ఎల్‌వోసీ: భారత్, పాకిస్తాన్‌ల మధ్య ‘ఒప్పందం’ అక్కడి ప్రజల జీవితాలను ఎలా మార్చింది?

- రచయిత, జుగల్ ఆర్ పురోహిత్
- హోదా, బీబీసీ ప్రతినిధి, ఎల్‌వోసీ, కశ్మీర్ నుంచి
‘విరాట్ కోహ్లీని మాకివ్వండి’ అని నది అవతల నుంచి ఒక వ్యక్తి అరుస్తున్నారు.
‘లేదు, మేం ఇవ్వం’ అని ఉత్తర కశ్మీర్‌లోని కెరాన్ గ్రామం నుంచి 23 ఏళ్ల తుఫైల్ అహ్మద్ భట్ బదులిచ్చారు.
స్థానికులు ఇలా మాట్లాడుకోవడాన్ని ప్రత్యేకంగా మార్చిన అంశం ఒకటుంది. అదేంటంటే ఈ ఇద్దరు వ్యక్తులు భారత్-పాకిస్తాన్ దేశాల మధ్య ఉన్న నియంత్రణ రేఖ(ఎల్‌వోసీ)కు ఇరువైపులా ఉన్న గ్రామాలకు చెందినవాళ్లు.
చుట్టూ పర్వతాలతో తరచూ ఉద్రిక్తతలకు నెలవుగా ఉండే ఈ ప్రాంతం భారత్, పాకిస్తాన్ దేశాలను వేరు చేసే సరిహద్దు ప్రాంతం.
నియంత్రణ రేఖ ఎల్‌వోసీ వెంబడి ఉన్న కెరాన్, దాని సమీప ప్రాంతాలు రెండు దేశాల మధ్య చాలా ఏళ్లుగా ఉన్న శత్రుత్వానికి సాక్షీభూతాలుగా నిలుస్తున్నాయి.


మార్పు తెచ్చిన 'ఒప్పందం'
ఈ ప్రాంతంలో తుపాకీ కాల్పులు, మోర్టార్లు, ఫిరంగులను వాడుతూ 594 సార్లు కాల్పుల విరమణ ఉల్లంఘనలు జరిగినట్లు 2021లో భారత్ నివేదించింది. ఈ ఘటనల్లో నలుగురు భారత సైనికులు కూడా మరణించారు.
అయితే, ఈ విషయంలో భారత్‌నే తప్పుబట్టింది పాకిస్తాన్. భారత ప్రభుత్వం సొంతంగా సైనికుల మరణాల సంఖ్యను, డేటాను తయారు చేసి ప్రకటించుకుంటోందని ఆరోపించింది.
నియంత్రణ రేఖ (ఎల్‌వోసీ)కి ఇరువైపులా ఎన్నో ఏళ్లుగా సాగుతున్న ఘర్షణల్లో అనేకమంది పౌరులు గాయపడటం, చనిపోవడం అందరికి తెలిసిన విషయమే.
అయితే, 2021లో ఇరు దేశాల సైన్యాల మధ్య ఒప్పందం కుదిరిన తర్వాత....2022 నుంచి 2024 సెప్టెంబర్ మధ్య కేవలం రెండుసార్లు మాత్రమే ఉల్లంఘనలు జరిగాయి.
ఈ తగ్గుదల ప్రజల జీవితాలను ఎలా మెరుగు పరిచిందో అక్కడి స్థానికులు, అధికారులతో జరిపిన పలు ఇంటర్వ్యూల ద్వారా మేం గమనించాం.

స్థానికుడైన తుఫైల్ భట్ ఈ మార్పు గురించి వివరించారు.
నియంత్రణ రేఖ నుంచి కొన్ని వందల మీటర్ల దూరంలో తుఫైల్ ఒక హోమ్‌స్టేని నడుపుతున్నారు. గతంలో కాల్పుల విరమణ ఉల్లంఘనల కారణంగా ఆయన ఇంటి కప్పు మీద పడిన బుల్లెట్ గుర్తులు ఇప్పటికీ ఉన్నాయి.
‘ఇక్కడ అనేక కొత్త హోమ్‌స్టేలు తెరుస్తున్నారు’ అని తుఫైల్ అన్నారు.
ఇటీవలి సంవత్సరాలలో సరిహద్దు పర్యటకాన్ని ప్రోత్సహించినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.
“ఇది మాకు చాలా ప్రయోజనకరంగా ఉంది. ఇంతకుముందు, ఇక్కడ ఇల్లు కట్టుకోవాలనే ఆలోచన ఎవరికీ ఉండేది కాదు” అన్నారు తుఫైల్.
కెరాన్‌లో ఇద్రిస్ అహ్మద్ ఖాన్ ఒక షాపు నడుపుతున్నారు. ఈ ప్రాంతం చాలాకాలంగా నిర్లక్ష్యానికి గురైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
"నరేంద్ర మోదీ పాలనలో మాత్రమే మాకు పరిస్థితులు మెరుగుపడ్డాయి. కొన్నేళ్లలో మాకు రోడ్లు, విద్యుత్ వచ్చాయి. నేను కూడా ఆయన పార్టీకి ఓటు వేసేవాడిని. కానీ, వాళ్లు ఇక్కడ పోటీ చేయడం లేదు" అని అహ్మద్ అన్నారు.

