అచ్చం హైదరాబాద్‌ ‘ఎన్‌కౌంటర్‌’లా బదలాపూర్ ఘటన, నాటి విచారణ కమిటీకి నాయకత్వం వహించిన మాజీ జడ్జి దీనిపై ఏమన్నారు?

బదలాపూర్‌ వేధింపుల కేసు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, భాగ్యశ్రీ రౌత్
    • హోదా, బీబీసీ కోసం

మహారాష్ట్రలోని బదలాపూర్‌లో స్కూలు పిల్లలను లైంగికంగా వేధించిన కేసులో నిందితుడు అక్షయ్ షిండే పోలీసు కాల్పుల్లో మరణించారు.

‘‘నిందితుడు మా గన్‌ తీసుకుని, మాపై దాడి చేశారు. ఆత్మరక్షణకోసం మేం కాల్పులు జరిపాం’’ అని పోలీసులు దీనిపై వివరణ ఇచ్చారు. అయితే ఈ ‘ఎన్‌కౌంటర్’ కేసు కోర్టు ముందుకు వెళ్లింది.

ఈ ఎదురు కాల్పుల ఘటనలో పోలీసులు, ప్రభుత్వం పాత్రపై పలు ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇది నకిలీ ఎన్‌కౌంటర్ అని ప్రతిపక్షాలు అంటున్నాయి.

బదలాపూర్ అత్యాచార కేసులో నిందితుడి ‘ఎన్‌కౌంటర్’ మాదిరిగానే, గతంలో హైదరాబాద్‌లో ఒక యువ వైద్యురాలి లైంగిక వేధింపుల కేసులో కూడా ‘ఎన్‌కౌంటర్’ జరిగింది.

ఆమెను అత్యాచారం చేసి, హత్య చేసిన వారు కూడా పోలీసులు కాల్పుల్లో మరణించారు. ఆ సమయంలో కూడా పోలీసుల ఇచ్చిన వివరణపై పలు ప్రశ్నలు వినిపించాయి.

అప్పటి హైదరాబాద్ ‘ఎన్‌కౌంటర్‌’పై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వికాస్ సిర్పూర్కర్ నేతృత్వంలో ఒక కమిటీని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది.

మరి బదలాపూర్ వేధింపుల కేసులో నిందితుడు అక్షయ్ షిండేను ‘ఎన్‌కౌంటర్’ చేయడంపై ఆ మాజీ న్యాయమూర్తి ఏమనుకుంటున్నారు?

‘‘ఎన్‌కౌంటర్ జరిగిందన్న దానిపై మాత్రమే రిపోర్టులు ఉన్నాయి. అక్కడ ఏం జరిగిందన్న దాన్ని విచారించేందుకు సీఐడీ కమిటీ వేసింది. ఇంకా ఆ రిపోర్టు రాలేదు. ఈ విషయం గురించి మరింత ఎక్కువగా మాట్లాడటం సరైంది కాదు’’ అని సిర్పూర్కర్ అన్నారు.

అయితే, ఇలాంటి ‘ఎన్‌కౌంటర్‌’లను ఎలా చూస్తారనే దానిపై ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

‘‘ఇలాంటి ఎన్‌కౌంటర్లు చాలా అరుదు. కొన్నేళ్ల కిందట బిహార్‌లో జరిగింది. ఆ తర్వాత హైదరాబాద్‌లో, ఇప్పుడు మహారాష్ట్రలో జరిగింది. ఇలా ఎన్‌కౌంటర్లు చేయడం ఎంతమాత్రం సరికాదు’’ అని అన్నారు.

‘‘ఎన్‌కౌంటర్ తర్వాత న్యాయం లభిస్తుందా? లేదా? అన్నది నిర్ణయించాలి. ఎన్‌కౌంటర్ చేయడం పోలీసుల ఉద్యోగం కాదు. విచారణ చేయడమే పోలీసుల పని. ఎన్‌కౌంటర్లు ఇలా జరగవు. చాలా అసాధారణమైన పరిస్థితుల్లో మాత్రమే ఎన్‌కౌంటర్లు జరుగుతాయి’’ అని అన్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

అయితే, కొందరు వ్యక్తులు మాత్రం ఈ ‘ఎన్‌కౌంటర్‌’ను సపోర్టు చేస్తున్నారు.

‘‘ ఏం జరిగినా అది మంచికే జరిగింది. సత్వర న్యాయం కోసం అత్యాచారానికి పాల్పడ్డ నిందితులను ఇలానే చంపాలి’’ అని కొందరు వ్యక్తులు ఈ ‘ఎన్‌కౌంటర్‌’ను సమర్థిస్తున్నారు.

అయితే, ఎవరికి ఇక్కడ సత్వర న్యాయం దొరికింది? అని మాజీ జడ్జి ప్రశ్నించారు.

హైదరాబాద్ కేసులో పోలీసులను ప్రజలెలా అభినందించారో చూశాం. ఆ ‘ఎన్‌కౌంటర్’ తర్వాత దర్యాప్తులో ఏం తేలింది? అన్నది కూడా చర్చనీయాంశమైంది.

హైదరాబాద్ కేసులో కూడా పోలీసులపై ప్రజలు పూలవర్షం కురిపించి, వారిని సపోర్టు చేశారు. కానీ, విచారణలో అది ఎన్‌కౌంటర్ కాదు, నలుగురు వ్యక్తులను పోలీసులు కాల్చి చంపినట్లు తేలింది. వారిలో ఒకరు మైనర్.

