లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడి, 1982, 2006 యుద్ధాలను గుర్తుచేస్తోందా? ఇజ్రాయెల్ వ్యూహం ఏంటి?

ఫొటో సోర్స్, EPA
- రచయిత, ఒమర్ హసన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
లెబనాన్‌పై దాడులను ఇజ్రాయెల్ మరింత తీవ్రతరం చేస్తోంది. హిజ్బుల్లా స్థావరాలే లక్ష్యంగా ఇప్పటి దాకా గగనతల దాడులు చేసిన ఇజ్రాయెల్, ఇప్పుడు భూతల దాడులకు సిద్ధమవుతోంది.
ఇజ్రాయెల్, లెబనాన్‌ల మధ్య జరుగుతున్న ఈ ఘర్షణ 2006 యుద్ధాన్ని గుర్తుచేస్తోంది. అప్పుడు కూడా మొదట వైమానిక దాడులు, తర్వాత గ్రౌండ్ ఎటాక్‌లు జరిగాయి.
2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడులు చేసిన తర్వాత, దక్షిణ లెబనాన్ నుంచి ఇజ్రాయెల్‌పై హిజ్బుల్లా దాడి చేయడం ప్రారంభించింది. అప్పటి నుంచి ఇజ్రాయెల్, హిజ్బుల్లా మధ్య పరస్పర దాడులు జరుగుతూనే ఉన్నాయి.
కొన్ని రోజులుగా గగనతల దాడులతో లెబనాన్‌పై విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్, ఇప్పుడు భూతల దాడులతో ఆ తీవ్రతను మరింత పెంచేందుకు కసరత్తు చేస్తోంది.


ఫొటో సోర్స్, EPA
లెబనాన్‌లోకి ఇజ్రాయెల్ దళాలు?
హిజ్బుల్లాతో ఘర్షణ కారణంగా ఉత్తర ఇజ్రాయెల్ ప్రాంతంలోని దాదాపు 60,000 మంది ప్రజలు తమ ఇళ్లను వదిలివెళ్లారని, వారందరినీ సురక్షితంగా తిరిగి తమ ఇళ్లకు తీసుకొస్తానని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు చాలాసార్లు ప్రతిజ్ఞ చేశారు.
ఇజ్రాయెల్ ఏదో ఒక రూపంలో లెబనాన్‌లోకి ప్రవేశించాలని భావిస్తోందని సెప్టెంబరు 25న స్పష్టమైంది. అక్కడి నివాసితులకు హిజ్బుల్లా నుంచి ఎదురయ్యే ముప్పును తగ్గించాలని చూస్తోందని తెలుస్తోంది.
"మన పనిని కొనసాగిస్తూనే ఉంటాం. ఆగేదే లేదు. దాడులు చేస్తూనే ఉంటాం. మన లక్ష్యం చాలా స్పష్టంగా ఉంది. ఉత్తర ఇజ్రాయెల్‌కు చెందిన ప్రజలను సురక్షితంగా తిరిగి తమ ఇళ్లకు తీసుకురావడమే మన లక్ష్యం" అని ఇజ్రాయెల్ ఆర్మీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ హెర్జి హలేవి అన్నారు.
సైన్యం భూతల ఆపరేషన్‌కు సిద్ధమవుతోందని, సైనికులు శత్రు భూభాగంలోకి ప్రవేశించి, హిజ్బుల్లా ముఖ్యమైన సైనిక స్థావరాలు ఉన్న గ్రామాలలోకి వెళ్తారని హెర్జి హలేవి తెలిపారు.
దీనికి ముందు, సెప్టెంబరు 23 సోమవారం నాడు లెబనాన్‌లోని హిజ్బుల్లా స్థావరాలుగా ఇజ్రాయెల్ చెబుతున్న ప్రాంతాలపై జరిగిన దాడుల్లో 550 మందికి పైగా మరణించారు. దీంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. అయితే, మృతుల్లో మహిళలు, పిల్లలు, వైద్య సిబ్బంది సహా డజన్ల కొద్దీ సామాన్య పౌరులు ఉన్నారని లెబనాన్ ఆరోగ్య శాఖ తెలిపింది.

ఫొటో సోర్స్, AFP
ఇజ్రాయెల్ వ్యూహం ఎలా ఉంటుంది?