అభివృద్ధి ప్రాజెక్టులు
జమ్మూకశ్మీర్ 2018 నుంచి కేంద్ర ప్రభుత్వ పాలనలో ఉంది. అక్కడ చివరిసారి అసెంబ్లీ ఎన్నికలు 2014లో జరిగాయి.
కెరాన్, ఉత్తర కశ్మీర్‌లోని ప్రజలు అక్టోబర్ 1న ఓటు వేయనున్నారు. అయితే, ఇక్కడ పరిపాలన విషయంలో ఖాన్‌లాగా అందరూ సంతోషంగా లేరు.
“మాకు కరెంట్ ఉంది. కానీ తరచూ పోతూనే ఉంటుంది. నియంత్రణ రేఖ వెంబడి అవతలి వైపు ఉన్న వారికి రాత్రిళ్లు కనీసం ఒక సెకను కూడా కరెంట్ పోదు. వారి రోడ్లు కూడా బాగున్నాయి. వాళ్లు ఈ సౌకర్యాలన్నీ సమకూర్చుకోగలిగినప్పుడు మనకు మాత్రం ఎందుకు సాధ్యం కాదు?” అని అబ్దుల్ ఖాదీర్ భట్ అనే మాజీ పోలీసు అధికారి ప్రశ్నించారు.
సరిహద్దు ప్రాంతాలను మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నామని స్థానిక అధికారులు తెలిపారు.
కెరాన్ ఉన్న కుప్వారాలో 2021-22లో 2,217 అభివృద్ధి ప్రాజెక్టులు పూర్తయ్యాయి. 2023-24లో అభివృద్ధి ప్రాజెక్టుల సంఖ్య 3,453కి పెరిగింది. ఈ సంఖ్యను వచ్చే సంవత్సరం 4,061కి పెంచుతామని స్థానిక అధికారులు తెలిపారు.
ఇతర సరిహద్దు ప్రాంతాలతో పోల్చితే జమ్మూ కశ్మీర్‌లో కొత్తగా నిర్మించిన సరిహద్దు రోడ్లదే అత్యధిక వాటా అని భారత ప్రభుత్వ డేటా చూపిస్తుంది.
అంతేకాదు, మంజూరైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో దీని వాటా పలు ఇతర సరిహద్దు రాష్ట్రాల కంటే ఎక్కువగా ఉంది.

ఉద్యోగాలు లేవు
కొన్ని గంటల ప్రయాణం తర్వాత తంగ్‌ధార్ అనే గ్రామం వచ్చింది. అన్ని వాతావరణాల్లోనూ దెబ్బతినని రోడ్డు (ఆల్ వెదర్ రోడ్) తమకు అవసరమని ఆ గ్రామ సర్పంచ్ మొహమ్మద్ రఫీక్ షేక్ అన్నారు.
“మా యువకులు పరీక్షల కోసం వెళ్లాలి. చాలాసార్లు మంచు కురిసి, రోడ్లు మూతపడుతున్నాయి. మా పిల్లలు ఉద్యోగావకాశాలను కోల్పోతున్నారు” అని ఆయన అన్నారు.
అక్కడ మాట్లాడిన వారిలో చాలామంది నిరుద్యోగం అంశాన్ని ప్రస్తావించారు.
పర్వత ప్రాంతంలో వ్యవసాయం కష్టమని, ఇక్కడ ఉద్యోగాలు కూడా అంతగా లేవని స్థానికులు చెప్పారు.

