దేవర మూవీ రివ్యూ: తండ్రీ కొడుకులుగా జూనియర్ ఎన్టీఆర్ మెప్పించారా?

ఫొటో సోర్స్, X/SivaKoratala
- రచయిత, శృంగవరపు రచన
- హోదా, బీబీసీ కోసం
'ఆర్‌ఆర్‌ఆర్'తో ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన జూనియర్ ఎన్టీఆర్, ఆరేళ్ల తర్వాత సోలో హీరోగా నటించిన సినిమా 'దేవర.'
కొరటాల శివ దర్శకత్వంలో భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం.


ఫొటో సోర్స్, NTR ARTS/FB
ఎర్ర సముద్రం కథేంటి?
ఆంధ్రప్రదేశ్, తమిళనాడు సరిహద్దులో రత్నగిరి ప్రాంతంలోని నాలుగు గ్రామాలను కలిపి ఎర్ర సముద్రం అంటారు. స్వాతంత్య్రం కోసం బ్రిటీషర్లకు వ్యతిరేకంగా పోరాడిన ఎర్ర సముద్రం వీరులలో దేవర కూడా ఒకరు. తరువాత ఆయన అదే ఎర్ర సముద్రానికి చెందిన భైరాతో కలిసి అక్రమ సరుకుల రవాణాకు సాయం చేస్తూ ఉంటారు. కానీ కొద్దికాలానికి దేవర ఆ పని మానేయాలకుంటారు? ఆ క్రమంలో దేవర, భైరా శత్రువులుగా మారతారు. అయితే ఉన్నట్టుండి దేవర మాయమైపోతారు. ఆయన ఎందుకు మాయమై పోయారు? ఆయన కొడుకు వరా తన తండ్రి ఆశయాన్ని నిలబెట్టగలిగారా? అన్నదే కథ.
సినిమా ఎలా ఉంది?
ఇది టైటిల్‌కు తగ్గట్టే దేవర అనే పాత్ర కేంద్రంగా తీసిన సినిమా ఇది. దేవర అనే వీరుడి కథ.
ఎంతో స్కోప్ ఉన్న పాత్ర ‘దేవర’. ఈ పాత్రకు ఉన్న సీరియస్‌నెస్‌ను స్క్రీన్ మీద సరిగ్గా ప్రెజెంట్ చేయలేకపోయారు.
సెకండ్ హాఫ్‌లో వచ్చే దేవర కొడుకు వర పాత్ర మొదట్లో ఎనర్జిటిక్‌గా కనిపించినా బలహీనమైన స్క్రీన్‌ప్లే వల్ల తరువాత తేలిపోయినట్టు అనిపిస్తుంది.

ఫొటో సోర్స్, NTR ARTS/FB
ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ ఎలా ఉంది? ఇతరులు ఎలా నటించారు?
ఎన్టీఆర్ తన పరిధి మేరకు బాగానే నటించారు. తండ్రీ కొడుకులుగా ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేసినా, ఆయా పాత్రలను బలహీనంగా చిత్రీకరించడం వల్ల ఎన్టీఆర్ మార్క్ మ్యాజిక్ ఈ సినిమాలో కనిపించలేదు.
సైఫ్ అలీ ఖాన్ పాత్రకు డబ్బింగ్ నప్పలేదు. శ్రీకాంత్ నటన డీసెంట్‌గా ఉంది. ప్రకాష్ రాజ్ నటన పాత్ర పరిధి మేరకు ఉంది.
జాన్వీ కపూర్‌కు తెలుగులో మొదటి సినిమా 'దేవర.'
ఈ సినిమాలో ఆమె పాత్ర(తంగమ్మ ), నటన రెండూ అసహజంగానే ఉన్నాయి.
సినిమాటోగ్రఫీ, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకు వెన్నుదన్నుగా నిలిచాయి. అనిరుధ్ మ్యూజిక్ కథాతీరును చక్కగా ఎస్టాబ్లిష్ చేసింది.
పాటలు కూడా సినిమాను నిలబెట్టే స్థాయిలో లేవు. ఆయుధ పూజ పాట ఆకట్టుకోలేదు. చుట్టమల్లె పాట పెద్దగా ప్లస్ కాలేదు.

ఫొటో సోర్స్, NTR ARTS/FB
కొరటాల శివ మ్యాజిక్ పనిచేసిందా?
కొరటాల శివ 'ఆచార్య' తరహా స్టైల్ ఇందులో కొన్ని చోట్ల కనిపిస్తుంది.
స్టార్ క్యాస్టింగ్, మాస్ ఎలిమెంట్స్ ఉన్న ఈ కథతో హిట్ కొట్టే ఛాన్స్ ఉన్నా దర్శకుడు ఆ అవకాశాన్ని వాడుకోలేకపోయారనిపించింది.
కథ ప్రారంభం నుంచి ముగింపు దాకా ఏ భాగాన్నీ సినిమాకు ప్లస్ అయ్యేలా చేయలేకపోయారు. కథలోని ఆత్మను సినిమాగా చూపడంలో శివ విఫలయం అయ్యారు.
సినిమా నిడివి మూడు గంటలు. కథ మొత్తం ముందే తెలిసిపోతుంటుంది. స్క్రీన్‌ప్లేలో బిగి, కథలో మలుపులు ఉంటే ప్రేక్షకులకు బోర్ కొట్టదు. కానీ అలాంటివేవీ దేవర సినిమాలో కనిపించవు.
ఎక్కడా కొత్తదనం లేని ఈ సినిమాకు రన్‌టైమ్ కూడా మైనస్ అయింది.
ప్లస్ పాయింట్స్
1) సినిమాటోగ్రఫీ
2) బ్యాక్‌గ్రౌండ్ స్కోర్
3) కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌లు
మైనస్ పాయింట్స్
1) బలహీనమైన క్యారెక్టర్స్
2) రన్ టైమ్
3) ఒరిజినాలిటీ లోపించడం
(గమనిక: ఈ రివ్యూలోని అభిప్రాయాలు సమీక్షకురాలి వ్యక్తిగతం)
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