ఉదయం 3 గంటలకు వారిని ఘటన జరిగిన ప్రాంతానికి తీసుకెళ్లి, అక్కడే వారిని చంపారని కమిటీ గుర్తించింది. అలా వారిని చంపడం కరెక్ట్ కాదని సిర్పూర్కర్ అన్నారు.

‘‘అప్పట్లో నేనిచ్చిన రిపోర్టులో పోలీసుల తప్పు ఉన్నట్లు తేలింది. నలుగురు వ్యక్తుల్ని కాల్చి చంపడం న్యాయం కాదన్నది నా అభిప్రాయం’’ అని సిర్పుర్కర్ అన్నారు.

ప్రస్తుతం ఈ కేసు హైదరాబాద్ హైకోర్టులో పెండింగ్‌లో ఉంది. అందువల్ల దీనిపై మరింత స్పందించేందుకు ఆయన నిరాకరించారు.

బదలాపూర్‌ వేధింపుల కేసు

హైదరాబాద్ ఎన్‌కౌంటర్ కేసులో కమిషన్ ఎంక్వైరీ నివేదిక ఏం చెప్పింది?

2019లో హైదరాబాద్‌లో ఎన్‌హెచ్ 44 దగ్గర ఉన్న మహిళా వైద్యురాలిపై కొందరు వ్యక్తులు అత్యాచారం చేసి, హత్యకు పాల్పడ్డారు.

ఈ ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వచ్చాయి. ఆ తర్వాత, ఏడు రోజుల్లో నలుగురు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. తర్వాత వారు పోలీసుల కాల్పుల్లో మరణించారు.

తమ గన్‌లు తీసుకుని నిందితులు పారిపోయేందుకు ప్రయత్నించారని, ఆ సమయంలో జరిపిన కాల్పుల్లో వారు మరణించారని పోలీసులు చెప్పారు.

ఆ తర్వాత ఈ విషయం కోర్టు ముందుకు వెళ్లింది. మాజీ జస్టిస్ వికాస్ సిర్పూర్కర్ నేతృత్వంలో విచారణ కమిషన్‌ను సుప్రీంకోర్టు నియమించింది.

సుప్రీంకోర్టు మాజీ జస్టిస్ వికాస్ సిర్పూర్కర్

2022 జనవరి 28న ఈ కమిషన్ తన ఎంక్వైరీ రిపోర్టును సుప్రీంకోర్టుకు సమర్పించింది. నిందితులు గన్‌లు లాక్కుని, పారిపోయేందుకు ప్రయత్నించారన్న వాదన నమ్మదగినట్లుగా లేదని, దీనికి ఆధారాలు లేవని రిపోర్టు పేర్కొంది.

అత్యాచారం కేసులో నిందితులైన వారిని చంపాలన్న ఉద్దేశంతోనే పోలీసులు కాల్పులు జరిపినట్లు పేర్కొంది. దీనివల్ల నిందితులు చనిపోతారన్నది షూటర్లకు తెలుసని చెప్పింది.

ఈ సంఘటన జరిగినప్పుడు, అక్కడ 10 మంది పోలీసులు ఉన్నారు. ఈ కాల్పుల ఘటనకు కారణమైన ఈ పదిమంది పోలీసులపై హత్యా నేరం కింద విచారణ జరపాలని కమిషన్ సిఫారసు చేసింది.

పోలీసులు

ఫొటో సోర్స్, Getty Images

బదలాపూర్ వేధింపుల కేసులో ఏం జరిగింది?

ఎఫ్‌ఐఆర్‌లో పోలీసులు పేర్కొన్న సమాచారం ప్రకారం: ‘‘ అక్షయ్ షిండేపై థాణె పోలీసులు మరో కేసు నమోదు చేశారు. ఈ కేసును విచారించేందుకు సెప్టెంబర్ 23 సాయంత్రం అక్షయ్ షిండేను తలోజా జైలు నుంచి పోలీసు వ్యాన్‌లో తీసుకెళ్తున్నారు. ఆ సమయంలో పోలీసు వ్యాన్‌లో నలుగురు పోలీసులు ఉన్నారు.

ముంబ్రా బైపాస్ రోడ్డుకు కారు చేరుకున్న తర్వాత, నీలేష్ మోరే అనే పోలీసు అధికారి ప్యాంట్ జేబులో ఉన్న తుపాకీని అక్షయ్ షిండే లాగడం మొదలుపెట్టారు. నిందితుణ్ని అడ్డుకునేందుకు నీలేష్ మోరే ప్రయత్నించారు.

తుపాకీ లాక్కున్న అక్షయ్ షిండే పోలీసులపై కాల్పులు జరిపారు. ఆత్మరక్షణలో భాగంగా, అక్షయ్ షిండేపై మేం కాల్పులు జరిపాం. ఆ సమయంలో ఆయన మరణించారు’’ అని పేర్కొన్నారు.

అయితే, ఆత్మ రక్షణలో భాగంగా కాల్పులు జరిపామని పోలీసులు చెప్పినప్పటికీ, అక్షయ్ షిండే మరణంపై అనేక సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. ఇతర నిందితులను కాపాడేందుకు అక్షయ్ షిండేను చంపేశారని విపక్షాలు ఆరోపించాయి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)