‘సరైన మార్గంలో నడిపిస్తున్నాం.. కానీ’
“సైన్యం కల్పించే పోర్టర్ ఉద్యోగాలపైనే మా జీవనోపాధి ఆధారపడి ఉంటుంది. ఎంతమంది ఉపాధి పొందవచ్చనే దానిపై పరిమితులు ఉన్నాయి. ఇటీవలి సంవత్సరాలలో యువతలో డ్రగ్స్ వినియోగం కూడా చూస్తున్నాం. యువకులు సరైన మార్గంలో నడిచేలా కృషి చేశాం. కానీ సమస్య అలాగే ఉంది” అని షేక్ అన్నారు.
ఈ ప్రాంతం కొన్ని సంవత్సరాలుగా మిలిటెంట్ కార్యకలాపాలకు నిలయంగా ఉంది. ఫలితంగా ఇప్పటికీ సెక్యురిటీ చెక్ పోస్టులున్నాయి. ఇక్కడకు రావడం అంత సులభం కాదు.
ఈ ప్రాంతానికి వెళ్లాలంటే ముందుగా పాస్ తీసుకోవాలి. అది ఉన్నా కూడా భద్రతా సిబ్బంది గుర్తింపు పత్రాలను అడుగుతారు. మా వాహనం సామగ్రిని కూడా పదేపదే తనిఖీ చేశారు.

వైద్యం అందుబాటులో లేదని, పేదలకు సరిపడా రేషన్ అందడం లేదని అక్కడి స్థానికులు చెప్పారు.
సీమరి గ్రామంలో నహీదా పర్వీన్‌ని మేం కలిశాం. గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన ఈమె ఏదో ఒక రోజు తాను టీచర్ కావాలని కోరుకుంటున్నారు.
“ఇక్కడ ప్రైవేట్ పాఠశాలను ప్రారంభించేలా సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. నాలాంటి చదువుకున్న అమ్మాయిలు అక్కడ బోధించవచ్చు. ఇక్కడ మాకు ఒక్క పాఠశాల కూడా లేదు. ప్రభుత్వ ఉద్యోగాలు లేవు’’ అని నహీదా పర్వీన్ అన్నారు.

మాకు నాయకులు కావాలి: అబ్దుల్ అజీజ్
ఎన్నికల్లో ఓటు వేయాలని భావిస్తున్నట్లు మాతో మాట్లాడిన చాలామంది అన్నారు.
“ప్రతి ఇంటికి ఒక నాయకుడు అవసరం. ప్రస్తుతం ఎవరూ కశ్మీర్ కోసం నిలబడటం లేదు. మాకు ఎవరైనా నాయకుడు ఉంటే పరిస్థితులు మెరుగుపడతాయని అనుకుంటున్నా’’ అని అబ్దుల్ అజీజ్ లోనే అనే స్థానికుడు అన్నారు.
మేం చివరిగా వెళ్లింది మాచిల్ లోయ. ఇది తంగ్‌ధార్‌కు ఈశాన్యంగా 100 కి.మీ. దూరంలో నియంత్రణ రేఖ సమీపంలో ఉంది.
ఈ గ్రామంలో ప్రభుత్వం బాంబు షెల్టర్లను నిర్మించింది. మేము ఒకదాని దగ్గరికి వెళ్లి చూశాం. ఇది కాంక్రీటుతో తయారైంది. ఇప్పుడు దాన్ని వాడటం లేదు. తలుపులు తుప్పు పట్టాయి, కానీ పని చేస్తున్నాయి.
‘‘ఈ గ్రామంలో 1,000 మందికి పైగా ఉంటున్నాం. కానీ, ఈ షెల్టర్‌లో 100 మంది వరకే పడతారు’’ అని అక్కడి స్థానికుడు ఒకరు చెప్పారు.
మాచిల్‌కు ఇటీవలే విద్యుత్ సౌకర్యం వచ్చింది.
కరెంటు రావడం వల్ల ఎక్కువసేపు చదువుకుంటున్నానని 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని సానియా అన్నది. ఐఏఎస్ అధికారి కావాలనేది తన కల అని ఆమె చెప్పింది.

భారత్-పాక్ దేశాల మధ్యనున్న అస్థిరమైన సంబంధాల వల్ల కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘన జరగొచ్చని అక్కడి స్థానికులు భయపడుతున్నారు.
‘‘ఆ రోజులను మాలో ఎవరూ మరచిపోలేదు. శాంతి కొనసాగాలని ఆశిస్తున్నాం’’ అని ఉపాధ్యాయుడు అబ్దుల్ హమీద్ షేక్ అన్నారు.
కెరాన్, సీమరిలలో మొబైల్ నెట్‌వర్క్ లేదని అక్కడి యువకులు అన్నారు.
‘‘నా హోమ్‌స్టే కోసం వెబ్‌సైట్ ఉంది. దీని గురించి యూట్యూబర్లు, వ్లాగర్‌లు ప్రచారం చేస్తారు’’ అని తుఫైల్ అన్నారు.
“ఫోన్ సిగ్నల్ రావాలంటే మేం ఒక గంటపాటు నడవాలి. దయచేసి ఇది అధికారులకు చెప్పగలరా?’’ అని నహీదా కోరారు.
( అదనపు రిపోర్టింగ్ వికాస్ అహ్మద్ షా)
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














