫ్రమ్ హోంలో పర్సనల్ లైఫ్‌ని పక్కన పెట్టి మరీ ఎక్కువగా పని చేయాల్సి ఉంటుంది. ఎక్కువసేపు పని చేసినంత మాత్రాన క్వాలిటీ ప్రొడక్టివిటీ పెరగదు కదా?” అని ఐటీ రంగంలో 5 ఏళ్ల అనుభవం ఉన్న అనూష చెప్పారు.

“ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలతో పోల్చితే సర్వీస్ బేస్డ్ కంపెనీల్లో ఎక్కువ ఒత్తిడి ఉంటుంది. ఒక వర్క్ పూర్తి కావడానికి వివిధ డిపార్ట్‌మెంట్లతో కలిసి పనిచేయాలి. అవతలి వాళ్లు ఆలస్యంగా పని చేసినప్పటికీ, టైమ్‌కు పూర్తి చేయాల్సిన బాధ్యత మనపైనే ఉంటుంది. దీంతో, తెలియకుండానే ఒత్తిడి పెరుగుతుంది. లేకుంటే మేనేజర్ వద్ద పేరు పోతుంది, హైక్స్ రావు అన్న భయాలు ఉంటాయి” అని కార్పొరేట్ ఉద్యోగి నరసింహా చెప్పారు.
“ఐటీ ఉద్యోగులకు కష్టమొస్తే ఎవరిని సంప్రదించాలో తెలియదు. కార్మిక శాఖ వాళ్లకు ఫిర్యాదు చేసిన వాళ్లు ఐటీ కంపెనీలపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.
డే వన్ నుంచే అప్రైజల్స్, స్పెషల్ అలవెన్స్‌లు అనే చట్రంలో ఉద్యోగులను నెట్టేస్తున్నారు. ఉద్యోగుల కోసం నిర్వహించే మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్స్ పేపర్లకే పరిమితమవుతున్నాయి.
ఇది కాక, బాస్‌లు చెప్పినట్లు నడుచుకోక పోతే ఉద్యోగం పోతుందనే అభద్రతా భావం ఈ ఇండస్ట్రీలో ఎక్కువగా ఉంది. మొత్తంగా చూస్తే ఇదో జైలు జీవితం” అని ఫోరమ్ ఫర్ ఐటీ ఎంప్లాయిస్ యూనియన్ తెలంగాణ అధ్యక్షుడు కట్టారి వినోద్ కుమార్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
వర్క్‌లైఫ్ బ్యాలెన్స్‌పై కార్పొరేట్ దిగ్గజాలు ఏమంటున్నారు?
వారానికి 40 గంటలు కాదు, 70 గంటలు పని చేయాలని గతేడాది అక్టోబర్‌లో ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు నారాయణ మూర్తి అన్నారు.
“నువ్వు నీ పనిని ఎంజాయ్ చేస్తుంటే ఆటోమేటిక్‌గా ఉద్యోగ జీవితంలో, వ్యక్తిగత జీవితంలో ఆనందం దొరుకుతుంది. అంతేకానీ, వర్క్ లైఫ్ బ్యాలెన్స్‌పై నాకు నమ్మకం లేదు” అని ఓలా ఇండియా చీఫ్ భవేష్ అగర్వాల్ అన్నారు.
“కొత్తగా ఉద్యోగంలో జాయినయ్యేవారు 4-5 ఏళ్ల పాటు రోజుకు 18 గంటలు పనిచేయడానికి సిద్ధంగా ఉండాలి” అని బాంబే షేవింగ్ కంపెనీ వ్యవస్థాపకురాలు శాంతను దేశ్‌పాండే 2022లో అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
అత్యధిక పని గంటలు ఉన్న దేశాలలో భారత్ ఏ స్థానంలో ఉంది?
భారత్‌లో సగం కంటే ఎక్కువ మంది వారానికి 49 గంటల కంటే ఎక్కువగా పని చేస్తున్నారని ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ చేపట్టిన ఓ సర్వేలో తేలింది. అత్యధిక పని గంటలు ఉన్న దేశాల్లో భారత్ ఒకటి.
1990 తరువాత దేశంలో కార్పొరేట్ రంగం బాగా విస్తరించడంతో ఆయా కంపెనీలు కార్మిక చట్టాలను తుంగలో తొక్కి 24 గంటలు పాటు ఉత్పాదకత కోసం పరుగులు పెడుతున్నాయని లేబర్ ఎకనామిస్ట్ శ్యామ్ సుందర్ చెప్పారు.