లెబనాన్‌తో గతంలో జరిగిన యుద్ధాల్లో ఇజ్రాయెల్ తన గ్రౌండ్ ఆపరేషన్లలో వివిధ పద్ధతులను అనుసరించింది. దీనిని అర్థం చేసుకోవడానికి 1982, 2006లో లెబనాన్‌పై ఇజ్రాయెల్ ఎలా దాడులు చేసిందో తెలుసుకుందాం.
1982 యుద్ధం: పూర్తి స్థాయి భూతల దాడి
ఇజ్రాయెల్ దౌత్య మిషన్ల వెబ్‌సైట్ ప్రకారం.. "1982లో పాలస్తీనియన్ క్రాస్-బార్డర్‌లో కాల్పులను ఆపడానికి, లెబనాన్‌లో సిరియన్ ఉనికిని అంతం చేయడం కోసం ఇజ్రాయెల్‌తో శాంతి ఒప్పందంపై సంతకం చేయగల లెబనాన్ స్నేహపూర్వక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో సహాయపడటానికి ఇజ్రాయెల్ దళాలు లెబనాన్‌లోకి ప్రవేశించాయి''.
అప్పుడు వేల మంది సైనికులు, వందల యుద్ధ ట్యాంకులు, సాయుధ వాహనాలతో భారీ దాడి జరిగింది. ఇజ్రాయెల్ సైనికులు దూసుకెళ్లారు. ఒక వారంలోనే లెబనాన్ రాజధాని బేరూత్ శివార్లకు చేరుకున్నారు, నగరాన్ని ముట్టడించారు.

ఫొటో సోర్స్, Getty Images
1982 యుద్ధాన్ని ప్రపంచం ఎలా చూసింది?
ఏది ఏమైనప్పటికీ, అప్పుడు ఇజ్రాయెల్ తీరును ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ఖండించారు. 1982 సెప్టెంబర్‌లో బేరూత్‌లో వందల మంది పాలస్తీనియన్లు క్రైస్తవ మిలీషియాల చేతిలో ఊచకోతకు గురయ్యారు. ఆ సమయంలో ఇజ్రాయెల్ దళాలు ఏమీ చేయలేదు. దానిని సబ్రా, షటిలా మారణకాండగా పిలిచారు. అది అంతకుముందు నాలుగు రోజుల క్రితం అధ్యక్షుడిగా ఎన్నికైన బషీర్ గెమాయెల్ హత్యకు ప్రతీకారమని అప్పట్లో కథనాలు వచ్చాయి.
1982తో పోలిస్తే 2006లో భూతల చొరబాటు నెమ్మదిగా సాగింది. ఇది లెబనాన్ లోపల కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న పట్టణాలు, వాటి పరిసరాలకు మాత్రమే పరిమితమైంది.
ఇజ్రాయెల్ రాజకీయ విశ్లేషకుడు యోవ్ స్టెర్న్ సెప్టెంబరు 23న బీబీసీతో మాట్లాడుతూ.. ఇప్పుడు ఇజ్రాయెల్ చేయబోయే భూతల దాడి 1982 మాదిరిగా ఉంటుందనుకోవడం లేదన్నారు. అయితే ఇది నెమ్మదిగా, వ్యూహాత్మకంగా, అన్ని విషయాలనూ పరిగణనలోకి తీసుకొని జరిగే చొరబాటు కావొచ్చని అభిప్రాయపడ్డారు.
ఒకేసారి పూర్తి స్థాయి దండయాత్రకు దిగకుండా, దక్షిణ లెబనాన్ ప్రాంతంలోని పట్టణాలను ఇజ్రాయెల్ ఒక్కొక్కటిగా ఆక్రమించవచ్చని ఆయన తెలిపారు. ఇది 2006లో జరిగిన దాని మాదిరే ఉంటుంది, కానీ ఇజ్రాయెల్ మరింతగా లెబనాన్‌లోకి వెళ్లి లిటాని నదికి చేరుకునే సూచనలు కనిపిస్తున్నాయి. లెబనాన్‌లోని ముఖ్యమైన ప్రాంతాలను నియంత్రించడానికి లిటాని నది ఇరువర్గాలకూ చాలా ముఖ్యమైనది.
దక్షిణ లెబనాన్ పట్టణాలలో హిజ్బుల్లా దీర్ఘకాల ఉనికి ఆధారంగా దీనిని స్టెర్న్ అంచనా వేశారు. ఇజ్రాయెల్ ఈ పట్టణాలను ఆక్రమించుకుంటే, హిజ్బుల్లా ఉనికి కష్టతరం అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, Israel Defense Forces
ఇజ్రాయెల్ ఎంత దూరం వెళ్తుంది?
దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడి చేస్తే, దాని దళాలు ఎక్కువ కాలం అక్కడ ఉండవని సైనిక విశ్లేషకుడు, మాజీ జనరల్ హిషామ్ జాబెర్ అభిప్రాయపడ్డారు.
2006 దండయాత్ర సమయంలో ఇజ్రాయెల్ ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఇబ్బందులు ఎదుర్కొన్నదని ఆయన చెప్పారు. భవిష్యత్తులో జరిగే ఏ దండయాత్ర అయినా భిన్నంగా ఉంటుందని అన్నారు.
ఇజ్రాయెల్ భూతల దాడిని ఎక్కువ కాలం కొనసాగించకుండా, అందుకు బదులుగా హత్యలు, సైబర్ దాడులతో పాటు వైమానిక దాడులపై ఎక్కువగా దృష్టి పెట్టే అవకాశం ఉందని హిషామ్ అంటున్నారు.
ఇజ్రాయెల్ గ్రౌండ్ ఆపరేషన్లు లెబనాన్ సరిహద్దు పట్టణాలలో చాలా చిన్న ప్రాంతాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుంటాయని హిషామ్ భావిస్తున్నారు. అయినప్పటికీ, లెబనాన్‌లోని ఇతర ప్రాంతాల్లో ఇజ్రాయెల్ "కమాండో కార్యకలాపాలు" నిర్వహించే అవకాశాన్ని ఆయన తోసిపుచ్చలేదు.
మరోవైపు స్టెర్న్ మాట్లాడుతూ.. ఇజ్రాయెల్ గ్రౌండ్ ఆపరేషన్ లక్ష్యాల్లో దక్షిణ లెబనాన్‌లోని పెద్ద ప్రాంతం కూడా ఉండొచ్చని తెలిపారు. లిటాని నదికి ఉత్తరాన ఉన్న కొన్ని ప్రాంతాలలోకి కూడా ఇజ్రాయెల్ చొరబడే అవకాశం ఉందన్నారు.
దాడి లక్ష్యాలు ఏమిటి?
1982 యుద్ధం ప్రధాన లక్ష్యం దక్షిణ లెబనాన్‌లోని పాలస్తీనా ఫైటర్లను లెబనీస్-ఇజ్రాయెల్ సరిహద్దు నుంచి 40 కిలోమీటర్ల దూరం వెనుకకు తరిమేయడం, వారి రాకెట్లు, ఫిరంగుల నుంచి ఉత్తర ఇజ్రాయెల్‌ను రక్షించడం. బేరూత్‌లోని పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ (పీఎల్వో) మౌలిక సదుపాయాలను నాశనం చేయడం, సిరియన్ దళాలను లెబనాన్ నుంచి తరిమికొట్టడం కూడా లక్ష్యంగా పెట్టుకుంది ఇజ్రాయెల్.
1982లో దక్షిణ లెబనాన్ ప్రాంతంలో మాత్రమే కాకుండా బెకా లోయ, చౌఫ్ పర్వతాలు, బేరూత్ వంటి భారీ ప్రాంతాలపై కూడా ఇజ్రాయెల్ దాడి చేసింది.
చిన్నస్థాయి భూతల దాడులు తక్కువ దీర్ఘకాల సైనిక ప్రభావాన్ని చూపుతాయని హిషామ్ జాబెర్ భావిస్తున్నారు.
ఏది ఏమైనప్పటికీ, దక్షిణ లెబనాన్‌లోకి ఇజ్రాయెల్ చొరబాటు ప్రధానంగా లిటాని నదికి ఉత్తరంగా హిజ్బుల్లా ఫైటర్లను వెనక్కి తరిమేయడమే లక్ష్యంగా ఉంటుందని స్టెర్న్ అభిప్రాయపడ్డారు. దీనికి రెండు ప్రధాన కారణాలున్నాయన్నారు.
‘‘ఒకటి ఇజ్రాయెల్ పట్టణాలపై షార్ట్ రేంజ్ రాకెట్ దాడులను ఆపడానికి, రెండోది ఉత్తర ఇజ్రాయెల్‌లో అక్టోబర్ 7న జరిగిన దాడుల వంటి ఘటనలు మరోసారి జరగకుండా నిరోధించడానికి’’ అని స్టెర్న్ చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