“ప్రఖ్యాత బిజినెస్ స్కూల్స్‌లో సైతం ఎక్కువ జీతం సంపాదించడానికి ఎక్కువ గంటలు పని చేయాలని బోధిస్తున్నారు. వర్క్ అంటే కంపెనీ సైడ్ నుంచే కాదు ఉద్యోగుల సైడ్ నుంచి కూడా చూడాలి. ఇద్దరూ కలిసి పని ఎంత వరకు? పర్సనల్ లైఫ్ ఎంత వరకు? అని సరిహద్దులు నిర్ణయించుకుని వర్క్ కల్చర్‌ని డెవలప్ చేసుకోవాలి. అదే మైండ్‌సెట్ షిప్ట్ అంటే. ఇప్పుడిది ఎంతో అవసరం” అని శ్యామ్ సుందర్ అన్నారు.

టెక్నాలజీ అంటేనే మనిషి పనిని తగ్గించడమని అర్ధమని, కానీ పని గంటలు రోజురోజుకు ఎందుకు పెరుగుతున్నాయని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ప్రొఫెసర్‌గా పని చేస్తున్న చంద్రశేఖర్ శ్రీపాద ప్రశ్నించారు.
ఈ తరహా టాక్సిక్ కల్చర్( విష సంస్కృతి) వల్ల తీవ్రమైన సమస్యలు తలెత్తుతాయని ఆయన అన్నారు.
"ఉద్యోగులు ఒత్తిడికి గురి కావొద్దనే ఉద్దేశంతోనే ఫన్ ఫ్రైడే వంటివి నిర్వహిస్తుంటాం. అప్పుడప్పుడు క్రికెట్ లేదా ఇండోర్ గేమ్స్ టోర్నీలు పెడతాం. ఎవరైనా వ్యక్తిగతంగా మమ్మల్ని కలిసి, ఒత్తిడికి గురవుతున్నామంటే డాక్టర్లతో కౌన్సిలింగ్ ఇప్పిస్తాం. టీమ్ లంచ్, టీమ్ అవుటింగ్స్ లాంటివి ప్లాన్ చేస్తుంటాం. సాధ్యమైనంత వరకు ఉద్యోగులపై ఒత్తిడి తగ్గించే ప్రయత్నం చేస్తున్నాం. అయినప్పటికీ, ఈ సమస్యలు ఎదురవుతున్నట్లు చాలాచోట్ల వింటున్నాం’’ అని హైదరాబాద్‌కు చెందిన రాకేశ్ చెప్పారు. ఆయన ఓ కార్పొరేట్ కంపెనీలో మానవ వనరుల విభాగంలో పని చేస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
వర్క్ లైఫ్ బ్యాలెన్స్‌కి డాక్టర్లు చెబుతున్న టిప్స్ ఇవే
వర్క్ లైఫ్ బ్యాలెన్స్‌కు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశంపై పలువురు వైద్య నిపుణులతో బీబీసీ మాట్లాడింది.
“సాధారణంగా మగవారితో పోల్చితే మహిళల్లో ఈ ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, మహిళలు రోజూ రన్నింగ్, వాకింగ్, యోగా, జుంబా వంటి వ్యాయమాలు చేయాలి. ఆఫీస్‌లో ఒత్తిడిగా అనిపిస్తే ఆ విషయాలు నచ్చిన వారితో షేర్ చేసుకుంటే కొంచెం రిలీఫ్ దొరుకుతుంది” అని సీఐఐ యంగ్ ఇండియన్స్‌లో వలంటీర్‌గా పని చేస్తున్న డా. శ్రావణి సంధ్య చెప్పారు.
“మన మనసుకు, మెదడుకు హాయిని కలిగించే పని చేస్తే డోపమైన్ హార్మోన్ విడుదలవుతుంది. దీనిని ‘ఫీల్ గుడ్ హార్మోన్’ అంటారు. పని ఒత్తిడి కారణంగా ఈ హార్మోన్ విడుదల కాదు. కాబట్టి, వీక్ ఆఫ్స్ లేదా సెలవు రోజుల్లో సోషల్ మీడియా, సినిమాలు అంటూ కాకుండా ప్రకృతితో మమేకం కావాలి. గార్డెనింగ్ చేయాలి. ఓ మంచి పుస్తకం చదవాలి, పెయింటింగ్ వేయాలి, కవితలు రాయాలి ఇలా ఏదో ఒక ఉల్లాసభరితమైన పని చేస్తే డోపమైన్ విడుదలై ఒత్తిడి తగ్గుతుంది” అని డాక్టర్ పవన్ నిహార్ చెప్పారు. ఆయన క్రిటికల్ కేర్ మెడిసిన్ విభాగంలో నిపుణులు.
“జీవితంలో పని ఓ భాగం. పనే జీవితం కాదు కాబట్టి, ఎంత పని ఉన్నప్పటికీ టైమ్‌కు తినడం, నిద్రపోవడం అలవర్చుకోవాలి. స్నేహితులు, కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయిస్తూ హాయిగా బతకడం నేర్చుకోవాలి” అని సైకియాట్రిస్ట్ కన్సల్టెంట్ నిశాంత్ వేమన చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
రైట్ టు డిస్ కనెక్ట్ అమలు భారత్‌లో కష్టమా?
పని వేళలు ముగిసిన తరువాత ఆఫీస్‌కు సంబంధించిన విషయాలకు దూరంగా ఉండే హక్కే ‘రైట్ టు డిస్ కనెక్ట్’.
ఉద్యోగులు ఇలా పనిని దూరం పెడితే ఆయా కంపెనీలు ఉద్యోగంలో నుంచి తీసివేస్తాయనే భయం ఉండకూదని చాలా దేశాలు ‘రైట్ టు డిస్ కనెక్ట్’ చట్టాలు చేశాయి.
యూరప్, లాటిన్ అమెరికాలాంటి దేశాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా 20కిపైగా దేశాల్లో ఈ చట్టం అమలులో ఉంది.
బెల్జియం, ఐర్లాండ్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, యూకే తదితర దేశాలలో ఇది అమలవుతోంది. జపాన్‌లో 4 రోజుల పని విధానం అమలు చేస్తున్నారు.

భారత్‌లోనూ 2019లో 'రైట్ టు డిస్ కనెక్ట్' బిల్లును మహారాష్ట్రకు చెందిన ఎన్సీపీ నేత సుప్రియా సూలే లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఇది ప్రైవేట్ మెంబర్ బిల్. అయితే, ఇది చట్టంగా మారలేదు.
భారత్‌లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ‘రైట్ టు డిస్ కనెక్ట్’ చట్టం అమలు చేయడానికి చాలా అడ్డంకులు ఉన్నాయని న్యాయవాది నాగేశ్వరరావు బీబీసీ తెలుగుతో చెప్పారు.
“మన దేశంలో అవసరానికి తగినట్లు స్కిల్డ్ లేబర్ లేరు. డిగ్రీ సర్టిఫికెట్లు తప్ప ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండట్లేదు. కాబట్టి, విద్యావ్యవస్థలో మార్పులు తెచ్చి స్కిల్డ్ గ్రాడ్యుయేట్లను సమాజంలోకి పంపాలి. అప్పుడే ఇండస్ట్రీ అవసరాల మేరకు నైపుణ్యాలు కలిగిన ఉద్యోగులు దొరుకుతారు. తద్వారా ఎక్కువ మందికి ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి, పని ఒత్తిడి తగ్గుతుంది. అంతేగానీ, కేవలం ‘రైట్ టు డిస్ కనెక్ట్’ చట్టం చేసినంత మాత్రాన పెద్దగా మారేది ఏమీ ఉండదు” అని నాగేశ్వరరావు అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఏం చెబుతోంది..!
2023లో విడుదలైన “వర్కింగ్ టైమ్ అండ్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అరౌండ్ ది వరల్డ్” రిపోర్టు ప్రకారం.. పని గంటలు తగ్గించడం వల్ల, ఫ్లెక్సిబుల్ వర్క్ ఇవ్వడం వల్ల ప్రొడక్టివిటీ పెరుగుతుందని తేలింది.
ఈ రిపోర్టు ప్రకారం, ఉద్యోగికి ఫ్లెక్సిబుల్ వర్క్ ఏర్పాటు చేయాలి. ఉద్యోగి- కంపెనీ ఇద్దరికీ ప్రయోజనకరంగా ఉండేలా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ విధానాలు రూపొందించాలి. తక్కువ సంఖ్యలో ఉద్యోగులతో ఎక్కువ పని చేయించుకునే బదులు, ఎక్కువ మందితో తక్కువ గంటలు పని చేయించుకోవడం వల్ల నాణ్యమైన ఉత్పాదకత పెరుగుతుంది. కోవిడ్-19 సమయంలో ఇచ్చినట్లుగా ఇంటి నుంచి పని, పార్ట్ టైం వర్క్, ఫోన్ ద్వారా పని వంటి వెసులుబాట్లు ఉద్యోగులకు ఇస్తే మంచి ఫలితాలు వస్తాయని ఆ రిపోర్టు పేర్కొంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














